మెల్‌బోర్న్: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ అద్భుతమైన ఆటతో యాషెస్ సిరీస్‌లో తమ జట్టును మొదటిసారి ముందంజలో నిలిపాడు. పలు రికార్డులు తిరగరాస్తూ మూడో రోజు మొత్తం క్రీజ్‌లో నిలిచిన కుక్ (409 బంతుల్లో 244 బ్యాటింగ్; 27 ఫోర్లు) భారీ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. ఫలితంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఇప్పటికే 164 పరుగుల ఆధిక్యం సాధించింది. గురువారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 491 పరుగులు చేసింది. కుక్‌తో పాటు అండర్సన్ (0) క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్, లయన్, కమిన్స్ తలా 3 వికెట్లు తీశారు.
ఓవర్‌నైట్ స్కోరు 192/2తో ఇంగ్లండ్ బ్యాటింగ్ కొనసాగించిన అనంతరం కొద్ది సేపటికే కెప్టెన్ రూట్ (61) అవుటయ్యాడు. అయితే ఆ తర్వాతి బ్యాట్స్‌మెన్ తలా కొద్ది సేపు కుక్‌కు అండగా నిలవడంతో అతను డబుల్ సెంచరీ వైపు దూసుకుపోయాడు. 153 పరుగుల వద్ద స్క్వేర్‌లెగ్‌లో కష్టసాధ్యమైన క్యాచ్‌ను స్మిత్ వదిలేయడం కూడా కుక్‌కు కలిసొచ్చింది. ఎట్టకేలకు బర్డ్ బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్ బౌండరీ బాది 360వ బంతికి కుక్ టెస్టుల్లో ఐదో డబుల్ సెంచరీని అందుకున్నాడు. మరో వైపు స్టువర్ట్ బ్రాడ్ (63 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్) తమ మాజీ కెప్టెన్‌కు చక్కటి సహకారం అందించాడు. దూకుడుగా ఆడిన బ్రాడ్...పదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 26 ఏళ్ల తర్వాత అర్ధసెంచరీ సాధించిన ఇంగ్లండ్ ఆటగాడిగా నిలిచాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు సరిగ్గా 100 పరుగులు జోడించారు.
►6 టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుక్ (11,956) ఆరో స్థానానికి చేరుకున్నాడు. మూడో రోజు ఆటలో అతను చందర్‌పాల్ (11,867), బ్రియాన్ లారా (11,953)లను అధిగమించాడు.
Comments
Please login to add a commentAdd a comment