T-20 World Cup
-
ఆ రెండింటిలోనూ ఆడాలని ఉంది: రోహిత్
ముంబై: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్‌తోపాటు టి20 ప్రపంచకప్ కూడా జరగాలని ఆశిస్తున్నాడు. కరోనా మహమ్మారి వల్ల ఈ టోర్నీలపై ఇప్పటికీ స్పష్టత లేకుండాపోయింది. టీమిండియా వైస్ కెప్టెన్ మాత్రం తాను ఈ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. అభిమానులతో ఇన్స్టాగ్రామ్ చాట్‌లో డాషింగ్ ఓపెనర్ మాట్లాడుతూ... ఆసీస్ పర్యటనలో జరిగే డే–నైట్ టెస్టు సవాలుతో కూడుకున్నదని చెప్పాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జెసన్ రాయ్‌ల ఆటను చూడటాన్ని ఆస్వాదిస్తున్నానని రోహిత్ తెలిపాడు. మాజీ సారథి ధోని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఏం చెబుతారనే ప్రశ్నకు రోహిత్ బదులిస్తూ ‘లెజెండ్’ అని ముక్తాయించాడు. ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత్ అక్కడ నాలుగు టెస్టులు ఆడనుంది. ఇందులో అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టును పింక్‌బాల్‌తో ఫ్లడ్‌లైట్లలో నిర్వహిస్తారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌పై ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఈ మెగా టోర్నీ వాయిదా పడితే ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అవుతుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ లీగ్‌పై ఆశలు రేపాడు. అన్ని అవకాశాల్ని, ప్రత్యామ్నాయాల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రకటించాడు. -
కౌర్ పవర్ డైనమో!
-
కౌర్ పవర్!
సాక్షి క్రీడావిభాగం :గత ఏడాది జులైలో వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై హర్మన్ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్‌ను ఎవరూ మరచిపోలేరు. నాడు కేవలం 115 బంతుల్లో 20 ఫోర్లు, 7 సిక్సర్లతో 171 పరుగులు సాధించి ఆమె అజేయంగా నిలిచింది. ఇప్పుడు మరో ప్రపంచ కప్ వచ్చింది. ఈసారీ హర్మన్ స్పెషల్ ఇన్నింగ్స్‌తో తన సత్తాను ప్రపంచానికి చూపించింది. బంతిని బలంగా బాదడమే మంత్రంగా పని చేసే టి20లో ఏకంగా శతకం సాధించడంలో కౌర్ పవర్ ఏమిటో కనిపించింది.సిక్సర్ల సునామీతో విరుచుకు పడిన ఈ ‘పంజాబ్ కీ షేర్ని’ తొలి టి20 సెంచరీతో భారత మహిళల క్రికెట్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకుంది. హర్మన్ షాట్లలో ఎంత పదును కనిపించిందంటే ఆమె కొట్టిన సిక్సర్లలో ఎక్కువ భాగం స్టాండ్స్‌లో పడ్డాయి. పురుషుల క్రికెట్లోనైనా, ఎలాంటి మైదానంలోనైనా అవి కచ్చితంగా సిక్సర్లుగా మారేవే! శుక్రవారం కివీస్‌తో మ్యాచ్‌లో కౌర్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే ప్రారంభమైంది.తాను ఎదుర్కొన్న తొలి 13 బంతుల్లో 5 పరుగులు మాత్రమే చేసింది. అయితే వాట్కిన్ వేసిన పదో ఓవర్లో హర్మన్ ప్రతాపం ప్రారంభమైంది. ఈ ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో తన ఉద్దేశాన్ని చాటింది. ఆ తర్వాత ప్రత్యర్థి కెప్టెన్ సాటర్‌వెయిట్ వేసిన 14వ ఓవర్లో పండగ చేసుకుంది. 2 సిక్సర్లు, ఫోర్‌తో చెలరేగిన భారత కెప్టెన్... 33 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఆమెను ఆపడం న్యూజిలాండ్ తరం కాలేదు. మరుసటి ఓవర్లో వరుసగా 4, 6...ఆ తర్వాతి రెండు ఓవర్లలో కలిపి మరో రెండు ఫోర్లు, సిక్సర్ బాదింది.హర్మన్ 85 పరుగుల వద్ద మళ్లీ స్ట్రయికింగ్‌కు వచ్చే సమయానికి ఇన్నింగ్స్‌లో 8 బంతులే మిగిలాయి. ఆమె సెంచరీ సాధించగలదా అనే సందేహం కనిపించింది. అయితే దానిని పటాపంచలు చేస్తూ 19వ ఓవర్ చివరి రెండు బంతులకు భారీ సిక్సర్లు కొట్టి 97కు చేరుకుంది. డెవిన్ వేసిన చివరి ఓవర్ మూడో బంతికి రెండు పరుగులు తీయడంతో భారత మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర నమోదైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు (మార్చి 8) పుట్టిన హర్మన్ అబ్బాయిలతో పోటీ పడి అసాధారణ క్రికెటర్‌గా ఎదిగింది.సెహ్వాగ్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తావా అంటూ ఊర్లో కుర్రాళ్లు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలకు సెహ్వాగ్‌లాంటి దూకుడైన ఆటతోనే జవాబు చెప్పింది. క్రికెట్ పిచ్చి ఉన్న తండ్రి ఆమె పుట్టినప్పుడు క్రికెటర్ బొమ్మ ఉన్న షర్ట్ తెచ్చి తొడగడం యాదృచ్ఛికమే కావచ్చు కానీ ఆయన ప్రోత్సాహంతో దేశం గర్వపడే క్రికెటర్‌గా ఎదిగేందుకు పట్టుదలతో శ్రమించింది. హర్మన్ మెరుపు బ్యాటింగ్ వెనక ఆమె అద్భుత ఫిట్నెస్ కూడా దాగి ఉంది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ తర్వాత జాతీయ క్రికెట్ అకాడమీలో ఆమె రెండు సార్లు యోయో టెస్టుకు హాజరైంది.పురుష క్రికెటర్లకే సాధ్యం కాని రీతిలో తొలిసారి 17.2 స్కోరు నమోదు చేసిన ఆమె మరో ఐదు నెలలకు దానిని మెరుగుపర్చుకొని 18.5కి తీసుకొచ్చింది. దీనిని చూసిన యువరాజ్ సింగ్ ‘ఇంత స్కోరు చేశావా... అదీ ఇండోర్‌లో...అంతా బాగానే ఉంది కదా’ అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. నువ్వు సెహ్వాగ్లాగానే ఆడుతున్నావంటూ యువీ ఇచ్చిన ప్రశంస ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఆటలోనే కాకుండా సగటు పంజాబీ అమ్మాయిలలాగా మాటల్లో కూడా కౌర్ దూకుడు కనిపిస్తుంది. మైదానంలో సరిగా స్పందించని జట్టు సభ్యులపై ఆమె ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన ఘటనలు బోలెడు. అయితే పిన్న వయసులో భారత టి20 కెప్టెన్ కావడం నుంచి బిగ్‌బాష్ లీగ్‌లో ఆడిన తొలి భారత క్రికెటర్ వరకు అనేక ఘనతలు తన పేరిట లిఖించుకున్న హర్మన్ ఖ్యాతి తాజా ఇన్నిం గ్స్‌తో శిఖరానికి చేరిందంటే అతిశయోక్తి లేదు. -
తప్పులు దిద్దుకున్నానన్న హార్దిక్ పాండ్యా
‘వాస్తవం బోధపడింది’ కాన్పూర్: ఆల్‌రౌండర్‌గా అప్పటికే చక్కటి గుర్తింపు తెచ్చుకున్నా, గత ఏడాది టి20 ప్రపంచకప్‌లో విఫలం కావడంతో హార్దిక్ పాండ్యా భారత జట్టులో చోటు కోల్పోయాడు. జింబాబ్వే పర్యటనకు కూడా అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదు. దీంతో తత్వం బోధపడిన పాండ్యా మళ్లీ శ్రమించి స్థానం దక్కించుకున్నాడు. ‘టి20 ప్రపంచ కప్ తర్వాత నాకు వాస్తవం తెలిసొచ్చింది. నేను ఇంకా చాలా మెరుగు పడాల్సి ఉందని అర్థమైంది. ‘ఎ’ జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియాలో పర్యటించడం నేను ఎంతో నేర్చుకునేందుకు అవకాశం కల్పించిం ది. కోచ్ రాహుల్ ద్రవిడ్ నా ఆట తో పాటు మానసికంగా కూడా నా ఆలోచనాతీరును మార్చారు. అసిస్టెంట్ కోచ్ పారస్ మాంబ్రే కూడా సహకరించారు. తప్పులు సరిదిద్దుకొని మళ్లీ టీమ్‌లోకి వచ్చాను’ అని పాండ్యా వ్యాఖ్యానించాడు. సాయంత్రం 4.30కే టి20 మ్యాచ్: కాన్పూర్‌లో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం జరగనున్న తొలి టి20 మ్యాచ్ సాయంత్రం 4.30కే ప్రారంభం కానుంది. ఉత్తరాదిన తీవ్ర ప్రభావం చూపిస్తున్న మంచుతోపాటు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న గ్రీన్‌పార్క్ మైదానంలో ఫ్లడ్ లైట్ల సమస్య కూడా మరో కారణం. ‘లో లక్స్ లెవల్స్ కారణంగా ఇక్కడి ఫ్లడ్‌లైట్ల కాంతి తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత ముందుగా మ్యాచ్ ముగించాలని భావించాం. ముందుగా మ్యాచ్ ప్రారంభించేందుకు బీసీసీఐ అనుమతి తీసుకున్నాం’ అని యూపీ క్రికెట్ సంఘం అధికారి ఒకరు వెల్లడించారు. -
ఆ ‘గాయం’ మానాలంటే... కరీబియన్లను కొట్టాల్సిందే!
-
ఆ ‘గాయం’ మానాలంటే... కరీబియన్లను కొట్టాల్సిందే!
► యూఎస్‌లో భారత్ మొదటి మ్యాచ్ ►నేడు వెస్టిండీస్‌తో తొలి టి20 ► ఉత్సాహంగా ధోని సేన ►సవాల్‌కు విండీస్ సిద్ధం దాదాపు ఐదు నెలల క్రితం ‘సొంతగడ్డపై భారత జట్టు టి20 ప్రపంచ కప్ గెలుచుకోవడం ఖాయం’ అని అభిమానులు ఆశలు పెట్టుకున్న స్థితిలో సెమీఫైనల్లో వెస్టిండీస్ చావుదెబ్బ కొట్టింది. 192 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడమే బాధ కలిగిస్తే... రెండు నోబాల్స్ కారణంగా వారికి అవకాశం లభించడం పుండు మీద కారం చల్లినట్లుగా అనిపించింది. నాటి మ్యాచ్ తర్వాత ఇరు జట్లు ఇప్పుడు మరోసారి పొట్టి ఫార్మాట్లో పోరుకు సిద్ధం అయ్యారుు. రెండు జట్లలోనూ ఆ మ్యాచ్‌లో ఆడిన చాలా మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు. గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ ఆశిస్తుండగా... ప్రపంచ చాంపియన్ హోదాలో తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలని విండీస్ భావిస్తోంది. అన్నింటికి మించి తొలిసారి అమెరికాలో భారత స్టార్ క్రికెటర్లు ఆడబోతుండటం ఒక్కసారిగా టి20 సిరీస్‌కు కొత్త ఆకర్షణ తెచ్చి పెట్టింది. గావస్కర్ కాలంనుంచి సచిన్ వరకు ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు చూడటంతోనే సంతృప్తి చెందిన అమెరికన్ భారతీయులకు ఇప్పుడు అసలైన ఇండియన్ ఇంటర్నేషనల్ మ్యాచ్ మజా దక్కనుంది. లాడర్‌హిల్ (ఫ్లోరిడా): టెస్టు సిరీస్‌లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడు టి20ల్లో సత్తా చాటేందుకు సన్నద్ధమైంది. ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇక్కడి సెంట్రల్ బ్రావర్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో నేడు (శనివారం) తొలి మ్యాచ్ జరగనుంది. జింబాబ్వేపై జూనియర్ జట్టుతో విజయం సాధించిన అనంతరం ధోని మళ్లీ మైదానంలోకి వస్తుండగా... స్యామీ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన కార్లోస్ బ్రాత్‌వైట్ తొలిసారి నాయకత్వం వహిస్తున్నాడు. టి20 బలాబలాల పరంగా చూస్తే విండీస్ చాలా బలంగా కనిపిస్తోంది కాబట్టి భారత్‌కు గెలుపు అంత సులువు కాదు. ఉత్సాహంగా ధోనిసేన టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం టి20లకు ఎంపిక కాని భారత ఆటగాళ్లంతా స్వదేశం చేరుకోగా... మిగతావారంతా నేరుగా అమెరికాలో అడుగు పెట్టారు. టెస్టుల్లో మెరుగ్గా రాణించిన జట్టు మొత్తం ఆత్మవిశ్వాసంతో ఉంది. ఎప్పటిలాగే టీమిండియా బ్యాటింగ్ భారం విరాట్ కోహ్లిపైనే ఉంది. అతనితో పాటు ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ చెలరేగేందుకు సిద్ధమయ్యారు. మిడిలార్డర్లో రహానే కీలకం కానున్నాడు. ప్రపంచకప్ వరకు సుదీర్ఘ కాలంగా భారత టి20 జట్టులో అంతర్భాగంగా ఉన్న సురేశ్ రైనా ఈ సిరీస్‌లో లేకపోవడం ఒక్కటే జట్టులో కొత్తగా కనిపించే మార్పు. జట్టులోకి వచ్చీ రావడంతోనే ఆకట్టుకున్న రాహుల్‌కు ఇప్పుడు సీనియర్ల రాక తో తుది జట్టులో స్థానం దొరుకుతుందా చూడాలి. బౌలర్లలో బుమ్రా ఆరంభ ఓవర్లలో మళ్లీ కీలకం కానున్నాడు. ఇతర పేసర్లుగా షమీ, భువనేశ్వర్ తుది జట్టులో ఉంటారు. టెస్టుల్లో విండీస్ భరతం పట్టిన అశ్విన్ టి20ల్లోనూ సత్తా చూపించాల్సి ఉంది. వరల్డ్ కప్ సెమీస్‌లో నోబాల్‌తో తీవ్ర విమర్శల పాలు కావడం అతడిని ఇప్పటికే వెంటాడుతూనే ఉండవచ్చు. కొత్త కెప్టెన్ నేతృత్వంలో... ప్రపంచ కప్‌ను గెలిపించినా వ్యక్తిగత ప్రదర్శన పేలవంగా ఉందంటూ డారెన్ స్యామీని కెప్టెన్సీతో పాటు జట్టునుంచి కూడా విండీస్ బోర్డు అనూహ్యంగా తప్పించింది. టి20 వరల్డ్ కప్ ఫైనల్లో నాలుగు సిక్సర్లతో హీరోగా మారిపోరుున బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా తన తొలి సిరీస్ ఆడుతున్నాడు. అరుుతే అతనికి పెద్దగా అనుభవం లేకపోరుునా... జట్టు మొత్తం టి20 స్టార్లతో నిండి ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా టెస్టు జట్టులో లేని క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, ఆండ్రీ రసెల్, సిమన్‌సలతో ఆ జట్టు బ్యాటింగ్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. వీరికి బ్రాత్‌వైట్ మెరుపులు కూడా తోడైతే జట్టుకు తిరుగుండదు. ఇక వరల్డ్ కప్ ఆడని పొలార్డ్, నరైన్‌లు కూడా జట్టులోకి తిరిగి రావడంతో విండీస్ తుది జట్టులో స్థానం కోసం కూడా గట్టి పోటీ నెలకొంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లి, రాహుల్, రహానే, అశ్విన్, షమీ, బుమ్రా, భువనేశ్వర్ లేదా రవీంద్ర జడేజా. వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), గేల్, చార్లెస్, రసెల్, బ్రేవో, హోల్డర్, కీరన్ పొలార్డ్, సిమన్స, శామ్యూల్స్, శామ్యూల్ బద్రీ, సునీల్ నరైన్. పిచ్, వాతావరణం గురువారం రాత్రి వరకు ఫ్లోరిడాను ఉరుములు, మెరుపులు ఇబ్బంది పెట్టారుు. అరుుతే ఆదివారం తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నా... ఈ మ్యాచ్‌కు మాత్రం వర్షం ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ మైదానంలో ఆరేళ్ల క్రితం తొలిసారి మ్యాచ్‌లు నిర్వహించినప్పుడు తక్కువ స్కోర్లు నమోదయ్యారుు. అరుుతే ఇటీవలి కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో మాత్రం మంచి స్కోర్లు వచ్చారుు. కాబట్టి ఈ మ్యాచ్‌లో కూడా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని భావిస్తున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్లో వెస్టిండీస్ చాలా అద్భుతంగా ఆడుతుంది. సమతూకంతో ఉన్న వారి జట్టులో వినోదాన్ని అందించే ఆటగాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. ఉదయం టి20 మ్యాచ్‌లు జరగడం అనేది కొంత కొత్తగా అనిపిస్తున్నా దాని ప్రభావం ఉండకపోవచ్చు. నా కెరీర్‌ను మరింత పొడిగించుకునేందుకు విరామ సమయాల్లో ఫిట్‌నెస్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టాను. కెప్టెన్సీ విషయంలో కుంబ్లే నుంచి నేను చాలా నేర్చుకున్నాను. క్రికెట్‌కు సంబంధించి అమెరికా ప్రత్యేక తరహా మార్కెట్. ఇక్కడ ఆటను అభివృద్ధి చేసేందుకు అన్ని అవకాశాలూ ఉన్నారుు. -ధోని, భారత కెప్టెన్ రా. గం. 7.30నుంచి స్టార్ స్పోర్ట్స -1లో ప్రత్యక్ష ప్రసారం -
టి20 ప్రపంచకప్‌లో సూపర్-12!
వచ్చే టి20 ప్రపంచ కప్ ప్రధాన రౌండ్లో మరో రెండు జట్లను అదనంగా చేర్చాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భావిస్తోంది. సూపర్-10కు బదులుగా సూపర్-12 నిర్వహించాలని శశాంక్ మనోహర్ నేతృత్వంలో ఎడిన్బర్గ్లో జరిగిన ఐసీసీ సమావేశంలో సభ్యులు ప్రతిపాదించారు. మరోవైపు 2024 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే దిశగా మద్దతు కూడగట్టేందుకు ఐసీసీ... ఇటలీ, ఫ్రాన్స్ దేశాల ఒలింపిక్ సంఘాలతో కూడా చర్చలు జరుపుతోంది. -
పాకిస్తాన్ కోచ్‌గా మికీ ఆర్థర్
పాకిస్తాన్ నూతన కోచ్‌గా మికీ ఆర్థర్‌ను నియమించారు. ఈనెల చివర్లో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. టి20 ప్రపంచకప్‌లో జట్టు పేలవ ప్రదర్శన కారణంగా వఖార్ యూనిస్ ఈ పదవికి రాజీనామా చేయడంతో పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కొత్త కోచ్ వేటలో పడింది. 47 ఏళ్ల ఆర్థర్ గతంలో తన సొంత జట్టు దక్షిణాఫ్రికాతో పాటు ఆస్ట్రేలియా జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు. -
కామెంటేటర్‌గా స్యామీ
కోల్‌కతా: సరిగ్గా నెల రోజుల క్రితం ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్ కెప్టెన్‌గా టి20 ప్రపంచకప్‌ను అందుకున్న డారెన్ స్యామీ... అదే ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్ అవతారం ఎత్తాడు. కోల్‌కతా, పంజాబ్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ ద్వారా కామెంటేటర్‌గా అరంగేట్రం చేశాడు. గతేడాది ఐపీఎల్లో బెంగళూరుకు ఆడిన స్యామీని ఈసారి వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. -
నా గొంతు కోస్తానన్నాడు!
ఫ్లింటాఫ్‌తో 2007 సంవాదంపై యువరాజ్ ముంబై: దాదాపు తొమ్మిదేళ్ల క్రితం టి20 ప్రపంచకప్‌లో స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో యువరాజ్ సింగ్ వరుసగా ఆరు సిక్సర్లు బాదిన విషయం అందరి మనసుల్లో నిలిచిపోయింది. దానికి ముందు మరో ఇంగ్లండ్ ఆటగాడు ఫ్లింటాఫ్‌తో గొడవ జరిగిన తర్వాతే తనలో ఆవేశం పెరిగిందని కూడా యువీ ఎన్నో సార్లు అన్నాడు. అయితే వారిద్దరి మధ్య సరిగ్గా ఏం సంభాషణ జరిగిందనేది ఇప్పటి వరకు బయటికి తెలీదు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ సందర్భంగా యువీ ఆ విషయం వెల్లడించాడు. ‘బ్రాడ్ ఓవర్‌కు ముందు ఫ్లింటాఫ్ వేసిన 18వ ఓవర్లో నేను వరుసగా రెండు ఫోర్లు బాదాను. ఆ ఓవర్ తర్వాత బూతులతో ఫ్లింటాఫ్ తన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తే నేను కూడా అదే తరహాలో బదులిచ్చాను. దాంతో మరింత కోపంతో ఫ్లింటాఫ్ నా గొంతు కోస్తానన్నాడు. నేను కూడా నా బ్యాట్ చూపిస్తూ దీంతో ఎక్కడ కొడతానో తెలుసా అంటూ గట్టిగా బదులిచ్చాను’ అని యువరాజ్ 2007నాటి డర్బన్ మ్యాచ్ ఘటనను గుర్తు చేసుకున్నాడు. ఆ గొడవ తర్వాత తనలో కోపం అమాంతం పెరిగిపోయిందని, ప్రతీ బంతినీ మైదానం బయట కొట్టాలనే కసితో బ్యాటింగ్ చేయడం వల్లే ఆరు సిక్సర్లు వచ్చాయని యువరాజ్ చెప్పుకొచ్చాడు. -
టి20 ప్రపంచకప్ రికార్డు స్థాయిలో వీక్షణ
దుబాయ్: ఇటీవల ముగిసిన ఐసీసీ టి20 ప్రపంచకప్‌కు సంబంధించిన మ్యాచ్‌లను అభిమానులు రికార్డు స్థాయిలో వీక్షించారు. భారత్‌లోని ఏడు వేదికల్లో జరిగిన 48 మ్యాచ్‌లను 32 కోట్ల మంది డిజిటల్, సోషల్ మీడియా ద్వారా తిలకించారు. ఇక ఐసీసీ నుంచి ప్రసార హక్కులు తీసుకుని వివిధ దేశాల్లో ప్రసారం చేసిన చానెల్స్ కూడా అత్యధిక వీక్షకులను సంపాదించాయి. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ స్టార్‌స్పోర్ట్స్, దూరదర్శన్‌లో ప్రసారం కాగా ఇది 17.3 రేటింగ్ సాధించింది. 8 కోట్ల 30 లక్షల మంది అత్యంత ఆసక్తిగా తిలకించారు. 2007 టి20 ప్రపంచకప్ ఫైనల్ అనంతరం ఇదే అత్యధిక స్థాయి కావడం విశేషం. ఓవరాల్‌గా భారత్‌లో ఈ టోర్నీ 73 కోట్ల మందిని ఆకర్శించింది. -
ఇప్పటికీ కోలుకోలేదు
భారత్‌తో ఓటమిపై మహ్మదుల్లా ఢాకా: టి20 ప్రపంచకప్‌లో భారత్ చేతిలో ఓటమి షాక్ నుంచి ఇంకా కోలుకోలేదని బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ మహ్మదుల్లా చెప్పాడు. ఆ మ్యాచ్‌లో విజయానికి చివరి మూడు బంతుల్లో రెండు పరుగులు అవసరం కాగా... ముష్ఫికర్, మహ్మదుల్లా చెత్త షాట్లు ఆడి అవుట్ కావడంతో భారత్ సంచలనాత్మక విజయం సాధిం చింది. ‘ఆ రోజు నేను ఆడిన చెత్త షాట్‌ని తలచుకుని ఇప్పటికీ బాధపడుతున్నా. ఓటమికి పూర్తి బాధ్య త నాదే. అభిమానులు నన్ను క్షమించాలి. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి ఎదురైతే పరిణతితో ఆడతాను’ అని మహ్మదుల్లా చెప్పాడు. -
‘చాంపియన్’లో ఏముంది!
