హెడింగ్లే వేదికగా ఇవాల్టి నుంచి (జులై 6) ప్రారంభంకానున్న యాషెస్ సిరీస్ మూడో టెస్ట్ మ్యాచ్ పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. ఈ మ్యాచ్ ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌కు వందో టెస్ట్ మ్యాచ్ కాగా.. ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జేమ్స్ ఆండర్సన్, ఆసీస్ స్టార్ స్పిన్నర్ నాథన్ లయోన్ లేకుండా 6037 రోజుల తర్వాత ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.
ఆండర్సన్, లయోన్ లేకుండా 2006 డిసెంబర్ 26న చివరిసారిగా ఓ యాషెస్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. కాగా, రెండో టెస్ట్ సందర్భంగా గాయపడినందున నాథన్ లయోన్ సిరీస్ మొత్తానికే దూరం కాగా, తొలి రెండు టెస్ట్‌ల్లో రాణించికపోవడంతో ఆండర్సన్‌ను ఇంగ్లీష్ మేనేజ్‌మెంట్ పక్కన పెట్టింది (మూడో టెస్ట్‌కు).
ఇదిలా ఉంటే, లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 327 పరుగులకు ఆలౌటైంది.
ఫలితంగా ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. బెన్ స్టోక్స్ (214 బంతుల్లో 155; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) వీరోచితంగా పోరాడినప్పటికీ ఇంగ్లండ్‌ను గెలిపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరి రోజు జానీ బెయిర్‌స్టో స్టంపౌట్ వివాదాస్పదమైంది.
Comments
Please login to add a commentAdd a comment