
Photo Courtesy: BCCI
పేసర్ అర్షదీప్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (ఏప్రిల్ 18) జరుగుతున్న మ్యాచ్‌లో అర్షదీప్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో అర్షదీప్ ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లి వికెట్లు తీశాడు.
2019 సీజన్‌లో పంజాబ్‌లో చేరిన అర్షదీప్ ఇప్పటివరకు 86 వికెట్లు తీశాడు. అర్షదీప్‌కు ముందు పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు పియూశ్ చావ్లా పేరిట ఉండేది. చావ్లా పంజాబ్ తరఫున (2000-2013) 84 వికెట్లు తీశాడు. అర్షదీప్‌ను పంజాబ్ కింగ్స్ ఈ సీజన్ మెగా వేలానికి ముందు వదిలేసింది. అయినా అతన్ని వేలంలో తిరిగి రూ. 18 కోట్లు పెట్టి దక్కించుకుంది.
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
86* - అర్ష్‌దీప్ సింగ్
84 - పియూష్ చావ్లా
73 - సందీప్ శర్మ
61 - అక్షర్ పటేల్
58 - మహ్మద్ షమీ
మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ను 14 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్లు చెలరేగిపోయారు. ఫలితంగా ఆర్సీబీ 8.2 ఓవర్లలో 42 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది.
పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సహా జన్సెన్, చహల్ తలో రెండు వికెట్లు తీశారు. బార్ట్‌లెట్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఆర్సీబీ బ్యాటర్లలో సాల్ట్ 4, కోహ్లి 1, రజత్ పాటిదార్ 23, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ శర్మ 2, కృనాల్ పాండ్యా 1, మనోజ్ భాండగే 1 పరుగు చేసి ఔటయ్యారు. టిమ్ డేవిడ్ (8), భువనేశ్వర్ కుమార్ (3) క్రీజ్‌లో ఉన్నారు. 10 ఓవర్ల తర్వాత ఆర్సీబీ స్కోర్ 47/7గా ఉంది.