► ఉర్రూతలూగిస్తున్న బ్రేవో పాట ► యూ ట్యూబ్‌లో రికార్డ్ హిట్స్ సాక్షి క్రీడావిభాగం ‘అందరికీ తెలుసు గేల్ చాంపియన్, లారా కూడా చాంపియన్... ఒబామా చాంపియన్, మండేలా చాంపియన్’... ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రేవో సింగిల్ ‘చాంపియన్’ సాహిత్యమిది! సాధారణ పదాలతో, వినేవారికి పెద్దగా శ్రమ కల్పించకుండా ఉంటూ అప్పటికప్పుడు అల్లుకున్న పాటలాగా ఇది అనిపిస్తుంది. క్రికెటర్‌గా బ్రేవోకున్న గుర్తింపు వల్ల పాట అందరికీ పరిచయమైతే... వెస్టిండీస్ వరల్డ్ కప్ విజయం ఇప్పుడు దానిని సూపర్‌హిట్ చేసింది. ‘చాంపియన్’ వీడియోకు యూ ట్యూబ్‌లో వారం వ్యవధిలోనే 4.5 మిలియన్ల హిట్స్ రావడం విశేషం. విండీస్ ఆటగాళ్లయితే దానిని తమ టీమ్ థీమ్ సాంగ్‌గా మార్చుకోగా... ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ పాట డ్యాన్స్ కదలికలను చాలా మంది క్రికెటర్లు, బాలీవుడ్ నటులు అనుకరించారు. రింగ్ టోన్లు, కాలర్ ట్యూన్లుగా పెట్టుకోవడంతో పాటు లెక్క లేనంత మంది అద్దం ముందు ఈ డ్యాన్స్‌ను చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేస్తున్నారు. మొదటి సారేం కాదు క్రికెట్‌తో పాటు వినోద ప్రపంచంలో కూడా గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న బ్రేవో ఆ క్రమంలో రూపొందించిన మూడో సింగిల్ చాంపియన్. ‘గో గ్యాల్ గో’ పేరుతో తొలి పాట అనంతరం 2013 ఐపీఎల్ సమయంలో చలో చలో అంటూ ఒక హింగ్లీష్ సాంగ్‌ను తయారు చేశాడు. ‘ఉలా’ అనే తమిళ చిత్రంలోనూ అతను ఒక పాట పాడాడు. చాంపియన్ పూర్తి వీడియో సాంగ్‌ను టి20 ప్రపంచ కప్ సందర్భంగా ఇటీవల విడుదల చేయడానికి మూడు నెలల ముందే అతను మెల్బోర్న్లో బిగ్‌బాష్ లీగ్ సందర్భంగా దీనిని వేదికపై ప్రదర్శించాడు. నాడు ప్రవాస భారత గాయని పల్లవి శారద అతనితో పదం కలిపింది. దీనిని ప్రమోట్ చేసేందుకు బ్రేవో లాస్ ఏంజెల్స్‌కు చెందిన వీనస్ మ్యూజిక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. భారత్‌లో ‘వేగ’ ఈ వీడియోను విడుదల చేసింది. జోసెఫ్ ఫెర్నాండో దీనికి దర్శకత్వం వహించాడు. చాలెంజ్ కూడా... మన ‘స్టాలిన్’ సినిమాలాగా, సరిగ్గా చెప్పాలంటే ‘స్వచ్ఛ భారత్’ ప్రచారం లాగా ‘చాంపియన్’ పాటకు కూడా ఇలా చేయగలరా అంటూ చాలెంజ్ విసిరాడు. అందరికంటే ముందుగా స్పందిం చిన గేల్ అలాగే డ్యాన్స్ చేసి మరో మూడు పేర్లు అమితాబ్, డివిలియర్స్, కోహ్లిను డ్యాన్స్ చేయాలంటూ నామినేట్ చేశాడు. హర్భజన్ సింగ్ కూడా ఈ పాటకు నర్తించి తన భార్య గీతా బస్రాతో పాటు సచిన్‌కు కూడా సవాల్ విసిరాడు. ‘కరీబియన్ సంస్కృతిలోనే సంగీతం ఉంది. ప్రపంచంలోని చాలా మంది పేరున్న సంగీతకర్తలు ఇక్కడి నుంచి వచ్చారు. క్రికెట్‌తోనే కాకుండా నా అభిమానులను వినోదంతో కూడా ఆనందపరచాలనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను. చాంపియన్ ఇంత పెద్ద హిట్ అయి నా నమ్మకాన్ని నిలబెట్టింది’ అని బ్రేవో గర్వంగా చెప్పుకున్నాడు. మొత్తంగా ఆటతో పాటు విండీస్ పాట కూడా ఇప్పుడు సరికొత్త సంచలనంగా మారింది. ప్రముఖుల పేర్లతో... చాంపియన్’ పాటలో డ్యాన్స్ మొత్తం దాదాపు ఒకే తరహాలో సాగుతుంది. అది సునాయాసంగా కూడా ఉండటంతో చాలా మందికి ఎక్కేసింది. ఈ పాటలో బ్రేవో తనతో పాటు గేల్, పొలార్డ్, లారా, రిచర్డ్స్, మార్షల్‌లాంటి వెస్టిండీస్ ఆటగాళ్ల పేర్లు తీసుకున్నాడు. ఇతర క్రీడా రంగాలకు చెందిన సెరెనా, ఉసేన్ బోల్ట్, జోర్డాన్‌లను చాంపియన్లుగా ప్రస్తుతిస్తూ ఒబామా, మండేలాలాంటి ప్రపంచ ప్రముఖుల పేర్లు కూడా చేర్చాడు. ట్రినిడాడ్ వాళ్ళంతా చాంపియన్లే అని కూడా అతను లైన్‌ను చేర్చాడు. డ్వేవో ఎక్కడా బహిరంగంగా చెప్పకపోయినా... పరిశీలిస్తే ఈ పాటలో పేర్లన్నీ నల్ల జాతివారివే కనిపిస్తాయి. వారి గొప్పతనం చెప్పడం కూడా అతని ఉద్దేశం కావచ్చు. -
ఐపీఎల్లో ఎల్ఈడీ స్టంప్స్
న్యూఢిల్లీ: ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్‌లు కొత్త వెలుగును సంతరించుకోనున్నాయి. టి20 ప్రపంచకప్‌లో వాడిన ఎల్ఈడీ స్టంప్స్‌ను తొలిసారి ఐపీఎల్‌లోనూ ఉపయోగిస్తున్నామని లీగ్ చైర్మన్ రాజీవ్ శుక్లాతెలిపారు. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో విండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో, మరికొంత మంది క్రికెటర్లు కలిసి ‘చాంపియన్ డాన్స్’ను స్టేజ్‌పై చేసి చూపించనున్నారు. -
విండీస్ కెప్టెన్ స్యామీకి అరుదైన గౌరవం
వెస్టిండీస్ జట్టుకు రెండుసార్లు టి20 ప్రపంచకప్ అందించినందుకు ఆ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీకి అరుదైన గౌరవం లభించింది. అతడి సొంత దేశం సెయింట్ లూసియాలోని ప్రధాన క్రికెట్ స్టేడియానికి ఈ స్టార్ క్రికెటర్ పేరు పెట్టారు. ‘బ్యూసెజర్ క్రికెట్ మైదానాన్ని ఇకపై డారెన్ స్యామీ జాతీయ క్రికెట్ మైదానంగా పేరు మారుస్తున్నాం’ అని ఆ దేశ ప్రధాని కెన్ని. డి. ఆంథోని ప్రకటించారు. -
స్యామీపై విండీస్ బోర్డు ఆగ్రహం
► సమస్యల పరిష్కారానికి పిలుపు సెయింట్ జాన్స్/కోల్‌కతా: ప్రతిష్టాత్మక టి20 ప్రపంచకప్‌ను గెలుచుకున్నప్పటికీ ఆటగాళ్లకు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసీబీ)కు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫైనల్ గెలిచిన అనంతరం తమ బోర్డు నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని కెప్టెన్ స్యామీ విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను విండీస్ బోర్డు తప్పుపట్టింది. స్యామీ విమర్శలకు దిగిన కొద్దిసేపటికే బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరూన్ ప్రకటన చేశారు. ‘బోర్డును రచ్చకీడ్చడం స్యామీకి సరికాదు. స్టేడియంలో స్యామీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిర్వాహకులకు క్షమాపణలు చెబుతున్నాను’ అని అన్నారు. అలాగే తమ మధ్య ఉన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ఆటగాళ్లకు పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వేతన సమస్యలపై జూన్‌లో చర్చిస్తామని తెలిపారు. మరోవైపు తమ జట్టుకు విండీస్ బోర్డుకన్నా బీసీసీఐ మద్దతుగా నిలిచిందని ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో అన్నాడు. టైటిల్ గెలిచినా బోర్డు అధికారులు ఇప్పటికీ తమకు ఫోన్ చేయలేదని, అసలు టి20 ప్రపంచకప్ గెలవాలని వారు కోరుకోలేదని ఆరోపించాడు. నికోలస్ క్షమాపణలు వెస్టిండీస్ ఆటగాళ్లకు బుర్ర లేదని తన కాలమ్‌లో పేర్కొన్న ఇంగ్లండ్ మాజీ ఆటగాడు మార్క్ నికోలస్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు తెలిపారు. ‘డారెన్ స్యామీకి, జట్టు ఆటగాళ్లకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నాను. నిజానికి ఆటగాళ్లకు బుర్ర లేదని నేను చెప్పలేదు. అయితే ఓ గొప్ప క్రికెట్ వారసత్వం కలిగిన విండీస్ గురించి అలాంటి అర్థం ధ్వనించేలా రాయాల్సింది కాదు’ అని నికోలస్ అన్నారు. -
మహిళల కొత్త చరిత్ర
► టి20 ప్రపంచకప్ టైటిల్ వెస్టిండీస్ సొంతం ► ఫైనల్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల విజయం మహిళల క్రికెట్లో ఇదో సంచలనం. ఇన్నాళ్లూ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల గుత్తాధిపత్యంలా సాగిన టి20 ఫార్మాట్లో వెస్టిండీస్ మహిళలు కొత్త చరిత్ర సృష్టించారు. డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను ఫైనల్లో చిత్తు చేసి తొలిసారి టైటిల్ సాధించారు. ఆస్ట్రేలియా స్కోరు 148... గెలిచేందుకు సరిపోయే స్కోరుకంటే తాము ఎక్కువగానే చేశామని ఆ జట్టు ప్లేయర్ విలాని చెప్పేసింది. తమతో పోలిస్తే బలహీనంగా కనిపిస్తున్న విండీస్‌ను కంగారూలు తక్కువగా అంచనా వేశారు. మొదటి మూడు ఓవర్లలో విండీస్ 9 పరుగులు చేయగానే సంబరపడి పట్టు సడలించారు. అంతే... ఆ తర్వాత మ్యాథ్యూస్, టేలర్‌ల సెంచరీ భాగస్వామ్యం కరీబియన్లను విశ్వవిజేతగా నిలపగా... నిరాశగా చూస్తుండటం మినహా ఆసీస్ ఏమీ చేయలేకపోయింది ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఫైనల్లో విండీస్ 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 19.3 ఓవర్లలో 2 వికెట్లకు 149 పరుగులు చేసి టోర్నీని చేజిక్కించుకుంది. వరుసగా గత మూడు వరల్డ్‌కప్‌లలో విజేతగా నిలిచి నాలుగో టైటిల్ మీద కన్నేసిన ఆసీస్‌కు భంగపాటు తప్పలేదు. మొదటి సారే ఫైనల్‌కు చేరినా... సమరోత్సాహం ప్రదర్శించిన విండీస్ ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించింది. కీలక భాగస్వామ్యం: ఆరంభంలోనే హీలీ (4)ను అవుట్ చేసి విండీస్ శుభారంభం చేసింది. అయితే విలాని (37 బంతుల్లో 52; 9 ఫోర్లు), కెప్టెన్ లానింగ్ (49 బంతుల్లో 52; 8 ఫోర్లు) కలిపి జట్టును నడిపించారు. ముఖ్యంగా దూకుడుగా ఆడిన విలాని 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ నమోదు చేసింది. వీరిద్దరు రెండో వికెట్‌కు 10 ఓవర్లలో 77 పరుగులు జోడించారు. విలాని వెనుదిరిగినా... లానింగ్, పెర్రీ (23 బంతుల్లో 28; 2 సిక్సర్లు) కలిసి 34 బంతుల్లో 42 పరుగులు జోడించారు. అయితే చివర్లో కట్టడి చేసిన విండీస్ బౌలర్లు ఆఖరి 5 ఓవర్లలో 34 పరుగులే ఇవ్వడంతో ఆసీస్ స్కోరు 150 పరుగుల లోపే ఆగిపోయింది. ఆ ఇద్దరూ అదుర్స్: విండీస్ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగానే ఆరంభించిన హేలీ మ్యాథ్యూస్ (45 బంతుల్లో 66; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ స్టెఫానీ టేలర్ (57 బంతుల్లో 59; 6 ఫోర్లు) ఆ తర్వాత జోరు పెంచారు. ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న వీరిద్దరు చక్కటి షాట్లతో దూసుకుపోయారు. ఈ జోడీని విడదీయడానికి ఆసీస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో ఏకంగా 120 పరుగులు జోడించిన అనంతరం ఎట్టకేలకు వికెట్ పడింది. 26 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన ఈ దశనుంచి విండీస్ వేగంగా విజయం వైపు దూసుకుపోయింది. లక్ష్యానికి చేరువైన తర్వాత టేలర్ కూడా అవుటైనా, డాటిన్ (12 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) పని పూర్తి చేసింది. మ్యాథ్యూస్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలు వగా, టోర్నీలో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు టైటిల్ అందించిన స్టెఫానీ టేలర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకుంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హీలీ (సి) అండ్ (బి) మ్యాథ్యూస్ 4; విలాని (సి) టేలర్ (బి) టేలర్ 52; లానింగ్ (ఎల్బీ) (బి) మొహమ్మద్ 52; పెర్రీ (ఎల్బీ) (బి) డాటిన్ 28; బ్లాక్వెల్ (నాటౌట్) 3; ఆస్బోర్న్ (రనౌట్) 0; జొనాసెన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 148. వికెట్ల పతనం: 1-15; 2-92; 3-134; 4-147; 5-147. బౌలింగ్: కానెల్ 2-0-15-0; మ్యాథ్యూస్ 2-0-13-1; టేలర్ 3-0-26-0; డాటిన్ 4-0-33-2; ఫ్లెచర్ 1-0-9-0; మొహమ్మద్ 4-0-19-1; క్వింటైన్ 4-0-27-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: మ్యాథ్యూస్ (సి) బ్లాక్వెల్ (బి) బీమ్స్ 66; టేలర్ (సి) జొనాసెన్ (బి) ఫారెల్ 59; డాటిన్ (నాటౌట్) 18; కూపర్ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (19.3 ఓవర్లలో 3 వికెట్లకు) 149. వికెట్ల పతనం: 1-120; 2-144. బౌలింగ్: జొనాసెన్ 4-0-26-0; పెర్రీ 3.3-0-27-0; షుట్ 3-0-26-0; ఫారెల్ 4-0-35-1; బీమ్స్ 4-0-27-1; ఆస్బోర్న్ 1-0-6-0. -
సిసలైన చాంపియన్
► టి20 ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ ► ఫైనల్లో 4 వికెట్లతోఇంగ్లండ్పై విజయం ► రాణించిన శామ్యూల్స్ గెలిపించిన బ్రాత్‌వైట్ ► రెండో సారి టైటిల్ కైవసం కోల్‌కతా నుంచి సాక్షి క్రీడాప్రతినిధి:- వెస్టిండీస్ జట్టు మహాద్భుతం చేసింది. టి20 ప్రపంచకప్‌ను రెండో సారి గెలిచి చరిత్ర సృష్టించింది. తమకే సొంతమైన రీతిలో చివర్లో విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శనతో అసలు సిసలు చాంపియన్‌లా ఆడి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు చేసింది. జో రూట్ (36 బంతుల్లో 54; 7 ఫోర్లు), బట్లర్ (22 బంతుల్లో 36; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించగా, బ్రాత్‌వైట్, బ్రేవోలకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం వెస్టిండీస్ 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 161 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మార్లోన్ శామ్యూల్స్ (66 బంతుల్లో 85 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు)కు తోడు బ్రాత్‌వైట్ (10 బంతుల్లో 34 నాటౌట్; 1 ఫోర్, 4 సిక్సర్లు) చెలరేగి విండీస్‌ను జగజ్జేతగా నిలిపారు. 2012లో టైటిల్ నెగ్గిన విండీస్ రెండో సారి టి20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా నిలిచింది. రెండు సార్లూ కెప్టెన్ డారెన్ స్యామీనే కావడం విశేషం. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: ఆదుకున్న రూట్ పవర్‌లెస్ ప్లే ఫైనల్ మ్యాచ్ విండీస్ లెగ్‌స్పిన్నర్ బద్రీ సంచలన బౌలింగ్‌తో ప్రారంభమైంది. రెండో బంతికే అతను రాయ్ (0)ను క్లీన్‌బౌల్డ్ చేసి శుభారంభాన్ని అందించాడు. రసెల్ వేసిన తర్వాతి ఓవర్లో బౌండరీ కోసం ప్రయత్నించిన హేల్స్ (1) షార్ట్ ఫైన్‌లెగ్‌లో బద్రీకి సునాయాస క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. టోర్నీలో ఘోరంగా విఫలమైన కెప్టెన్ మోర్గాన్ (5) అదే దారిలో నడిచాడు. మరో వైపు రూట్ నిలబడటంతో పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 33 పరుగులు చేయగలిగింది. ఆ ఐదు ఓవర్లు పవర్ ప్లే ముగిసిన తర్వాత రూట్, బట్లర్ దూకుడు ప్రదర్శించారు. వీరిద్దరి జోరు ఇంగ్లండ్‌ను కోలుకునేలా చేసింది. బెన్ బౌలింగ్‌లో బట్లర్ 3 భారీ సిక్సర్లు బాది సత్తా చాటాడు. దాంతో 7-11 మధ్య 5 ఓవర్లలో 10 రన్‌రేట్‌తో ఇంగ్లండ్ 50 పరుగులు చేసింది. మార్చేసిన బ్రేవో, బ్రాత్‌వైట్ నాలుగో వికెట్‌కు రూట్, బట్లర్ భాగస్వామ్యం 51 పరుగులకు చేరిన తర్వాత ఒక్కసారిగా ఇంగ్లండ్ పతనం మొదలైంది. జోరు మీదున్న బట్లర్... బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డీప్‌లో బ్రేవోకు క్యాచ్ ఇచ్చాడు. మరో వైపు 33 బంతుల్లో రూట్ అర్ధ సెంచరీ పూర్తయింది. ఈ దశలో బ్రేవో ఓవర్ ఇంగ్లండ్‌ను ముంచింది. అతను వేసిన నాలుగో బంతిని ఆడలేక స్టోక్స్ (13) సునాయాస క్యాచ్ అందించగా, చివరి బంతికి అలీ (0) వెనుదిరిగాడు. అప్పటి దాకా నిలకడగా ఆడుతూ వచ్చిన రూట్... బ్రాత్‌వైట్ ఓవర్లో స్కూప్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. 18 బంతుల వ్యవధిలో 27 పరుగులకే 4 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ పరిస్థితి మరింత దిగజారింది. చివర్లో విల్లీ (14 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) ధాటిగా ఆడటంతో ఆఖరి 5 ఓవర్లలో ఇంగ్లండ్ 40 పరుగులు చేయగలిగింది. వెస్టిండీస్ ఇన్నింగ్స్: శామ్యూల్స్ పోరాటం రూట్ దెబ్బ... వెస్టిండీస్ ఇన్నింగ్స్ కూడా దాదాపు ఇంగ్లండ్‌లాగే సాగింది. విల్లీ తొలి ఓవర్లో ఒకే పరుగు ఇవ్వగా, అనూహ్యంగా రెండో ఓవర్ వేసిన రూట్ అద్భుత ఫలితం సాధించాడు. తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి చార్లెస్ (1) మిడాన్‌లో చిక్కగా, మూడో బంతిని ఇదే తరహాలో ఆడి క్రిస్ గేల్ (4) క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ సంబరాలు మిన్నంటాయి. గత మ్యాచ్ హీరో సిమన్స్ (0) తొలి బంతికే ఎల్బీ కావడంతో విండీస్ కష్టాల్లో పడగా... జోర్డాన్ వేసిన ఆరో ఓవర్లో శామ్యూల్స్ 3 ఫోర్లు బాదడంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 37కు చేరింది. కొనసాగిన తడ‘బ్యాటు’ పవర్‌ప్లే తర్వాత విండీస్ నీరసించింది. కీపర్ పట్టుకున్న క్యాచ్ నేలను తాకడంతో అదృష్టవశాత్తూ అవుట్ కాకుండా బతికిపోయిన శామ్యూల్స్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఇంగ్లండ్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పరుగులు తీయడమే కష్టంగా మారిపోయింది. ఎంత బలంగా బాదే ప్రయత్నం చేసినా బంతి ఫీల్డర్లను దాటిపోలేదు. 7-13 మధ్య 7 ఓవర్లలో 39 పరుగులే చేసిన ఆ జట్ట్టు కేవలం 3 ఫోర్లు మాత్రమే కొట్టింది. ఎట్టకేలకు 14వ ఓవర్లో ఒక భారీ సిక్స్ కొట్టిన బ్రేవో (27 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) ఆ వెంటనే వెనుదిరిగాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 69 బంతుల్లో 75 పరుగులు జోడించారు. మరువలేని ఫినిషింగ్ 6 ఓవర్లలో 70 పరుగులు చేయాల్సిన దశలో ప్లంకెట్ ఓవర్లో శామ్యూల్స్ 2 సిక్సర్లు, ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. అయితే విల్లీ చక్కటి బౌలింగ్‌కు తోడు ఇంగ్లండ్ అద్భుత ఫీల్డింగ్‌తో తర్వాతి ఓవర్లోనే రసెల్ (1), స్యామీ (2) వెనుదిరిగారు. 15-19 ఓవర్ల మధ్యలో విండీస్ 51 పరుగులు చేయగా... ఇక చివరి ఓవర్ విండీస్‌ను చరిత్రలో నిలబెట్టింది. ఆఖరి ఓవర్లో విజయానికి 19 పరుగులు కావలసి ఉండగా... స్టోక్స్ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ వరుసగా నాలుగు సిక్సర్లు బాది కొత్త చరిత్ర సృష్టించాడు. ఏడో వికెట్‌కు శామ్యూల్స్, బ్రాత్‌వైట్ 25 బంతుల్లో అజేయంగా 54 పరుగులు జత చేశారు. -
‘విధ్వంసం’ ఎవరిదో!
- బాదినోడే బాద్షా.. - టి20 ప్రపంచకప్ ఫైనల్ నేడు - వెస్టిండీస్‌తో ఇంగ్లండ్ అమీతుమీ పవర్ హిట్టింగ్‌కు పర్యాయపదం వెస్టిండీస్... సంప్రదాయక దూకుడుకు నిలువుటద్దం ఇంగ్లండ్... ప్రత్యర్థులు పటిష్టంగా ఉన్నా... పరిస్థితులు ప్రతికూలంగా మారినా... ఊహించని రీతిలో ఈ రెండు జట్లు టి20 ప్రపంచకప్‌లో జోరు చూపాయి భయం పుట్టించే భారీ షాట్లు.... అచ్చెరువొందే విన్యాసాలు... అనూహ్య మలుపులతో... బాదుడుకు మారుపేరుగా మారిన ఈ రెండు జట్లు ఇప్పుడు పొట్టి కప్‌లో ఫైనల్ సమరానికి సన్నద్ధమయ్యాయి. ఈడెన్ గార్డెన్స్‌లో నేడు (ఆదివారం) ఈ మ్యాచ్ జరగనుంది. ఇందులో ఎవరు గెలిచినా రెండోసారి ట్రోఫీని సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కుతారు. బలం, బలహీనతల్లో రెండు జట్లూ సమానంగా ఉండటం విశేషం! కరీబియన్లకు గేల్ రాణించడం కీలకం. ఇంగ్లండ్ మాత్రం రాయ్, రూట్లను నమ్ముకుంది. టి20 ప్రపంచకప్ జరుగుతోంది భారత్‌లో... బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి పిచ్‌లు, స్పిన్‌తో చెలరేగిపోయే బౌలర్లు... టోర్నీ ఇలాగే సాగుతుందని అంతా భావించారు. ఈ వికెట్లపై ఉపఖండపు జట్లకే అనుకూలత ఉంటుందని అంతా అనుకుంటే అలాంటి జట్టే లేకుండా తుది పోరు జరగబోతోంది. ఈ గడ్డపై ఒక్కసారి కూడా ఆడని 10 మందిని తీసుకొచ్చి కూడా ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరితే... ఐపీఎల్ అనుభవాన్నంతా రంగరించి విండీస్ సత్తా చాటింది. సాంప్రదాయ, కళాత్మక ఆటను కాదు... ఇరు జట్లు దూకుడైన బ్యాటింగ్‌నే నమ్ముకున్నాయి. బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలాంటిదైనా ఎదురుదాడితోనే ఫలితం సాధించాలనే తరహాలోనే ఆడాయి. అందుకే ఇతర జట్లను వెనక్కి తోసి ఈ రెండు టీమ్‌లు ఫైనల్‌కు చేరాయి. ఒకరిని మించి మరొకరు హిట్టర్లు ఉన్న జట్లలో చివరకు పైచేయి ఎవరిది...? ఎవరు విధ్వంసం సృష్టించి విశ్వాన్ని జయిస్తారో, ఎవరు విధ్వంసం బారిన పడతారో ఈడెన్‌లో నేడు తేలిపోనుంది. కోల్‌కతా ప్రపంచకప్ ఫైనల్‌కు చేరే క్రమంలో వెస్టిండీస్ జట్టు బ్యాట్స్‌మెన్ 36 సిక్సర్లు బాదితే... ఇంగ్లండ్ ఆటగాళ్లు 34 కొట్టారు. మరే జట్టు కూడా కనీసం 30 సిక్స్‌లు కొట్టలేదు. ఇది టోర్నమెంట్లో సరిగ్గా ఇరు ఫైనలిస్ట్‌ల శైలిని నిర్వచిస్తోంది. ఆటగాళ్ల గతానుభవంతో విండీస్ ఈ రీతిలో చెలరేగిపోగా... మారిపోయిన ఇంగ్లండ్ జట్టు కొత్తగా తమ ధాటిని ప్రదర్శించింది. పొట్టి ఫార్మాట్లో జగజ్జేతను నిర్ణయించే తుది పోరులో కూడా ఇప్పుడు ఇదే కనిపించబోతోంది. ఆదివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగే టి20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. 2010లో ఇంగ్లండ్, 2012లో వెస్టిండీస్ ఒక్కోసారి గెలిచాయి. ఇక్కడ విజయం సాధించే జట్టు రెండోసారి టైటిల్ గెలిచిన మొదటి జట్టుగా ఘనత సాధిస్తుంది. స్టార్లు వీరే: ఇంగ్లండ్ ప్రధానంగా జేసన్ రాయ్ బ్యాటింగ్‌ను నమ్ముకుంది. ఈ టోర్నీలో ఆ జట్టు తరఫున వెలుగులోకి వచ్చిన కొత్త స్టార్ అతను. బట్లర్, హేల్స్ ధాటిగా ఆడుతుండగా, జో రూట్ అద్భుతమైన ఫామ్‌తో నిలకడ చూపిస్తున్నాడు. టోర్నీలో మూడు మ్యాచ్‌లలో ఆ జట్టు భారీ స్కోర్లు నమోదు చేసింది. వెస్టిండీస్ తరఫున క్రిస్ గేల్ గురించి కొత్తగా చెప్పాల్సింది లేకపోయినా, సెమీస్‌తో సిమన్స్, రసెల్, చార్లెస్ కూడా తామేంటో చూపించారు. బ్రేవో, స్యామీ కూడా రాణిస్తే తిరుగుండదు. విండీస్ స్పిన్నర్ బద్రీ మినహా ఇరు జట్ల తరఫున బౌలర్ల నుంచి చెప్పుకోదగ్గ గొప్ప ప్రదర్శనలేమీ రాలేదు . కెప్టెన్లు విఫలం: తమ జట్లను నడిపించడంలో ఇరువురు కెప్టెన్లు విజయవంతమయ్యారు గానీ వ్యక్తిగతంగా జట్టుకు ఏమీ చేయలేకపోయారు. కేవలం 11 బంతులే ఆడిన స్యామీ 2 ఓవర్లే బౌలింగ్ చేశాడు. మోర్గాన్ అయితే రెండు సార్లు తొలి బంతికే అవుటయ్యాడు. అయితే ఇప్పటికే కెప్టెన్‌గా ఒక ప్రపంచకప్‌ను అందించిన స్యామీ, దిగ్గజం లాయిడ్ సరసన నిలవాలని భావిస్తుండగా... ఏడాది క్రితం బాధ్యతలు తీసుకొని ఇంగ్లండ్‌ను మార్చిన మోర్గాన్ టైటిల్ గెలవాలని పట్టుదలగా ఉన్నాడు. ఇంగ్లండ్ సహాయక సిబ్బందిలో ఉన్న కాలింగ్‌వుడ్ (2010లో ఇంగ్లండ్‌ను గెలిపించిన కెప్టెన్) తనకు స్ఫూర్తి అని అతను చెప్పుకొచ్చాడు. మాకు బుర్ర లేదంటారా... ఐపీఎల్ వల్ల కావచ్చు... లేదంటే వెస్టిండీస్ క్రికెటర్లు మైదానంలో చేసే సందడి కావచ్చు... కారణం ఏదైనా భారత్‌లో వెస్టిండీస్ జట్టుకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. కరీబియన్ క్రికెటర్లు కూడా భారత అభిమానులతో చాలా స్నేహంగా ఉంటారు. అయితే భారత్‌తో సెమీస్ విజయం తర్వాత ఓ మీడియాలో వచ్చిన వ్యాఖ్య వారిని బాధించింది. వాళ్లు ఆడే షాట్ల గురించి చెబుతూ ‘బుర్ర తక్కువవారు’ అనే వ్యాఖ్య వచ్చింది. దీనిపై స్యామీ ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఎవరైనా తోటి మనుషులను బుర్ర లేనివారని ఎలా అంటారు. ఇది మమ్మల్ని చాలా బాధించింది. ఎన్నో ఘటనలు జరిగినా ఆటపై ప్రేమతోనే మేం ఇంత బాగా ఆడగలుగుతున్నాం. మా మనసులు కూడా అందమైనవి కాబట్టి దేవుడు మా పక్షానే ఉండి ఇంత గొప్ప క్రికెట్ ఆడిస్తున్నాడు’ అని స్యామీ వ్యాఖ్యానించాడు. 29 ఏళ్ల తర్వాత... ఇంగ్లండ్ జట్టు ఒక ఐసీసీ టోర్నీ ఫైనల్ కోల్‌కతాలో ఆడటం ఇది రెండో సారి. గతంలో 1987 రిలయన్స్ వన్డే వరల్డ్ కప్‌లో ఆ జట్టు ఆసీస్ చేతిలో 7 పరుగులతో ఓడింది. 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 2 వికెట్లతో 135 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్... మైక్ గ్యాటింగ్ అనాలోచిత రివర్స్ స్వీప్‌తో పతనమైంది. దేశం గుండె బద్దలైంది. ఇన్నాళ్ల తర్వాత మరో ఫార్మాట్లో ఈడెన్‌లో ఫైనల్ ఆడబోతోంది. జట్ల బలాబలాల గురించి ఎంతగా చెప్పుకున్నా... చివరకు అసలు బలం కనిపించేది అంకెల్లోనే. ఫైనల్లోకి అడుగు పెట్టే ముందు ఇరు జట్ల ప్రదర్శన ఎలా ఉందంటే... ⇒భారత్‌లో ఇరు జట్లు ఒక్క సారి మాత్రమే తలపడ్డాయి. అది ఈ టోర్నీ లీగ్ దశలోనే. 182 పరుగులు చేసి ఇంగ్లండ్ సంబరపడినా... క్రిస్ గేల్ (48 బంతుల్లో 100 నాటౌట్) సునామీతో విండీస్ 6 వికెట్లతో నెగ్గింది. ⇒వెస్టిండీస్ ఈ ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లలోనూ టాస్ గెలవడం విశేషం. ఐదు సార్లు లక్ష్యాన్ని ఛేదించడాన్నే ఇష్టపడినా, అప్ఘన్ షాకిచ్చింది. గత ఐదు టి20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో 4సార్లు టాస్ గెలిచిన జట్టుకే గెలుపు దక్కింది. ⇒ఇరు జట్ల మధ్య 13 టి20 మ్యాచ్‌లు జరిగితే వెస్టిండీస్ 9 గెలిచి 4 ఓడింది. వరల్డ్ కప్‌లోనైతే 4 సార్లూ విండీస్‌దే విజయం. టి20 చరిత్రలో విండీస్ ఇన్ని మ్యాచ్‌లు మరే జట్టుపై గెలవలేదు. ఇంగ్లండ్ ఇన్ని సార్లు ఎవరి చేతిలోనూ ఓడిపోలేదు. రెండు జట్లు ఫైనల్లో తలపడటం ఇదే తొలిసారి. ⇒టోర్నీలో ఇంగ్లండ్ జట్టు మాత్రమే ఓవర్‌కు తొమ్మిదికి పైగా పరుగులు చేసింది. ఆ జట్టు 9.12 రన్‌రేట్‌తో దూసుకువచ్చింది. విండీస్ 7.78 రన్‌రేట్‌తో పరుగులు చేయగలిగింది. ⇒ఇంగ్లండ్ బౌలింగ్ 8.68 ఎకానమీ రేట్‌తో అన్ని జట్లకంటే చెత్త ప్రదర్శన నమోదు చేసింది. కాగా విండీస్ ఎకానమీ రేట్ 7.41. ⇒భారత్‌పై గెలుపులో భారీ షాట్లతోనే సత్తా చాటిన విండీస్ ఈ టోర్నీలో పెద్ద సంఖ్యలో డాట్ బాల్స్ (45.44 శాతం) ఆడిన జట్టుగా నిలిస్తే, ప్రత్యర్థి ఇంగ్లండ్ (33.85 శాతం) అతి తక్కువ డాట్ బాల్స్ ఆడింది. ⇒విండీస్ టోర్నీలో తమ స్పిన్నర్లను కూడా బాగా నమ్ముకుంది. బద్రీ, బెన్ బాగా ప్రభావం చూపించగలిగారు. ఆ జట్టు స్పిన్నర్ల ఎకానమీ రేట్ 5.73 అద్భుతంగా ఉంది. ఇంగ్లండ్ ఎంతో ఆశలు పెట్టుకున్న ఆ జట్టు స్పిన్నర్లు అలీ, రషీద్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ స్పిన్నర్లు అందరికంటే చెత్తగా 9.36 ఎకాన మీతో పరుగులిచ్చారు. ⇒ వెస్టిండీస్‌లో హిట్టర్లకు కొదవ లేకున్నా చివరి వరకు ధాటిగా పరుగులు చేయగల బ్యాట్స్‌మెన్ ఇంగ్లండ్‌కూ ఉన్నారు. టోర్నీలో 15-20 ఓవర్ల మధ్య అన్ని జట్లకంటే వేగంగా ఇంగ్లండ్ (ఓవర్‌కు 12.27) పరుగులు సాధించడం విశేషం. అదే బౌలింగ్‌లో 15-20 ఓవర్ల మధ్య ఇంగ్లండ్ బౌలర్ స్టోక్స్ తరహాలో 50 శాతం డాట్ బాల్స్ ఎవరూ వేయలేకపోయారు. ⇒టోర్నీలో వెస్టిండీస్ అత్యధికంగా 65.34 శాతం పరుగులు బౌండరీల ద్వారా సాధిస్తే, ఇంగ్లండ్ 62.93 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న ఈ బౌండరీల జోరే వారిని ఫైనల్ చేర్చిందంటే అతిశయోక్తి కాదు. పిచ్, వాతావరణం మ్యాచ్‌కు ముందు రోజు ఇంగ్లండ్ వచ్చినప్పుడు పిచ్‌పై కాస్త పచ్చిక కనిపించినా... ఐసీసీ పిచెస్ చీఫ్ అట్కిన్సన్ సూచనలతో బాగా రోలింగ్ జరిగింది. సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్. స్పిన్ కాస్త ప్రభావం చూపించవచ్చు. అయితే మంచు కారణంగా టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఆదివారం వర్ష సూచన ఉంది. ఒకవేళ అంతరాయం కలిగినా ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంది. మా జట్టులో ఆత్మవిశ్వాసం, పట్టుదల పెరిగాయి కాబట్టి మళ్లీ టైటిల్ గెలుస్తామనే నమ్మకం మాలో చాలా మందికి ఉంది. ఇంగ్లండ్ ఆటతీరును బాగా పరిశీలించాం. వారు బాగా ఆడగలరు కాబట్టే ఫైనల్‌కు వచ్చారు. ఆటగాళ్లందరి ప్రదర్శనను విశ్లేషించి సిద్ధంగా ఉన్నాం. మాతో ఓడిన తర్వాత ఆ జట్టు ఆట మరింత మెరుగైంది. ఆదివారం మా లక్ష్యం నెరవేరి కరీబియన్లు అందరికీ ఆనందం పంచాలనేదే మా కోరిక. మా అంతట మేం ఓడాల్సిందే కానీ ఎవరూ మమ్మల్ని ఓడించలేరనే నమ్మకంతో బరిలోకి దిగుతున్నాం. - స్యామీ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు ముందు కూడా మేం ఇదే తరహాలో ఒత్తిడిని ఎదుర్కొన్నాం. అయితే ఆటగాళ్లంతా దానిని అధిగమించి అద్భుతంగా ఆడారు. ఇది ఏ రకంగా చూసినా సాధారణ మ్యాచ్ కాదు. గత ఏడాది కాలంగా కొత్త తరహాలో ఆడుతూ జట్టుగా మారి మేం పడిన శ్రమను సరైన చోట ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది. వరల్డ్ కప్ గెలిస్తే మా అందరి కల నెరవేరినట్లే. -మోర్గాన్ -
ఒకరి కోసం మరొకరు..!
