యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో ఆసీస్‌పై ఇంగ్లండ్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ (75) కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. మిచెల్ స్టార్క్ (5/78) ఫైఫర్‌తో ఇంగ్లండ్‌ను భయపెట్టినా.. వోక్స్ (32 నాటౌట్) సహకారంతో బ్రూక్ ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. బ్రూక్ ఔటయ్యాక వుడ్ (12 నాటౌట్) అండతో వోక్స్ ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు.
చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్..
ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లండ్‌ను గెలిపించిన బ్రూక్ ఓ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతి తక్కువ బంతుల్లో టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసినా ఆటగాడిగా చరిత్ర సృస్టించాడు. బ్రూక్ 1058 బంతుల్లో వెయ్యి పరుగులు మైలురాయిని చేరుకోగా.. గతంతో ఈ రికార్డు కివీస్ ఆల్‌రౌండర్ కొలిన్ గ్రాండ్‌హోమ్ (1140) పేరిట ఉండేది. ఈ జాబితాలో గ్రాండ్‌హోమ్ తర్వాత టిమ్ సౌథీ (1167), బెన్ డకెట్ (1168) ఉన్నారు.
అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు..
టెస్ట్‌ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 1000 పరుగులు పూర్తి చేసిన రికార్డు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు హెర్బర్ట్ సచ్లిఫ్ (12 ఇన్నింగ్స్‌లు), విండీస్ మాజీ ఎవర్టన్ వీక్స్ (12)ల పేరిట సంయుక్తంగా ఉండగా.. యాషెస్ సిరీస్ మూడో టెస్ట్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన బ్రూక్ ఈ జాబితాలో ఐదో స్థానానికి చేరాడు. బ్రూక్ 17 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకుని, ఇంగ్లండ్/జింబాబ్వే ఆటగాడు గ్యారీ బ్యాలెన్స్ సరసన నిలిచాడు. ఈ జాబితాలో డాన్ బ్రాడ్‌మన్ (13) రెండో స్థానంలో, వినోద్ కాంబ్లీ (14) మూడో స్థానంలో, లెన్ హటన్ (16), ఫ్రాంక్ వారెల్ (16), రోవ్ (16) నాలుగో స్థానంలో ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం సాధించడం ద్వారా, 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఆసీస్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. 251 పరుగుల లక్ష్యాఛేదనలో 27/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్, రెండో సెషన్‌లోనే ఆటను ముగించింది (50 ఓవర్లలో 254/7). బ్రూక్, వోక్స్, వుడ్‌లతో పాటు జాక్ క్రాలే (44), బెన్ డకెట్ (23), జో రూట్ (21)లు కూడా ఇంగ్లండ్ గెలుపులో తమవంతు పాత్ర పోషించగా.. మొయిన్ అలీ (5), స్టోక్స్ (13), బెయిర్‌స్టో (5) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 5.. కమిన్స్, మార్ష్ తలో వికెట్ పడగొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. ఇంగ్లండ్ 237 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు టపా కట్టేసి ఇంగ్లండ్ 251 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో మిచెల్ మార్ష్ (118) సెంచరీ చేయగా.. మార్క్ వుడ్ 5 వికెట్లతో చెలరేగాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో బెన్ స్టోక్స్ (80) అర్ధసెంచరీతో రాణించగా.. పాట్ కమిన్స్ 6 వికెట్లతో ఇరగదీశాడు. ఆసీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ట్రావిస్ హెడ్ (77) టాప్ స్కోరర్‌గా నిలువగా.. బ్రాడ్, వోక్స్ తలో 3 వికెట్లు, మార్క్ వుడ్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment