T-20 tournament in Asia
-
వన్స్‌మోర్
► భారత్, బంగ్లా ఫైనల్ పోరు నేడు ఆత్మవిశ్వాసంతో ధోనిసేన ► సంచలనం కోసం బంగ్లా తహతహ ఆసియా కప్ టి20 టోర్నీ సరిగ్గా పది రోజుల క్రితం బంగ్లాదేశ్‌పై ఘనంగా గెలిచి ఆసియా కప్‌ను మొదలుపెట్టిన భారత్... ఆ తర్వాత టోర్నీ మొత్తం తన సత్తా చూపెట్టింది. ప్రత్యర్థులందర్నీ చిత్తు చేసి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పుడు టైటిల్ పోరులో మళ్లీ బంగ్లాదేశ్‌తో అమీతుమీకి సిద్ధమైంది. మరోసారి టోర్నీ తొలి మ్యాచ్ ఫలితాన్ని ధోనిసేన పునరావృతం చేస్తే ఆసియాకప్‌తో ఘనంగా స్వదేశానికి వచ్చి ప్రపంచకప్ సమరాన్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రారంభించొచ్చు. మిర్పూర్: బంగ్లాదేశ్ జట్టు ఏడాది కాలంగా సొంతగడ్డపై అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా ఆడుతోంది. ప్రస్తుత ఆసియాకప్ టి20 టోర్నీలోనూ ఒక్క భారత్ మినహా అన్ని జట్లపై గెలిచింది. ఇందులో పాకిస్తాన్, శ్రీలంకలాంటి బలమైన జట్లపై విజయాలు ఉన్నాయి. కాబట్టి ఆ జట్టు అంతులేని ఆత్మవిశ్వాసంతో ఉంటుంది. దీనికితోడు స్టేడియాన్ని హోరెత్తించే అభిమానుల మద్దతు కూడా వారికే ఉంటుంది. నేడు (ఆదివారం) జరిగే ఫైనల్లో ధోనిసేన ఏమాత్రం అలసత్వం చూపకుండా బంగ్లాను మరోసారి కొట్టేయాలి. ఫామ్ పరంగా భారత్ ఈ మ్యాచ్‌లో తిరుగులేని ఫేవరెట్. అయితే అనిశ్చితికి మారుపేరైన టి20 ఫార్మాట్లో భారత్‌నూ ఓడించి ఓ పెద్ద టైటిల్ గెలవాలని బంగ్లాదేశ్ తహతహలాడుతోంది. మళ్లీ పాత జట్టే యూఏఈతో మ్యాచ్‌కు రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఇచ్చిన ధోని... ఫైనల్‌కు మాత్రం మళ్లీ పాత జట్టునే బరిలోకి దించనున్నాడు. జట్టులో ప్రతి ఒక్కరూ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. ఓపెనర్లలో రోహిత్ ఇప్పటికే టోర్నీలో 137 పరుగులు చేసినా.. ధావన్ చెలరేగాల్సి ఉంది. కోహ్లి సూపర్ ఫామ్‌ను కొనసాగించాలని భావిస్తుండగా, రైనా కూడా భారీ ఇన్నింగ్స్‌పై కన్నేశాడు. శ్రీలంక, యూఏఈలపై మంచి ఇన్నింగ్స్ ఆడి ఒత్తిడి తగ్గించుకున్న యువరాజ్ ఈ మ్యాచ్‌లోనూ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాడు. ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా తన పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తుండటం భారత్‌కు అదనపు బలం. జడేజా బ్యాట్ మెరవకపోయినా... బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టిపడేస్తున్నాడు. కీలక వికెట్లతో పాటు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు చూపెడుతున్నాడు. ఇక ప్రధాన స్పిన్నర్ అశ్విన్ తన బాధ్యత మరోసారి సమర్థంగా నిర్వర్తిస్తే టీమిండియాకు తిరుగుండదు. పేసర్లు నెహ్రా, జస్ప్రీత్ బూమ్రాలు అంచనాలకు అనుగుణంగా రాణిస్తుండటం అనుకూలాంశం. ఓవరాల్‌గా జట్టుపై కెప్టెన్ ధోని పూర్తి విశ్వాసం చూపెట్టడం శుభసూచకం. గాయాల బెడద మరోవైపు బంగ్లాదేశ్‌ను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ టోర్నీ నుంచి వైదొలగగా, ఆల్‌రౌండర్ షకీబ్ తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అతను ఆడటంపై అనిశ్చితి నెలకొంది. అయితే పాక్‌తో ఆడిన తుది జట్టునే ఫైనల్‌కు కొనసాగించాలని మేనేజ్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒకవేళ స్లో వికెట్‌ను ఎంచుకుంటే మాత్రం స్పిన్నర్ అరాఫత్ సన్నీ చోటు నిలబెట్టుకునే అవకాశం ఉంది. