సన్నాహ సమరం | Asia Twenty20 tournament from tomorrow | Sakshi
Sakshi News home page

సన్నాహ సమరం

Published Mon, Feb 22 2016 10:29 PM | Last Updated on Sun, Sep 3 2017 6:11 PM

సన్నాహ సమరం

సన్నాహ సమరం

రేపటి నుంచి ఆసియాకప్ టి20 టోర్నమెంట్  ఫేవరెట్‌గా భారత్ పాక్‌తో పోరు శనివారం

టి20 ప్రపంచకప్ జరిగే భారత్‌కు, ఆసియాకప్ టి20 టోర్నీ జరిగే బంగ్లాదేశ్‌కు పరిస్థితుల పరంగా పెద్దగా తేడా ఏమీ లేదు. పిచ్‌లు, వాతావరణం అన్నీ ఒకే రకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆసియా జట్లన్నింటికీ ఇదో గొప్ప అవకాశం. ప్రపంచకప్‌కు ముందు తమ బలాబలాలను సమీక్షించుకోవడానికి అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. శ్రీలంక, పాకిస్తాన్ జట్లకు కూడా భారత్‌లో పరిస్థితుల గురించి బాగా తెలుసు కాబట్టి... ఆసియాకప్‌లో ఈ జట్లను ఎదుర్కోవడం ద్వారా భారత్ టి20 ప్రపంచకప్‌కు సన్నద్ధం కానుంది.
  
సాక్షి క్రీడావిభాగం:ఈ ఏడాది ఆరంభం నుంచీ భారత జట్టు టి20 ఫార్మాట్‌లో  అద్భుతంగా ఆడుతూ వస్తోంది. ఆస్ట్రేలియాలో మూడింటికి మూడు మ్యాచ్‌లను గెలిచి సిరీస్ స్వీప్ చేయడంతో పాటు స్వదేశంలో శ్రీలంకపై 2-1తో సిరీస్ నెగ్గింది. ఇదే జోరులో ధోనిసేన మరో సమరానికి సిద్ధమైంది. ప్రపంచకప్ లాంటి పెద్ద ‘సినిమా’ ముందు... ‘ట్రైలర్’లా జరుగుతున్న ఆసియాకప్‌లో కూడా గెలిస్తే అంతులేని ఆత్మవిశ్వాసంతో స్వదేశంలో జరిగే మెగా టోర్నీలో బరిలోకి దిగొచ్చు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి జరిగే ఆసియాకప్ ద్వారా భారత్ కావలసినంత ప్రాక్టీస్ పొందడంతో పాటు తొలిసారి టి20 ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ టైటిల్‌ను గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. బంగ్లాదేశ్‌తో బుధవారం తొలి మ్యాచ్ ఆడే భారత్... చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో శనివారం తలపడుతుంది. ఎప్పటిలాగే ఈ టోర్నీలో కూడా ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌కు ముందు అందరికీ మ్యాచ్‌లు ఆడిన అనుభవం అవసరమని, కాబట్టి ఆసియాకప్‌లో అందరికీ అవకాశం ఇస్తామని ధోని ఇప్పటికే చెప్పాడు. కాబట్టి పవన్ నేగి ఆసియాకప్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

శ్రీలంక, పాక్ బలమైన జట్లు: భారత్‌లో జరిగిన సిరీస్‌లో శ్రీలంక జట్టులో సీనియర్ క్రికెటర్లు పెద్దగా లేరు. కానీ ఆసియాకప్‌కు మాత్రం అందరూ తిరిగి వచ్చారు. కెప్టెన్ లసిత్ మలింగ, ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌తో పాటు రంగన హెరాత్, కులశేఖరలాంటి కీలక బౌలర్లంతా బరిలోకి దిగుతున్నారు. ఈ జట్టులో అనుభవజ్ఞులతో పాటు కుర్రాళ్లు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రపంచకప్‌కు ముందు తుది జట్టు కూర్పు కోసం మలింగ ఈ టోర్నీని ఉపయోగించుకోవచ్చు. ఇదే బంగ్లాదేశ్‌లో చివరిసారి 2014లో జరిగిన టి20 ప్రపంచకప్ ఫైనల్లో మలింగ సారథ్యంలోనే శ్రీలంక ప్రపంచకప్ గెలిచింది.
 
ఇక పాకిస్తాన్ జట్టు కూడా ఈ ఫార్మాట్‌లో ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ఆఫ్రిది సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టులో హఫీజ్, షోయబ్ మాలిక్ ఇద్దరూ అనుభవజ్ఙులు. బ్యాటింగ్ లైనప్‌లో కొన్ని కొత్త ముఖాలు కనిపిస్తున్నా... ప్రస్తుతం ఈ క్రికెటర్లంతా పాక్ టి20 లీగ్‌లో ఆడటం ద్వారా ఫార్మాట్‌తో టచ్‌లో ఉన్నారు. నిషేధం నుంచి బయటపడిన తర్వాత ఆమిర్ తొలిసారి ఓ పెద్ద టోర్నీలో ఆడబోతున్నాడు. ప్రపంచకప్‌కు ముందు జట్టు ను సరిజూసుకోవడానికి పాక్‌కు కూడా ఇది మంచి అవకాశం.

తక్కువ అంచనా వేయలేం: ఇక ఆతిథ్య బంగ్లాదేశ్‌ను సొంతగడ్డపై ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. గత ఏడాది స్వదేశంలో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాలపై వన్డే సిరీస్‌లు గెలిచిన ఆత్మవిశ్వాసం ఈ జట్టుకు ఉంది. మషఫ్రె మొర్తజా సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టుకు మరోసారి షకీబ్ కీలక ఆటగాడు. బంగ్లా ప్రీమియర్ లీగ్ ద్వారా ఈ జట్టుకు కూడా కావలసినంత టి20 అనుభవం ఉంది.

ముష్ఫికర్, ముస్తాఫిజుర్ కీలక ఆటగాళ్లు.  ఫార్మాట్ ఎందుకు మారిందంటే..: ఆసియా క్రికెట్ కౌన్సిల్ 1983లో ఏర్పడిన తర్వాత 1984లో తొలిసారి ఆసియాకప్ జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది వన్డే టోర్నమెంట్. చివరిసారిగా 2014లో ఈ టోర్నీ జరిగింది. 2015లో ఆసియా క్రికెట్ కౌన్సిల్‌లో పలు మార్పులు జరిగాయి. సభ్యదేశాల సంఖ్యను తగ్గిం చారు. ఈ నేపథ్యంలో ఐసీసీ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆసియాకప్‌ను వన్డే, టి20 రెండు ఫార్మాట్లలో నిర్వహిస్తారు. ఒకసారి టి20లో జరిగితే తర్వాత సారి వన్డే టోర్నీగా జరుగుతుంది. ప్రపంచకప్‌ల ముందు సన్నాహకంగా ఈ టోర్నీ ఉపయోగపడాలని ఈ నిర్ణ యం తీసుకున్నారు. అందుకే ఈసారి టి20 ప్రపంచకప్ ఉన్నందున... సరిగ్గా ఆ మెగా టోర్నీకి ముందు టి20 ఫార్మాట్‌లో ఆడుతున్నారు.

యూఏఈ కొత్త ఉత్సాహం
గత ఏడాది వన్డే ప్రపంచకప్ ద్వారా ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్న యూఏఈ జట్టు ఈసారి ఆసియాకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో అగ్రస్థానంలో నిలిచి ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. నిజానికి ఇటీవల కాలంలో అఫ్ఘానిస్థాన్ జట్టు బాగా నిలకడగా ఆడుతోంది. అయితే యూఏఈ అనూహ్యంగా అఫ్ఘాన్‌ను కంగుతినిపించింది. అమ్జద్ జావెద్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న ఈ జట్టు ఒక్క మ్యాచ్ గెలిచినా గొప్ప విషయమే అనుకోవాలి. అయితే అనిశ్చితికి మారుపేరైన టి20ల్లో ఏ జట్టునూ తక్కువ అంచనా వేయలేం.
 
 ఆసియాకప్ షెడ్యూల్ 

తేదీ             మ్యాచ్    
24    భారత్- బంగ్లాదేశ్     
25     శ్రీలంక- యూఏఈ
26      బంగ్లాదేశ్- యూఏఈ
27      భారత్- పాకిస్తాన్
28       బంగ్లాదేశ్- శ్రీలంక
 29      పాకిస్తాన్- యూఏఈ

 మార్చి     
1    భారత్- శ్రీలంక
2    బంగ్లాదేశ్- పాకిస్తాన్
 3    భారత్- యూఏఈ
4     పాకిస్తాన్- శ్రీలంక
6     ఫైనల్
 
 మ్యాచ్‌లన్నీ రాత్రి గం.7.00 నుంచి జరుగుతాయి. స్టార్‌స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం
 అన్ని మ్యాచ్‌లూ ఢాకాలోని షేరే బంగ్లా క్రికెట్ స్టేడియంలోనే నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement