![Malen century ∙ Ashes third Test - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/15/MALAN-110A.jpg.webp?itok=gw_MciU5)
పెర్త్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ మూడో టెస్టులో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆకట్టుకున్నారు. డేవిడ్ మలాన్ (110 బ్యాటింగ్; 15 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత సెంచరీకి తోడు బెయిర్‌స్టో (75 బ్యాటింగ్; 10 ఫోర్లు), స్టోన్‌మన్ (56; 10 ఫోర్లు) పోరాడటంతో... ఇంగ్లండ్ తొలి రోజు నాలుగు వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఒకదశలో 89/1తో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ 131 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఐదో వికెట్‌కు మలాన్, బెయిర్‌స్టో అబేధ్యమైన 174 పరుగులు జతచేయడంతో ఇంగ్లండ్ తొలి రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్‌కు రెండు, హాజల్‌వుడ్, కమిన్స్‌లకు తలో వికెట్ దక్కింది. 1966 తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై యాషెస్ టెస్టులో ఇంగ్లండ్ తొలి రోజే 300 పరుగులు చేయడం విశేషం.
స్పాట్ ఫిక్సింగ్ కలకలం
మ్యాచ్‌కు ముందు స్పాట్ ఫిక్సింగ్ కథనాలతో కలకలం రేగింది. బ్రిటిష్ వార్తపత్రిక ‘ది సన్’ ఫిక్సింగ్ ఉదంతాన్ని వెలుగులోకి తేవడంతో... క్రికెట్ పెద్దలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఫిక్సింగ్ వార్తలను ఐసీసీ ఖండించింది. ఫిక్సింగ్‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది. ఏ ఓవర్‌లో ఎన్ని పరుగులు నమోదవుతాయి, ఎప్పుడు వికెట్ పడుతుంది, సెషన్‌లో ఎన్ని రన్స్ చేస్తారనే ఆంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఆస్ట్రేలియాకు చెందిన ఓ అజ్ఞాతవ్యక్తి సేకరించాడని దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు పెద్ద మొత్తాల్లో బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారని సన్ పత్రిక తన నాలుగు నెలల పరిశోధనలో తేల్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై స్పందించిన ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధిపతి అలెక్స్ మార్షల్ ‘బుకీలతో క్రికెటర్లు సంప్రదింపులు జరిపారనే అంశంపై ఎలాంటి ఆధారాలు లేవు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై ఐసీసీ విచారణ ప్రారంభించింది.
Comments
Please login to add a commentAdd a comment