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ ఫామ్‌లో ఉన్నా కీలక సమయంలో తడబడటం ఆందోళనగా మారింది. తమీమ్ ఇక్బాల్ ఇంతవరకు బ్యాట్‌కు పని చెప్పలేదు. సౌమ్య సర్కార్, షబ్బీర్ రెహమాన్‌లు పోరాడుతున్నా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోతున్నారు. ముష్ఫికర్, షకీబ్, మహ్మదుల్లా మరోసారి కీలకం కానున్నారు. బౌలింగ్‌లో స్ట్రయిక్ బౌలర్ కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అమిన్ హుస్సేన్ ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపిస్తున్నాడు. తస్కిన్, మోర్తజా, షకీబ్‌లు గాడిలో పడాల్సి ఉంది. అంచనాలకు మించి రాణిస్తే తప్ప ఈ మ్యాచ్‌లో భారత్‌ను కట్టడి చేయడం బంగ్లాకు అంత సులువుకాదు. జట్లు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, బుమ్రా, నెహ్రా. బంగ్లాదేశ్: మోర్తజా (కెప్టెన్), తమీమ్, సౌమ్య, షబ్బీర్, ముష్ఫికర్, షకీబ్, మహ్మదుల్లా, మిథున్, అల్ అమిన్, సన్నీ, తస్కిన్. పిచ్, వాతావరణం టోర్నీ ఆరంభంతో పోలిస్తే పిచ్‌లు క్రమంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్నాయి. అలాగే మంచు కూడా కీలక పాత్ర పోషిస్తున్నందున టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. వర్షం ముప్పేమీ లేదు. బంగ్లాదేశ్‌తో ఫైనల్ కూడా ఓ మామూలు మ్యాచ్‌లాంటిదే. భారత జట్టులో ప్రతి ఒక్కరికీ అనుభవం ఉంది కాబట్టి ప్రతి జట్టును, ప్రతి మ్యాచ్‌ను ఒకేలా చూశాం. అయితే తొలి మ్యాచ్‌లో బంగ్లాపై గెలవడం మాకు కలిసొచ్చింది. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో మేం చివరి 10 ఓవర్ల వరకూ ఒత్తిడిలోనే ఆడాం. ఇక తర్వాతి మ్యాచ్‌ల్లో మా ప్రదర్శన అద్భుతంగా ఉంది. మా బ్యాటింగ్, బౌలింగ్ బాగా పని చేశాయి. ఎలాంటి పిచ్‌లు ఇస్తారనేది మన చేతుల్లో లేదు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా ఎదుర్కోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. - రవిశాస్త్రి (భారత్ టీమ్ డెరైక్టర్) 1 భారత్, బంగ్లాదేశ్ జట్లు ఒక పెద్ద టోర్నీ ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి ఈ మ్యాచ్‌లో భారత్ జట్టే ఫేవరెట్. ఇందులో ఎలాంటి చర్చకు తావులేదు. అయితే ఇక్కడి అభిమానులు, పరిస్థితులు, పిచ్ మాకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో చివరి వరకు పోరాడేందుకు ప్రయత్నిస్తాం. ఇప్పటికీ మా జట్టులో టి20 స్టార్ లేడు. అయినా మేమంతా సమష్టిగా రాణించి విజయాలు సాధిస్తున్నాం. - మోర్తజా (బంగ్లా కెప్టెన్) -