► ఒక్క అడుగు దూరంలో ‘మిషన్’ ► కరీబియన్ క్రికెట్లో కొత్త కళ కోల్‌కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- క్రమశిక్షణ పేరుతో ఏడాది క్రితం ఇద్దరి ఆటగాళ్లపై వేటు... టెస్టు క్రికెట్ పరిస్థితి చూస్తే అధ్వాన్నం... బోర్డుకు, క్రికెటర్లకు మధ్య సు దీర్ఘ కాలంగా తెగని సమస్యలు... డబ్బులు దక్కని పరిస్థితుల్లో టోర్నీకి దూరమయ్యేం దుకు కూడా సిద్ధమైన ఆటగాళ్లు... అంతా గందరగోళం... టి20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు వెస్టిండీస్ పరిస్థితి ఇది. అందుకే వ్యక్తిగతంగా చాలామంది టి20 స్టార్స్ ఉన్నా జట్టుగా కరీబియన్ల మీద ఎవరికీ అంచనాలు లేవు. కానీ భారత్‌ను సెమీస్‌లో ఓడించాక ఆ జట్టు మీద మరింత గౌరవం పెరిగింది. చాంపియన్ పాట నాలుగేళ్ల క్రితం శ్రీలంకలో జరిగిన టి20 ప్రపంచకప్‌లో గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్‌తో వెస్టిండీస్ క్రికెటర్లు సందడి చేశారు. అనూహ్యంగా, అంచనాలకు అందకుండా రాణించి ఆ టైటిల్ గెలిచిన కరీబియన్లు ఒక రకంగా క్రికెట్ అభిమానుల్లో గంగ్నమ్ పాటకు క్రేజ్ పెంచారు కూడా. ఆ తర్వాత బంగ్లాదేశ్‌లో 2014లో విఫలమైన స్యామీ సేనపై ఈసారి కూడా టోర్నీ ఆరంభానికి ముందు అంచనాలు లేవు. అసలు ఈ ఏడాది ఈ జట్టు ఒక్క అంతర్జాతీయ టి20 కూడా ఆడలేదు. జట్టును ప్రకటించడానికి కూడా బోర్డు పలుసార్లు ఆలోచించింది. కాంట్రాక్టు వివాదంతో అసలు తాము వెళ్లమని సీనియర్లంతా బోర్డుతో గొడవపెట్టుకున్నట్లు ప్రచారం జరిగింది. ‘కొన్ని ఘటనలు జరిగి ఉండకపోతే మేం జట్టుగా ఇంతలా కలిసిపోయేవాళ్లం కాదేమో. టోర్నీకి ముందు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. మా జట్టును ఎవరూ గౌరవించలేదు. ఇలాంటి ఘటనలతో అందరం ఒక్కటయ్యాం. ఒకరికోసం ఒకరనే మంత్రం జపించాం. అలాగే మేం సాధించగలం అనే నమ్మకాన్ని ఎప్పుడూ వీడలేదు. అదిప్పుడు ఆటలో కనిపిస్తోంది’ అని కెప్టెన్ స్యామీ ఉద్వేగంగా చెప్పాడు. ఇప్పుడు బ్రేవో పాట ‘చాంపియన్’ వారికి జాతీయగీతంలా మారిపోయింది. మైదానంలో వారి జోష్, సంబరాలు మరే జట్టుకు సాధ్యం కాని విధంగా సాగుతున్నాయి. తమను చిత్తు చేసిన చిన్న జట్టు అఫ్ఘానిస్తాన్‌తో కూడా ఆడిపాడగలగడం కరీబియన్లకే సాధ్యం. ఒకటే లక్ష్యం... మేం ఒక మిషన్‌తో భారత్ వచ్చాం అని పదే పదే స్యామీ చెబుతున్నాడు. ఆ మిషన్ కచ్చితంగా ప్రపంచకప్ టైటిల్. ఇక దీనిని అందుకోవడానికి అడుగు దూరంలో ఉన్నారు. అయితే ఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లండ్ కూడా బలంగానే ఉంది. కానీ ప్రత్యర్థి ఎవరనే ఆలోచన ఎప్పుడూ వెస్టిండీస్‌కు ఉండదు. మా జట్టులో 15 మందీ మ్యాచ్ విన్నర్లే అని పదే పదే కెప్టెన్ చెప్పినా... అందరి చూపూ ప్రతిసారీ గేల్ మీదే ఉంటోంది. ఈ టోర్నీలో గేల్ విఫలమైన మూడు మ్యాచ్‌ల్లోనూ విండీస్ గెలిచింది. ముఖ్యంగా సెమీస్‌లో తీవ్ర ఒత్తిడిలో భారత్‌పై సిమన్స్, రసెల్, చార్లెస్ ఆడిన తీరు... ఆ జట్టులో అందరూ చాంపియన్లే అనే కెప్టెన్ నమ్మకానికి ప్రతీక. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడినా... భారత్‌తో ఆడిన తీరు చూస్తే సరైన సమయంలో గాడిలో పడ్డట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది వెస్టిండీస్ అండర్-19 ప్రపంచకప్ గెలవడం, మహిళల జట్టు కూడా టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడం చూస్తే ఇది వెస్టిండీస్ సీజన్‌లా ఉంది. ‘మేం ఒకరకంగా ప్రపంచం అందరితో ఏకకాలంలో పోరాడుతున్నాం. మా విజయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. టైటిల్ గెలిస్తే మాకు కలిగే ఆనందంతో పోలిస్తే ఏ ఇతర జట్టు గెలిచినా వారికి అంతటి సంతోషం దక్కదు’ అని స్యామీ చెప్పే మాటల్లో వాస్తవం ఉంది. ఎందుకంటే ఇప్పుడు విండీస్ విజ యాన్ని ఆస్వాదించేందుకు ఆ దేశం బయట కూడా పెద్ద సంఖ్యలో జట్టుకు అభిమానులు ఉన్నారు. మరి చాంపియన్ పాట ఫైనల్ తర్వాత కూడా అదే మోత మోగిస్తుందా?. -
కోహ్లి మినహా.....
క్రికెట్ జట్టుగా ఆడాల్సిన ఆట. వ్యక్తుల వల్ల కొన్ని మ్యాచ్‌లు గెలవచ్చు. కానీ జట్టుగా ఆడితే ప్రతి మ్యాచ్ గెలవొచ్చు. టి20 ప్రపంచకప్‌లో భారత్ జట్టులో ప్రధాన లోపం కూడా ఇదే. సచిన్ టెండూల్కర్ అంతటి దిగ్గజం కూడా ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడినా జట్టు నుంచి సహకారం లేక చాలాసార్లు నిరాశ చెందాడు. ఇప్పుడు కోహ్లి విషయంలోనూ అదే జరిగింది. ఒంటిచేత్తో భారత జట్టు భారాన్ని మోశాడు. అయినా మిగిలిన సహచరులు విఫలమయ్యారు. ఓడింది రెండు మ్యాచ్‌లే కదా... సెమీఫైనల్‌కు వచ్చారు కదా... అనే సంతృప్తి మనలో చాలా మందికి ఉండొచ్చు. కానీ సెమీస్‌కు చేరడానికి కూడా ఓ యోధుడి పోరాటం మాత్రమే కారణమని గుర్తించాలి. నిజానికి సెమీస్‌లో బ్యాటింగ్ పిచ్‌పై మినహాయిస్తే... టోర్నీలో అన్నీ స్లో వికెట్లపై కోహ్లి మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మన్ కూడా సరిగా ఆడలేదు. ఏమైనా... వ్యక్తి మీద ఆధారపడితే జరిగే నష్టానికి ఈ టి20 ప్రపంచకప్‌లో భారత ప్రదర్శన పెద్ద ఉదాహరణ. ముంబై నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి :- టి20 ప్రపంచకప్ కోసం భారత్‌కంటే గొప్పగా ఎవరూ సిద్ధం కాలేదు. టోర్నీకి ముందు ఏకంగా 11 వరుస మ్యాచ్‌లు ధోని సేన ఆడింది. అందులో ఒకటే పరాజయం. వరుసగా రెండు సిరీస్‌లు, ఒక టోర్నీ నెగ్గింది. దాంతో ఆశలు, అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అదీ సొంతగడ్డపై ఆడుతుండటంతో... నిస్సందేహంగా 90 శాతంకు పైగా విశ్లేషకులు విజేత స్థానానికి భారత్‌కు ఓటు వేశారు. కానీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమితోనే ‘డేంజర్ బెల్’ మోగింది. భారత జట్టు తమ సొంతగడ్డపై ఇంత పేలవంగా, అదీ స్పిన్‌కు తలవంచడం అసలు ఎప్పుడు జరిగిందో ఎవరికీ గుర్తుండకపోవచ్చు. స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు చావో రేవో మ్యాచ్... సాధారణంగా ఏదో ఒక పరిస్థితుల్లో ఇలాంటి మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. కానీ మనకు మాత్రం ప్రతీ మ్యాచ్ అలాగే మారిపోయింది. గెలిస్తేనే టోర్నీలో నిలవాల్సిన స్థితిలో ఒక్కో గండం దాటాం. ఈ మూడు మ్యాచ్‌లలోనూ మన బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. 90ల్లో సచిన్ టెండూల్కర్ ఏకవీరుడిలా పోరాటం చేయడం, మిగతా జట్టు విఫలమై ఓటమిని ఆహ్వానించడం రివాజుగా ఉండేది. ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో కాకపోయినా విరాట్ కోహ్లికి, ఇతర బ్యాట్స్‌మెన్‌కు మధ్య హస్తిమశకాంతరం ఉంటోంది. లీగ్ దశలో టాప్-5లో ఇతర నలుగురు కలిపి చేసిన పరుగులకంటే విరాట్ ఒక్కడే ఎక్కువ పరుగులు చేశాడు. సరిగ్గా చెప్పాలంటే పాక్‌తో, ఆసీస్‌తో మ్యాచ్‌లను కోహ్లి ఒంటి చేత్తో గెలిపించాడు. అతను తప్ప వాటిలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. పిచ్‌లు మరీ నిస్సారంగా హైవేల తరహాలో ఉండి, పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తేనే మన బ్యాట్స్‌మెన్ పండగ చేసుకుంటారని, రికార్డులు కొల్లగొట్టగలరని ఈ ప్రదర్శనతో రుజువైంది. లేకపోతే సొంతగడ్డపై మన మెరుపు వీరులు ఇంతగా విఫలమవుతారని అసలు ఎవరైనా ఊహించగలరా. రోహిత్, ధావన్, రైనా... ముగ్గురు ఒకరితో ఒకరు పోటీ పడి పెవిలియన్‌కు చేరారు తప్ప సాధికారిక ఇన్నింగ్స్ ఆడలేదు. యువరాజ్ అయితే ఎప్పుడో కళ తప్పినా, తన గతాన్ని నమ్ముకొనే ఇన్ని రోజులుగా కొనసాగుతున్నట్లుగా అనిపించింది. బంగ్లాదేశ్ చేతకానితనం మనకు పరుగు తేడాతో గెలుపు అందించింది కానీ లేదంటే 145 పరుగులు చేసినప్పుడే కథ ముగిసేది. ధోని వికెట్ల మధ్య పరుగు, ఫిట్నెస్ను చూపించి మరికొంత కాలం ఆడగలడనే నమ్మకాన్ని అభిమానుల్లో పెంచాడు. కానీ టి20 తరహాలో అతను ఓ గొప్ప ఇన్నింగ్స్ ఆడి ఎన్నాళ్లయింది. టోర్నీలో 70 బంతులు ఆడితే రెండంటే రెండు సిక్సర్ల కొట్టగలిగాడంటే అది ధోని శైలి ఏమాత్రం కాదు. టి20ల్లో దూకుడుగా ఆడగల బ్యాట్స్‌మెన్‌తో నిండిన లైనప్ ఒక్కసారి కూడా స్థాయికి తగ్గట్లుగా ఆడలేదు. జట్టు మొత్తం తరఫున 3 అర్ధ సెంచరీలు మాత్రమే నమోదు కాగా, అవన్నీ కోహ్లివే. అంతంత మాత్రంగానే... సొంతగడ్డపై ప్రపంచకప్‌లో భారత్ ప్రధాన ఆయుధం అశ్విన్ అవుతాడనే అంతా భావించారు. ఏ షేన్‌వార్న్, మురళీధరన్ తరహాలో జట్టు బౌలింగ్‌కు నాయకత్వం వహించి టోర్నీని గెలిపించగల సత్తా అతనిలో ఉందని నమ్మారు. అదేంటో 5 మ్యాచ్‌లలో కలిపి అతను 15 ఓవర్లు మాత్రమే వేశాడు. కెప్టెన్ ఎంతో నమ్ముకున్న బౌలర్ కూడా పూర్తి కోటా వేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో అప్పటికి 2 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చినా... ఆఖరి ఓవర్లో అశ్విన్‌ను కాదని కోహ్లితో బౌలింగ్ చేయించడం చూస్తే... అశ్విన్‌పై కెప్టెన్‌కు నమ్మకం పోయిందా అనిపించింది. ఆస్ట్రేలియా గడ్డపై మొదలు ఆసియా కప్ వరకు వరుస విజయాలు సాధించడంతో భారత బౌలింగ్ తిరుగు లేనిదిగా కనిపించింది. సీనియర్ నెహ్రా, జూనియర్ బుమ్రా కాంబినేషన్... అశ్విన్, జడేజా జోడీతో ఇక జట్టులో మార్పులే అవసరం లేదని పరిస్థితి కొనసాగింది. కానీ ప్రపంచకప్ వచ్చేసరికి మాత్రం బౌలింగ్ సాదాసీదాగా కనిపించింది. పరుగులు నియంత్రించడంలో అప్పుడప్పుడు సఫలమైనా, వికెట్లు తీయడంలో మాత్రం అందరూ విఫలమయ్యారు. మ్యాచ్‌ను మ లుపు తిప్పే ఒక్క బౌలింగ్ ప్రదర్శన కూడా లేకపోయింది. నెహ్రా ఒక్కడే 6 లోపు ఎకానమీతో అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టగా... మ్యాచ్‌లో ఒక్కసారి కూడా ఏ బౌలర్ కనీసం 3 వికెట్లు తీయలేకపోయారు. టోర్నీ ముందు వరకు తిరుగు లేకుండా ఉన్న బౌలింగ్ విభాగం, అసలు సమయంలో మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. వ్యూహం విఫలమైందా... పాకిస్తాన్, ఆస్ట్రేలియాలతో మ్యాచ్‌లలో ధోని కొత్త ఆలోచనలు అద్భుతమైన ఫలితాలు ఇవ్వగా, బంగ్లాదేశ్‌తో అయితే చివరి మూడు బంతుల ద్వారా కెప్టెన్‌గా తన స్థాయిని తానే మరింత పెంచుకున్నాడు. కానీ వెస్టిండీస్‌తో పరాజయానికి అతను నోబాల్స్‌తో పాటు మంచును కారణంగా చూపించడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే వాంఖడే మైదానం ఆదినుంచి భారీ పరుగుల వేదిక, పైగా చిన్న గ్రౌండ్ కాబట్టి 200 పరుగుల స్కోరు కూడా అంత పెద్దదేం కాదనే విషయం ధోనికి కూడా తెలుసు. వెస్టిండీస్ పవర్ హిట్టర్ల గురించి అంచనా ఉంది. కాబట్టి మరిన్ని పరుగులు చేయాల్సింది. ఆసీస్‌తో పని చేసింది కదాని సింగిల్స్, డబుల్స్ వ్యూహంతో పరుగులు తీయడం బెడిసి కొట్టింది. పరుగు చూడటానికి సరదాగానే ఉంది కానీ... ఇంకెప్పుడూ కొడతారు బాబూ అనేట్లుగా కూడా అనిపించింది. చేతిలో ఎనిమిది వికెట్ల ఉన్నప్పుడు మరిన్ని భారీ షాట్లు ఆడకుండా పరుగెత్తడం అప్పటికి ఏమీ కనిపించకపోయినా చివర్లో అదే ప్రభావం చూపించింది. ఒక సిక్సర్ రావాల్సిన బంతికి రెండుతోనే సరిపెట్టడంతో లెక్క మారిపోయింది. ధోని ఇప్పటికి భారత్‌కు చాలా విజయాలు అందించాడు. అతని మాటలను బట్టి చూస్తే ఇంకా కొనసాగి మున్ముందు కూడా గెలిపించవచ్చు కూడా. కానీ స్వదేశంలో 2011 వన్డే వరల్డ్‌కప్ తరహాలోనే మరో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో అతను సొంతగడ్డపై మళ్లీ విశ్వ విజేతగా నిలుపుతాడని ఆశించిన అభిమానులకు మాత్రం టి20 ప్రపంచకప్ ఒక చేదు అనుభవం. -
కరీబియన్ మహిళలు తొలిసారి...
► ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్ ► సెమీస్‌లో 6 పరుగులతో న్యూజిలాండ్ ఓటమి ముంబై నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ మహిళల జట్టు తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించింది. అంచనాలకు మించి రాణించిన ఆ జట్టు గురువారం ఇక్కడ జరిగిన రెండో సెమీ ఫైనల్లో పటిష్టమైన న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. బ్రిట్నీ కూపర్ (48 బంతుల్లో 61; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో చెలరేగగా, స్టెఫానీ టేలర్ (26 బంతుల్లో 25; 2 ఫోర్లు) రాణించింది. కివీస్ బౌలర్లలో సోఫీ డెవిన్ 22 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. సారా మెక్‌గ్లాషన్ (30 బంతుల్లో 38; 2 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. సాటర్‌వెయిట్ (24), డెవిన్ (22) ఫ ర్వాలేదనిపించారు. స్టెఫానీ టేలర్‌కు 3 వికెట్లు దక్కా యి. విండీస్ చక్కటి బౌలింగ్, అద్భుత ఫీల్డింగ్‌తో కివీస్‌ను కట్టి పడేసింది. ఆదివారం కోల్‌కతాలో జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో వెస్టిండీస్ తలపడుతుంది. -
‘రాయ్’ల్గా... ఫైనల్‌కి
► సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్ ► చెలరేగిన రాయ్, బట్లర్ ► టి20 ప్రపంచకప్ ఐపీఎల్ జట్లు తమను తీసుకోలేదన్న కసితో ఉన్నారేమో... భారత గడ్డపై ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ప్రతి మ్యాచ్‌లోనూ విశ్వరూపం చూపిస్తున్నారు. టోర్నీలో నిలకడగా విజయాలు సాధిస్తూ వచ్చిన బలమైన ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు సెమీఫైనల్లో చుక్కలు చూపించారు. ఓపెనర్ జాసన్ రాయ్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో... న్యూజిలాండ్‌పై అలవోకగా నెగ్గిన ఇంగ్లండ్ రెండోసారి టి20 ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది. న్యూఢిల్లీ: లీగ్ దశలో ఎంత ప్రతిభ చూపినా.... నాకౌట్ మ్యాచ్‌ల్లో మాత్రం న్యూజిలాండ్‌ను దురదృష్టం వెంటాడుతూనే ఉంది. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఓడిన కివీస్... ఈసారి టి20 ప్రపంచకప్‌ను సెమీస్‌తోనే ముగించింది. ఈ టోర్నీలో అజేయశక్తిలా దూసుకుపోతున్న న్యూజిలాండ్‌ను సెమీఫైనల్లో ఇంగ్లండ్ ఏడు వికెట్లతో చిత్తు చేసింది. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులు చేసింది. మున్రో (32 బంతుల్లో 46; 7 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తర్వాత ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులు చేసి నెగ్గింది. జాసన్ రాయ్ (44 బంతుల్లో 78; 11 ఫోర్లు, 2 సిక్సర్లు) సంచలన ఆరంభం ఇవ్వగా... బట్లర్ (17 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ముగించాడు. ఆఖర్లో తడబాటు న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన గప్టిల్ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు) మూడో ఓవర్లోనే పెవిలియన్‌కు చేరినా... విలియమ్సన్, మున్రోలు చెలరేగిపోయారు. ఈ ఇద్దరి జోరుతో తొలి 10 ఓవర్లలో కివీస్ స్కోరు 89/1కు చేరింది. అయితే 11వ ఓవర్లో విలియమ్సన్ అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 8.2 ఓవర్లలో 74 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత అండర్సన్ (23 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడినా.... 14వ ఓవర్లో మున్రోను అవుట్ చేసి ఇంగ్లిష్ బౌలర్లు ట్రాక్‌లోకి వచ్చారు. 16 ఓవర్లలో 133/3 స్కోరుతో పటిష్టస్థితిలో ఉన్న కివీస్‌ను నాణ్యమైన బౌలింగ్‌తో అద్భుతంగా కట్టడి చేశారు. కేవలం 20 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు తీసి భారీ స్కోరును అడ్డుకున్నారు. దీంతో చివరి 10 ఓవర్లలో కివీస్ 64 పరుగులతో సరిపెట్టుకుంది. స్టోక్స్ 3 వికెట్లు తీశాడు. అదిరిపోయే ఆరంభం లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. తొలి ఓవర్లోనే రాయ్ నాలుగు ఫోర్లు బాదితే.. రెండో ఎండ్‌లో హేల్స్ (19 బంతుల్లో 20; 1 ఫోర్, 1 సిక్స్) కూడా దీటుగా స్పందించాడు. మెక్లీంగన్, మిల్నేలకు భారీ సిక్సర్ల రుచి చూపెట్టిన ఈ ఇద్దరు ఓవర్‌కు 10 పరుగులకు పైగా సాధించారు. దీంతో పవర్‌ప్లేలో 67 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో రాయ్ 26 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అయితే తొమ్మిదో ఓవర్లో హేల్స్‌ను సాంట్నర్ అవుట్ చేయడంతో తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలో 82 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో రూట్ (22 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) నెమ్మదిగా ఆడినా.. రాయ్ మాత్రం ఎలియట్ ఓవర్లో భారీ సిక్సర్‌తో మరింత జోరు పెంచాడు. అయితే 48 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన దశలో స్పిన్నర్ సోధి వరుస బంతుల్లో రాయ్, మోర్గాన్ (0)లను అవుట్ చేసినా ప్రయోజనం లేకపోయింది. చివర్లో రూట్ అండతో బట్లర్ ఒక్కసారిగా రెచ్చిపోయాడు. 24 బంతుల్లో 23 పరుగులు అవసరమైన దశలో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో విజయ లాంఛనం ముగించాడు. ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 29 బంతుల్లోనే 49 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) బట్లర్ (బి) విల్లే 15; విలియమ్సన్ (సి అండ్ బి) అలీ 32; మున్రో (సి) అలీ (బి) ఫ్లంకెట్ 46; అండర్సన్ (సి) జోర్డాన్ (బి) స్టోక్స్ 28; టేలర్ (సి) మోర్గాన్ (బి) జోర్డాన్ 6; రోంచి (సి) విల్లే (బి) స్టోక్స్ 3; ఎలియట్ నాటౌట్ 4; సాంట్నర్ (సి) జోర్డాన్ (బి) స్టోక్స్ 7; మెక్లీంగన్ రనౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-17; 2-91; 3-107; 4-134; 5-139; 6-139; 7-150; 8-153. బౌలింగ్: విల్లే 2-0-17-1; జోర్డాన్ 4-0-24-1; ఫ్లంకెట్ 4-0-38-1; రషీద్ 4-0-33-0; స్టోక్స్ 4-0-26-3; మొయిన్ అలీ 2-0-10-1. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (బి) సోధి 78; హేల్స్ (సి) మున్రో (బి) సాంట్నర్ 20; రూట్ నాటౌట్ 27; మోర్గాన్ ఎల్బీడబ్ల్యు (బి) సోధి 0; బట్లర్ నాటౌట్ 32; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: (17.1 ఓవర్లలో 3 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1-82; 2-110; 3-110. బౌలింగ్: అండర్సన్ 1-0-16-0; మిల్నె 3-0-27-0; మెక్లీంగన్ 3-0-24-0; సాంట్నర్ 3.1-0- 28-1; సోధి 4-0-42-2; ఎలియట్ 3-0-21-0. ► రేసులో మిగిలిన మూడు జట్లు (ఇంగ్లండ్, వెస్టిండీస్, భారత్)లో ఎవరు గెలిచినా... రెండోసారి టి20 ప్రపంచకప్ సాధించిన తొలి జట్టుగా అవతరిస్తుంది. -
గేల్ x కోహ్లి
► గేల్‌కోహ్లి నేడు రెండో సెమీ ఫైనల్ ► వెస్టిండీస్‌తో భారత్ పోరు ► గాయంతో యువరాజ్ అవుట్ టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు ప్రస్థానాన్ని ఒక్క ముక్కలో తేల్చేయాలంటే కోహ్లి పేరు తప్ప మరొకటి వినిపించదు. టాప్-5లో మిగతా నలుగురు కలిపి 181 పరుగులు చేస్తే, కోహ్లి ఒక్కడే 184 పరుగులు సాధించాడు. కీలకమైన సెమీస్ మ్యాచ్‌లో ఇప్పుడు కూడా అతడినే దేశం నమ్ముతోంది. అతనిపైనే ఆశలు పెట్టుకుంది. అతను విఫలమైతే ఎలా అనే ఆలోచన కూడా రానంతగా ఫామ్‌లో ఉన్న కోహ్లి మరోసారి తన మ్యాజిక్ చూపించాల్సిన సమయమిది. వెస్టిండీస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వీర విధ్వంసం సృష్టించే క్రిస్‌గేల్ జట్టు భారాన్ని ఒంటిచేత్తో మోస్తున్నాడు. చాలా మంది హిట్టర్లు ఉన్నారని పేరుకు చెప్పుకున్నా... గేల్ అవుటైతే ఆ జట్టు కుప్పకూలిపోవచ్చు. మెరుపు సెంచరీతో అతను గెలిపించిన మ్యాచ్‌ను మినహాయిస్తే మిగతా రెండు మ్యాచ్‌లలో విజయం కోసం తీవ్రంగా శ్రమించిన జట్టు, అఫ్ఘానిస్తాన్ చేతిలో ఓడింది కూడా. బ్యాటింగ్‌తోనే కాదు మానసికంగా కూడా విండీస్‌పై అతని ప్రభావం ఎంతో ఉంది. ప్రపంచకప్ సెమీస్ పేరుకు ఇప్పుడు రెండు జట్ల మధ్య జరుగుతున్నా... కోహ్లి, గేల్ల మధ్య పోటీగానే భావించవచ్చు. ఈ ఇద్దరు ఆటగాళ్లలో ఎవరు తమ స్థాయికి తగినట్లుగా ఆడితే ఆ జట్టుకు గెలుపు ఖాయం. మరి రేసులో మిగిలేదెవరో..! ముంబై నుంచి సాక్షి క్రీడాప్రతినిధి:- వాంఖడే వేదికగా భారత జట్టు మరో మహా మ్యాచ్‌కు సిద్ధమైంది. నేడు (గురువారం) ఇక్కడ జరిగే టి20 ప్రపంచకప్ రెండో సెమీ ఫైనల్లో భారత్, వెస్టిండీస్‌తో తలపడుతుంది. తొలి మ్యాచ్‌లో అనూహ్య పరాజయం తర్వాత కోలుకొని భారత్ సెమీస్‌కు చేరగా...మూడు విజయాలతో సెమీస్ స్థానం సంపాదించాక అఫ్ఘానిస్తాన్ చేతిలో అనూహ్య ఓటమితో వెస్టిండీస్ ఈ మ్యాచ్‌కు వచ్చింది. కాలి మడమ గాయంతో ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఈ మ్యాచ్‌కు దూరం కావడం భారత్‌ను ఇబ్బంది పెట్టే పరిణామం. బలాబలాలు, అనుకూలతలు చూస్తే భారత్ ఒకింత ఆధిక్యంలో కనిపిస్తున్నా... టి20ల్లో మాజీ చాంపియన్ విండీస్‌ను తక్కువగా అంచనా వేయలేం. భారం పంచుకుంటారా..? టాప్-5లో నలుగురు ఆటగాళ్లు విఫలమైన తర్వాత కూడా భారత జట్టు సెమీఫైనల్‌కు చేరడం నిజంగా అద్భుతమే. ఈ నాలుగు మ్యాచ్‌లలో కోహ్లి ఒక్కడే 92 సగటు, 132.37 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగగా... రోహిత్, ధావన్, రైనా, యువరాజ్ కలిపి కేవలం 11.31 సగటు, 103.87 స్ట్రైక్‌రేట్‌తో మాత్రమే పరుగులు చేయగలిగారు. ఇక మిగతావారు కూడా తమ సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ టోర్నీలో అన్ని వేదికలతో పోలిస్తే పరుగుల వరద పారింది ఇక్కడే. ఇలాంటి బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్ అంటే మనోళ్లు సాధారణంగా రెచ్చిపోతుంటారు. అదే జరిగితే జట్టు గెలుపుపై ఆశలు పెంచుకోవచ్చు. చాలా రోజులుగా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడని రోహిత్ శర్మ తన విలువ చూపించేందుకు సొంతగడ్డపై అతనికి మంచి అవకాశం లభించింది. ధావన్, రైనా కూడా ధాటిగా ఆడితే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. మూడు మ్యాచ్‌లలో నాటౌట్‌గా నిలిచిన ధోనికి మరిన్ని బంతులు ఆడే అవకాశం దక్కితే అతను మ్యాచ్ దిశను మార్చగలడు. యువరాజ్ స్థానంలో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందనేది ఆసక్తికరం. బ్యాట్స్‌మెన్ రహానే, పాండే అందుబాటులో ఉన్నారు. అయితే డెరైక్టర్ రవిశాస్త్రి గత మ్యాచ్‌లో యువరాజ్ వేసిన మూడు ఓవర్ల గురించి నొక్కి చెప్పడం చూస్తే నేగికి అవకాశం ఇస్తారా అనేది చూడాలి. ఆల్రౌండర్లపై నమ్మకం ఎవరు అవునన్నా, కాదన్నా గేల్ జోరుపైనే వెస్టిండీస్ ఆధారపడి ఉందంటే అతిశయోక్తి కాదు. అతను సృష్టించే విధ్వంసం గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. పైగా అతని సెంచరీ కూడా ఇదే మైదానంలో వచ్చింది. మరో ఓపెనర్‌గా ఆడే అవకాశం ఉన్న సిమన్స్ టోర్నీలో ఇదే తొలి మ్యాచ్ అయినా ముంబై ఇండియన్స్ ఆటగాడిగా అనుభవం ఉపయోగపడవచ్చు. చార్లెస్, శామ్యూల్స్ దూకుడుగా ఆడగల సమర్థులు. 9వ నంబర్ ఆటగాడి వరకు అందరూ బ్యాటింగ్ చేయగలరు. బ్రేవో, రసెల్, స్యామీల ఫామ్ అంత బాగోలేదు. బౌలింగ్‌లో ఆల్‌రౌండర్లు మినహా చెప్పుకోదగ్గ పేసర్ లేడు. దాంతో ఇద్దరు స్పిన్నర్లు బద్రీ, బెన్ కీలకం కానున్నారు. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, రహానే/పాండే, హార్దిక్ పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. వెస్టిండీస్: స్యామీ (కెప్టెన్), గేల్, సిమన్స్, చార్లెస్, శామ్యూల్స్, బ్రేవో, రసెల్, బ్రాత్‌వైట్, రామ్‌దిన్, బద్రీ, బెన్. పిచ్, వాతావరణం టోర్నీలో గత మూడు మ్యాచ్‌లలో ఉపయోగించని కొత్త పిచ్‌ను తొలిసారి భారత మ్యాచ్‌కు వాడుతున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉంది. అయితే స్పిన్ అనుకూలత కోసం కాస్త ఎక్కువగా రోలింగ్ చేసినట్లు కనిపిస్తోంది. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించకపోవచ్చు. ►2 భారత్, వెస్టిండీస్‌ల మధ్య ఇప్పటివరకూ జరిగిన 4 టి20 మ్యాచ్‌ల్లో చెరో రెండు గెలిచాయి. ప్రపంచకప్‌లలో మూడు ఆడగా... భారత్ ఒకటి గెలిచి, రెండు ఓడింది. అశ్విన్ అతడిని ఆపాలి... క్రిస్ గేల్ క్రీజ్‌లో ఉంటే ఎంత ప్రమాదకరంగా మారతాడో ధోనికి తెలియనిది కాదు. అందుకే అది ఐపీఎల్ అయినా, అంతర్జాతీయ మ్యాచ్ అయినా అతడిని కట్టడి చేసేందుకు అశ్విన్ అనే ఆయుధాన్ని ధోని అనేక సార్లు ప్రయోగించాడు. అశ్విన్ కూడా కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. టి20ల్లో వీరిద్దరు ఎదురెదురుగా 9 ఇన్నింగ్స్‌లలో తలపడితే అందులో నాలుగు సార్లు అశ్విన్ అవుట్ చేశాడు. అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కోలేక గేల్ పడే ఇబ్బందిని ఇప్పుడు భారత్ మళ్లీ సొమ్ము చేసుకోవాల్సి ఉంది. ప్రపంచంలో ప్రతీ బౌలర్‌ను చితకబాది ఏడిపించే గేల్ అశ్విన్ బౌలింగ్‌లో 70 బంతులు ఆడితే 57 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇందులో 51 బంతులు పవర్‌ప్లేలో వేశాడు. అయినా సరే ఈ ఎత్తును చిత్తు చేయడం గేల్ వల్ల కాలేక కేవలం 3 ఫోర్లు, 3 సిక్సర్లతోనే సరిపెట్టాడు. ఇప్పుడు మరోసారి తొలి ఓవర్ అశ్విన్‌తో ప్రారంభించినా ఆశ్చర్యం లేదు. అతను అవుటైనా చాలా మంది బ్యాట్స్‌మెన్ ఉన్నారని వెస్టిండీస్ చెప్పుకోవచ్చు. కానీ గేల్ బ్యాటింగ్ చూపే ప్రభావమే వేరు. ఒక్కసారి అతను వెనుదిరిగితే విండీస్ కుప్పకూలడమో లేదంటే పడుతూ లేస్తూ తక్కువ స్కోరుకే పరిమితం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కోహ్లి రివర్స్ స్వీప్ టి20 క్రికెట్లో కూడా సంప్రదాయ షాట్లతోనే అద్భుతాలు చేసే విరాట్ కోహ్లి బుధవారం కాస్త కొత్తగా కనిపించాడు. సుదీర్ఘ సమయం పాటు సాగిన ప్రాక్టీస్ సెషన్లో అతను భారత బౌలర్లందరినీ ఎదుర్కొన్నాడు. అయితే ఎప్పుడూ లేని విధంగా రివర్స్ స్వీప్, స్విచ్ హిట్లను ఆడటం విశేషం. ముఖ్యంగా అశ్విన్ బౌలింగ్‌లో అతను కొట్టిన రివర్స్ స్వీప్‌లు ఎలాంటి తడబాటు లేకుండా పర్ఫెక్ట్ షాట్లుగా మారాయి. సరదాగా ఒకటి, రెండు బంతులు కాకుండా సీరియస్‌గానే సాధన చేసిన కోహ్లి మనసులో కొత్త ఆలోచనలేమైనా ఉన్నాయేమో. మరో వైపు రహానే, పాండేలు ఇద్దరిపై ప్రత్యేక దృష్టి పెడుతూ రవిశాస్త్రి మరో నెట్స్‌లో వీరిద్దరితో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయించారు. రా. గం. 7 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1లో ప్రత్యక్ష ప్రసారం -
మీ సంగతేంటి..?
► ఆందోళన కలిగిస్తున్న ఓపెనర్లు ► మిడిలార్డర్ కూడా అంతంత మాత్రమే మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరినా జట్టు బ్యాటింగ్ ప్రదర్శన పట్ల పెద్దగా ఎవరికీ సంతృప్తి లేదు. కోహ్లి మినహా ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పటివరకూ ఆడలేదు. కోహ్లి పుణ్యమాని పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై గెలిచాం. బంగ్లాదేశ్ స్వయంకృతాపరాధంతో గట్టెక్కాం. మొత్తానికి సెమీస్‌కు చేరాం. కానీ రేపు సెమీస్‌లో కోహ్లి పొరపాటున విఫలమైతే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు భారత జట్టు సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న ఇది. ఓపెనర్ల వైఫల్యం వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు, టి20ల్లో కూడా సెంచరీ ఉన్న ఘనత రోహిత్ శర్మ సొంతం. కానీ అదంతా బ్యాటింగ్ పిచ్‌ల మహిమే తప్ప రోహిత్ గొప్పతనం కాదేమో అన్నట్లుగా అతని ఆట కొనసాగుతోంది. నాలుగు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా అతను కనీస ప్రభావం చూపలేకపోయాడు. మొత్తం టోర్నీలో అతను ఇప్పటి వరకు 45 పరుగులే చేశాడు. పిచ్ కాస్త బౌలర్లకు అనుకూలిస్తుంటే చాలు చేతులెత్తేస్తున్నాడు. పోరాటపటిమ అనేది మచ్చుకైనా కనిపించక పోగా, అవుటైన తీరు నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. శిఖర్ ధావన్ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈసారి టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా ప్రభావం చూపలేదు. ధావన్ వరుసగా 1, 6, 23, 13 పరుగులు చేశాడు. నేరుగా వచ్చిన బంతులను స్వీప్ ఆడి అతను రెండు సార్లు ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం ఇంకా డెరైక్టర్, కోచ్‌లు గుర్తించినట్లు లేదు. గతంలో చాలా సందర్భాల్లో టి20లైనా సరే వీరిద్దరు ఆరంభంలో కాస్త నిలదొక్కుకొని ఆ తర్వాత చెలరేగిపోయేవారు. ఫలితంగా స్ట్రైక్‌రేట్ కూడా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడూ నిలబడే ప్రయత్నంలో బంతులు తినేస్తున్నారు. కానీ ఆ వెంటనే అవుట్ కావడంతో పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారుతోంది. గత నాలుగు మ్యాచ్‌లలో భారత ఓపెనింగ్ భాగస్వామ్యం 5 పరుగులు (5 బంతుల్లో), 14 (13), 42 (36), 23 (23)గా ఉంది. టి20ల్లో సాధారణంగా పవర్‌ప్లేలో కనిపించే మెరుపు ఆరంభానికి ఇది భిన్నం. మిడిల్ అంతంత మాత్రమే ఇక ఈ టోర్నీలో అందరికంటే దారుణం రైనా. బంగ్లాదేశ్‌పై చేసిన 30 పరుగులు మినహా ఏమాత్రం ఆడలేదు. పడుతూ లేస్తూ పరుగులు చేస్తున్న యువరాజ్‌ను చూసి సంతోషించాలో లేక గతంలో అతడి స్థాయిని గుర్తు చేసుకుని బాధపడాలో తెలియడం లేదు. ఒకప్పుడు గొప్ప మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న యువరాజ్ ఇప్పుడు చివరి వరకూ నిలబడలేకపోతున్నాడు. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు కలిపి 52 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కొద్ది సేపు నిలబడగలిగితే ఆ మాత్రం పరుగులైనా వస్తున్నాయి కానీ లేదంటే ఆరంభంలో తడబడితే అక్కడితోనే సరి. కెప్టెన్ ధోని నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఇప్పటివరకూ పరుగులు రాలేదు. ఆల్‌రౌండర్ పేరున్న జడేజా బ్యాటింగ్ మరచిపోయి చాలా కాలం అయింది కాబట్టి అతనిపై ఆశలు పెట్టుకోవడం కూడా అనవసరం. టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కనీసం 100 పరుగులు చేసిన 23 మందిలో కోహ్లి మినహా మరెవరూ భారతీయులు లేకపోవడం మన బ్యాట్స్‌మెన్ ఆటకు ఉదాహరణ. ఇక స్ట్రైక్‌రేట్ పరంగా చూస్తే కోహ్లి (132.37)నే 46వ స్థానంలో నిలిచాడంటే మన స్టార్ బ్యాట్స్‌మెన్ వేగంగా కూడా ఆడలేకపోతున్నారని అర్థమవుతుంది. యువరాజ్ సరిగ్గా 100 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తే...రోహిత్ (88.23), ధావన్ (82.69) బంతికో పరుగు కూడా చేయలేకపోయారు. మరోసారి టి20ల్లో విశ్వ విజేతగా నిలిచేందుకు, సొంతగడ్డపై వరుసగా ప్రపంచకప్ గెలిచేందుకు ఇక ఆడాల్సింది రెండు మ్యాచ్‌లే. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా టోర్నీలో తమదైన ముద్ర వేసేందుకు ఇదే మిగిలిన అవకాశం. మరి ఇకనైనా కోలుకుంటారా..? -
విజయంతో ముగించారు
► శ్రీలంకపై దక్షిణాఫ్రికా గెలుపు ► రాణించిన ఆమ్లా ► టి20 ప్రపంచకప్ న్యూఢిల్లీ: బౌలర్లు రాణింపు.. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ విజృంభణతో టి20 ప్రపంచకప్‌ను దక్షిణాఫ్రికా విజయంతో ముగించింది. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో డు ప్లెసిస్ సేన ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. హషీమ్ ఆమ్లా (52 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇరు జట్లు ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్ర్కమించిన విషయం తెలిసిందే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 19.3 ఓవర్లలో 120 పరుగులు చేసింది. దిల్షాన్ (40 బంతుల్లో 36; 4 ఫోర్లు; 1 సిక్స్), చండిమాల్ (20 బంతుల్లో 21; 2 ఫోర్లు; 1 సిక్స్) వీరిద్దరు తొలి వికెట్‌కు 4.5 ఓవర్లలో 45 పరుగులు జోడించారు. అయితే ఫంగిసో వరుస బంతుల్లో చండిమాల్, తిరిమన్నెలను అవుట్ చేయడంతో లంక పతనం ప్రారంభమైంది. చివర్లో షనక (18 బంతుల్లో 20 నాటౌట్; 1 ఫోర్; 1 సిక్స్) పోరాడినా సహకారం కరువైంది. అబాట్, ఫంగిసో, బెహర్డీన్లకు రెండేసి వికెట్లు దక్కాయి. దక్షిణాఫ్రికా 17.4 ఓవర్లలో 2 వికెట్లకు 122 పరుగులు చేసి నెగ్గింది. రెండో ఓవర్లోనే డి కాక్ (9) రనౌట్ అయినా ఆమ్లా, డు ప్లెసిస్ (36 బంతుల్లో 31; 3 ఫోర్లు) ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడారు. రెండో వికెట్‌కు 60 పరుగులు జోడించారు. అటు 47 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన ఆమ్లా టి20ల్లోనూ వెయ్యి పరుగులు పూర్తి చేశాడు. చివర్లో మెరిసిన డి విలియర్స్ (12 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్సర్లు) ఓ భారీ సిక్స్‌తో ఇన్నింగ్స్‌ను విజయంతో ముగించాడు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: చండిమాల్ (బి) ఫంగిసో 21; దిల్షాన్ ఎల్బీడబ్ల్యు (బి) బెహర్డీన్ 36; తిరిమన్నె (బి) ఫంగిసో 0; సిరివర్దన (రనౌట్) 15; జయసూరియ (సి) డు ప్లెసిస్ (బి) బెహర్డీన్ 1; కపుగెడెర (బి) తాహిర్ 4; పెరీరా (సి) బెహర్డీన్ (బి) స్టెయిన్ 8; షనక నాటౌట్ 20; హెరాత్ (సి) డి కాక్ (బి) అబాట్ 2; వాండర్సే (బి) అబాట్ 3; లక్మల్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 120. వికెట్ల పతనం: 1-45, 2-45, 3-75, 4-78, 5-85, 6-85, 7-96, 8-109, 9-120, 10-120. బౌలింగ్: స్టెయిన్ 4-0-33-1; అబాట్ 3.3-0-14-2; ఫంగిసో 4-0-26-2; తాహిర్ 4-0-18-1; వీస్ 1-0-8-0; బెహర్డీన్ 3-0-15-2. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా నాటౌట్ 56; డి కాక్ (రనౌట్) 9; డు ప్లెసిస్ ఎల్బీడబ్ల్యు (బి) లక్మల్ 31; డి విలియర్స్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (17.4 ఓవర్లలో రెండు వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1-15, 2-75. బౌలింగ్: జయసూరియ 1-0-9-0; లక్మల్ 3.4-0-28-1; హెరాత్ 4-0-21-0; వాండర్సే 4-0-25-0; షనక 2-0-17-0; పెరీరా 2-0-15-0; సిరివర్ధన 1-0-5-0. -
మహిళల పోరాటం ముగిసింది
మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: టి20 ప్రపంచకప్‌నుంచి భారత మహిళల జట్టు నిష్ర్కమించింది. సెమీస్ చేరే ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో చివరి ఓవర్ వరకు పోరాడిన భారత్... 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ముందుగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 114 పరుగులు చేయగా, భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 111 పరుగులు చేయగలిగింది. ఆఖరి ఓవర్లో విజయానికి 10 పరుగులు అవసరం కాగా, భారత్ 2 వికెట్లు కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో వెస్టిండీస్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. టోర్నీలో ఒక్క బంగ్లాదేశ్‌పై మాత్రమే గెలిచి పాకిస్తాన్, ఇంగ్లండ్, వెస్టిండీస్ చేతిలో ఓడిన భారత్ లీగ్ దశలోనే నిష్ర్కమించింది. కీలక భాగస్వామ్యం: టాస్ గెలిచిన భారత్ వెస్టిండీస్‌కు బ్యాటింగ్ అప్పగించింది. 26 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయి ఆ జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ స్టెఫానీ టేలర్ (45 బంతుల్లో 47; 5 ఫోర్లు), డాటిన్ (40 బంతుల్లో 45; 5 ఫోర్లు) నాలుగో వికెట్‌కు 65 బంతుల్లో 77 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే భారత బౌలర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ (4/23), అనూజ (3/16) చెలరేగడంతో విండీస్ 11 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. తొలి బంతితోనే..: లక్ష్యఛేదనలో తొలి బంతికే భారత్‌కు షాక్ తగిలింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ మిథాలీరాజ్ (0) తొలి బంతికే కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు పతనం ప్రారంభమైంది. స్మృతి మందన (27 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించినా, తక్కువ వ్యవధిలో మరో 3 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత అనూజ పాటిల్ (27 బంతుల్లో 26; 1 ఫోర్), జులన్ గోస్వామి (19 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన డాటిన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇంగ్లండ్ విజయం చెన్నై: టి20 మహిళల ప్రపంచకప్‌లో లీగ్ దశను ఇంగ్లండ్ జట్టు అజేయంగా ముగించింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 68 పరుగుల తేడాతో నెగ్గింది. ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 148 పరుగులు చేసింది. చార్లెట్ ఎడ్వర్డ్స్ (77) రాణించింది. పాకిస్తాన్ 17.5 ఓవర్లలో 80 పరుగులకు ఆలౌట్ అయ్యింది. సెమీఫైనల్స్‌లో ఆసీస్‌తో ఇంగ్లండ్.. న్యూజిలాండ్‌తో వెస్టిండీస్ తలపడుతాయి. -
మూల విరాట్
► ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించిన కోహ్లి ► టి20 ప్రపంచకప్ సెమీస్‌లో ధోని సేన ► కీలక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో విజయం ఎవరన్నారు... సచిన్ తర్వాత మరో క్రికెట్ దేవుడు రాడని..! విరాట్ కోహ్లి రూపంలో ఎప్పుడో వచ్చాడు. ఆ ‘దేవుడి’ తాండవం ప్రతిసారీ చూస్తున్నా... ఈసారి విశ్వరూపమే చూపించాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్... ఓ ఎండ్‌లో వెనుదిరుగుతున్న సహచరులు... ఎదురుగా కొండలా లక్ష్యం... పెరిగిపోతున్న రన్‌రేట్... మరింత పెరుగుతున్న ఒత్తిడి... అయితేనేం... మూల విరాట్ ‘మాయ’ చేశాడు. పరుగుకే అలుపొచ్చేలా పరుగు... బౌండరీ వెనక బౌండరీ... ఏ మాత్రం తడబాటు లేకుండా... యావత్ భారతదేశాన్ని ఆనంద డోళికల్లో ముంచెత్తాడు. జీవితాంతం గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడి టి20 ప్రపంచకప్‌లో భారత్‌ను సెమీస్‌కు చేర్చాడు. మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి:- 11 బంతుల్లో 32 పరుగులు... భారత్‌ను గెలిపించే క్రమంలో విరాట్ కోహ్లి చివరి 11 బంతుల స్కోరు ఇది. ఇందులో 6 ఫోర్లు, 1 సిక్సర్ ఉన్నాయి. భూమిలో పాతిపెట్టిన పరాజయాన్ని కూడా వెనక్కి తెచ్చి విజయంగా మార్చగల సత్తా తనకు ఉందని ఈ సూపర్ స్టార్ మరో సారి నిరూపించాడు. లెక్కలేనన్ని అతని అమూల్య ఇన్నింగ్స్‌లలో మరొకటి చేరింది. కోహ్లి అద్భుత బ్యాటింగ్‌తో భారత్ టి20 ప్రపంచకప్ సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం ఇక్కడ జరిగిన గ్రూప్ 2 చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (34 బంతుల్లో 43; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, మ్యాక్స్ వెల్ (28 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) రాణించాడు. అనంతరం భారత్ 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 161 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (51 బంతుల్లో 82 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (10 బంతుల్లో 18 నాటౌట్; 3 ఫోర్లు) ఐదో వికెట్‌కు 31 బంతుల్లోనే 67 పరుగులు జోడించి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఈ మ్యాచ్ విజయంతో టీమిండియా సెమీస్‌కు చేరింది. ఈ నెల 31న ముంబైలో జరిగే సెమీస్‌లో భారత్, వెస్టిండీస్‌తో తలపడుతుంది. ఆరంభం ఘనం ఆస్ట్రేలియాకు ఓపెనర్లు ఖాజా (16 బంతుల్లో 26; 6 ఫోర్లు), ఫించ్ మెరుపు ఆరంభం అందించారు. బుమ్రా తొలి ఓవర్లో ఖాజా నాలుగు ఫోర్లు బాదగా, అశ్విన్ తన తొలి ఓవర్లో రెండు భారీ సిక్సర్లు సహా 22 పరుగులు సమర్పించుకున్నాడు. ఫలితంగా ఆసీస్ ఓపెనర్లు తొలి వికెట్‌కు 25 బంతుల్లోనే 54 పరుగులు జోడించారు. అయితే ఖాజాను అవుట్ చేసి నెహ్రా, ఆసీస్ జోరుకు అడ్డుకట్ట వేశాడు. మరి కొద్ది సేపటికే వార్నర్ (6) కూడా వెనుదిరిగాడు. టోర్నీలో తొలిసారి బౌలింగ్‌కు దిగిన యువరాజ్ మొదటి బంతికే స్మిత్ (2)ను పెవిలియన్‌కు పంపించడంతో భారత శిబిరంలో ఆనందం పెరిగింది. ఈ దశలో బౌలర్లు మరింత కట్టడి చేయడంతో పరుగులు చేయడంలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ తీవ్రంగా తడబడ్డారు. శుభారంభం తర్వాత ఆ జట్టు ఒక్కసారిగా పేలవంగా మారిపోయింది. హిట్టర్లుగా పేరు పొందిన బ్యాట్స్‌మెన్ కూడా సింగిల్ తీయడానికే శ్రమించారు. ఈ క్రమంలో ధాటిగా ఆడే ప్రయత్నం చేసి ఫించ్ కూడా అవుటయ్యాడు. ఆఖర్లో మ్యాక్స్‌వెల్, వాట్సన్ (16 బంతుల్లో 18 నాటౌట్; 2 ఫోర్లు) కొన్ని పరుగులు జోడించడంతో ఆస్ట్రేలియా చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. భారత బౌలర్లు ఏకంగా 44 డాట్ బంతులు విసరడం చూస్తే ఆసీస్ ఎంతగా ఇబ్బంది పడిందో అర్థమవుతుంది. ఇందులో నెహ్రా ఒక్కడే 13 బంతులు వేశాడు. విరాట్ విశ్వరూపం వరల్డ్ కప్‌లో మరోసారి భారత ఓపెనర్లు నిరాశపరిచే ఆరంభాన్ని ఇచ్చారు. నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన ధావన్ (12 బంతుల్లో 13; 1 ఫోర్, 1 సిక్స్), రోహిత్ (17 బంతుల్లో 12; 1 ఫోర్) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. కూల్టర్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి ధావన్ బంతిని గాల్లో లేపగా, వాట్సన్ బౌలింగ్‌లో రోహిత్ క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ తర్వాత రైనా (10) కూడా షార్ట్ పిచ్ బంతిని ఇబ్బందిగా ఆడి పెవిలియన్ చేరాడు. ఈ దశలో కోహ్లి, యువరాజ్ (18 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఒక వైపు కోహ్లి అలవోకగా సింగిల్స్ తీసుకోగా, కాలి మడమ గాయంతో బాధపడుతూ రెండు సార్లు చికిత్స తీసుకున్న యువీ క్రీజ్‌లో నిలబడే ప్రయత్నం చేశాడు. అయితే కవర్స్‌లో వాట్సన్ అద్భుత క్యాచ్‌కు అతను వెనుదిరిగాడు. 6 ఓవర్లలో 67 పరుగులు చేయాల్సిన స్థితిలో జత కలిసిన కోహ్లి, ధోని చెలరేగిపోయారు. తమదైన వేగంతో ఆసీస్ ఫీల్డర్లను పరుగులు పెట్టించి వేగంగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా కోహ్లి ఏ బంతినైనా అలవోకగా బౌండరీకి తరలించిన తీరు, వీరిద్దరు సింగిల్స్‌ను రెండు పరుగులుగా మార్చిన తీరు అమోఘం. 17 ఓవర్లు ముగిసిన తర్వాత కూడా ఆసీస్ ఆశతోనే ఉంది. కానీ ఫాల్క్‌నర్ వేసిన 18వ ఓవర్లో 19 పరుగులు రాబట్టడంతోనే మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చేసింది. మరో సారి తనదైన శైలిలో భారీ షాట్‌తో ధోని మ్యాచ్ ముగించడం విశేషం. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖాజా (సి) ధోని (బి) నెహ్రా 26; ఫించ్ (సి) ధావన్ (బి) పాండ్యా 43; వార్నర్ (స్టంప్డ్) ధోని (బి) అశ్విన్ 6; స్మిత్ (సి) ధోని (బి) యువరాజ్ 2; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 31; వాట్సన్ (నాటౌట్) 18; ఫాల్క్‌నర్ (సి) కోహ్లి (బి) పాండ్యా 10; నెవిల్ (నాటౌట్) 10; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 160. వికెట్ల పతనం: 1-54; 2-72; 3-74; 4-100; 5-130; 6-145. బౌలింగ్: నెహ్రా 4-0-20-1; బుమ్రా 4-0-32-1; అశ్విన్ 2-0-31-1; జడేజా 3-0-20-0; యువరాజ్ 3-0-19-1; పాండ్యా 4-0-36-2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) వాట్సన్ 12; ధావన్ (సి) ఖాజా (బి) కూల్టర్ నీల్ 13; కోహ్లి (నాటౌట్) 82; రైనా (సి) నెవిల్ (బి) వాట్సన్ 10; యువరాజ్ (సి) వాట్సన్ (బి) ఫాల్క్‌నర్ 21; ధోని (నాటౌట్) 18; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (19.1 ఓవర్లలో 4 వికెట్లకు) 161. వికెట్ల పతనం: 1-23; 2-37; 3-49; 4-94. బౌలింగ్: హాజల్‌వుడ్ 4-0-38-0; కూల్టర్ నీల్ 4-0-33-1; వాట్సన్ 4-0-23-2; ఫాల్క్‌నర్ 3.1-0-35-1; మ్యాక్స్‌వెల్ 2-0-18-0; జంపా 2-0-11-0. -
టీమిండియానా.. ఆస్ట్రేలియానా..?
టి-20 ప్రపంచ కప్‌లో మూడు జట్లకు సెమీస్ బెర్తులు ఖరారయ్యాయి. గ్రూపు దశలో వాటి స్థానాలూ ఖాయమయ్యాయి. ఇక తేలాల్సింది మరో బెర్తు ఎవరిదన్నదే. ఆ బెర్తు టీమిండియాదా లేక ఆస్ట్రేలియాదా..? మరి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. గ్రూపు-2లో ఓటమెరుగని న్యూజిలాండ్ (8) అగ్రస్థానంతో దర్జాగా సెమీస్ చేరింది. మరో బెర్తు కోసం భారత్ (4), ఆస్ట్రేలియా (4) పోటీపడుతున్నాయి. భారత్, ఆసీస్‌ల మ్యాచ్ విజేతకు సెమీస్ బెర్తు ఖరారవుతుంది. ఈ గ్రూపులో దాయాది పాకిస్తాన్ (2)తో పాటు బోణీ కూడా కొట్టని మరో ఉపఖండం జట్టు బంగ్లాదేశ్ (0) ఇంటిదారి పట్టాయి. ఇక గ్రూపు-1 విషయానికొస్తే వెస్టిండీస్ (6), ఇంగ్లండ్ (6) తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్‌కు దూసుకెళ్లాయి. ఈ రోజు జరిగిన మ్యాచ్‌లో విండీస్ పసికూన అఫ్ఘాన్ చేతిలో ఓడినా మెరుగైన రన్‌రేట్ కారణంగా గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ఈ గ్రూపులో దక్షిణాఫ్రికా (2), శ్రీలంక (2), అఫ్ఘానిస్తాన్ (0) టోర్నీ నుంచి నిష్కమించాయి. ఈ గ్రూపులో మరో లీగ్ మ్యాచ్ జరగాల్సివున్నా నామమాత్రమైనదే. తొలి సెమీస్‌లో గ్రూపు-2 టాపర్, గ్రూపు-1లో రెండో స్థానంలో నిలిచిన టీమ్ అంటే కివీస్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. మరో సెమీస్‌లో గ్రూపు-1 టాప్ టీమ్, గ్రూపు-2లో రెండో స్థానంలో నిలిచిన జట్టు అంటే వెస్డిండీస్, భారత్ లేదా ఆసీస్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ రోజు జరిగే కీలక పోరులో భారత్ గెలిస్తే సెమీస్‌లో విండీస్ ఎదురుకానుంది. ఈ నెల 30, 31న సెమీస్ మ్యాచ్‌లు, వచ్చే నెల 3న ఫైనల్ సమరం జరగనున్నాయి. -
సెమీస్‌లో ఎవరు ఎవరితో..?
వేసవిలో క్రికెట్ అభిమానులకు పరుగుల వినోదాన్ని అందిస్తున్న టి-20 ప్రపంచ కప్‌లో లీగ్ పోరు ముగింపు దశకు వచ్చింది. ఇక నాకౌట్ సమరానికి తెర లేవనుంది. సెమీస్‌లో ఏయే జట్లు తలపడతాయన్నది ఆసక్తికరంగా మారింది. గ్రూపు-2లో ఓటమెరుగని న్యూజిలాండ్ (8) అగ్రస్థానంతో దర్జాగా సెమీస్ చేరింది. మరో బెర్తు కోసం భారత్ (4), ఆస్ట్రేలియా (4) పోటీపడుతున్నాయి. ఈ రోజు భారత్, ఆసీస్‌ల మధ్య జరిగే మ్యాచ్ విజేతకు సెమీస్ బెర్తు ఖరారవుతుంది. ఈ గ్రూపులో దాయాది పాకిస్తాన్ (2)తో పాటు బోణీ కూడా కొట్టని మరో ఉపఖండం జట్టు బంగ్లాదేశ్ (0) ఇంటిదారి పట్టాయి. ఇక గ్రూపు-1 విషయానికొస్తే వెస్టిండీస్ (6), ఇంగ్లండ్ (6) తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్‌కు దూసుకెళ్లాయి. దక్షిణాఫ్రికా (2), శ్రీలంక (2), అఫ్ఘానిస్తాన్ (0) టోర్నీ నుంచి నిష్కమించాయి. ఈ గ్రూపులో ఇంకా రెండు లీగ్ మ్యాచ్‌లు జరగాల్సివున్నా నామమాత్రమైనవే. తొలి రెండు స్థానాల్లో ఉన్న విండీస్‌కు మరో మ్యాచ్ ఉండగా, ఇంగ్లండ్ నాలుగు మ్యాచ్‌లు ఆడేసింది. ఈ రోజు విండీస్, అఫ్ఘాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. కరీబియన్ల జోరు చూస్తే అఫ్ఘాన్‌పై గెలవడం పెద్ద కష్టమేమీకాదు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో విండీస్ ఓడినా ఇంగ్లండ్ కంటే మెరుగైన రన్‌రేట్ ఉంది కాబట్టి అగ్రస్థానానికి ఢోకా ఉండదు. ఈ గ్రూపులో విండీస్, ఇంగ్లండ్.. తొలి, రెండో స్థానాల్లో నిలవడం దాదాపు ఖాయమే. ఈ సమీకరణాలను గమనిస్తే సెమీస్‌లో గ్రూపు-2 టాపర్, గ్రూపు-1లో రెండో స్థానంలో నిలిచిన టీమ్ అంటే కివీస్, ఇంగ్లండ్ ఆడే చాన్స్ ఉంది. మరో సెమీస్‌లో గ్రూపు-1 టాప్ టీమ్, గ్రూపు-2లో రెండో స్థానంలో నిలిచిన జట్టు అంటే వెస్డిండీస్, భారత్ లేదా ఆసీస్ తలపడే అవకాశముంది. ఈ రోజు జరిగే కీలక పోరులో భారత్ గెలిస్తే సెమీస్‌లో దాదాపుగా విండీస్ ఎదురుకానుంది. నాకౌట్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగే అవకాశముంది. కివీస్, విండీస్ సూపర్ ఫామ్‌లో ఉన్నాయి. ఈ నెల 30, 31న సెమీస్ మ్యాచ్‌లు, వచ్చే నెల 3న ఫైనల్ సమరం జరగనున్నాయి. -
‘టాప్’ క్లాస్ కివీస్
► వరుసగా నాలుగో విజయం ► గ్రూప్-2లో అగ్రస్థానం ► 75 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ చిత్తు కోల్‌కతా: టి20 ప్రపంచకప్‌లో టాప్‌క్లాస్ ఆటతీరుతో చెలరేగుతున్న న్యూజిలాండ్ జట్టు లీగ్ దశను అగ్రస్థానంతో ముగించింది. నాణ్యమైన బౌలింగ్‌తో చెలరేగి వరుసగా నాలుగో మ్యాచ్‌లో గెలిచింది. శనివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 145 పరుగులు చేసింది. విలియమ్సన్ (32 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), మున్రో (33 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్సర్లు) నిలకడగా ఆడారు. టేలర్ (24 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నారు. అయితే ముస్తాఫిజుర్ (5/22) సంచలన బౌలింగ్‌తో కివీస్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమయింది. తర్వాత బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటయింది. శువగత (17 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. ఎలియట్ (3/12), సోధి (3/21)ల అద్భుత బౌలింగ్‌కు తోడు కివీస్ ఫీల్డింగ్‌లో చురుగ్గా వ్యవహరించింది. విలియమ్సన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు: న్యూజిలాండ్ ఇన్నింగ్స్: నికోలస్ (బి) ముస్తాఫిజుర్ 7; విలియమ్సన్ (బి) ముస్తాఫిజుర్ 42; మున్రో (బి) అల్ అమిన్ 35; టేలర్ (సి) మిథున్ (బి) అల్ అమిన్ 28; అండర్సన్ (బి) మోర్తజా 0; ఎలియట్ (సి) శువగత (బి) ముస్తాఫిజుర్ 9; రోంచి నాటౌట్ 9; సాంట్నర్ (బి) ముస్తాఫిజుర్ 3; మెకల్లమ్ (బి) ముస్తాఫిజుర్ 0; మెక్లీంగన్ నాటౌట్ 6; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1-25; 2-57; 3-99; 4-100; 5-122; 6-127; 7-139; 8-139. బౌలింగ్: మోర్తజా 3-0-21-1; శువగత 3-0-16-0; షకీబ్ 4-0-33-0; ముస్తాఫిజుర్ 4-0-22-5; అల్ అమిన్ 4-0-27-2; మహ్మదుల్లా 2-0-21-0. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ రనౌట్ 3; మిథున్ (బి) మెక్లీంగన్ 11; షబ్బీర్ (సి) సాంట్నర్ (బి) మెకల్లమ్ 12; షకీబ్ (సి) మెకల్లమ్ (బి) సాంట్నర్ 2; సౌమ్య (స్టం) రోంచి (బి) సోధి 6; మహ్మదుల్లా (బి) సోధి 5; ముష్ఫికర్ (బి) ఎలియట్ 0; శువగత నాటౌట్ 16; మోర్తజా ఎల్బీడబ్ల్యు (బి) ఎలియట్ 3; ముస్తాఫిజుర్ (సి) రోంచి (బి) ఎలియట్ 6; అల్ అమిన్ (బి) సోధి 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (15.4 ఓవర్లలో ఆలౌట్) 70. వికెట్ల పతనం: 1-4; 2-29; 3-31; 4-38; 5-43; 6-44; 7-48; 8-59; 9-65; 10-70. బౌలింగ్: నాథన్ మెకల్లమ్ 2-0-6-1; అండర్సన్ 2-0-7-0; సాంట్నర్ 3-0-16-1; మెక్లీంగన్ 1-0-3-1; ఎలియట్ 4-0-12-3; సోధి 3.4-0-21-3. -
గెలవాలి....నిలవాలి
► నేడు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ ► గెలిచిన జట్టు సెమీఫైనల్‌కి ► ఓడితే కథ ముగిసినట్లే ► టి20 ప్రపంచకప్ టోర్నీ సరిగ్గా సంవత్సరం క్రితం... మార్చి 26న సిడ్నీ మైదానంలో జరిగిన వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ చిత్తయింది. ఇప్పుడు ఏడాది వ్యవధిలో మరో ప్రపంచకప్ పోరు వచ్చింది. సెమీస్ కాకపోయినా, ఇప్పుడు కూడా నాకౌట్ పోరే. క్వార్టర్ ఫైనల్‌లాంటి ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు కథ ముగిసిపోతుంది. ఫార్మాట్ వేరు కావచ్చు కానీ వైరంలో మాత్రం తేడా ఉండదు. ఇక నాటి పరాజయానికి పదునైన జవాబు ఇవ్వడం మన వంతు. మన సొంతగడ్డపై ఆసీస్‌ను చిత్తు చేసి ఇంటికి పంపడం, దర్జాగా సెమీస్‌లోకి అడుగుపెట్టడం ఆదివారం భారత్ ముందున్న లక్ష్యం. మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి;- టి20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జైత్రయాత్ర ఆస్ట్రేలియాలోనే మొదలైంది. అక్కడి నుంచి 14 మ్యాచ్‌లలో 12 విజయాలు సాధించిన టీమిండియా ఇప్పుడు వరల్డ్‌కప్ రేస్‌లో కీలక దశలో అదే ఆసీస్‌తో పోరుకు సిద్ధమైంది. ఆదివారం ఇక్కడి ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఎలాంటి గణాంకాలు, రన్రేట్లతో పని లేకుండా ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు సెమీ ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇరు జట్లకు ఇది చావోరేవోలాంటి పరిస్థితి. ఉత్కంఠభరితంగా సాగిన గత మ్యాచ్‌లో భారత్ ఒక పరుగుతో గట్టెక్కగా, ఇదే మైదానంలో శుక్రవారం పాక్‌ను చిత్తు చేసి ఆసీస్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ఉదాసీనత లేకుండా...: బంగ్లాదేశ్‌తో ఓటమి అంచుల్లోకి వెళ్లినా చివరకు భారత్ మ్యాచ్ కాపాడుకోగలిగింది. అయితే ఈసారి అలాంటి పరిస్థితి వస్తే ఒత్తిడిలో చిత్తవడానికి ఎదురుగా ఉన్న జట్టు బంగ్లాదేశ్ కాదు. చిన్నపాటి అవకాశం ఇచ్చినా ఆస్ట్రేలియన్లు మ్యాచ్ లాక్కోగలరు. కాబట్టి అన్ని రంగాల్లో జట్టు సమష్టిగా రాణించాల్సి ఉంది. చివరి రెండు మ్యాచ్‌లలో గెలిచినా నిజాయితీగా చెప్పాలంటే భారత జట్టు బ్యాటింగ్ ప్రదర్శన చెప్పుకోదగిన స్థాయిలో లేదు. ముఖ్యంగా ఓపెనర్లు ఒక్కసారి కూడా శుభారంభం ఇవ్వలేకపోయారు. ఈ టోర్నీకి ముందు స్టార్ హోదాతో బరిలోకి దిగిన రోహిత్‌తో పాటు ధావన్ ఒక్కసారి కూడా ఆకట్టుకోలేదు. పైగా వీరిద్దరూ నిర్లక్ష్యమైన రీతిలో వరుసగా ఒకే తరహాలో అవుట్ కావడం ఆసీస్ గుర్తిస్తే కష్టం. కోహ్లి విఫలమైతే చాలు... ఇక కష్టం అన్నట్లుగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కనిపించింది. శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో ప్రధాన బ్యాట్స్‌మెన్‌తో పాటు లోయర్ ఆర్డర్ వరకు కూడా అంతా సుదీర్ఘంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు. బౌలింగ్‌లో పేసర్లకంటే అశ్విన్, జడేజాల రాణింపుపైనే భారత్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రాక్టీస్ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సాధారణ సెషన్ తర్వాత బుమ్రాకు స్పెషల్ క్లాస్ తీసుకున్నాడు. గాల్లో లేచే బంతిని క్యాచ్ ఎలా అందుకోవాలో ప్రతీది విడమర్చి చెప్పడంతో పాటు చాలా సేపు సాధన చేయించాడు. అందరూ ఫామ్‌లోనే! తొలి మ్యాచ్‌లో కివీస్‌తో ఓడి ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై తడబడుతూ గెలిచిన ఆస్ట్రేలియా ఒక్కసారిగా సరైన సమయంలో ఫామ్‌లోకి వచ్చింది. జట్టులో అందరూ రాణించడంతో గత మ్యాచ్‌లో ఆ జట్టు పాక్‌పై ఘన విజయం సాధించింది. ఇది కచ్చితంగా వారిలో ఆత్మవిశ్వాసం పెంచే అంశం. వార్నర్ మినహా గత మ్యాచ్‌లో ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా చెలరేగారు. అయితే వార్నర్ ఎప్పుడైనా ప్రమాదకర ఆటగాడే. అతనితో పాటు ఐపీఎల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే వాట్సన్, మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్‌లకు ఇక్కడి పిచ్‌లపై మంచి అనుభవం ఉంది. ఈ టోర్నీతో రిటైర్ కానున్న వాట్సన్ తన జట్టును టోర్నీలో మరింత ముందుకు తీసుకెళ్లాని పట్టుదలగా ఉన్నాడు. పాక్‌తో బ్యాటింగ్ చూస్తే వాట్సన్ ఎంత ప్రమాదకారినో అర్థమవుతుంది. ఈ ఏడాది ఆరంభంలో ఇరు జట్ల మధ్య జరిగిన సిరీస్‌తో పోలిస్తే భారత్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఈసారి కూడా అదే జట్టు బరిలోకి దిగవచ్చు. ఈ టోర్నీలో ప్రభావం చూపిస్తున్న లెగ్‌స్పిన్నర్ ఆడమ్ జంపా తొలిసారి భారత్‌పై ఆడబోతున్నాడు. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), ఫించ్, ఖాజా, వార్నర్, వాట్సన్, మ్యాక్స్‌వెల్, ఫాల్క్‌నర్, నెవిల్, కూల్టర్ నీల్, జంపా, హాజల్‌వుడ్. పిచ్, వాతావరణం టోర్నీలో ఇక్కడి రెండు వేర్వేరు పిచ్‌లపై జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ పరుగుల వరద పారింది. ఇప్పుడు కూడా బ్యాటింగ్‌కు అనుకూలించే వికెట్ కనిపిస్తోంది. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. వాతావరణం సాధారణంగా ఉంది. వర్షంతో మ్యాచ్‌కు ఆటంకం కలిగే అవకాశాలు తక్కువ. 8 భారత్, ఆస్ట్రేలియా మధ్య ఇప్పటి వరకు 12 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 8 గెలిచి 4 ఓడింది. వరల్డ్‌కప్‌లలో 4 మ్యాచ్‌లలో చెరో 2 గెలిచారు. -
ఆసీస్ అలవోకగా...
