70 ఏళ్ల ప్రయాణంలో 12 పర్యటనల్లో 47 టెస్టుల పరంపరలో ఆస్ట్రేలియా గడ్డపై టీమిండియా తొలిసారిగా 2–1 ఆధిక్యంలో నిలిచింది. మరొక్క విజయం సాధించినా... కనీసం ‘డ్రా’ చేసుకున్నా ... సిరీస్‌ను కైవసం చేసుకుని రికార్డుల్లోకెక్కుతుంది. ఏ తీరుగా చూసినా మళ్లీ ఎప్పటికి వస్తుందోచెప్పలేనంతటి గొప్ప అవకాశం ఇది. ఏమాత్రం పొరపాటు జరుగకుండా చూసుకోవాల్సిన అరుదైన సందర్భం ఇది. ఈ చారిత్రక మలుపును కోహ్లి సేన గెలుపు పిలుపుతో మురిపిస్తుందని ఆశిద్దాం...!
సాక్షి క్రీడా విభాగం : 2003–04 ఆసీస్ పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్టును గెలిచిన టీమిండియా 1–0తో పైచేయి సాధించింది. అయితే, తర్వాతి దాంట్లో ఓడిపోవడంతో ఆధిక్యం చేజారింది. ఈ సిరీస్‌లో మొదటి, నాలుగో టెస్టులు ‘డ్రా’గా ముగియడంతో తుది ఫలితం 1–1గా మారింది. అంతకుముందు 1977–78లో 2–2తో సమంగా ఉన్న స్థితిలో ఐదో మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను కోల్పోయింది. కంగారూ గడ్డపై ఇప్పటి వరకు ఈ రెండు మాత్రమే భారత్ సిరీస్ విజయానికి చేరువగా వచ్చిన సందర్భాలు. కానీ, ఇప్పుడు స్పష్టమైన ఆధిక్యంతో సిడ్నీలో అడబోతోంది. ఈ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్నా కోహ్లి సేన చరిత్ర తిరగరాసినట్లవుతుంది.
పట్టిన పట్టు విడవొద్దు...
పైన చెప్పుకొన్న ఉదాహరణల్లో మొదటి దాంట్లో భారత్ చేజేతులా పట్టు జారవిడిచింది. స్థిరమైన బ్యాటింగ్ ప్రదర్శన చేయలేక మెల్‌బోర్న్‌లో జరిగిన మూడో టెస్టులో ఓడింది. 1977–78 సిరీస్‌లో మాత్రం ఐదో టెస్టులో అతి భారీ లక్ష్యాన్ని (492) ఛేదిస్తూ 445 పరుగుల వద్ద ఆగిపోయింది. పోరాటం ఎలా ఉన్నా... ఈ రెండు సార్లూ ‘బ్యాటింగ్’దే ప్రధాన పాత్ర కావడం గమనార్హం. ప్రస్తుతం కూడా బ్యాటింగే జట్టును కొంత కలవరపెడుతోంది. మెల్‌బోర్న్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టాపార్డర్ కుప్పకూలిన వైనమే దీనికి నిదర్శనం. తొలి ఇన్నింగ్స్‌లో దక్కిన భారీ ఆధిక్యానికి రెండో ఇన్నింగ్స్‌లో కుర్రాళ్లు మయాంక్ అగర్వాల్, రిషభ్ పంత్ విలువైన పరుగులు జోడించడంతో ఇబ్బంది లేకపోయింది. ఆసీస్ ఓడిన తేడా (137 పరుగులు)ను పరిగణనలోకి తీసుకుంటే వీరిద్దరి ఇన్నింగ్స్ విలువ తెలుస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, ‘ఓడినా పోయేదేమీ లేదుగా’ అనే భావనను వీడి ఏమాత్రం అలసత్వం వహించకుండా పకడ్బందీగా ఆడాల్సి ఉంటుంది.
ఆ పొరపాట్లు చేయొద్దు...
పిచ్ గురించి అంచనా వేయలేక, అతి విశ్వాసంతో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, తాజాగా ఆస్ట్రేలియాలోనూ ఎదురుదెబ్బలు తగిలాయి. కనీసం ముందస్తు ఊహాగానాలనూ పట్టించుకోకుండా బరిలో దిగి ఫలితం అనుభవించారు. సిడ్నీ టెస్టుకు మాత్రం వాతావరణం సహా అన్ని విషయాలనూ లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ఫిట్‌నెస్ సంతరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిడ్నీలో వాతావరణం వేడిగా ఉంది. పిచ్ పొడిగా కనిపిస్తోంది. దీంతో ఆస్ట్రేలియా లయన్‌కు తోడుగా స్పిన్నర్ లబషేన్‌ను ఆడిస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు స్పిన్నర్లను ఆడించాలా? లేదా బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ స్థానాన్ని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో భర్తీ చేయాలా? అనేదానిపై టీమిండియా కచ్చితంగా ముందే ఓ అభిప్రాయానికి రావాలి. అద్భుత ఫామ్‌తో పాటు పోటాపోటీగా వికెట్లు పడగొడుతున్నందున ముగ్గురు పేసర్లతో సరిపెట్టుకుని, హార్దిక్ బదులు పూర్తి ఫిట్‌గా ఉంటే అశ్విన్‌నే ఆడించడం ఉత్తమం. బ్యాటింగ్‌లోనూ అశ్విన్ సామర్థ్యాన్ని తక్కువగా చూడలేం. మెల్‌బోర్న్‌లో ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్ నాథన్ లయన్ కంటే జడేజా మెరుగ్గా రాణించాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్... పేసర్ బుమ్రా తర్వాత జడేజా బౌలింగ్‌లోనే ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. మరోవైపు పక్కటెముకల గాయంతో దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా అశ్విన్ ఫిట్‌నెస్‌పై ఏమాత్రం అనుమానం ఉన్నా, అతడిని తుది జట్టులో చేర్చకపోవడమే మేలు. రెండో స్పిన్నర్‌గా హనుమ విహారిని ఉపయోగించుకోవచ్చు.
బ్యాట్స్‌మెన్ మరింత బాధ్యతగా...
పుజారా, కోహ్లి... ఈ సిరీస్‌లో భారత్ బ్యాటింగ్ భారాన్ని పూర్తిగా మోస్తున్నారు. అయితే, నిర్ణయాత్మకమైన స్థితిలో వీరిద్దరికి మిగతా వారూ సహకరించాల్సిన అవసరం ఉంది. అరుదైనదే అయినా మెల్‌బోర్న్ రెండో ఇన్నింగ్స్‌లోలా పుజారా, కోహ్లి పరుగులు సాధించలేకపోతే.. రహానే పూర్తి బాధ్యత తీసుకోవాలి. మూడో టెస్టులో తమ పాత్ర సమర్థంగా పోషించిన ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, హనుమ విహారి సిడ్నీలోనూ దానిని కొనసాగించాలి. రోహిత్ లేనందున లోయరార్డర్‌లో వికెట్ కీపర్ రిషభ్ పంత్ మరింత కీలకం కానున్నాడు. పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ అతడు మరిన్ని పరుగులు జోడిస్తే అవే కీలకం అవుతాయి. ఏదేమైనా, కోహ్లి సేన జోరును కొనసాగిస్తూ, గెలుపు ఊపును నిలబెట్టుకుంటూ కొత్త సంవత్సరం తొలినాళ్లలోనే దేశానికి అద్భుతమైన కానుక ఇస్తుందని బలంగా ఆశిద్దాం... విజయోస్తు టీమిండియా!
Comments
Please login to add a commentAdd a comment