సన్నాహ సమరం
రేపటి నుంచి ఆసియాకప్ టి20 టోర్నమెంట్ ఫేవరెట్‌గా భారత్ పాక్‌తో పోరు శనివారం టి20 ప్రపంచకప్ జరిగే భారత్‌కు, ఆసియాకప్ టి20 టోర్నీ జరిగే బంగ్లాదేశ్‌కు పరిస్థితుల పరంగా పెద్దగా తేడా ఏమీ లేదు. పిచ్‌లు, వాతావరణం అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆసియా జట్లన్నింటికీ ఇదో గొప్ప అవకాశం. ప్రపంచకప్‌కు ముందు తమ బలాబలాలను సమీక్షించుకోవడానికి అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్ జట్లకు కూడా భారత్‌లో పరిస్థితుల గురించి బాగా తెలుసు కాబట్టి... ఆసియాకప్‌లో ఈ జట్లను ఎదుర్కోవడం ద్వారా భారత్ టి20 ప్రపంచకప్‌కు సన్నద్ధం కానుంది. సాక్షి క్రీడావిభాగం:ఈ ఏడాది ఆరంభం నుంచీ భారత జట్టు టి20 ఫార్మాట్లో అద్భుతంగా ఆడుతూ వస్తోంది. ఆస్ట్రేలియాలో మూడింటికి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్ స్వీప్ చేయడంతో పాటు స్వదేశంలో శ్రీలంకపై 2-1తో సిరీస్ నెగ్గింది. ఇదే జోరులో ధోనిసేన మరో సమరానికి సిద్ధమైంది. ప్రపంచకప్ లాంటి పెద్ద ‘సినిమా’ ముందు... ‘ట్రైలర్’లా జరుగుతున్న ఆసియాకప్‌లో కూడా గెలిస్తే అంతులేని ఆత్మవిశ్వాసంతో స్వదేశంలో జరిగే మెగా టోర్నీలో బరిలోకి దిగొచ్చు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరిగే ఆసియాకప్ ద్వారా భారత్ కావలసినంత ప్రాక్టీస్ పొందడంతో పాటు తొలిసారి టి20 ఫార్మాట్లో జరుగుతున్న ఈ టైటిల్‌ను గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌తో బుధవారం తొలి మ్యాచ్ ఆడే భారత్... చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో శనివారం తలపడుతుంది. ఎప్పటిలాగే ఈ టోర్నీలో కూడా ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌కు ముందు అందరికీ మ్యాచ్‌లు ఆడిన అనుభవం అవసరమని, కాబట్టి ఆసియాకప్‌లో అందరికీ అవకాశం ఇస్తామని ధోని ఇప్పటికే చెప్పాడు. కాబట్టి పవన్ నేగి ఆసియాకప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. శ్రీలంక, పాక్ బలమైన జట్లు: భారత్‌లో జరిగిన సిరీస్‌లో శ్రీలంక జట్టులో సీనియర్ క్రికెటర్లు పెద్దగా లేరు. కానీ ఆసియాకప్‌కు మాత్రం అందరూ తిరిగి వచ్చారు. కెప్టెన్ లసిత్ మలింగ, ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌తో పాటు రంగన హెరాత్, కులశేఖరలాంటి కీలక బౌలర్లంతా బరిలోకి దిగుతున్నారు. ఈ జట్టులో అనుభవజ్ఞులతో పాటు కుర్రాళ్లు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రపంచకప్‌కు ముందు తుది జట్టు కూర్పు కోసం మలింగ ఈ టోర్నీని ఉపయోగించుకోవచ్చు. ఇదే బంగ్లాదేశ్‌లో చివరిసారి 2014లో జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో మలింగ సారథ్యంలోనే శ్రీలంక ప్రపంచకప్ గెలిచింది. ఇక పాకిస్తాన్ జట్టు కూడా ఈ ఫార్మాట్లో ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ఆఫ్రిది సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టులో హఫీజ్, షోయబ్ మాలిక్ ఇద్దరూ అనుభవజ్ఙులు. బ్యాటింగ్ లైనప్‌లో కొన్ని కొత్త ముఖాలు కనిపిస్తున్నా... ప్రస్తుతం ఈ క్రికెటర్లంతా పాక్ టి20 లీగ్‌లో ఆడటం ద్వారా ఫార్మాట్‌తో టచ్‌లో ఉన్నారు. నిషేధం నుంచి బయటపడిన తర్వాత ఆమిర్ తొలిసారి ఓ పెద్ద టోర్నీలో ఆడబోతున్నాడు. ప్రపంచకప్‌కు ముందు జట్టు ను సరిజూసుకోవడానికి పాక్‌కు కూడా ఇది మంచి అవకాశం. తక్కువ అంచనా వేయలేం: ఇక ఆతిథ్య బంగ్లాదేశ్‌ను సొంతగడ్డపై ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. గత ఏడాది స్వదేశంలో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలపై వన్డే సిరీస్‌లు గెలిచిన ఆత్మవిశ్వాసం ఈ జట్టుకు ఉంది. మషఫ్రె మొర్తజా సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టుకు మరోసారి షకీబ్ కీలక ఆటగాడు. బంగ్లా ప్రీమియర్ లీగ్ ద్వారా ఈ జట్టుకు కూడా కావలసినంత టి20 అనుభవం ఉంది. ముష్ఫికర్, ముస్తాఫిజుర్ కీలక ఆటగాళ్లు. ఫార్మాట్ ఎందుకు మారిందంటే..: ఆసియా క్రికెట్ కౌన్సిల్ 1983లో ఏర్పడిన తర్వాత 1984లో తొలిసారి ఆసియాకప్ జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది వన్డే టోర్నమెంట్. చివరిసారిగా 2014లో ఈ టోర్నీ జరిగింది. 2015లో ఆసియా క్రికెట్ కౌన్సిల్లో పలు మార్పులు జరిగాయి. సభ్యదేశాల సంఖ్యను తగ్గిం చారు. ఈ నేపథ్యంలో ఐసీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆసియాకప్‌ను వన్డే, టి20 రెండు ఫార్మాట్లలో నిర్వహిస్తారు. ఒకసారి టి20లో జరిగితే తర్వాత సారి వన్డే టోర్నీగా జరుగుతుంది. ప్రపంచకప్‌ల ముందు సన్నాహకంగా ఈ టోర్నీ ఉపయోగపడాలని ఈ నిర్ణ యం తీసుకున్నారు. అందుకే ఈసారి టి20 ప్రపంచకప్ ఉన్నందున... సరిగ్గా ఆ మెగా టోర్నీకి ముందు టి20 ఫార్మాట్లో ఆడుతున్నారు. యూఏఈ కొత్త ఉత్సాహం గత ఏడాది వన్డే ప్రపంచకప్ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్న యూఏఈ జట్టు ఈసారి ఆసియాకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో అగ్రస్థానంలో నిలిచి ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. నిజానికి ఇటీవల కాలంలో అఫ్ఘానిస్థాన్ జట్టు బాగా నిలకడగా ఆడుతోంది. అయితే యూఏఈ అనూహ్యంగా అఫ్ఘాన్‌ను కంగుతినిపించింది. అమ్జద్ జావెద్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టు ఒక్క మ్యాచ్ గెలిచినా గొప్ప విషయమే అనుకోవాలి. అయితే అనిశ్చితికి మారుపేరైన టి20ల్లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేం. ఆసియాకప్ షెడ్యూల్ తేదీ మ్యాచ్ 24 భారత్- బంగ్లాదేశ్ 25 శ్రీలంక- యూఏఈ 26 బంగ్లాదేశ్- యూఏఈ 27 భారత్- పాకిస్తాన్ 28 బంగ్లాదేశ్- శ్రీలంక 29 పాకిస్తాన్- యూఏఈ మార్చి 1 భారత్- శ్రీలంక 2 బంగ్లాదేశ్- పాకిస్తాన్ 3 భారత్- యూఏఈ 4 పాకిస్తాన్- శ్రీలంక 6 ఫైనల్ మ్యాచ్‌లన్నీ రాత్రి గం.7.00 నుంచి జరుగుతాయి. స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం అన్ని మ్యాచ్‌లూ ఢాకాలోని షేరే బంగ్లా క్రికెట్ స్టేడియంలోనే నిర్వహిస్తారు.