► పాకిస్తాన్‌పై 21 పరుగులతో విజయం ► ఫాల్క్‌నర్‌కు ఐదు వికెట్లు ► ఇక సెమీస్ బెర్త్ కోసం భారత్‌తో అమీతుమీ మొహాలీ: టి20 ప్రపంచకప్‌లో తొలిసారి ఆస్ట్రేలియా జట్టు చాంపియన్ తరహా ఆటతీరు ప్రదర్శించింది. బ్యాటింగ్‌లో స్మిత్, వాట్సన్, బౌలింగ్‌లో ఫాల్క్‌నర్ చెలరేగడంతో పాకిస్తాన్‌పై అలవోకగా గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా నిలబెట్టుకుంది. పీసీఏ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 193 పరుగుల భారీస్కోరు సాధించింది. ఓపెనర్ ఖవాజా (16 బంతుల్లో 21; 3 ఫోర్లు, 1 సిక్సర్) మంచి ఆరంభాన్నిచ్చినా... పాక్ పేసర్ల జోరుకు తడబడిన ఆసీస్ 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ స్మిత్ (43 బంతుల్లో 61 నాటౌట్, 7 ఫోర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాక్స్‌వెల్ (18 బంతుల్లో 30; 3 ఫోర్లు, 1 సిక్సర్) ఎప్పటిలాగే వేగంగా ఆడగా... వాట్సన్ (21 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్‌కు భారీస్కోరు అందించాడు. స్మిత్, వాట్సన్ ఐదో వికెట్‌కు అజేయంగా 38 బంతుల్లోనే 74 పరుగులు జోడించడం విశేషం. పాక్ బౌలర్లలో వహాబ్, ఇమాద్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. ఓపెనర్ షార్జీల్ ఖాన్ (19 బంతుల్లో 30; 6 ఫోర్లు)తో పాటు లతీఫ్ (41 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్సర్), ఉమర్ అక్మల్ (20 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో ఒక దశలో పాక్ లక్ష్యం దిశగా సాగుతున్నట్లే అనిపించింది. కానీ ఆసీస్ స్పిన్నర్ జంపా (2/32) కీలక సమయంలో వికెట్లు తీశాడు. చివర్లో షోయబ్ మాలిక్ (20 బంతుల్లో 40 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక ఎండ్‌లో పోరాడినా... రెండో ఎండ్‌లో ఫాల్క్‌నర్ (5/27) ధాటికి పాక్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆస్ట్రేలియా తరఫున టి20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఫాల్క్‌నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖవాజా (బి) వహాబ్ 21; ఫించ్ (బి) ఇమాద్ 15; వార్నర్ (బి) వహాబ్ 9; స్టీవ్ స్మిత్ నాటౌట్ 61; మ్యాక్స్‌వెల్ (సి) షెహ్జాద్ (బి) ఇమాద్ 30; వాట్సన్ నాటౌట్ 44; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 193. వికెట్ల పతనం: 1-28; 2-42; 3-57; 4-119. బౌలింగ్: ఆమిర్ 4-0-39-0; సమీ 4-0-53-0; వహాబ్ రియాజ్ 4-0-35-2; ఆఫ్రిది 4-0-27-0; ఇమాద్ వసీమ్ 4-0-31-2. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షార్జీల్ ఖాన్ (బి) ఫాల్క్‌నర్ 30; షెహ్జాద్ (సి) కౌల్టర్ నైల్ (బి) హాజిల్‌వుడ్ 1; లతీఫ్ (బి) ఫాల్క్‌నర్ 46; ఉమర్ అక్మల్ (బి) జంపా 32; ఆఫ్రిది (స్టంప్డ్) నెవిల్ (బి) జంపా 14; షోయబ్ మాలిక్ నాటౌట్ 40; ఇమాద్ వసీమ్ (సి) కౌల్టర్ నైల్ (బి) ఫాల్క్‌నర్ 0; సర్ఫరాజ్ (సి) ఖవాజా (బి) ఫాల్క్‌నర్ 2; వహాబ్ (సి) హాజిల్‌వుడ్ (బి) ఫాల్క్‌నర్ 0; సమీ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1-20; 2-40; 3-85; 4-110; 5-147; 6-147; 7-164; 8-164. బౌలింగ్: హాజిల్‌వుడ్ 4-0-26-1; కౌల్టర్ నైల్ 4-0-45-0; ఫాల్క్‌నర్ 4-0-27-5; వాట్సన్ 2-0-27-0; జంపా 4-0-32-2; మ్యాక్స్‌వెల్ 2-0-13-0. ఎవరు గెలిస్తే వాళ్లు సెమీస్‌కు భారత xఆస్ట్రేలియా పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా విజయంతో గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్త్‌ల విషయంలో పూర్తి స్పష్టత వచ్చింది. ఈ గ్రూప్ నుంచి న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించింది. ఆదివారం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది. -
కామెంటేటర్స్... కొంచెం మారండి!
టి20 ప్రపంచకప్ మ్యాచ్‌ల సందర్భంగా వివిధ దేశాల కామెంటేటర్స్ వారి జట్లను సమర్ధించుకుంటూ మాట్లాడుతుంటే... భారత వ్యాఖ్యాతలు మాత్రం ధోని సేనను పదే పదే విమర్శిస్తున్నారని బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యానించారు. గెలిచిన సమయంలో కూడా పాజిటివ్‌గా మాట్లాడకపోతే కష్టమని, ఇప్పటికైనా మన కామెంటేటర్స్ మారాలని సూచించారు. ఈ వ్యాఖ్యకు సోషల్ మీడియాలో స్పందన బాగా వచ్చింది. మన కామెంటేటర్ల తీరు బాగోలేదని పలువురు విమర్శించారు. -
విండీస్ విహారం
► వరుసగా మూడో మ్యాచ్‌లోనూ గెలుపు ► పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా ► రాణించిన చార్లెస్, శామ్యూల్స్ జట్టు మొత్తం టి20 స్టార్స్‌తో నిండిన వెస్టిండీస్ టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరింది. తొలి రెండు మ్యాచ్‌లతో పోలిస్తే దక్షిణాఫ్రికాపై కాస్త కష్టపడ్డా హ్యాట్రిక్ విజయంతో నాకౌట్‌కు అర్హత సాధించింది. గేల్, బ్రేవో ఈసారి బంతితో మెరిస్తే.. శామ్యూల్స్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో కరీబియన్లను గట్టెక్కించాడు. ఈ గ్రూప్‌లో శ్రీలంకతో నేడు జరిగే మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే... దక్షిణాఫ్రికా జట్టు ఇంటికి వెళుతుంది. నాగ్‌పూర్: భారీ హిట్టర్లున్న దక్షిణాఫ్రికాను అద్భుతమైన బౌలింగ్‌తో కట్టడి చేసిన వెస్టిండీస్ జట్టు.. టి20 ప్రపంచకప్‌లో సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. బ్యాటింగ్‌లో కాస్త తడబడ్డా మూడు వికెట్లతో సఫారీలపై గెలిచింది. వీసీఏ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 122 పరుగులు చేసింది. డికాక్ (46 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్స్), వీస్ (26 బంతుల్లో 28; 2 ఫోర్లు) మినహా మిగతా వారు విఫలమయ్యారు. తొలి మూడు ఓవర్లలో మూడు కీలక వికెట్లు పడటంతో సఫారీలు కోలుకోలేకపోయారు. భారీగా ఆశలు పెట్టుకున్న డివిలియర్స్ (12 బంతుల్లో 10; 1 ఫోర్), మిల్లర్ (1) కూడా ఒత్తిడికి లోనుకావడంతో ప్రొటీస్ 47 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. అయితే డికాక్, వీస్‌లు ఆరో వికెట్‌కు 7.2 ఓవర్లలో 50 పరుగులు జోడించడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. రస్సెల్, గేల్, బ్రేవోలు తలా రెండు వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ 19.4 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులు చేసి గెలిచింది. శామ్యూల్స్ (44 బంతుల్లో 44; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. ప్రత్యర్థుల ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించలేకపోయినా.. ఇన్నింగ్స్ ఐదో బంతికి ‘డేంజర్ బ్యాట్స్‌మన్’ క్రిస్ గేల్ (4)ను అవుట్ చేసి ప్రొటీస్ పట్టుబిగించే ప్రయత్నం చేసింది. తర్వాత ఫ్లెచర్ (11) అనూహ్యంగా రనౌటైనా.. చార్లెస్ (35 బంతుల్లో 32; 2 ఫోర్లు, 1 సిక్స్), శామ్యూల్స్ సమయోచితంగా ఆడారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 32 పరుగులు జత చేశారు. అయితే చార్లెస్, డ్వేన్ బ్రేవో (8) వరుస ఓవర్లలో అవుట్‌కావడంతో విండీస్ విజయ సమీకరణం 24 బంతుల్లో 24 పరుగులుగా మారింది. ఈ దశలో స్పిన్నర్ తాహిర్ ‘మ్యాజిక్’ చేశాడు. 17వ ఓవర్లో వరుస బంతుల్లో రస్సెల్ (4), స్యామీ (0)లను అవుట్ చేస్తే.. 18వ ఓవర్‌ను వీస్ మూడు పరుగులే ఇవ్వడంతో ప్రొటీస్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. తర్వాతి ఓవర్లో మోరిస్ రెండు ఫోర్లు సమర్పించుకున్నా శామ్యూల్స్‌ను అవుట్ చేయడంతో విండీస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సిన దశలో రబడ బౌలింగ్‌లో బ్రాత్‌వైట్ (10 నాటౌట్) భారీ సిక్సర్ బాదడంతో సఫారీల పోరాటం వృథా అయ్యింది. తాహిర్‌కు రెండు వికెట్లు దక్కాయి. శామ్యూల్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా రనౌట్ 1; డికాక్ (బి) రస్సెల్ 47; డు ప్లెసిస్ (సి) బెన్ (బి) రస్సెల్ 9; రోసోవ్ (సి) రస్సెల్ (బి) గేల్ 0; డివిలియర్స్ (బి) బ్రేవో 10; మిల్లర్ (బి) గేల్ 1; వీస్ (సి) స్యామీ (బి) బ్రేవో 28; మోరిస్ నాటౌట్ 16; ఫాంగిసో రనౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1-1; 2-13; 3-20; 4-46; 5-47; 6-97; 7-112; 8-122. బౌలింగ్: బద్రీ 3-0-22-0; రస్సెల్ 4-0-28-2; గేల్ 3-0-17-2; బ్రాత్‌వైట్ 2-0-11-0; బెన్ 4-0-20-0; బ్రేవో 4-0-20-2. వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) డుప్లెసిస్ (బి) వీస్ 32; గేల్ (బి) రబడ 4; ఫ్లెచర్ రనౌట్ 11; శామ్యూల్స్ (సి) డివిలియర్స్ (బి) మోరిస్ 44; బ్రేవో (సి) వీస్ (బి) ఫాంగిసో 8; రస్సెల్ (సి) మిల్లర్ (బి) తాహిర్ 4; స్యామీ (బి) తాహిర్ 0; బ్రాత్‌వైట్ నాటౌట్ 10; రామ్‌దిన్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: (19.4 ఓవర్లలో 7 వికెట్లకు) 123. వికెట్ల పతనం: 1-5; 2-34; 3-66; 4-87; 5-100; 6-100; 7-113. బౌలింగ్: రబడ 3.4-0-38-1; మోరిస్ 4-0-33-1; తాహిర్ 4-0-13-2; వీస్ 4-0-19-1; ఫాంగిసో 4-0-19-1. -
సెమీస్‌కు చేరడానికి ఏ జట్లకు ఛాన్స్?
టి20 ప్రపంచకప్‌లో మ్యాచ్‌లు మంచి రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటివరకూ చాలా మ్యాచ్‌ల ఫలితాలు ఊహించినట్లే వచ్చినా... గ్రూప్-1లో వెస్టిండీస్, గ్రూప్-2లో న్యూజిలాండ్ దూసుకుపోతున్నాయి. ఇక లీగ్ మ్యాచ్‌లు ముగింపు దశకు వచ్చేశాయి. ఈ నేపథ్యంలో సెమీస్‌కు చేరడానికి ఏ జట్లకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూద్దాం. - సాక్షి, క్రీడా విభాగం వెస్టిండీస్: ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించింది. ఇక దక్షిణాఫ్రికా, అఫ్ఘానిస్తాన్‌లతో ఆడాలి. ఒక్క మ్యాచ్ గెలిచినా సెమీస్‌కు చేరతారు. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో ఇది కష్టం కాదు. దక్షిణాఫ్రికా: ఇంగ్లండ్ చేతిలో ఓడి, అఫ్ఘాన్‌పై గెలిచింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో శ్రీలంక, వెస్టిండీస్‌లతో ఆడాలి. రెండూ గెలిస్తేనే సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ ఒక్కటి ఓడినా అటు ఇంగ్లండ్ కూడా శ్రీలంక చేతిలో ఓడాలని కోరుకోవాలి. నెట్న్‌ర్రేట్ ఇంగ్లండ్ కంటే మెరుగ్గా ఉండటం సానుకూలాంశం. ఇంగ్లండ్: మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచింది. తమ చివరి మ్యాచ్‌లో శ్రీలంకపై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడితే మాత్రం అటు దక్షిణాఫ్రికా రెండు మ్యాచ్‌లూ ఓడాలని కోరుకోవాలి. శ్రీలంక: రెండు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచింది. ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలతో ఆడాలి. ఈ రెండూ గెలిస్తేనే సెమీస్‌కు చేరుతుంది. ప్రస్తుతం ఉన్న ఫామ్‌లో ఇది చాలా కష్టమే అనుకోవాలి. అఫ్ఘానిస్తాన్: ఆడిన మూడూ ఓడింది. చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌తో తలపడాలి. ఈసారికి సంచలనాలు లేకుండానే ఇంటి ముఖం పట్టొచ్చు. నోట్: ఆ-ఆడినవి, గె-గెలిచినవి, ఓ-ఓడినవి, పా-పాయింట్లు, నె.ర.రే-నెట్ రన్‌రేట్ న్యూజిలాండ్: ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి ఇప్పటికే సెమీస్‌కు చేరింది. ప్రస్తుత ఫామ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి గ్రూప్‌లో అగ్రస్థానం దక్కించుకోవడం లాంఛనమే. ఒకవేళ బంగ్లా చేతిలో ఓడినా దాదాపుగా కివీస్ జట్టే అగ్రస్థానంలో నిలుస్తుంది. భారత్: మూడు మ్యాచ్‌లు ఆడి రెండు గెలిచింది. ఆఖరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిస్తే సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌కు చేరుతుంది. ఒకవేళ ఓడి నాలుగు పాయింట్లతో మిగిలిన రెండు జట్లతో సమంగా నిలిస్తే మాత్రం ముందుకు వెళ్లడం కష్టం. ఎందుకంటే నెట్న్‌ర్రేట్ దారుణంగా ఉంది. ఆస్ట్రేలియా: పాకిస్తాన్, భారత్‌లతో మ్యాచ్‌లు మిగిలాయి. రెండూ గెలిస్తే దర్జాగా సెమీస్‌కు వెళ్లొచ్చు. ఒకవేళ పాకిస్తాన్ చేతిలో ఓడితే భారత్‌పై గెలవాలి. అప్పుడు నెట్న్‌ర్రేట్ కూడా మెరుగుపడాలి. పాకిస్తాన్: మూడు మ్యాచ్‌ల్లో రెండు ఓడింది. దాదాపుగా సెమీస్‌కు చేరడం కష్టం. ఒకవేళ ఆస్ట్రేలియాపై గెలిస్తే... అటు భారత్‌పై ఆస్ట్రేలియా గెలవాలని కోరుకోవాలి. ఈ సమీకరణంలో నెట్న్‌ర్రేట్ మెరుగ్గా ఉన్నందున పాక్‌కు అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్: మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. చివరి మ్యాచ్‌లో బలమైన న్యూజిలాండ్‌తో ఆడాలి. -
బై బై వాట్సన్
టి20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వాట్సన్ వీడ్కోలు మొహాలీ: ఆస్ట్రేలియా క్రికెట్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. టి20 ప్రపంచకప్ తర్వాత ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. ఈ మేరకు ఐఎస్ బింద్రా స్టేడియంలో పాకిస్తాన్‌తో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న జట్టు సభ్యులకు వీడ్కోలు సందేశాన్ని ఇచ్చాడు. ఉద్వేగపూరితమైన మాటలతో సహచరులను ఆకట్టుకున్నాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్న వాట్సన్ గత సెప్టెంబర్ నుంచి వన్డేలకూ దూరంగా ఉన్నాడు. 14 ఏళ్ల కిందట మార్చి 24న దక్షిణాఫ్రికాతో వన్డేల్లో అరంగేట్రం చేసిన వాట్సన్ మళ్లీ సరిగ్గా అదే రోజున వీడ్కోలు విషయాన్ని వెల్లడించడం గమనార్హం. 2005లో తొలి టెస్టు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 59 మ్యాచ్‌ల్లో 3731 పరుగులు; 75 వికెట్లు తీశాడు. 190 వన్డేల్లో 5757 పరుగులు; 168 వికెట్లు పడగొట్టాడు. 56 టి20ల్లో 1400 పరుగులు; 46 వికెట్లు తీశాడు. ఆరు టి20 ప్రపంచకప్‌ల్లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వహించిన వాట్సన్... రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (2007, 2015) గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్లో రెగ్యులర్‌గా ఆడే ఈ ఆల్‌రౌండర్‌ను ఈసారి వేలంలో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ రూ. 9.5 కోట్లకు దక్కించుకుంది. ‘అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకడానికి ఇదే సరైన సమయని భావించా. గత వారం రోజులుగా దీని గురించే ఆలోచిస్తున్నా. బిజీ షెడ్యూల్ వల్ల కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి టి20 ప్రపంచకప్ తర్వాత గుడ్‌బై చెప్పాలని నిర్ణయానికి వచ్చా. ఆసీస్‌కు ఆడటం గౌరవంగా భావిస్తున్నా’ అని వాట్సన్ పేర్కొన్నాడు. -
కోట్లాలో సెమీస్‌కు అనుమతి
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఈనెల 30న జరగాల్సిన సెమీఫైనల్‌పై ఉత్కంఠ వీడింది. స్టేడియంలోని ఆర్పీ మెహ్రా బ్లాక్‌ను ఉపయోగించుకునేందుకు ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ) అనుమతి పొందింది. గతంలో ఈ బ్లాక్‌ను ఉపయోగించుకునేందుకు దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎస్డీఎంసీ)ను ఆదేశించాల్సిందిగా కోర్టుకెక్కిన డీడీసీఏకు నిరాశే ఎదురైంది. అయితే డీడీసీఏ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు సుప్రీం కోర్టు నియమించిన జస్టిస్ ముకుల్ ముద్గల్‌తో అధికారులు బుధవారం సమావేశమవడంతో సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ‘2017 వరకు డీడీసీఏకు అనుమతి లభించింది. సెమీస్‌తో పాటు అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. ఇక్కడ మ్యాచ్‌లకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు ఉండవని ముద్గల్ ఒప్పించారు’ అని డీడీసీఏ అధికారి ఒకరు తెలిపారు. దీంతో ఆర్పీ మెహ్రా బ్లాకులోని 1800 టిక్కెట్లను అమ్మే అవకాశం ఉంది. -
క్రికెట్ మ్యాచ్‌కు హాకీ జట్టు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ ద్వారా బీసీసీఐ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఈ మ్యాచ్‌ను తిలకించేందుకు రావాలని భారత హాకీ జట్టుకు బీసీసీఐ ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. వీఐపీ టిక్కెట్లతో పాటు రవాణ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసింది. ఇతర క్రీడలకు సంబంధించిన మొత్తం జట్టును ఇలా మ్యాచ్ చూడటానికి బోర్డు అధికారికంగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. మలేసియాలో జరగనున్న సుల్తాన్ అజ్లాన్ షా ట్రోఫీ కోసం హాకీ జట్టు ప్రస్తుతం బెంగళూరులో శిక్షణ శిబిరంలో పాల్గొంటుంది. ‘బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ నుంచి మాకు ఆహ్వానం వచ్చింది. ఇదో శుభ పరిణామం. మేం స్టాండ్స్‌నుంచి మన జట్టును ఉత్సాహపరుస్తాం’ అని హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ పేర్కొన్నారు. తాము బెంగళూరులో ఉన్నట్లు తెలుసుకున్న ఠాకూర్ ఈ చొరవ తీసుకున్నారని హాకీ అధికారి ఒకరు తెలిపారు. గతేడాది న్యూఢిల్లీలో భారత్, చెక్ రిపబ్లిక్ల మధ్య జరిగిన డేవిస్ కప్ మ్యాచ్ కూడా హాకీ జట్టు హాజరైంది. -
చెమటోడ్చిన ఇంగ్లండ్
అఫ్ఘానిస్తాన్‌పై 15 పరుగుల విజయం న్యూఢిల్లీ: బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైనా... బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఆకట్టుకున్న ఇంగ్లండ్ జట్టు... టి20 ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్తాన్‌పై చెమటోడ్చి నెగ్గింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో మోర్గాన్ బృందం 15 పరుగుల తేడాతో అఫ్ఘానిస్తాన్‌పై విజయం సాధించింది. ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది. ఓపెనర్లలో విన్సీ (18 బంతుల్లో 22; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడగా.. చివర్లో మొయిన్ అలీ (33 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్), విల్లీ (17 బంతుల్లో 20 నాటౌట్; 2 సిక్సర్లు) చెలరేగారు. 85 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్‌ను ఈ ఇద్దరు 8వ వికెట్‌కు 5.3 ఓవర్లలో 57 పరుగుల అజేయ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. నబీ, రషీద్ చెరో రెండు వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన అఫ్ఘానిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసి ఓడింది. ఇంగ్లిష్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌కు కట్టుబడటంతో అఫ్ఘాన్‌కు సరైన శుభారంభం లభించలేదు. దీంతో 39 పరుగులకే సగం జట్టు పెవిలియన్‌కు చేరుకుంది. ఆ తర్వాత షఫీకుల్లా (20 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), సమీయుల్లా (27 బంతుల్లో 22; 1 ఫోర్) కాస్త మెరుగ్గా ఆడినా.. రెండో ఎండ్‌లో సహచరులు ఒత్తిడికి గురయ్యారు. దీంతో అఫ్ఘాన్ ఏ దశలోనూ లక్ష్యానికి చేరువకాలేకపోయింది. విల్లీ, రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మొయిన్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు: ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) అమిర్ (బి) హమ్జా 5; విన్సీ (సి అండ్ బి) నబీ 22; రూట్ రనౌట్ 12; మోర్గాన్ (బి) నబీ 0; స్టోక్స్ (బి) రషీద్ 7; బట్లర్ (సి) నబీ (బి) షెన్వారి 6; అలీ నాటౌట్ 41; జోర్డాన్ (సి అండ్ బి) రషీద్ 15; విల్లీ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు: 14; మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-16; 2-42; 3-42; 4-42; 5-50; 6-57; 7-85 బౌలింగ్: అమిర్ హమ్జా 4-0-45-1; షాపూర్ జద్రాన్ 4-0-34-0; మహ్మద్ నబీ 4-0-17-2; సమీయుల్లా షెన్వారి 4-0-23-1; రషీద్ 4-0-17-2. అఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్: షెహ్జాద్ ఎల్బీడబ్ల్యు (బి) విల్లీ 4; నూర్ అలీ (సి అండ్ బి) రషీద్ 17; అస్గర్ (సి) రూట్ (బి) జోర్డాన్ 1; గుల్బాదిన్ నబీ (సి) స్టోక్స్ (బి) విల్లీ 0; రషీద్ (సి) మోర్గాన్ (బి) అలీ 15; నబీ (సి) జోర్డాన్ (బి) రషీద్ 12; షెన్వారి (సి) రూట్ (బి) స్టోక్స్ 22; నజీబుల్లా రనౌట్ 14; షఫీకుల్లా నాటౌట్ 35; అమిర్ రనౌట్ 1; షాపూర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1-4; 2-12; 3-13; 4-35; 5-39; 6-64; 7-85; 8-94; 9-108. బౌలింగ్: విల్లీ 4-0-23-2; జోర్డాన్ 4-0-27-1; ఫ్లంకెట్ 4-1-12-0; అలీ 2-0-17-1; రషీద్ 3-0-18-2; స్టోక్స్ 3-0-28-1. -
ప్రాణం లేచొచ్చింది!
► ఒక్క పరుగుతో బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్ ► చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లతో సంచలనం ► టి20 ప్రపంచకప్‌లో సెమీస్ ఆశలు సజీవం ► తర్వాతి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో కోట్లాది మంది ఊపిరి బిగపట్టి చూస్తున్న క్షణం.. లక్షలాది గొంతుకలు మూగబోతున్న తరుణం... వేలాది కనులు రెప్పార్పకుండా చూసిన సమయం... ఏదో జరుగుతోంది.... ఏదేదో అయిపోతోంది. ఊహకందని స్థాయిలో... ఊహించని రీతిలో... కళ్లముందే భారత్ స్వప్నం చెదిరిపోతోంది అభిమానుల మనసు మూగబోవడానికి ఇక మిగిలింది క్షణమే...స్వదేశంలో ధోనిసేన పరువు పాతాళంలో కలవడానికి మిగిలిందీ ఆ క్షణమే... కానీ ఆ ఒక్క క్షణమే.... భారత జట్టు తల రాతను తిరగరాసింది. జరిగింది కలో.. అద్భుతమో తెలుసుకునే లోపే... ఆశకు, నిరాశకు మధ్య ఊగిసలాడుతున్న ఎన్నో ప్రాణాలు లేచి వచ్చేలా మాయ జరిగింది.చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీసి... చేజారిన మ్యాచ్‌ను రెండు చేతులా భారత్ ఒడిసిపట్టింది. కేవలం రెండు పరుగులు చేయలేక బంగ్లా గుండె పగిలింది. టి20 ప్రపంచకప్‌లో భారత్ ఒక్క పరుగుతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బెంగళూరునుంచి సాక్షి క్రీడా ప్రతినిధి నరాలు తెగే ఉత్కంఠ... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ విజయం దోబూచులాడిన వేళ... భారత జట్టు ఒత్తిడిని జయించింది. చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి గట్టెక్కింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ఒక్క పరుగు తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసింది. సురేశ్ రైనా (23 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులకు పరిమితమయింది. తమీమ్ ఇక్బాల్ (32 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. 2 కీలక వికెట్లు తీసిన అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్‌కు చేరుతుంది. కనిపించని దూకుడు: తొలి ఐదు ఓవర్లలో 27 పరుగులు... తర్వాతి ఓవర్లో 15 పరుగులతో పాటు రోహిత్ శర్మ అవుట్. ఇదీ పవర్‌ప్లేలో భారత జట్టు ఆట కొనసాగిన తీరు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు దూకుడైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ధావన్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (16 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిని ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఆడారు. ముస్తఫిజుర్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్, ధావన్ చెరో సిక్సర్ బాది వేగం పెంచగా... చివరి బంతికి రోహిత్‌ను అవుట్ చేసి బౌలర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. మరుసటి ఓవర్లోనే చక్కటి బంతితో షకీబ్... ధావన్‌ను పెవిలియన్ పంపించాడు. కోహ్లి, రైనా మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించిన అనంతరం మరోసారి బంగ్లా ఆధిక్యం ప్రదర్శించింది. షువగత వేసిన 14వ ఓవర్లో 17 పరుగులు రాబట్టి భారత్ దూకుడు ప్రదర్శించినా...అదే ఓవర్లో కోహ్లి (24 బంతుల్లో 24; 1 సిక్స్) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం వరుస బంతుల్లో రైనా, పాండ్యా (7 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అమీన్ అవుట్ చేయగా, యువరాజ్ (3) విఫలమయ్యాడు. చివర్లో ధోని (13 నాటౌట్), జడేజా(12) కొన్ని పరుగులు జోడించినా స్కోరు 150 పరుగుల లోపే ఆగిపోయింది. అంతా కలిసికట్టుగా...: సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన మ్యాచ్‌లో బుమ్రా... బంగ్లా ప్రధాన బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ నెత్తిన పాలు పోశాడు. ఫీల్డింగ్ వైఫల్యంతో ఇన్నింగ్స్ తొలి బంతికే తమీమ్‌కు బౌండరీని ఇచ్చిన బుమ్రా... 15 పరుగుల వద్ద అతను ఫైన్‌లెగ్‌లో ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను వదిలేశాడు. అంతే... ఈ అవకాశాన్ని అందుకున్న తమీమ్... బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లోనే చెలరేగిపోయి నాలుగు ఫోర్లు బాదాడు. అయితే అదే ఊపులో భారీ షాట్‌కు ప్రయత్నించి తమీమ్ వెనుదిరగ్గా, మరో వైపు దూకుడు ప్రదర్శించిన షబ్బీర్ (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్)ను ధోని అద్భుతంగా స్టంపౌట్ చేశాడు. ఎనిమిది పరుగుల వద్ద షకీబ్ (15 బంతుల్లో 22; 2 సిక్సర్లు) క్యాచ్‌ను అశ్విన్ వదిలేసినా... కొద్ది సేపటికే అద్భుత బంతికి అతనే అవుట్ చేశాడు. ఈ దశలో మహ్ముదుల్లా, సర్కార్ (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే చివరి ఓవర్లలో భారత బౌలర్లు పూర్తిగా కట్టి పడేశారు. 19వ ఓవర్లో బుమ్రా 6 పరుగులే ఇవ్వగా, ఆఖరి ఓవర్లో పాండ్యా 9 పరుగులు ఇచ్చినా 2 కీలక వికెట్లు తీయడం, చివరి బంతికి ధోని రనౌట్ చేయడంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది. స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) షబ్బీర్ (బి) ముస్తఫిజుర్ 18; ధావన్ (ఎల్బీ) (బి) షకీబ్ 23; కోహ్లి (బి) షువగత 24; రైనా (సి) షబ్బీర్ (బి) అమీన్ 30; పాండ్యా (సి) సర్కార్ (బి) అమీన్ 15; ధోని (నాటౌట్) 13; యువరాజ్ (సి) అమీన్ (బి) మహ్ముదుల్లా 3; జడేజా (బి) ముస్తఫిజుర్ 12; అశ్విన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-42; 2-45; 3-95; 4-112; 5-112; 6-117; 7-137. బౌలింగ్: మొర్తజా 4-0-22-0; షువగత 3-0-24-1; అమీన్ 4-0-37-2; ముస్తఫిజుర్ 4-0-34-2; షకీబ్ 4-0-23-1; మహ్ముదుల్లా 1-0-4-1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 35; మిథున్ (సి) పాండ్యా (బి) అశ్విన్ 1; షబ్బీర్ (స్టంప్డ్) ధోని (బి) రైనా 26; షకీబ్ (సి) రైనా (బి) అశ్విన్ 22; మొర్తజా (బి) జడేజా 6; మహ్ముదుల్లా (సి) జడేజా (బి) పాండ్యా 18; సర్కార్ (సి) కోహ్లి (బి) నెహ్రా 21; ముష్ఫికర్ (సి) ధావన్ (బి) పాండ్యా 11; షువగత (నాటౌట్) 0; ముస్తఫిజుర్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145. వికెట్ల పతనం: 1-11; 2-55; 3-69; 4-87; 5-95; 6-126; 7-145; 8-145; 9-145 బౌలింగ్: నెహ్రా 4-0-29-1; బుమ్రా 4-0-32-0; అశ్విన్ 4-0-20-2; జడేజా 4-0-22-2; పాండ్యా 3-0-29-2; రైనా 1-0-9-1. హైడ్రామా సాగిందిలా... బంగ్లాదేశ్ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు కావాలి. హార్దిక్ పాండ్యా బంతి అందుకున్నాడు.తొలి బంతి: మహ్మదుల్లా డీప్ కవర్లోకి ఆడి సింగిల్ తీశాడు.రెండో బంతి: లెంగ్త్ బాల్. ముష్ఫిఖర్ ఎక్స్ట్రా కవర్లోకి బౌండరీ కొట్టాడు.మూడో బంతి: ముష్ఫిఖర్ స్కూప్ షాట్ ఆడి బౌండరీ సాధించాడు. మిగిలిన మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుస్తుంది.నాలుగో బంతి: ముష్ఫికర్ పుల్‌షాట్ ఆడాడు. డీప్ మిడ్వికెట్లో ధావన్ క్యాచ్ పట్టాడు. ఐదో బంతి: పుల్‌టాస్ బంతిని మహ్మదుల్లా భారీ షాట్ కొట్టాడు. డీప్ మిడ్వికెట్లో జడేజా పరిగెడుతూ వచ్చి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.సింగిల్ తీస్తే మ్యాచ్ టై. రెండు పరుగులుచేస్తే బంగ్లా విజయంఆఖరి బంతి: ఆఫ్ స్టంప్ బయట పడిన బంతిని బ్యాట్స్‌మన్ షువగతా మిస్ చేశాడు. నాన్‌స్ట్రయికర్ ముస్తఫిజుర్ పరుగు పూర్తి చేసేలోపు... కీపర్ ధోని తెలివిగా పరిగెడుతూ వచ్చి బెయిల్స్ ఎగరగొట్టాడు. రనౌట్. భారత్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. బంగ్లా గుండె పగిలింది. -
3 పరుగుల తేడాతో ఓపెనర్లు అవుట్
బెంగళూరు: టి-20 ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భారత్ జోరుకు బ్రేక్ పడింది. 3 పరుగుల తేడాతో టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధవన్ అవుటయ్యారు. బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. భారత ఓపెనర్లు రోహిత్ (18), ధవన్ (23) శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించారు. అయితే ఈ స్కోరు వద్ద రోహిత్ పెవిలియన్ చేరాడు. బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ ఓవర్లో రోహిత్ క్యాచవుటయ్యాడు. ఆ వెంటనే ధవన్.. షకీబల్ హసన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో భారత్ పరుగుల జోరు కాస్త తగ్గింది. విరాట్ కోహ్లీ, రైనా బ్యాటింగ్ చేస్తున్నారు. -
ఇంగ్లండ్ 'టాప్' లేపిన అఫ్ఘాన్; లక్ష్యం 143
న్యూఢిల్లీ: టి-20 ప్రపంచ కప్‌లో పసికూన అఫ్ఘానిస్తాన్ బౌలర్లు ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించారు. బుధవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్ఘాన్ బౌలర్లు ఇంగ్లండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చారు. చివర్లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ మోయిన్ అలీ (33 బంతుల్లో 41 నాటౌట్) రాణించడంతో అఫ్ఘాన్‌కు 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అలీ దూకుడుగా ఆడటంతో పాటు జేమ్స్ విన్సె 22, డేవిడ్ విల్లె 20 పరుగులు చేయడం మినహా ఇతర బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. అఫ్ఘాన్ బౌలర్లు మహ్మద్ నబీ, రషీద్ ఖాన్ చెరో రెండు.. ఆమిర్ హంజా, షెన్వారి తలా వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అఫ్ఘాన్ బౌలర్ ఆమిర్ హంజా.. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ (5)ను బౌల్డ్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నబీ.. వరుస బంతుల్లో జేమ్స్ విన్సె, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్లో జో రూట్ (12) రనౌటయ్యాడు. స్టోక్స్ (7), బట్లర్ (6) కూడా ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఆ తర్వాత జోర్డాన్ 15 పరుగులు చేశాడు. చివర్లో అలీ, విల్లె బ్యాట్ ఝుళిపించడంతో ఇంగ్లండ్ సముచిత స్కోరు చేయగలిగింది. -
అఫ్ఘాన్ బౌలర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల
న్యూఢిల్లీ: టి-20 ప్రపంచ కప్‌లో దూకుడుమీదున్న ఇంగ్లండ్‌కు అఫ్ఘానిస్తాన్ బౌలర్లు చుక్కలు చూపిస్తున్నారు. బుధవారం ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ మెన్ ఆరంభంలోనే తడబడ్డారు. అఫ్ఘాన్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ టాపార్డర్ విలవిలలాడింది. ఇంగ్లండ్ 14 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. అఫ్ఘాన్ బౌలర్లు మహ్మద్ నబీ రెండు, ఆమిర్ హంజా, రషీద్ ఖాన్, షెన్వారి తలా వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఆరంభంలోనే కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో అఫ్ఘాన్ బౌలర్ ఆమిర్ హంజా.. ఇంగ్లండ్ ఓపెనర్ జాసన్ రాయ్ (5)ను బౌల్డ్ చేసి వికెట్ల వేటకు శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత నబీ.. వరుస బంతుల్లో జేమ్స్ విన్సె (22), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఇదే ఓవర్లో జో రూట్ (12) రనౌటయ్యాడు. స్టోక్స్ (7), బట్లర్ (6) కూడా ఎంతో సేపు క్రీజులో నిలవలేకపోయారు. -
సెమీఫైనల్లో న్యూజిలాండ్
పాకిస్తాన్‌పై 22 పరుగులతో విజయం గప్టిల్ మెరుపు ఇన్నింగ్స్ మొహాలీ: ఈసారి టి20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతున్న న్యూజిలాండ్ జట్టు వరుసగా మూడో విజయం సాధించింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలుండగానే సెమీఫైనల్‌కు చేరింది. పీసీఏ మైదానంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కివీస్ 22 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 180 పరుగులు చేసింది. ఓపెనర్ గప్టిల్ (48 బంతుల్లో 80; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ విలియమ్సన్ (17), అండర్సన్ (21) గప్టిల్‌కు అండగా నిలిచారు. చివరి ఓవర్లలో రాస్ టేలర్ (23 బంతుల్లో 36 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడటంతో కివీస్ భారీస్కోరు సాధించింది. పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఓపెనర్ షార్జీల్ ఖాన్ (25 బంతుల్లో 47; 9 ఫోర్లు, 1 సిక్సర్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడటంతో పాటు మరో ఓపెనర్ షెహ్జాద్ (32 బంతుల్లో 30; 3 ఫోర్లు) కూడా రాణించడంతో పాక్‌కు మెరుపు ఆరంభం లభించింది. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు కేవలం 33 బంతుల్లోనే 65 పరుగులు జోడించడం విశేషం. అయితే ఆ తర్వాత న్యూజిలాండ్ బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. పాక్ చేతిలో వికెట్లు ఉన్నా... న్యూజిలాండ్ బౌలర్లు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ బంతులు వేయడంతో పాక్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయలేకపోయారు. ఈ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలు బాగా క్లిష్టమయ్యాయి. భారత్, ఆస్ట్రేలియాలలో ఒక జట్టుకు ఈ గ్రూప్ నుంచి రెండో సెమీస్ బెర్త్‌ను సాధించే అవకాశం ఉంది. స్కోరు వివరాలు: న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (బి) సమీ 80; విలియమ్సన్ (సి) ఆఫ్రిది (బి) ఇర్ఫాన్ 17; మున్రో (సి) లతీఫ్ (బి) ఆఫ్రిది 7; అండర్సన్ (సి) మాలిక్ (బి) ఆఫ్రిది 21; టేలర్ నాటౌట్ 36; రోంచీ (సి) మాలిక్ (బి) సమీ 11; ఇలియట్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 180. వికెట్ల పతనం: 1-62; 2-75; 3-127; 4-132; 5-164. బౌలింగ్: ఆమిర్ 4-0-41-0; ఇర్ఫాన్ 4-0-46-1; సమీ 4-0-23-2; ఇమాద్ 4-0-26-0; ఆఫ్రిది 4-0-40-2. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షార్జీల్ (సి) గప్టిల్ (బి) మిల్నే 47; షెహ్జాద్ (సి) గప్టిల్ (బి) శాంట్నర్ 30; లతీఫ్ (సి) ఇలియట్ (బి) శాంట్నర్ 3; ఉమర్ అక్మల్ (సి) గప్టిల్ (బి) మిల్నే 24; ఆఫ్రిది (సి) అండర్సన్ (బి) సోధి 19; షోయబ్ మాలిక్ నాటౌట్ 15; సర్ఫరాజ్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 158. వికెట్ల పతనం: 1-65; 2-79; 3-96; 4-123; 5-140. బౌలింగ్: శాంట్నర్ 4-0-29-2; అండర్సన్ 2-0-14-0; మిల్నే 4-0-26-2; మెక్లీనగన్ 4-0-43-0; ఇలియట్ 2-0-16-0; సోధి 4-0-25-1. -
వర్ణ రంజితం కావాలి
నేడు బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ నెట్న్ర్రేట్పై ధోనిసేన దృష్టి తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగానే... తెల్ల గోడ వెలిసిపోయినట్లు అనిపించింది. మన నీలి రంగు మెరుపు తగ్గిందనే ఆందోళన కలిగింది. తర్వాత మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేయగానే... ప్రత్యర్థిపై పచ్చరంగు చల్లి బల్లే బల్లే అంటూ గంతులేశాం. ఇప్పుడు ప్రత్యర్థిపై అన్ని రంగులూ కలిపి బలంగా చల్లాల్సిన సమయం వచ్చింది. ఏదో సాదాసీదా గెలుపు గులాల్‌తో సరిపెట్టకుండా రంగ్‌దే బసంతి అంటూ రంగుల్లో ముంచెత్తాలి. హోళీ వేల యావత్ దేశం ధోనిసేన నుంచి ‘కలర్‌ఫుల్’ విజయాన్ని ఆశిస్తోంది. పాక్‌ను కసితీరా ఓడించినా... మరో పక్క అడపాదడపా విజయాలతో పక్కలో బల్లెంలా మారుతున్న బంగ్లాదేశ్‌నూ తక్కువ అంచనా వేయకూడదు. తర్వాతి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉన్నందున ఈ మ్యాచ్‌లో బంగ్లాపై భారీ విజయం సాధించి నెట్న్‌ర్రేట్‌ను మెరుగు పరుచుకోవాలి. సెమీస్ బెర్త్‌లను ఖరారు చేసే ప్రక్రియలో నెట్న్‌ర్రేట్ కూడా అవసరం కావచ్చు మరి. బెంగళూరునుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు తమ మూడో లీగ్ మ్యాచ్‌కు సన్నద్ధమైంది. నేడు (బుధవారం) ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో భారత్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిన ధోనిసేన ఇక్కడా నెగ్గితే సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరో వైపు ఇప్పటికే రెండు ఓటములు మూటగట్టుకున్న బంగ్లా ఓడితే అధికారికంగా టోర్నీనుంచి నిష్ర్కమిస్తుంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండటంతో ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు సాధ్యమైనంతగా రన్‌రేట్‌ను పెంచుకోవాలని కూడా భారత జట్టు భావిస్తోంది. రైనా, ధావన్‌లపై ప్రత్యేక దృష్టి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు మంగళవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. మూడు గంటల పాటు క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అయితే టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ప్రత్యేకంగా మరో నెట్స్‌లో ధావన్, రైనాల చేత ప్రాక్టీస్ చేయించారు. అంతా బాగుందని చెబుతున్నా ప్రస్తుతం జట్టు ఫామ్, ఆటతీరును చూస్తే వీరిద్దరు రాణించడమే ముఖ్యమని జట్టు గుర్తించినట్లుంది. వీరిద్దరికి అన్ని రకాల బౌలింగ్‌లు వేయిస్తూ శాస్త్రి సాధనను పర్యవేక్షించారు. అందరికంటే ముందుగా వచ్చిన ధావన్ ఆఖర్లో వెళ్లగా, రైనా కూడా సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు. అశ్విన్ బౌలింగ్‌కంటే బ్యాటింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టడం కనిపించింది. ఆసియా కప్‌లో ఇటీవలే రెండు సార్లు బంగ్లాదేశ్‌తో తలపడి గెలవడం, ఇరు జట్లలో పెద్దగా మార్పులు కూడా లేకపోవడంతో టీమిండియా అదే జోరులో హ్యట్రిక్ విజయంపై దృష్టి పెట్టింది. జట్టులో మార్పులకు కూడా ఇక ఏ మాత్రం అవకాశం లేదు. నైరాశ్యంలో బంగ్లాదేశ్: సోమవారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్ భారత్‌తో మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. ఐసీసీ నిషేధం కారణంగా ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోవడంతో గత మ్యాచ్‌లో టాస్ సమయంలోనే కెప్టెన్ మషఫ్ ్రమొర్తజా మొహంలో ఒకింత నైరాశ్యం కనిపించింది. ప్రధాన బౌలర్ అయి ఉండీ అతను ఒక్క ఓవర్ మాత్రమే వేయడం అతని మానసిక పరిస్థితిని సూచిస్తోంది. జట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిన బంగ్లాదేశ్ ఇక ముందంజ వేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గత కొంత కాలంగా బంగ్లాదేశ్ ఫామ్, దూకుడు చూస్తే భారత్‌కు కూడా గట్టి పోటీ ఇవ్వగల జట్టుగా కనిపించింది. అయితే ఈ వరల్డ్‌కప్‌లో పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన జట్టు, ఆస్ట్రేలియాకు తలవంచింది. ఆసీస్‌తో ఆడని తమీమ్ ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత లేకపోవడంతో మరోసారి బంగ్లా సీనియర్ షకీబ్‌పై ఆధార పడుతోంది. జట్లు (అంచనా) భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా. బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), మిథున్, సర్కార్, షబ్బీర్, షకీబ్, షువగత, మహ్ముదుల్లా, ముష్ఫికర్, సక్లాయిన్, అల్ అమీన్, ముస్తఫిజుర్. నేనూ... నా నోకియా... ఆశిష్ నెహ్రా సాధారణంగా పెద్దగా మీడియాలో హడావిడి చేయడు. గంభీరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకునే రకం. అయితే మంగళవారం మీడియా సమావేశంలో అతను చేసిన వ్యాఖ్య నవ్వులు పంచింది. సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల ఫోటోలతో రచ్చ చేస్తున్న ధోరణి పెరిగిపోవడంపై ప్రశ్నకు అతను సరదాగా జవాబిచ్చాడు. ‘మీరు ఎవరిని అడుగుతున్నారో చూడండి. నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు. ట్విట్టర్, ఇన్‌స్టగ్రామ్ వాడను. ఇప్పటికీ ఎప్పటిదో నోకియా ఫోన్‌నే వాడుతున్నాను. కాస్త పాతకాలం మనిషిలాగా కనిపించవచ్చు కానీ ఇలాగే ఉంటాను. పత్రికలూ చదవను కాబట్టి సోషల్ మీడియా సంగతులు నేను పట్టించుకోను’ అని నెహ్రా అన్నాడు. ► 4 భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకూ నాలుగు టి20లు జరిగితే అన్నింటిలోనూ భారత్ గెలిచింది. పిచ్, వాతావరణం చిన్నస్వామి సాధారణంగా బ్యాటింగ్‌కు మంచి వేదిక. విండీస్, లంక మధ్య జరిగిన మ్యాచ్ పిచ్‌నే దీని కోసం ఉపయోగిస్తున్నారు. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ముందు రోజు నగరంలో వాతావరణం కాస్త చల్లబడినా... వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఉండకపోవచ్చు. -
జీవితాలు క్లీన్ బోల్డ్!
జోరుగా టీ-20 ప్రపంచ కప్ బెట్టింగ్‌లు చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్న పోలీసు యంత్రాంగం టీ-20 ప్రపంచకప్ పోటీలు వీక్షకులకు ఆనందాన్ని ఇస్తుంటే.. పందెంగాళ్లు మాత్రం కాయ్‌రాజాకాయ్ .. అంటూ యువతపై వల విసురుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైందంటే చాలు ఏ బ్యాట్స్‌మన్ ఎన్ని పరుగులు తీస్తాడు.. బంతిబంతికీ బేరమం టూ పందేల రాయుళ్లను ఆహ్వానిస్తున్నారు. ఈ రొంపిలోకి దిగిన యువత జీవితాలను సర్వనాశనం చేసుకుంటోంది. తిరుపతి క్రైం: క్రికెట్ బెట్టింగ్‌లో జిల్లా అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఇలా.. జట్టు ఏదైనా బెట్టింగ్‌లు మాత్రం అసాధారణ స్థాయిలో సాగుతున్నాయి. టీ-20 ప్రపంచకప్ పోటీల్లో ఏరోజుకు ఆరోజే పందేలు కాస్తున్నారు. ప్రధానంగా యువత ఇష్టానుసారం బెట్టింగ్‌లు కాస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. జిల్లాలో ఆట ప్రారంభమైందంటే సుమారు రూ.కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. యువతపై తీవ్ర ప్రభావం పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. మదనపల్లిలో క్రికెట్ స్టార్ట్ అయిందంటే బెట్టింగ్ రాయుళ్లు బుకీల వద్ద బారులు తీరుతున్నారు. రెండు రోజుల క్రితం నగదుతో సహా పలువురుని మదనపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. బుకీలు పట్టణ, నగర ప్రాంతాల్లోని శివారు ప్రాంతాల్లో స్టార్ హోటల్స్‌లో రూములు తీసుకుని ఏమీ తెలియని వారిలా అంతా ఫోన్లలోనే బెట్టింగ్‌లు జరుపుతున్నారు. పోలీసులకు ఎటువంటి అనుమానం లేకుండా ఏరోజుకారోజు హోటల్ గదిని ఖాళీ చేసి మరో హోటల్‌కు మారిపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో బెట్టింగ్ బుకీలు జిల్లాలోని తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, పుంగనూరు వంటి ముఖ్యపట్టణాలకు చెందిన కొందరు రాష్ట్ర స్థాయిలో బెట్టింగ్‌ల ద్వారా దందా కొనసాగిస్తున్నారు. చోటా రాజకీయల నాయకుల అండదండలతో ఈ కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నారు. గతంలో బెట్టింగ్ రాయళ్లతో పాటు బుకీ రాయళ్లు కూడా ఒకేచో ఉంటూ మ్యాచ్ అయ్యేవరకు ఆస్వాదించేవారు. పోలీసులు వారిపై నిఘా ఉంచడంతో నిర్మానుష్యంగా ఉన్న దూరప్రాంతాల్లోని లాడ్జీల్లో రూమ్‌లు తీసుకుని వ్యవహారాలు నడుపుతున్నారు. నిర్వాహకులంతా ఎక్కువగా సెల్ఫోన్ల ద్వారానే ఈ దందా కొనసాగిస్తున్నారు. బెట్టింగ్‌ల కోసమే కొత్త సిమ్‌లు కొనుగోలు చేసి లావాదేవీలు అయిన తర్వాత వాటిని పారేస్తున్నారు. పటిష్టమైన చర్యలు నగరంలో బెట్టింగ్‌పై నిఘా ఏర్పాటు చేశాం. క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన సందర్భంలో నగరంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. బెట్టింగ్ కాయడం చట్టరీత్యానేరం. యువకులు కూడా వీటికి దూరంగా ఉండాలి. ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసు వాట్సప్ నెం.8099999977, 9491086021 నెంబర్లకు సమాచారం అందించండి. -మురళీకృష్ణ, ఈస్టు సబ్‌డివిజనల్ డీఎస్పీ -
మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం: యువరాజ్
టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఓటమితో కొంత ఆందోళన కలిగినా... పాకిస్తాన్‌పై విజయం తర్వాత భారత జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉందని స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పాడు. ఏ జట్టుతో, ఏ టోర్నీలో, ఏ వేదికలో మ్యాచ్ ఆడినా... పరిస్థితికి తగ్గట్లుగా ఆటతీరును మార్చుకోవాలని అన్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చివరి వరకూ క్రీజులో నిలబడి విజయాన్ని తానే పూర్తి చేస్తే మరింత సంతోషంగా ఉండేదని యువీ చెప్పాడు. -
‘కంగారు’ పడ్డా కొట్టేశారు
► బంగ్లాదేశ్‌పై మూడు వికెట్లతో ఆసీస్ విజయం ► సెమీస్ అవకాశాలు సజీవం బెంగళూరు: టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆశలు సజీవంగా నిలిచాయి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి టోర్నీలో తొలి విజయం సాధించింది. అటు బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమితో దాదాపుగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా... బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసింది. ఆరంభంలోనే సర్కార్, షబ్బీర్ల వికెట్లు కోల్పోయినా.... మిథున్ (22 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్సర్), షకీబ్ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. చివర్లో మహ్మదుల్లా (29 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) సంచలన షాట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోరు లభించింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా, వాట్సన్ రెండు వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా జట్టు 18.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్సర్), వాట్సన్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌కు 44 బంతుల్లోనే 62 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. స్మిత్ (13 బంతుల్లో 14; 1 సిక్సర్), వార్నర్ (9 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్సర్) ఎక్కువసేపు నిలబడలేదు. మధ్య ఓవర్లలో బంగ్లాదేశ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచినా... మ్యాక్స్‌వెల్ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చకచకా పరుగులు చేశాడు. రెండు సులభమైన క్యాచ్‌లను వదిలేయడం బంగ్లాదేశ్‌ను దారుణంగా దెబ్బతీసింది. షకీబ్ మూడు, ముస్తాఫిజుర్ రెండు వికెట్లు తీసుకున్నారు. జంపాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: మిథున్ (సి) వాట్సన్ (బి) జంపా 23; సౌమ్య సర్కార్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) వాట్సన్ 1; షబ్బీర్ (సి) ఫాల్క్‌నర్ (బి) వాట్సన్ 12; షకీబ్ (సి) కౌల్టర్ నైల్ (బి) జంపా 33; షువగత ఎల్బీడబ్ల్యు (బి) జంపా 13; మహ్మదుల్లా నాటౌట్ 49; ముష్ఫికర్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1-2; 2-25; 3-62; 4-78; 5-105. బౌలింగ్: కౌల్టర్ నైల్ 4-0-21-0; వాట్సన్ 4-0-31-2; హేస్టింగ్స్ 3-0-24-0; మిషెల్ మార్ష్ 1-0-12-0; మ్యాక్స్‌వెల్ 1-0-12-0; ఆడమ్ జంపా 4-0-23-3; ఫాల్క్‌నర్ 3-0-26-0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖవాజా (బి) అల్ అమిన్ 58; వాట్సన్ రనౌట్ 21; స్టీవ్ స్మిత్ (బి) ముస్తాఫిజుర్ 14; వార్నర్ (సి) అండ్ (బి) షకీబ్ 17; మ్యాక్స్‌వెల్ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) షకీబ్ 26; మిషెల్ మార్ష్ (సి) షకీబ్ (బి) ముస్తాఫిజుర్ 6; ఫాల్క్‌నర్ నాటౌట్ 5; హేస్టింగ్స్ (సి) సర్కార్ (బి) షకీబ్ 3; నెవిల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.3 ఓవర్లలో ఏడు వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-62; 2-95; 3-115; 4-119; 5-135; 6-148; 7-152. బౌలింగ్: మొర్తజా 1-0-9-0; మహ్మదుల్లా 2-0-22-0; అల్ అమిన్ 2-0-14-1; ముస్తాఫిజుర్ 4-0-30-2; షకీబ్ 4-0-27-3; సాజిబ్ 3.3-0-40-0; షువగత 2-0-13-0. -
ఆఫ్రిదిని తొలగిస్తాం: పీసీబీ
కరాచీ: టి20 ప్రపంచకప్ అనంతరం షాహిద్ ఆఫ్రిదిని కెప్టెన్సీ నుంచి తొలగించడం ఖాయమైంది. ఈవిషయంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టతనిచ్చారు. ‘ప్రపంచకప్ వరకు ఆఫ్రిది కెప్టెన్‌గా ఉంటాడు. మా మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ టోర్నీ అనంతరం రిటైర్ అవుతానని చెప్పాడు. ఒకవేళ మనసు మార్చుకుని ఆడాలనుకున్నా కెప్టెన్‌గా మాత్రం కొనసాగడు. అలాగే ఆటగాడిగా కూడా జట్టులో ఉంటాడా? లేదా? అనేది కూడా చూడాలి. ప్రస్తుత పరిస్థితిలో తనకు అందరి మద్దతు అవసరం’ అని ఖాన్ అన్నారు. భారత్‌లో తమ జట్టుకు ఏర్పాటు చేసిన భద్రతపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. -
కోట్లాలో సెమీస్ మ్యాచ్ అనుమానమే!
