ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ ఫామ్‌లోకి వచ్చాడు. డీవై పాటిల్ టీ20 టోర్నీలో డీవై పాటిల్ బ్లూ జట్టుకు ఆడుతున్న గబ్బర్.. సీఏజీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన శిఖర్ కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఫలితంగా డీవై పాటిల్ బ్లూ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. గబ్బర్ తాజా ప్రదర్శనతో ఐపీఎల్ జట్లు హడలిపోతున్నాయి. ధవన్ ఇదే భీకర్ ఫామ్‌ను కొనసాగిస్తే తిప్పలు తప్పవని మదనపడుతున్నాయి.
బ్లూ జట్టులో గబ్బర్ మినహా ఎవ్వరూ రాణించలేకపోయారు. ఓపెనర్ అభిజిత్ తోమర్ (20 బంతుల్లో 31 పరుగులు), అయాజ్ ఖాన్ (9 బంతుల్లో 16), పరిక్షిత్ (6 బంతుల్లో 11 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సీఏజీ బౌలర్లలో సన్వీర్ సింగ్, రిత్విక్ చటర్జీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. ప్రధాన్, అంకిత్ శర్మ తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సీఏజీ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. వరుణ్ లవండే (70) అర్దసెంచరీతో రాణించగా.. సన్వీర్ సింగ్ (48 నాటౌట్), ఆబిద్ ముస్తాక్ (17 నాటౌట్) సీఏజీని విజయతీరాలకు చేర్చారు. సీఏజీలో సంజయ్ 11, సేనాపతి 4, సచిన్ బేబీ 20 పరుగులు చేశారు. బ్లూ బౌలర్లలో విపుల్ కృష్ణన్ 2, కర్ష్ కొఠారి ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో సీఏజీ సెమీఫైనల్‌కు చేరుకుంది. ఇవాళే జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో ఇండియన్ అయిల్ జట్టు టాటా స్పోర్ట్స్ క్లబ్‌పై గెలుపొంది సెమీస్‌కు చేరింది. ఈ టోర్నీలో మరో రెండు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఇవాళే జరుగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment