పట్టుమని పది ఓవర్లయినా నిలవలేని ఓపెనర్లు... పూర్తి ఫిట్‌నెస్ కొరవడిన ప్రధాన స్పిన్నర్లు... ఆడించాలా? వద్దా? అనే స్థితిలో ఆల్‌రౌండర్! వెరసి... ‘బాక్సింగ్ డే’ టెస్టుకు ముందు టీమిండియాలో పెద్ద డైలమా? ఎలాంటి సమస్యలు లేకుండా ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన కోహ్లి సేనను... ఇప్పుడు ప్రత్యర్థి కంటే గాయాలు, ఫామ్ లేమి ఎక్కువగా భయపెడుతున్నాయి. మరి... సిరీస్ కీలక దశలో మెల్‌బోర్న్‌లో టీమిండియా ఏం చేస్తుంది? చిక్కుముడులను ఎలా విప్పుతుంది?
సాక్షి క్రీడా విభాగం: తుది జట్టు ఖరారులో బహుశా గతంలో ఎన్నడూ ఎదుర్కొననంత సందిగ్ధంలో ఉందిప్పుడు టీమిండియా. స్వదేశంలో అయినా, విదేశంలో అయినా సహజంగా ఒకటీ, రెండు స్థానాలపైనే ఊగిసలాట ఉంటుంది. కానీ, కోహ్లి సేన మూడో టెస్టుకు నాలుగు స్థానాలపై ఆందోళన చెందుతోంది. 11 మందికిగాను ఫామ్, ఫిట్‌నెస్ ప్రకారం నికరంగా ఏడుగురు ఆటగాళ్లే అందుబాటులో ఉన్నట్లయింది పరిస్థితి. ఎటొచ్చి... మెల్‌బోర్న్‌లో ‘మార్పు’ తప్పనిసరి! కానీ, అదెలాగన్నదే తేలాల్సి ఉంది.
ఓపెనర్లు ఎవరో?
49, 48... విజయ్, రాహుల్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసిన స్కోర్లివి. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోని 44 పరు గులు మినహాయిస్తే రాహుల్ చేసినవి నాలుగే పరుగులు. యువ సంచలనం పృథ్వీ షా గాయంతో పూర్తిగా దూరం కాగా, వీరిలో ఎవరినీ నమ్మలేని స్థితిలో ఉన్నపళంగా కర్ణాటక బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌ను రప్పించారు. విజయ్ కొంత ఎక్కువసేపు క్రీజులో ఉంటున్నా ప్రతి పరుగుకు శ్రమిస్తున్నాడు. ఆడినప్పుడే ఆడినట్లుంటోంది రాహుల్ కథ. పోతే పోనీ ఈ ఒక్కసారికి కొనసాగిద్దామనుకుంటారా? లేక మయాంక్ అగర్వాల్, హనుమ విహారిలతో ఇన్నింగ్స్ ప్రారంభించి భారీ ప్రయోగం చేస్తారా? అనేది చూడాలి?
జడ్డూ సంగతేంటో?
ఎడమ భుజం గాయంతో ఇబ్బందిపడుతున్న స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉన్నాడని ప్రకటనలైతే వస్తున్నాయి. అయితే, అది కోచ్ రవిశాస్త్రి లెక్కల్లోలాగ 70–80 శాతమా? బీసీసీఐ చెప్పినట్లు 100 శాతమా? అనేది స్పష్టం కావాల్సి ఉంది. కోచ్ మాట ప్రకారం 80 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నా ఆడిస్తారా? అశ్విన్ దూరమై, గత్యంతరం లేకపోతే జడేజాను దించినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది.
అశ్విన్ ‘ఫిట్టు’ కానట్టే?
ఇంగ్లండ్‌లో గాయంతోనే సౌతాం ప్టన్ టెస్టులో ఆడి, వైఫల్యం మూటగట్టుకుని ఆపై చివరి టెస్టుకు దూరమైన అశ్విన్... పాత కథనే పునరావృతం చేసేలా ఉన్నాడు. అశ్విన్ పరిస్థితిని రెండ్రోజుల్లో చెబుతామని కోచ్ రవిశాస్త్రి ఆదివారం వ్యాఖ్యానించడం దీనినే సూచిస్తోంది. సోమవారం నెట్స్‌లోనూ అతడు రనప్ లేకుండానే బౌలింగ్ చేశాడు. బుధవారం నాటికైనా ఫిట్‌నెస్ సంతరించుకుంటే జట్టుకది శుభవార్త లాంటిదే.
హార్దిక్‌ను పిలిపించారు...కానీ!
ఆసియా కప్‌లో గాయపడి.. మూడు నెలల తర్వాత ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడీ ఆల్‌రౌండర్. 7 వికెట్లు తీసి, అర్ధశతకమూ సాధించి ఫిట్‌గానే ఉన్నానని చాటుకున్నాడు. కానీ, 70–80 శాతం ఫిట్‌నెస్‌తో జడేజాను మైదానంలో దించిన కోచ్ రవిశాస్త్రి... హార్దిక్‌ను మాత్రం ఇప్పుడే ఆడించి రిస్క్ తీసుకోలేం అంటున్నాడు. అంటే, ఇతడి విషయమూ చెప్పలేం అనే తెలుస్తోంది.
మయాంక్ వైపు మొగ్గితే...?
అసలే ఆస్ట్రేలియా... ఆపై కూకాబుర్రా బంతులు! వీటికితోడు పదునైన ప్రత్యర్థి పేస్. ఇలాంటిచోట కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా మయాంక్ అగర్వాల్‌ను నేరుగా దించడం అంత మంచిది కాదన్నది మాజీల మాట. మరోవైపు 2017–18 సీజన్‌లో శతకాల మీద శతకాలు బాదిన మయాంక్ ప్రస్తుతం అంత గొప్ప ఫామ్‌లో లేడు. గత పది ఇన్నింగ్స్‌ల్లో రెండే అర్ధ శతకాలు సాధించాడు. అక్టోబరులో స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌లో ఆడించి ఉంటే తనపై ఒత్తిడి లేకుండేది. ఇప్పుడు జట్టుకు అత్యంత అవసరమైన సందర్భంలో, రాణించాలన్న తీవ్ర ఒత్తిడి మధ్య ఆసీస్‌పై అరంగేట్రం అంటే అతడిని నిప్పుల్లోకి తోసినట్లే.
రోహిత్... వచ్చేస్తానన్నాడు
తొలి టెస్టులో మంచి అవకాశాలను చేజార్చుకుని విమర్శలపాలై... రెండో టెస్టుకు వెన్నునొప్పితో దూరమైన రోహిత్ శర్మది చిత్రమైన పరిస్థితి. భార్య ప్రసవ సమయం దగ్గరపడుతుండటంతో భారత్ వచ్చేద్దామని అతడు ప్రణాళికలు వేసుకున్నాడు. దీంతో మూడో టెస్టుకు అందుబాటులో ఉండడనే భావించారు. కానీ, ఇంకా జట్టుతోనే ఉన్నాడు. వెన్నునొప్పి తగ్గింది కానీ, మెల్‌బోర్న్ టెస్టుకు అనుమానమే అంటున్నాడు రవిశాస్త్రి.
Comments
Please login to add a commentAdd a comment