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగేది అనుమానంగా మారింది. స్టేడియంలో 1800 సీట్ల సామర్థ్యం ఉన్న ఆర్పీ మెహ్రా బ్లాక్‌కు సంబంధించిన టిక్కెట్లను ఇంకా అమ్మలేదు. దీనికోసం ఐసీసీ ఆదివారం వరకే గడువునిచ్చింది. ఆ బ్లాక్‌కు సంబంధించి సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ బెంగళూరుకు తరలితే డీడీసీఏ రూ.4 కోట్లు నష్టపోతుంది. ‘ఇప్పటిదాకా అయితే వేదిక మార్పు గురించి ఐసీసీ, బీసీసీఐ నుంచి మాకు సమాచారం లేదు’ అని ఢిల్లీ క్రికెట్ సంఘం అధికారి అన్నారు. -
దేశం ఆశగా చూస్తోంది... మనసు పెట్టి ఆడండి
టి20 ప్రపంచకప్ తొలిసారి భారత్‌లో జరుగుతుండటం వల్ల కావచ్చు... టోర్నీకి ముందు భారత్ సాధించిన విజయాల వల్ల కావచ్చు... జట్టు మొత్తం స్టార్ క్రికెటర్లతో నిండిపోవడం వల్ల కావచ్చు... కారణం ఏదైనాగానీ ఈసారి భారత్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. మొత్తం దేశం అంతా ధోనిసేన కప్ గెలుస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ తొలి రెండు మ్యాచ్‌ల్లో మనవాళ్ల ఆటతీరు మాత్రం ఆశించిన విధంగా లేదు. ముఖ్యంగా సురేశ్ రైనా, శిఖర్ ధావన్ అవుటైన తీరు చాలా ఆందోళన కలిగించింది. నిర్లక్ష్యంతో కూడిన సాధారణ షాట్లు ఆడి ఈ ఇద్దరూ అవుటయ్యారు. బెంగళూరు నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ఏ ఫార్మాట్లో అయినా జట్టు విజయాలు సాధించాలంటే ఇన్నింగ్స్‌కు పునాది బలంగా ఉండాలి. ఓపెనర్లతో పాటు తర్వాత ఇద్దరూ కూడా నిలకడగా ఆడాలి. టాప్-4 బ్యాట్స్‌మెన్ రాణించిన ప్రతిసారీ కచ్చితంగా ఆ జట్టు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఒక్క కోహ్లి మినహా టాప్-4లో మిగిలిన ముగ్గురూ విఫలమయ్యారు. రోహిత్ శర్మ ఎప్పుడైనా మ్యాచ్ విన్నరే. ఇటీవల అతను చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్క మ్యాచ్‌లో కొద్దిగా కుదురుకుంటే ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపిస్తాడు. కానీ శిఖర్ ధావన్, రైనా మాత్రం ఏమాత్రం ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ‘లేజీ షాట్లు’ ఆడి అవుటయ్యారు. వీరి వైఫల్యం వల్ల మిడిలార్డర్‌పై ఒత్తిడి పెరుగుతుంది. నిజానికి ఈ టోర్నీకి ముందు భారత్ గెలిచిన అనేక మ్యాచ్‌ల్లో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌కు అవకాశమే రాలేదు. దీనివల్ల ఇప్పటికిప్పుడు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ వచ్చి నిలదొక్కుకునే సమయం కూడా లేకుండా షాట్లు ఆడటం ఇబ్బందిగా మారుతుంది. అదే వైఫల్యం భారత బౌలర్ ఎవరైనా వికెట్ తీస్తే, ఫీల్డర్ క్యాచ్ పడితే మూడు సెకన్ల లోపు అతడిని చేరుకొని అభినందించే రైనా పాత్ర చూస్తే టీమ్‌లో ప్రస్తుతం చీర్ గర్ల్‌లా కనిపిస్తోంది... సోషల్ మీడియాలో ఏవరో సరదాగా ఈ వ్యాఖ్య చేసినా... వాస్తవం అంతకంటే భిన్నంగా ఏమీ లేదు. 2015 నుంచి గత 15 టి20 మ్యాచ్‌లలో రైనా కేవలం 2 సార్లు మాత్రమే 30 పరుగుల స్కోరు దాటగలిగాడు. ఆసియా కప్‌లో ఘోరంగా విఫలమైన అతను వరల్డ్ కప్‌లోనూ అదే ఆటతీరు కనబరుస్తున్నాడు. 2016లో 13 మ్యాచ్‌లలో కలిపి అతను చేసింది 180 పరుగులే. బంతి కొంచెం స్పిన్ అయితే, పిచ్‌పై కాస్త బౌన్స్ ఉంటే చాలు పదేళ్ల కెరీర్ తర్వాత కూడా తన వల్ల కాదన్నట్లుగా ముందే అవుట్‌కు సిద్ధమైనట్లు అనిపిస్తుంది. నాలుగో స్థానంలో అతను బరిలోకి దిగడంపై కూడా ఇది సందేహాలు రేకెత్తిస్తోంది. నాగ్‌పూర్‌లో రెండో బంతికే మిడ్ వికెట్లో రైనా సునాయాస క్యాచ్ ఇవ్వగా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో తొలి బంతికే ఈ యూపీ బ్యాట్స్‌మన్ ఆట ముగిసింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పోరాడే తత్వం, కఠినమైన పరిస్థితుల్లో ఆడగలగడం రైనా ఇంకా నేర్చుకోలేదు. తరచి చూస్తే అతడి నుంచి అలాంటి ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఇప్పటివరకు వచ్చినట్లు కనిపించదు. ఫ్లాట్ వికెట్లపైనా, ఏడాదికి ఒక పండగలాగా వచ్చే ఐపీఎల్లో చెలరేగిపోయే రైనా, మిగిలిన వరల్డ్ కప్ మ్యాచ్‌లలోనైనా దూకుడుగా ఆడాల్సి ఉంది. గత ఐదు టి20 ఇన్నింగ్స్‌లలో అతను ప్రతీసారి చేసిన పరుగులకంటే ఎక్కువ బంతులే తీసుకున్నాడు. ఈ ఐదు సందర్భాల్లో ఐదు ఓవర్లకంటే ముందే బ్యాటింగ్‌కు వచ్చిన రైనాపై చాలా బాధ్యత ఉన్నా దానిని అతను నెరవేర్చలేకపోయాడు. రైనాకు తన సత్తా చాటేందుకు బెంగళూరులో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు మించిన వేదిక, సందర్భం దొరకదు. నాటి దూకుడు ఏది..? ఒకప్పుడు శిఖర్ ధావన్ అంటే సెహ్వాగ్ స్థానంలో వచ్చి అతడి ఆటను మరిపించే విధంగా చెలరేగిన హిట్టర్. కానీ కొన్నాళ్లుగా ధావన్ ఆటను చూస్తే అతి సాధారణంగా మారిపోయింది. మరో ఓపెనర్ రోహిత్‌కు సహకరించడమే తప్ప తనదైన శైలిలో దూకుడుగా ఆడటం అతను మర్చిపోయినట్లున్నాడు. ఇటీవల రాంచీలో శ్రీలంకతో మ్యాచ్ మినహా అతడి నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన రాలేదు. ఆసియా కప్ ఫైనల్లో స్వల్ప లక్ష్యంతో అప్పటికే దాదాపుగా ఫలితం ఖరారైన మ్యాచ్‌లో మాత్రమే శిఖర్ రాణించాడు. టి20ల్లో అతని స్ట్రయిక్ రేట్ కూడా సాధారణంగా ఉంటోంది. ప్రపంచకప్‌లో కివీస్‌తో మ్యాచ్‌లో అడ్డంగా ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయిన ధావన్... పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో మరీ ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా ఆమిర్‌ను ఎదుర్కొన్న ఏడు బంతుల్లో ఒక్క సింగిల్ మాత్రమే తీసిన అతను 15 బంతుల్లో 6 పరుగులతో ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఫ్రీ హిట్ బంతికి కూడా అతను పరుగు తీయలేకపోవడం ఊహించగలమా? ఒకవేళ ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల్లోనూ ఇదే తరహాలో విఫలమైతే... బెంచ్ మీద అవకాశం కూర్చున్న రహానే, దేశవాళీలో చెలరేగుతున్న శ్రేయస్ అయ్యర్‌లాంటి వాళ్ల నైపుణ్యాన్ని చేజేతులా ధావన్ కోసం వృథా చేసుకున్నట్లే. కెప్టెన్ మద్దతు ఏ ఆటగాడు విఫలమైనా అతనికి మద్దతుగా నిలబడటంలో ధోనిని మించిన కెప్టెన్ లేడు. గతంలో ఎన్నో సందర్భాల్లో ఇది రుజువయింది కూడా. ప్రస్తుతం ధావన్, రైనాల విషయంలోనూ ధోని వారికి అండగా నిలిచాడు. వాళ్లిద్దరూ పుంజుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశాడు. మరి కెప్టెన్ నమ్మకాన్ని ఈ ఇద్దరూ ఇప్పటికైనా నిలబెట్టుకుంటారా..? -
సఫారీలు గెలిచారు
► అఫ్ఘానిస్తాన్‌పై దక్షిణాఫ్రికా విజయం ► రాణించిన డివిలియర్స్ టి20 ప్రపంచకప్ ముంబై: టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు చేసినా ఓటమిపాలైన దక్షిణాఫ్రికా... రెండో మ్యాచ్‌లో అఫ్ఘానిస్తాన్‌పై కూడా భారీ స్కోరు చేసి తడబడినా గెలిచింది. 210 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అఫ్ఘానిస్తాన్ ఓ దశలో చెలరేగినా సఫారీ బౌలర్లు చివర్లో కట్టడి చేయగలిగారు. ఆదివారం వాంఖడే స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 37 పరుగులతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు 20 ఓవర్లలో 5 వికెట్లకు 209 పరుగులు చేశారు. డివిలియర్స్ (29 బంతుల్లో 64; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తనదైన శైలిలో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ ఆమ్లా (5) విఫలమైనా... డికాక్ (31 బంతుల్లో 45; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), డు ప్లెసిస్ (27 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. తర్వాత డివిలియర్స్ సిక్సర్ల జోరు చూపెట్టాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడినా... రషీద్ వేసిన 17వ ఓవర్లో నాలుగు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో 29 పరుగులు రాబట్టాడు. తర్వాతి ఓవర్లో మరో సిక్సర్ బాది అవుట్‌కాగా... డుమిని (20 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి నాలుగో వికెట్‌కు 76 పరుగులు జత చేశాడు. చివర్లో మిల్లర్ (8 బంతుల్లో 19; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడటంతో ప్రొటీస్ స్కోరు 200 దాటింది. అఫ్ఘానిస్తాన్ 20 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ మహ్మద్ షెహజాద్ (19 బంతుల్లో 44; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. తొలి ఓవర్లో ఓ సిక్స్, ఫోర్‌తో పాటు, అబాట్ వేసిన రెండో ఓవర్లో మూడు సిక్స్‌లు, ఓ ఫోర్ బాదాడు. దీంతో రెండు ఓవర్లలో అఫ్ఘాన్ స్కోరు 33 పరుగులకు చేరింది. మూడో ఓవర్లో 14 పరుగులు రాబట్టిన షెహజాద్.. నాలుగో ఓవర్లో అనూహ్యంగా స్టంపౌటయ్యాడు. దీంతో నూర్ అలీ జద్రాన్ (24 బంతుల్లో 25; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అస్గర్ (7) విఫలమైనా... గుల్బాదిన్ (18 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా స్పందించడంతో అఫ్ఘానిస్తాన్ తొలి 10 ఓవర్లలో 2 వికెట్లకు 103 పరుగులు చేసింది. తర్వాత గుల్బాదిన్, నూర్ అలీలు వరుస ఓవర్లలో అవుట్‌కావడం ఇన్నింగ్స్‌పై ప్రభావం చూపింది. మిడిలార్డర్లో సైమూల్లా షెన్వారి (14 బంతుల్లో 25; 3 ఫోర్లు) మినహా అంతా విఫలమవడంతో... 67 పరుగుల తేడాలో ఏడు వికెట్లు చేజార్చుకుంది. 4 వికెట్లు తీసిన మోరిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: డికాక్ (సి) షెహజాద్ (బి) హమ్జా 45; ఆమ్లా (సి) అస్గర్ (బి) షాపూర్ 5; డు ప్లెసిస్ రనౌట్ 41; డివిలియర్స్ (సి) నూర్ అలీ (బి) నబీ 64; డుమిని నాటౌట్ 29; మిల్లర్ (సి) గుల్బాదిన్ (బి) దౌలత్ 19; వీస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 209. వికెట్ల పతనం: 1-25; 2-90; 3-97; 4-173; 5-203. బౌలింగ్: అమిర్ హమ్జా 3-0-25-1; దౌలత్ 3-0-46-1; షాపూర్ 3-0-28-1; నబీ 4-0-35-1; రషీద్ ఖాన్ 4-0-51-0; షైన్వారి 3-0-22-0. అఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్: షెహజాద్ (బి) మోరిస్ 44; నూర్ అలీ (స్టంప్) డికాక్ (బి) తాహిర్ 25; అస్గర్ (సి) డికాక్ (బి) మోరిస్ 7; గుల్బాదిన్ నబీ (సి) డికాక్ (బి) అబాట్ 26; మహ్మద్ నబీ (సి) డివిలియర్స్ (బి) తాహిర్ 11; సైమూల్లా షెన్వారి (సి) వీస్ (బి) అబాట్ 25; నజీబుల్లా జద్రాన్ (సి) డికాక్ (బి) రబడ 12; రషీద్ ఖాన్ (బి) మోరిస్ 11; దౌలత్ జద్రాన్ (బి) మోరిస్ 0; అమిర్ హమ్జా నాటౌట్ 3; షాపూర్ (బి) రజడ 1; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో ఆలౌట్) 172. వికెట్ల పతనం: 1-52; 2-60; 3-105; 4-109; 5-140; 6-156; 7-156; 8-167; 9-169; 10-172. బౌలింగ్: రబడ 4-0-37-2; అబాట్ 4-0-36-2; మోరిస్ 4-0-27-4; తాహిర్ 4-0-24-2; వీస్ 4-0-47-0. -
విండీస్ మహిళలకు మరో విజయం
చెన్నై: మహిళల టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. విండీస్ కెప్టెన్ స్టెఫానీ టేలర్ (41 బంతుల్లో 40; 2 ఫోర్లు; 1 సిక్స్), (3/13) ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్ జట్టు 49 పరుగుల భారీ తేడాతో ఓడింది. మూడు ఓటములతో బంగ్లా టోర్నీ నుంచి నిష్ర్కమించినట్టే. ఆదివారం జరిగిన ఈ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 148 పరుగులు చేసింది. హేలీ మాథ్యూస్ (42 బంతుల్లో 41; 4 ఫోర్లు), స్టెఫానీ టేలర్ రాణించారు. డాటిన్ (11 బంతుల్లో 24; 2 ఫోర్లు), స్టేసీ కింగ్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు) చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడారు. న హీదాకు మూడు వికెట్లు పడ్డాయి. బంగ్లాదేశ్ 18.3 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌట్ అయ్యింది. నిగర్ సుల్తానా (27 బంతుల్లో 27; 2 ఫోర్లు) టాప్ స్కోరర్. హేలీ, డాటిన్లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. శ్రీలంక మహిళల గెలుపు మొహాలీ: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న శ్రీలంక మహిళల జట్టు... ఆదివారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై నెగ్గింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 129 పరుగులు చేసింది. కౌసల్య (28 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు), జయాంగిని (22 బంతుల్లో 34; 7 ఫోర్లు), వీరక్కొడి (41 బంతుల్లో 32; 2 ఫోర్లు) రాణించారు. 59 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన లంకను వీరక్కొడి, కౌసల్య ఆరో వికెట్‌కు 49 పరుగులు జోడించి ఆదుకున్నారు. మెట్కాల్ఫి 4 వికెట్లు తీసింది. తర్వాత ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 115 పరుగులు మాత్రమే చేసింది. సిసిలా జాయ్సీ (30 బంతుల్లో 29; 4 ఫోర్లు), డెల్ని (24 బంతుల్లో 29; 2 ఫోర్లు), ఐసోబెల్ జాయ్సీ (28 బంతుల్లో 24; 2 ఫోర్లు) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. సుగంధికా 3 వికెట్లు పడగొట్టింది. -
ఆఫ్రిదికి ఎసరు!
► టి20 ప్రపంచకప్ తర్వాత ఉద్వాసన ► అక్మల్‌పై కూడా పీసీబీ ఆగ్రహం కరాచీ: టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మరోసారి ఓటమిపై పాకిస్తాన్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. వీధుల్లోకి వచ్చిన అభిమానులు తమ టీవీ సెట్లను పగలగొట్టడంతో పాటు ఓటమిపై తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కగా... కెప్టెన్సీలో దారుణంగా విఫలమయ్యాడంటూ ఆఫ్రిదిపై మాజీలు విరుచుకుపడ్డారు. భారత్‌తో మ్యాచ్‌లో ఆఫ్రిది ఏమాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించలేదని, స్పెషలిస్ట్ స్పిన్నర్ ఎమాద్ వాసిమ్‌ను తీసుకోకుండా తప్పిదం చేశాడని విమర్శించారు. ఫామ్‌లో ఉన్న హఫీజ్‌ను పక్కనబెట్టి ఆఫ్రిది వన్‌డౌన్‌లో బ్యాటింగ్ దిగడాన్ని వారు ప్రశ్నించారు. ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్న షాహిద్ ఆఫ్రిది నాయకత్వానికి ముగింపు పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘ఆఫ్రిది ప్రదర్శనపై.. కెప్టెన్సీపై బోర్డులో అసంతృప్తి నెలకొంది. ఈ టోర్నీ అనంతరం అతడు రిటైర్మెంట్ కాకుంటే మాత్రం కెప్టెన్సీ కోల్పోవాల్సి వస్తుంది. అలాగే ఆటగాడిగా కూడా కొనసాగే అవకాశాలు తక్కువే. అలాగే కప్ గెలిచినా కూడా ప్రస్తుత సెలక్షన్ కమిటీకి ఉద్వాసన పలకడం ఖాయం’ అని పీసీబీ వర్గాలు తెలిపాయి. అక్మల్‌పై పీసీబీ ఆగ్రహం భారత్‌తో మ్యాచ్‌లో తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకునేందుకు పాక్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ సహాయం తీసుకున్న ఉమర్ అక్మల్‌పై పీసీబీ ఆగ్రహంతో ఉంది. ఇమ్రాన్‌తో ఉమర్ మాట్లాడిన విషయాలు టీవీ ఫుటేజిలో రికార్డయ్యాయి. కోల్‌కతాలోనే ఉన్న పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్ ఈ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీమ్ మేనేజిమెంట్‌తో మాట్లాడారు. స్వార్థంగా ఆలోచించే ఉమర్‌ను ఇతర మ్యాచ్‌ల్లో ఆడనీయొద్దని రమీజ్ రాజా సూచించారు. -
కరీబియన్ల జోరు
► శ్రీలంకపై ఏడు వికెట్లతో విజయం ► మెరిసిన బద్రీ, ఫ్లెచర్ ఇన్నాళ్లూ ఐపీఎల్ మెరుపులతో భారత అభిమానులకు దగ్గరైన వెస్టిండీస్ క్రికెటర్లు... ఈసారి టి20 ప్రపంచకప్‌లో అద్భుతంగా ఆడుతూ భారత అభిమానులకు వినోదాన్ని పంచుతున్నారు. టోర్నీలో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సాధికార విజయం సాధించారు. బెంగళూరు: టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు దూసుకుపోతోంది. తమ తొలి మ్యాచ్‌లో గేల్ విధ్వంసంతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన కరీబియన్లు... శ్రీలంకపై అన్ని విభాగాల్లోనూ సమష్టిగా రాణించి అలవోకగా నెగ్గారు. చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో స్యామీ సేన ఏడు వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా... శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేసింది. దిల్షాన్ (12), చండీమల్ (16) ఇన్నింగ్స్‌ను దూకుడుగా ఆరంభించే ప్రయత్నం చేసినా... కరీబియన్ బౌలర్లు కట్టడి చేశారు. వరుస విరామాల్లో వికెట్లతో ఏ దశలోనూ లంకను కుదురుకోనీయలేదు. పెరీరా (29 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడటంతో లంకకు ఓ మాదిరి స్కోరైనా లభించింది. వెస్టిండీస్ స్పిన్నర్ శామ్యూల్ బద్రీ (3/12) ఆరంభంలో సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. బ్రేవో రెండు వికెట్లు తీశాడు. వెస్టిండీస్ జట్టు 18.2 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసి గెలిచింది. ఫీల్డింగ్ సమయంలో గాయం కావడం వల్ల గేల్ ఓపెనింగ్ చేయలేదు. అయితే ఈ లోటు తెలియకుండా గేల్ స్థానంలో వచ్చిన ఫ్లెచర్ (64 బంతుల్లో 84 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. రెండో ఎండ్‌లో మూడు వికెట్లు పడ్డా ఏమాత్రం తడబాటు లేకుండా దాదాపుగా ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. గేల్ బ్యాటింగ్‌కు రావాలంటూ బెంగళూరు అభిమానులు గోల చేశారు. దీంతో మూడో వికెట్ పడ్డాక గేల్ బ్యాటింగ్‌కు రాబోయాడు. అయితే ఫీల్డింగ్ సమయంలో బయటకు వెళ్లినందున నిబంధనల ప్రకారం మరో 11 నిమిషాలు ఆగాక లేదా మరో రెండు వికెట్లు పడ్డాక గేల్ ఆడాలని అంపైర్లు సూచించారు. రస్సెల్ (8 బంతుల్లో 20 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్సర్)తో కలిసి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఫ్లెచర్ మ్యాచ్‌ను ముగించడంతో బెంగళూరు అభిమానులు గేల్ మెరుపులను చూడలేకపోయారు. స్కోరు వివరాలు శ్రీలంక ఇన్నింగ్స్: చండీమల్ రనౌట్ 16; దిల్షాన్ ఎల్బీడబ్ల్యు (బి) బ్రాత్‌వైట్ 12; తిరిమన్నె (సి) ఫ్లెచర్ (బి) బద్రీ 5; కపుగెడెర (స్టంప్డ్) రామ్‌దిన్ (బి) బద్రీ 6; మాథ్యూస్ (సి) రామ్‌దిన్ (బి) బ్రేవో 20; సిరివర్ధన (సి) గేల్ (బి) బద్రీ 0; తిషార పెరీరా (సి) రస్సెల్ (బి) బ్రేవో 40; కులశేఖర (బి) రస్సెల్ 7; హెరాత్ రనౌట్ 3; వాండార్సె నాటౌట్ 0; చమీరా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 122. వికెట్ల పతనం: 1-20; 2-32; 3-41; 4-47; 5-47; 6-91; 7-116; 8-121; 9-121. బౌలింగ్: రస్సెల్ 4-0-34-1; బద్రీ 4-0-12-3; బెన్ 4-0-13-0; బ్రాత్‌వైట్ 4-0-36-1; డ్వేన్ బ్రేవో 4-0-20-2. వెస్టిండీస్ ఇన్నింగ్స్: ఫ్లెచర్ నాటౌట్ 84; చార్లెస్ (బి) వాండార్సె 10; శామ్యూల్స్ (స్టంప్డ్) చండీమల్ (బి) సిరివర్ధన 3; రామ్‌దిన్ (బి) సిరివర్ధన 5; రస్సెల్ నాటౌట్ 20; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.2 ఓవర్లలో మూడు వికెట్లకు) 127. వికెట్ల పతనం: 1-39; 2-54; 3-72. బౌలింగ్: మాథ్యూస్ 1-0-13-0; హెరాత్ 4-0-27-0; కులశేఖర 2-0-17-0; వాండార్సె 4-1-11-1; సిరివర్ధన 4-0-33-2; చమీరా 3-0-15-0; పెరీరా 0.2-0-11-0. -
టస్కిన్, సన్నీలపై వేటు
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్ ఓడిన బంగ్లాదేశ్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. సందేహాస్పద బౌలింగ్ శైలి కారణంగా పేసర్ టస్కిన్ అహ్మద్, లెఫ్టార్మ్ స్పిన్నర్ అరాఫత్ సన్నీలపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సస్పెన్షన్ విధించింది. స్వతంత్ర విచారణ పరీక్షలో వీరిద్దరి బౌలింగ్ శైలి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు తేలిందని ఐసీసీ ప్రకటించింది. -
ప్రపంచంలో ఎప్పుడైనా...ఎక్కడైనా...
► ఈడెన్లోనూ పాకిస్తాన్‌పై భారత్ విజయం ► చెలరేగిన విరాట్ కోహ్లి భారత్ మళ్లీ గర్జించింది... విశ్వ వేదికపై మనల్ని ఓడించడం పక్కవాడి, పగవాడి తరం కాదని మరో సారి నిరూపించింది. చరిత్ర మార్చడం అంత సులువు కాదని, అదిప్పుడు శిలాక్షరంగా మారిపోయిందని ప్రత్యర్థికి గట్టిగా గుర్తు చేసింది. ఈడెన్‌లో శత సహస్ర సంఖ్యలో ‘హిందుస్తాన్ జిందాబాద్’ అని వినిపిస్తుండగా, సగర్వంగా మరో విజయాన్ని అందుకుంది. ఈ మైదానం మాకు అచ్చి వచ్చిందని చెప్పుకుంటూ ఆటకు ముందే సంబరపడిన పాకిస్తాన్‌ను ధోని సేన దుమ్ము దులిపింది. ఇక్కడే కాదు ప్రపంచంలో భారత్‌తో ఎక్కడ ప్రపంచకప్ మ్యాచ్ జరిగినా విజయం వారి వాకిలి వైపు కూడా తిరిగి చూడదని ఆ జట్టుకు అర్థమయ్యేలా గట్టి దెబ్బ కొట్టిన మన జట్టు పనిలో పనిగా సొంతగడ్డపై ప్రపంచకప్‌లో మనమేంటో చూపిస్తూ రేసులో నిలబడింది. కొలంబో, ఢాకా, సిడ్నీ, కోల్‌కతా... మైదానం ఏదైనా ‘పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే నేనే గెలిపిస్తాను’ అని విరాట్ కోహ్లి మరోసారి ఢంకా బజాయించి చెప్పాడు. దాయాదిపై తన ఘన రికార్డును నిలబెట్టుకున్నాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి ఆందోళనతో ఉన్న సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్కుచిరస్మరణీయ విజయాన్ని అందించాడు. కోల్‌కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి టి20 ప్రపంచకప్‌లో భారత్ మళ్లీ రేస్‌లోకి వచ్చేసింది. గత మ్యాచ్ ఓటమి నుంచి తొందరగానే కోలుకున్న ధోనిసేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ని చిత్తు చేసి వరల్డ్‌కప్‌లలో తమ రికార్డును నిలబెట్టుకుంది. శనివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. మాలిక్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్మల్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కీలక భాగస్వామ్యంతో ఆ జట్టు ఈ మాత్రం పరుగులైనా చేయగలిగింది. అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 4 వికెట్లకు 119 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (37 బంతుల్లో 55 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్ ) అర్ధ సెంచరీతో చెలరేగగా, యువరాజ్ (23 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగోవికెట్‌కు 44 బంతుల్లోనే 61 పరుగులు జోడించడం విశేషం. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఈ నెల 23న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. కీలక భాగస్వామ్యం గింగిరాలు తిరుగుతున్న అశ్విన్ బంతి, అనూహ్య బౌన్స్... చూస్తే ఈడెన్ గార్డెన్ కూడా నాగ్‌పూర్ పిచ్‌లాగే అనిపించింది. పాక్ జట్టు కూడా తడబడుతూనే తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది. మూడో ఓవర్ చివరి బంతికి గానీ ఆ జట్టు తొలి బౌండరీని కొట్టలేకపోయింది. భారత బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో పరుగులు తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన ఓపెనర్లు షర్జీల్ (24 బంతుల్లో 17; 2 ఫోర్లు), షహజాద్ (28 బంతుల్లో 25; 3 ఫోర్లు) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. గత మ్యాచ్‌లో బంగ్లాపై చెలరేగిన ఆఫ్రిది (8) ఒక్కో బంతిని ఆడేందుకు శ్రమించి చివరకు పాండ్యా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ దశలో మాలిక్, అక్మల్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకు పాండ్యా వేసిన 14వ ఓవర్లో రెండు సిక్సర్లతో 15 పరుగులు రావడంతో పాక్ పరిస్థితి కాస్త మెరుగైంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 4 ఓవర్లలోనే 41 పరుగులు జోడించారు. చివర్లో మళ్లీ వేగం తగ్గిన పాక్ ఆఖరి 3 ఓవర్లలో 23 పరుగులతోనే సరిపెట్టుకుంది. పిచ్‌పై తేమను ఉపయోగించుకోవడంతో పాటు వర్షం పడితే లక్ష్య ఛేదనపై స్పష్టత ఉంటుందని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోగా... పాక్ మాత్రం లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమాద్ స్థానంలో అనూహ్యంగా నాలుగో పేసర్‌గా సమీని ఎంచుకుంది. సూపర్ కోహ్లి: స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో మళ్లీ న్యూజిలాండ్ మ్యాచ్ అనుభవాన్నే గుర్తుకు తెచ్చింది. ఇర్ఫాన్ ఓవర్లో 2 ఫోర్లు బాదిన తర్వాత రోహిత్ (10) ఆమిర్ చక్కటి బంతికి వెనుదిరగ్గా, ఆ వెంటనే సమీ వరుస బంతుల్లో ధావన్ (6), రైనా (0)లను క్లీన్‌బౌల్డ్ చేసి ఒక్కసారిగా అలజడి రేపాడు. కానీ ఎప్పటిలాగే కోహ్లి ముందుండి నడిపించాడు. తనదైన శైలిలో జాగ్రత్తగా ఆరంభం చేసి నిలదొక్కుకున్న తర్వాత దూకుడు కనబర్చాడు. పాక్ బౌలర్లు ఒక్కసారి కూడా కోహ్లిని కనీసం ఇబ్బంది పెట్టలేకపోయారు. మరో వైపు యువరాజ్నుంచి కోహ్లికి చక్కటి సహకారం లభించింది. చాలా కాలం తర్వాత యువరాజ్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ప్రతీ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతో పరుగులు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. చివర్లో అనవసర షాట్‌తో యువీ వెనుదిరిగినా... కోహ్లి, ధోని (13 నాటౌట్) మరో 13 బంతులు మిగిలి ఉండగానే ముగించారు. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షర్జీల్ (సి) పాండ్యా (బి) రైనా 17; షహజాద్ (సి) జడేజా (బి) బుమ్రా 25; ఆఫ్రిది (సి) కోహ్లి (బి) పాండ్యా 8; అక్మల్ (సి) ధోని (బి) జడేజా 22; మాలిక్ (సి) అశ్విన్ (బి) నెహ్రా 26; సర్ఫరాజ్ (నాటౌట్) 8; హఫీజ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 118. వికెట్ల పతనం: 1-38; 2-46; 3-60; 4-101; 5-105. బౌలింగ్: నెహ్రా 4-0-20-1; అశ్విన్ 3-0-12-0; బుమ్రా 4-0-32-1; జడేజా 4-0-20-1; రైనా 1-0-4-1; పాండ్యా 2-0-25-1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మాలిక్ (బి) ఆమిర్ 10; ధావన్ (బి) సమీ 6; కోహ్లి (నాటౌట్) 55; రైనా (బి) సమీ 0; యువరాజ్ (సి) సమీ (బి) రియాజ్ 24; ధోని (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (15.5 ఓవర్లలో 4 వికెట్లకు) 119. వికెట్ల పతనం: 1-14; 2-23; 3-23; 4-84. బౌలింగ్: ఆమిర్ 3-1-11-1; ఇర్ఫాన్ 2.5-0-25-0; సమీ 2-0-17-2; ఆఫ్రిది 4-0-25-0; మాలిక్ 2-0-22-0; రియాజ్ 2-0-16-1. సచిన్‌కు వందనం అర్ధ సెంచరీ సాధించినప్పుడు విరాట్ కోహ్లి ఏదో బ్యాట్ చూపించడంతో ఆగిపోకుండా ప్రేక్షకుల వైపు చూస్తూ కిందికి వంగుతూ వందనం చేయడం అందరికీ కనిపించింది. అప్పటికే జట్టు విజయం దాదాపు ఖాయమైన స్థితిలో హాఫ్ సెంచరీకి ఈ రకంగా భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ఆసక్తిని కలిగించింది. అయితే అది తాను ఎంతో అభిమానించే దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోసమని కోహ్లి చెప్పాడు. సచిన్ ఎన్నో గొప్ప చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారని, ఆయన సమక్షంలో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని ఎంతో కాలంగా కోరుకున్నట్లు కోహ్లి చెప్పాడు. ఇప్పుడు ఇది సరైన సందర్భంగా తాను భావించానని, అందుకే సచిన్‌కు ఈ తరహాలో వందనం చేసినట్లు అతను వెల్లడించాడు. ప్రతిగా సచిన్ కూడా చిరునవ్వుతో విరాట్‌కు బదులిచ్చారు. 11 ప్రపంచకప్‌లలో (వన్డేలు, టీ20లు కలిపి) పాకిస్తాన్‌పై భారత్ గెలవడం ఇది 11వ సారి. -
ఇంగ్లండ్ కుమ్మేసింది
► దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం ► జో రూట్, జాసన్ రాయ్ మెరుపులు ► ఆమ్లా, డి కాక్ శ్రమ వృథా ముంబై: 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఉఫ్‌మని ఊదేశారు. ఓపెనర్ జాసన్ రాయ్ (16 బంతుల్లో 43; 5 ఫోర్లు; 3 సిక్సర్లు) ఊచకోతతో ప్రారంభమైన పరుగుల వరద జో రూట్ (44 బంతుల్లో 83; 6 ఫోర్లు; 4 సిక్సర్లు) జట్టు విజయాన్ని ఖాయం చేసేదాకా సాగింది. ఫలితంగా వాంఖడే మైదానంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో ఓడింది. టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక ఛేజింగ్ కావడం విశేషం. బౌలర్ల వైఫల్యానికి తోడు చెత్త ఫీల్డింగ్ కూడా జత కలవడంతో ప్రొటీస్ మూల్యం చెల్లించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 229 పరుగుల స్కోరు సాధించింది. ఓపెనర్లు ఆమ్లా (31 బంతుల్లో 58; 7 ఫోర్లు; 3 సిక్సర్లు), డి కాక్ (24 బంతుల్లో 52; 7 ఫోర్లు; 3 సిక్సర్లు) ప్రత్యర్థి బౌలర్లను ఆటాడుకున్నారు. డుమిని (28 బంతుల్లో 54 నాటౌట్; 3 ఫోర్లు; 3 సిక్సర్లు), మిల్లర్ (12 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) చివర్లో ధాటిగా ఆడారు. అనంతరం భారీ లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్ 19.4 ఓవర్లలో 8 వికెట్లకు 230 పరుగులు చేసి నెగ్గింది.ఇంగ్లండ్ తొలి బంతి నుంచే బాదుడు ప్రారంభించింది. రబడా వేసిన ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్లో నాలుగు ఫోర్లు బాదిన ఓపెనర్ రాయ్ 21 పరుగులు రాబట్టగా రెండో ఓవర్లో మరో ఓపెనర్ హేల్స్ వరుసగా మూడు ఫోర్లు.. రాయ్ 4,6 కొట్టడంతో 23 పరుగులు వచ్చాయి. మూడో ఓవర్లో హేల్స్ (7 బంతుల్లో 17; 4 ఫోర్లు) అవుటవడంతో తొలి వికెట్‌కు 15 బంతుల్లోనే 48 పరుగులు వచ్చాయి. కొద్దిసేపటికే రాయ్ ఓ భారీ సిక్స్ అనంతరం అవుట్ అయ్యాడు. ఆ తర్వాత జో రూట్ బాధ్యతను తీసుకుని ఇన్నింగ్స్‌ను నడిపించాడు. భారీ షాట్లతో రెచ్చిపోయి 29 బంతుల్లో అర్ధ సెంచరీ చేశాడు. 19వ ఓవర్లో అవుటయ్యాడు. ఇక చివరి ఓవర్లో ఒక్క పరుగు కోసం హైడ్రామా నడిచినా మొయిన్ అలీ ఇంగ్లండ్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా ఎల్బీడబ్ల్యు (బి) అలీ 58; డి కాక్ (సి) హేల్స్ (బి) అలీ 52; డి విలియర్స్ (సి) మోర్గాన్ (బి) రషీద్ 16; డు ప్లెసిస్ (సి) రాయ్ (బి) విల్లీ 17; డుమిని నాటౌట్ 54; మిల్లర్ నాటౌట్ 28; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 229. వికెట్ల పతనం: 1-96, 2-114, 3-133, 4-169. బౌలింగ్: విల్లే 4-0-40-1; టోప్లే 2-0-33-0; అలీ 4-0-34-2; జోర్డాన్ 3-0-49-0; స్టోక్స్ 2-0-23-0; రషీద్ 4-0-35-1; రూట్ 1-0-13-0. ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) డి కాక్ (బి) అబాట్ 43; హేల్స్ ఎల్బీడబ్ల్యు (బి) అబాట్ 17; స్టోక్స్ (సి) మోరిస్ (బి) రబడా 15; జో రూట్ (సి) మిల్లర్ (బి) రబడా 83, మోర్గాన్ (బి) డుమిని 12; బట్లర్ (స్టంప్డ్) డి కాక్ (బి) తాహిర్ 21; అలీ నాటౌట్ 12; జోర్డాన్ (సి) డుమిని (బి) అబాట్ 5; విల్లే (రనౌట్) 0; రషీద్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 22; మొత్తం (19.4 ఓవర్లలో 8 వికెట్లకు) 230. వికెట్ల పతనం: 1-48, 2-71, 3-87, 4-111, 5-186, 6-219, 7-229, 8-229. బౌలింగ్: రబడా 4-0-50-2; స్టెయిన్ 2-0-35-0; అబాట్ 3.4-0-41-3; తాహిర్ 4-0-28-1; డుమిని 3-0-31-1; మోరిస్ 3-0-43-0. -
ప్రపంచ కప్ నుంచి మలింగ అవుట్
టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ శ్రీలంక జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ లసిత్ మలింగ గాయం కారణంగా ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకున్నాడు. మోకాలి గాయం తిరగబెట్టడంతో మలింగ ఈ నిర్ణయం తీసుకున్నాడు. -
ఆసిస్ విజయ లక్ష్యం 143
ధర్మశాల: టీ20 ప్రపంచకప్ లో భాగంగా ధర్మశాలలో హెచ్.పి.సి.ఎ స్టేడియంలో శుక్రవారం జరుగుతున్న మ్యాచ్‌లో ఆసిస్ ముందు 143 పరుగుల లక్ష్యాన్ని కివీస్ నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్లు గప్టిల్ 39(27బంతులు), విలియమ్సన్ 24 (20)లు మందు నుంచే దూకుడుగా ఆడి కివీస్ స్కోరు బోర్డు ను పరుగులు పెట్టించారు. ఈ ఇద్దరు 61 పరుగుల భాగస్వామ్యంతో శుభారంబాన్నిచ్చారు. అనంతరం వీరిద్దరూ వెనువెంటనే ఔటవ్వడంతో రన్ రేట్ ఓక్కసారిగా తగ్గిపోయింది. ఆ తర్వాత వచ్చిన వారిలో ఇలియట్ 27(20 బంతులు) మినహా ఎవరూ పెద్దగా రాణించకపోవడంతో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. మాక్స్ వెల్, ఫాల్కనర్లు తలా రెండు వికెట్లు తీయగా, వాట్సన్, మార్ష్‌లకు చెరో వికెట్ లభించింది. -
దిల్షాన్ అదుర్స్
కోల్‌కతా: ఇటీవలి వరుస పరాజయాలకు చెక్ పెడుతూ శ్రీలంక జట్టు తమ టి20 ప్రపంచకప్‌ను గెలుపుతో ఆరంభించింది. ఓపెనర్ దిల్షాన్ (56 బంతుల్లో 83 నాటౌట్; 8 ఫోర్లు; 3 సిక్సర్లు) సూపర్ బ్యాటింగ్‌తో మునుపటి ఫామ్‌ను అందుకుని చివరికంటా క్రీజులో నిలవడంతో గురువారం అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. గ్రూప్-1లో భాగంగా ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 153 పరుగులు చేసింది. ఆరంభంలో త్వరగా వికెట్లు పడినా కెప్టెన్ అస్ఘర్ స్టానిక్జాయ్ (47 బంతుల్లో 62; 3 ఫోర్లు; 4 సిక్సర్లు) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. సమీయుల్లా (14 బంతుల్లో 31; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) సహకారం అందించాడు. పెరీరాకు మూడు వికెట్లు, హెరాత్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బరిలోకి దిగిన లంక 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు 155 పరుగులు చేసింది. మాథ్యూస్ (10 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు; 1 సిక్స్) చివర్లో మెరిశాడు. నబీ, రషీద్‌లకు చెరో వికెట్ దక్కింది. స్కోరు వివరాలు అఫ్ఘానిస్తాన్ ఇన్నింగ్స్: షహజాద్ (సి) చమీర (బి) మాథ్యూస్ 8; నూర్ అలీ (బి) హెరాత్ 20; అస్ఘర్ (సి) చండిమాల్ (బి) పెరీరా 62; కరీమ్ (సి) చండిమాల్ (బి) పెరీరా 0; నబీ ఎల్బీడబ్ల్యు (బి) హెరాత్ 3; సమీయుల్లా (సి) పెరీరా (బి) కులశేఖర 31; షఫీకుల్లా (సి) తిరిమన్నె (బి) పెరీరా 5; దావ్లత్ నాటౌట్ 5; నజీబుల్లా నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1-12, 2-44, 3-46, 4-51, 5-112, 6-132, 7-136. బౌలింగ్: మాథ్యూస్ 3-0-17-1; కులశేఖర 4-0-43-1; చమీర 4-0-19-0; హెరాత్ 4-0-24-2; పెరీరా 4-0-33-3; సిరివర్ధన 1-0-16-0. శ్రీలంక ఇన్నింగ్స్: చండిమాల్ (సి) సమీయుల్లా (బి) నబీ 18; దిల్షాన్ నాటౌట్ 83; తిరిమన్నె (బి) రషీద్ ఖాన్ 6; పెరీరా (రనౌట్) 12; కపుగెడెర (రనౌట్) 10; మాథ్యూస్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.5 ఓవర్లలో 4 వికెట్లకు) 155. వికెట్ల పతనం: 1-41, 2-58, 3-85, 4-113. బౌలింగ్: కరీమ్ సాదిఖ్ 2-0-21-0; హమీద్ హసన్ 3.5-0-38-0; దవ్లత్ జద్రాన్ 3-0-31-0; నబీ 4-1-25-1; రషీద్ ఖాన్ 4-0-27-1; సమీయుల్లా 2-0-9-0. -
జిల్ జిల్ జి‘గేల్’
► అజేయ సెంచరీతో చెలరేగిన కరీబియన్ స్టార్ ► ఇంగ్లండ్‌పై విండీస్ ఘన విజయం టి20 ప్రపంచకప్ విధ్వంసానికి పరాకాష్ట... క్రిస్‌గేల్ ఎప్పుడు టి20 మ్యాచ్ ఆడినా చాలా సహజంగా వినిపించే పదం. ఈసారి అలాంటి విధ్వంసాన్ని మించిన విలయం సృష్టిస్తూ... బంతికే భయం పుట్టిస్తూ... ప్రత్యర్థుల వెన్నులో వణుకు తెప్పిస్తూ... మరోసారి క్రిస్‌గేల్ విశ్వరూపం చూపించాడు. టి20 ప్రపంచకప్ చరిత్రలో వేగవంతమైన సెంచరీతో వెస్టిండీస్‌కు ఘన విజయాన్ని అందించాడు. ముంబై: టి20ల్లో తను ఎంత ప్రమాదకరమో క్రిస్ గేల్ (48 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 11 సిక్సర్లు) మరోసారి నిరూపించాడు. కళ్ల ముందు భారీ లక్ష్యం ఉన్నా... పూనకం వచ్చినోడిలా ఇంగ్లిష్ బౌలర్ల భరతం పట్టాడు. సిక్సర్లు, బౌండరీల వర్షం కురిపిస్తూ టి20 ప్రపంచకప్‌లో అజేయ సెంచరీ నమోదు చేశాడు. ఫలితంగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో కరీబియన్ జట్టు 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. రూట్ (36 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బట్లర్ (20 బంతుల్లో 30; 3 సిక్సర్లు), హేల్స్ (26 బంతుల్లో 28; 4 ఫోర్లు), మోర్గాన్ (14 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) తలా కొన్ని పరుగులు చేశారు. 37 పరుగులకు తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్‌ను రూట్, హేల్స్ రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించి ఆదుకున్నారు. దీంతో తొలి పది ఓవర్లలో ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. మిడిలార్డర్లో బట్లర్, మోర్గాన్ నాలుగో వికెట్‌కు 3.3 ఓవర్లలోనే 38 పరుగులు జత చేశారు. ఓవరాల్‌గా చివరి మూడు ఓవర్లలో 40 పరుగులు వచ్చాయి. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన వెస్టిండీస్ 18.1 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే చార్లెస్ (0)ను అవుట్ చేసి ఇంగ్లండ్ ఆరంభంలోనే విండీస్‌కు షాకిచ్చింది. అయితే రెండో ఓవర్లో ఓ ఫోర్, సిక్సర్‌తో కాస్త కుదురుకున్న గేల్ ఆ తర్వాత తన విశ్వరూపం చూపాడు. సహచరులు మెల్లగా ఆడినా... తను మాత్రం సిక్సర్ల జోరు చూపెట్టాడు. శామ్యూల్స్ (27 బంతుల్లో 37; 8 ఫోర్లు) కూడా వరుస బౌండరీలు బాదడంతో పవర్‌ప్లే ముగిసేసరికి కరీబియన్ జట్టు స్కోరు 55/1గా మారింది. ఆరో ఓవర్లో శామ్యూల్స్ అవుట్‌కావడంతో రెండో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత రామ్‌దిన్ (12) నెమ్మదించినా... రషీద్, స్టోక్స్ ఓవర్లలో గేల్ నాలుగు సిక్సర్లు బాదాడు. కానీ వరుస ఓవర్లలో రామ్‌దిన్, డ్వేన్ బ్రేవో (2)లు అవుట్‌కావడంతో విండీస్ కాస్త తడబడింది. అయితే అలీ వేసిన 14వ ఓవర్లో గేల్ వరుసగా మూడు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టి మళ్లీ ఊపు తెచ్చాడు. రస్సెల్ (16 నాటౌట్) సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేస్తూ గేల్‌కు ఎక్కువగా బ్యాటింగ్ ఇవ్వడంతో ప్రత్యర్థి బౌలర్లు చేష్టలుడిగిపోయారు. 16వ ఓవర్లో మరో రెండు సిక్సర్లు బాదిన గేల్.... 47 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా రామ్‌దిన్‌తో మూడో వికెట్‌కు 46; రస్సెల్‌తో ఐదో వికెట్‌కు అజేయంగా 70 పరుగులు జత చేయడంతో విండీస్ 11 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకుంది. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) బద్రీ (బి) రస్సెల్ 15; హేల్స్ (బి) బెన్ 28; రూట్ (సి) టేలర్ (బి) రస్సెల్ 48; బట్లర్ (సి) బ్రాత్‌వైట్ (బి) బ్రేవో 30; మోర్గాన్ నాటౌట్ 27; స్టోక్స్ ఎల్బీడబ్ల్యు (బి) బ్రేవో 15; మొయిన్ అలీ రనౌట్ 7; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1-37; 2-92; 3-114; 4-152; 5-175; 6-182. బౌలింగ్: టేలర్ 3-0-30-0; బద్రీ 4-0-34-0; రస్సెల్ 4-0-36-2; డ్వేన్ బ్రేవో 4-0-41-2; బెన్ 3-0-23-1; బ్రాత్‌వైట్ 2-0-16-0. వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) అలీ (బి) విల్లే 0; గేల్ నాటౌట్ 100; శామ్యూల్స్ (సి) విల్లే (బి) రషీద్ 37; రామ్‌దిన్ (సి) రషీద్ (బి) అలీ 12; బ్రేవో (సి) హేల్స్ (బి) టోప్లే 2; రస్సెల్ నాటౌట్ 16; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: (18.1 ఓవర్లలో 4 వికెట్లకు) 183. వికెట్ల పతనం: 1-2; 2-57; 3-103; 4-113. బౌలింగ్: విల్లే 3-0-33-1; టోప్లే 2.1-0-22-1; జోర్డాన్ 4-0-24-0; స్టోక్స్ 3-0-42-0; రషీద్ 2-0-20-1; అలీ 4-0-38-1. విశేషాలు ► టి20 ప్రపంచకప్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (10) కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గతంలో తన పేరిట ఉన్న రికార్డును ఈ మ్యాచ్‌లో గేల్ (11 సిక్సర్లు) సవరించాడు. ► టి20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా గేల్ (98 సిక్సర్లు) నిలిచాడు. ఇంతకుముందు ఈ రికార్డు బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్-91 సిక్సర్లు) పేరిట ఉండేది. ► టి20 ప్రపంచకప్ చరిత్రలో ఇది ఎనిమిదో సెంచరీ. ఓవరాల్‌గా టి20 అంతర్జాతీయ పోటీల్లో ఇది 20వ సెంచరీ. ఈ 20 సెంచరీల్లో గేల్, మెకల్లమ్లవి రెండేసి ఉన్నాయి. ► టి20 ప్రపంచకప్‌లో తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డును గేల్ (47 బంతుల్లో) నెలకొల్పాడు. టి20 అంతర్జాతీయ పోటీల్లో ఇది సంయుక్తంగా మూడో వేగవంతమైన సెంచరీ. రిచర్డ్ లెవీ (దక్షిణాఫ్రికా-45 బంతుల్లో), డు ప్లెసిస్ (దక్షిణాఫ్రికా-46 బంతుల్లో), ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా-47 బంతుల్లో) వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. -
ఆఫ్రిది ఆల్‌రౌండ్ షో
► తొలి మ్యాచ్‌లో పాక్ ఘన విజయం ► 55 పరుగులతో బంగ్లాదేశ్ చిత్తు కోల్‌కతా: చాలా కాలంగా ఫామ్‌లో లేక ఇంటా బయటా రకరకాల విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది ఎట్టకేలకు స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచాడు. ఇటు బ్యాటింగ్‌లో, అటు బౌలింగ్‌లోనూ చెలరేగి పాకిస్తాన్‌కు టి20 ప్రపంచకప్‌లో శుభారంభాన్ని అందించాడు. ఆఫ్రిది ఆల్‌రౌండ్ షోతో పాక్ జట్టు బంగ్లాదేశ్‌ను 55 పరుగులతో చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు చేసింది. షార్జీల్ ఖాన్ (10 బంతుల్లో 18; 1 ఫోర్, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్నిచ్చాడు. మరో ఓపెనర్ షెహ్జాద్ (39 బంతుల్లో 52; 8 ఫోర్లు), హఫీజ్ (42 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగి ఆడటంతో పాటు రెండో వికెట్‌కు 95 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన ఆఫ్రిది (19 బంతుల్లో 49; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు వేగంతో పరుగులు చేశాడు. చివర్లో షోయబ్ మాలిక్ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కూడా రాణించంతో పాక్ 200 మార్కును దాటింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్, సన్నీ రెండేసి వికెట్లు తీశారు. బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 146 పరుగులు చేసి ఓడిపోయింది. తమీమ్ ఇక్బాల్ (20 బంతుల్లో 24; 2 సిక్సర్లు), షబ్బీర్ రహమాన్ (19 బంతుల్లో 25; 5 ఫోర్లు) నిలకడగా ఆడి రెండో వికెట్‌కు 43 పరుగులు జోడించడంతో బంగ్లా విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. అయితే ఆఫ్రిది ఈ ఇద్దరినీ అవుట్ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ తీశాడు. షకీబ్ (40 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్సర్) ఒక ఎండ్‌లో పోరాడినా మరో ఎండ్‌లో ఎవరూ నిలబడలేదు. పాక్ బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆఫ్రిదితో పాటు ఆమిర్ కూడా రెండు వికెట్లు తీశాడు. ఇటీవల ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో ఎదురైన ఓటమికి పాక్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. స్కోరు వివరాలు పాకిస్తాన్ ఇన్నింగ్స్: షార్జీల్ ఖాన్ (బి) సన్నీ 18; షెహ్జాద్ (సి) మహ్మదుల్లా (బి) షబ్బీర్ 52; హఫీజ్ (సి) సర్కార్ (బి) సన్నీ 64; ఆఫ్రిది (సి) మహ్మదుల్లా (బి) తస్కీన్ 49; ఉమర్ అక్మల్ (సి) షకీబ్ (బి) తస్కీన్ 0; షోయబ్ మాలిక్ నాటౌట్ 15; వసీమ్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1-26; 2-121; 3-163; 4-175; 5-198. బౌలింగ్: తస్కీన్ 4-0-32-2; అల్ అమిన్ 3-0-43-0; సన్నీ 4-0-34-2; షకీబ్ 4-0-39-0; మొర్తజా 3-0-41-0; షబ్బీర్ 2-0-11-1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (సి) వసీం (బి) ఆఫ్రిది 24; సౌమ్య సర్కార్ (బి) ఆమిర్ 0; షబ్బీర్ (బి) ఆఫ్రిది 25; షకీబ్ నాటౌట్ 50; మహ్మదుల్లా (సి) షార్జీల్ (బి) వసీం 4; ముష్ఫికర్ (సి) సర్ఫరాజ్ (బి) ఆమిర్ 18; మిథున్ (సి) ఆమిర్ (బి) ఇర్ఫాన్ 2; మొర్తజా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-1; 2-44; 3-58; 4-71; 5-110; 6-117. బౌలింగ్: ఆమిర్ 4-0-27-2; ఇర్ఫాన్ 4-0-30-1; రియాజ్ 4-0-31-0; ఆఫ్రిది 4-0-27-2; షోయబ్ మాలిక్ 2-0-14-0; ఇమాద్ వసీం 2-0-13-1. -
పాకిస్తాన్ నుంచి భారీగా...
కోల్‌కతాలో శనివారం భారత్, పాకిస్తాన్ల మధ్య జరిగే టి20 ప్రపంచకప్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు ఆ దేశం నుంచి భారీ బృందం రానుంది. ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్, ఇమ్రాన్ ఖాన్, షహర్యార్ ఖాన్‌లతో పాటు పీసీబీ నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు రానున్నారు. ఈ మ్యాచ్‌కు ముందు బెంగాల్ క్రికెట్ సంఘం సెహ్వాగ్‌ను సన్మానించనుంది. సచిన్, గవాస్కర్, కపిల్ తదితర దిగ్గజాలు కూడా మ్యాచ్‌కు వస్తారు. -
అలసత్వం తగదు
న్యూజిలాండ్ స్పిన్నర్ల ప్రతిభ కంటే మా బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యమే ఓటమికి ప్రధాన కారణం... తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత కెప్టెన్ ధోని అభిప్రాయం ఇది. అవును... మాకు ఎదురే లేదనే దృక్పథంతో క్రీజులోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపికలో చేసిన ఘోరమైన తప్పుల వల్లే కివీస్ చేతిలో అనూహ్య పరాభవం ఎదురయింది. అయితే తొలి మ్యాచ్‌లోనే ఇలాంటి షాక్ తగలడం కూడా ఒక రకంగా మంచిదే. అలసత్వం లేకుండా ఆడాలనే విషయం అర్థమైతే విజయాల బాటలోకి వెళ్లొచ్చు. నాగ్‌పూర్ నుంచి సాక్షి క్రీడాప్రతినిధి టి20 ప్రపంచకప్ తొలిసారి 2007లో భారత్ గెలిచినప్పుడు... ఆ టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలోనే భారత్ ఓడిపోయింది. కానీ కప్ గెలిచింది..! ఈసారి కూడా మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం... అంటే కప్ గెలుస్తాం... ఓ భారత క్రికెట్ అభిమాని, ఆశాజీవి అభిప్రాయం ఇది. మంచిదే ఇంత సానుకూల దృక్పథం క్రికెటర్లలో కూడా ఉంటే అంతకంటే కావలసింది లేదు. ఆటన్నాక గెలుపోటములు సహజం. కానీ ఎలాంటి దృక్పథం కనబరుస్తున్నామనేదే ముఖ్యం. గతంలో దారుణమైన పేస్ బౌలింగ్ పిచ్‌లు ఎదురైన ప్రతిసారీ భారత కెప్టెన్ లేదా టీమ్ డెరైక్టర్ నేరుగా తమ అసహనాన్ని ప్రదర్శించారు. కానీ ఈసారి మాత్రం నాగ్‌పూర్ పిచ్ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయలేని పరిస్థితి. ‘తొలి రోజు నుంచి బంతి స్పిన్ తిరగకూడదని ఏ రాజ్యాంగంలో రాసుంది?’ అంటూ దక్షిణాఫ్రికాతో నాగ్‌పూర్‌లో టెస్టు విజయం తర్వాత రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. కాబట్టి పిచ్ గురించి ఏమీ మాట్లాడకుండా... తర్వాతి మ్యాచ్‌ల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించే భారత బృందం కసరత్తులు చేస్తోంది. అడుగడుగునా నిర్లక్ష్యం భారత జట్టులో నెహ్రా, బుమ్రా మినహా అందరూ బ్యాటింగ్ చేయగలవారే. అయినా అందరూ కలిసి చేసింది కేవలం 79 పరుగులు. మరో 11 బంతులు మిగిలుండగానే ఇన్నింగ్స్ ముగియడం అంటే టి20లో దారుణమైన వైఫల్యంగా భావించాలి. పరిస్థితిని గమనించి, పిచ్‌ను అర్థం చేసుకుని షాట్స్ ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. స్వీప్ ఆడబోయి ఎల్బీగా అవుట్ కావడం శిఖర్ ధావన్‌కు ఇది మొదటిసారేం కాదు. పదేపదే ఇలాగే అవుటవుతున్నాడు. తొలి ఓవర్లో పెద్దగా స్పిన్ కాని బంతికే వికెట్ ఇవ్వడం ద్వారా ధావన్ భారీ తప్పు చేశాడు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ అంత ముందుకు వెళ్లి ఆడాల్సిన అవసరం అసలే లేదు. రెండు ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన తర్వాత వచ్చిన రైనా ఆడిన షాట్ నిర్లక్ష్యానికి పరాకాష్ట. చాలా క్యాజువల్‌గా బంతిని పుష్ చేసి వెనుదిరిగాడు. ఇక యువరాజ్, జడేజాల షాట్లలోనూ నిర్లక్ష్యమే ఎక్కువగా ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని విషయాన్ని గ్రహించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ అండర్సన్ దూకుడు తగ్గించుకుని ఆడాడుగానీ, భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ అలాంటి పరిణతి చూపలేకపోయారు. కిం కర్తవ్యం..? ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన కొంపలు మునిగిపోవు. కానీ ఒక్క బ్యాట్స్‌మన్ చివరి వరకూ నిలబడితే గెలిచే చోట ఓడిపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లందరికీ కావలసినంత అనుభవం ఉంది. ఐపీఎల్లో ప్రతి ఒక్కరూ హీరోలే. కాబట్టి ఈ ఓటమి నుంచి వీలైనంత తొందరగానే కోలుకోవచ్చు. ఇక తర్వాతి మ్యాచ్ ఆడాల్సింది పాకిస్తాన్‌తో. సహజంగానే దేశంలో ఈ మ్యాచ్ గురించి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పాకిస్తాన్‌తో ఆడే సమయంలో ఆటగాళ్లంతా రెట్టింపు కష్టపడతారు. కాబట్టి రెండో మ్యాచ్ సమయానికి కోలుకోవచ్చు. పాక్‌తో మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్‌లో బ్యాటింగ్ పిచ్ సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా మన ఆటతీరుకు అనుకూలించే వికెట్. అయితే చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుని కివీస్‌తో పరాజయాన్ని వీలైనంత త్వరగా మరచిపోవాలి. ఇకపై ప్రతి మ్యాచ్ చావోరేవోలాంటిదే. ఇలాంటి సమయంలో ధోనిసేన మరింత మెరుగ్గా ఆడుతుందని ఆశిద్దాం. టోర్నీలో తొలి మ్యాచ్ ఓడితే ఆపై అన్ని మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని కోసం మానసికంగా సిద్ధమయ్యాం. ప్రతీ మ్యాచ్ చావోరేవోలాగా మారిపోవడం వల్ల ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. ఈ ఓటమి ఒకందుకు మంచిదే. మాకూ, దేశానికి మేలు చేసింది. ఎందుకంటే జట్టు పరంగా, అభిమానులపరంగా అందరికీ ఒక హెచ్చరిక లభించినట్లయింది. ఇప్పుడు సరిగ్గా సమస్య ఏమిటి, లోపం ఎక్కడుంది తెలిసింది కాబట్టి మేం ఇకపై ఏం చేయాలో తెలుస్తుంది. దాని ప్రకారం వ్యూహాలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది. - ధోని -
విండీస్ మహిళల బోణీ
చెన్నై: టి20 ప్రపంచకప్ మహిళల ఈవెంట్లో వెస్టిండీస్ 4 పరుగుల స్వల్ప తేడాతో పాకిస్తాన్‌పై గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ మహిళలు 20 ఓవర్లలో 8 వికెట్లకు 103 పరుగులు చేశారు. స్టెఫాని టేలర్ (40) రాణించింది. పాక్ బౌలర్ ఆనమ్ అమిన్ 4 వికెట్లు తీసింది. తర్వాత పాక్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 99 పరుగులకే పరిమితమైంది. బిస్మా 22 పరుగులు చేసింది. -
నేలకు దించారు!
స్వదేశంలో టి20 ప్రపంచకప్‌లో భారత్‌ను ఫేవరెట్‌గా పరిగణించడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి... భారత బ్యాటింగ్‌లో డెప్త్. తొమ్మిదో నంబర్ ఆటగాడి వరకూ బ్యాటింగ్ చేయగలగడం, టాపార్డర్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటం. రెండు... సొంతగడ్డపై స్పిన్నర్లు బాగా ప్రభావం చూపుతారనే నమ్మకం. ఈ రెండు కారణాల వల్ల ప్రపంచం అంతా భారత్‌ను విజేతగా చూసింది. కానీ నాణ్యమైన స్పిన్నర్లు లేరని భావించిన న్యూజిలాండ్ భారత్‌ను ఈ స్థాయిలో చిత్తు చేస్తుందనేది ఊహకందని విషయం. శైలికి భిన్నంగా జట్టు... సాధారణంగా ఎలాంటి పిచ్‌ల మీద ఆడినా న్యూజిలాండ్ జట్టు పేస్ ఆయుధంగా జట్టును ఎంపిక చేస్తుంది. కానీ నాగ్‌పూర్ పిచ్‌ను చూసిన తర్వాత బౌల్ట్, సౌతీలాంటి సూపర్ స్టార్స్‌ను కూడా పక్కనబెట్టి ముగ్గురు స్పిన్నర్లను ఆడించింది. నాథన్ మెకల్లమ్, సాన్‌ట్నర్, సోధి... ఈ ముగ్గురూ అడపాదడపా మెరిసే వాళ్లే తప్ప ఎప్పుడూ నిలకడగా వికెట్లు సాధించిన బౌలర్లు కాదు. భారత్ జట్టులోని అశ్విన్, రవీంద్ర జడేజాలతో పోలిస్తే ఈ స్పిన్ త్రయం పెద్దగా ప్రభావం చూపుతుందనీ అనుకోలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెంటనే విలియమ్సన్ చెప్పినట్లు రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బాగా నెమ్మదించింది. దీనిని సమర్థంగా వినియోగించుకోవడంలో న్యూజిలాండ్ స్పిన్నర్లు విజయవంతమయ్యారు. ఓపిక లేకపోతే ఎలా? నిజానికి న్యూజిలాండ్ చేసిన 126 పరుగులు టి20 మ్యాచ్‌లో ఎలాంటి పిచ్‌పై అయినా గొప్ప స్కోరేం కాదు. కివీస్‌ను తక్కువ స్కోరుకు నియంత్రించడంలో భారత బౌలర్లు విజయవంతం అయ్యారు. పార్ట్‌టైమ్ స్పిన్నర్ రైనా బంతిని తిప్పినప్పుడే భారత బ్యాట్స్‌మెన్‌కు పిచ్‌పై అవగాహన వచ్చి ఉండాలి. ఈ పిచ్‌పై బ్యాటింగ్ కష్టమని తొలి ఓవర్లోనే భారత బ్యాట్స్‌మెన్‌కు అర్థమైంది. అయితే ఎవరూ ఓపిక చూపించలేకపోయారు. 26 పరుగులకే నాలుగు వికెట్లు పడ్డా కోహ్లి, ధోని ఉన్నంతసేపు భారత్ విజయంపై ఎవరికీ సందేహాలు లేవు. కానీ న్యూజిలాండ్ స్పిన్నర్లు నిజంగా అద్భుతం చేశారు. బంతిని అనూహ్యంగా తిప్పారు. ధోని చివరి వరకూ క్రీజులో నిలబడాలనే ఉద్దేశంతో కాస్త ‘బుర్ర’ వాడి బ్యాటింగ్ చేసినా, మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా మూర్ఖంగా అవుటయ్యారు. ఏమైనా తొలి మ్యాచ్‌లో ఘోర పరాజయం భారత జట్టును నేలకు దించింది. ఇన్నాళ్లూ తమకు ఎదురులేదనే ధీమాతో ఉన్న జట్టును ఆలోచనలో పడేసి ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన నష్టం లేదు. ఇక మిగిలిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఘన విజయాలు సాధిస్తే సెమీస్‌కు చేరొచ్చు. ఏమైనా ఈ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటారని ఆశిద్దాం. - సాక్షి క్రీడావిభాగం -
ఫటాఫట్ ఫ్యాక్ట్స్
1 కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఘనత ధోని (28) సొంతం 2 ఈ టోర్నీ చరిత్రలో భారత్ రెండుసార్లు ఫైనల్ చేరింది. 3 ప్రపంచకప్‌లలో ‘టై’ అయిన మ్యాచ్‌లు. 4 నలుగురు లంక ఆటగాళ్లు మలింగ, దిల్షాన్, జయవర్ధనే, సంగక్కర టోర్నీలో అత్యధిక (31) మ్యాచ్‌లు ఆడారు. 5 ఇప్పటివరకూ జరిగిన ప్రపంచకప్‌లు 6 అంతర్జాతీయ టి20ల్లోఇప్పటివరకూ టై అయిన మ్యాచ్‌లు 7 ప్రపంచకప్‌లో నమోదైన సెంచరీలు 8 మహిళల తొలి మూడు ప్రపంచకప్‌లలో ఎనిమిదేసి జట్లు మాత్రమే పాల్గొన్నాయి. 9 ఈ మెగా ఈవెంట్లో భారత మహిళల జట్టుకు అత్యధికంగా తొమ్మిది మ్యాచ్‌ల్లో మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించింది. 10ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు గేల్ (10) 11ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్ రోహిత్ 12మరో 12 వికెట్లు తీస్తే మలింగ ప్రపంచ కప్‌లో 50 వికెట్లు పూర్తి చేస్తాడు. 13 ప్రపంచకప్‌లో 90 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తిగత స్కోర్లు 13సార్లు వచ్చాయి. 14 మహిళల ప్రపంచకప్‌లో ఆసీస్ తర్వాత ఇంగ్లండ్, కివీస్ 14 మ్యాచ్‌ల్లో గెలిచాయి. 15 ఎక్కువ పరాజయాలు బంగ్లాదేశ్ (15) 16 ఈసారి టోర్నీలో పాల్గొన్న, పాల్గొంటున్న మొత్తం జట్లు 17 మహిళల టి20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా 17 సిక్సర్లు కొట్టిన బ్యాట్స్ఉమన్ దియాంద్రా డాటిన్ (వెస్టిండీస్) 18 ప్రపంచకప్‌లో భారత్ గెలిచిన మ్యాచ్‌లు. మొత్తం 28 మ్యాచ్‌లు ఆడింది. 9 ఓడిపోగా, ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 19 చరిత్రలో ఈ టోర్నీలో ఒక్కసారైనా ఆడిన జట్లు 20 మహిళల టి20 ప్రపంచకప్ పోటీల్లో ఒకే మ్యాచ్‌లో అత్యధికంగా 20 ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జట్టు న్యూజిలాండ్. గత విజేతలు సంవత్సరం వేదిక విజేత రన్నరప్ 2007 దక్షిణాఫ్రికా భారత్ పాకిస్తాన్ 2009 ఇంగ్లండ్ పాకిస్తాన్ శ్రీలంక 2010 వెస్టిండీస్ ఇంగ్లండ్ ఆస్ట్రేలియా 2012 శ్రీలంక వెస్టిండీస్ శ్రీలంక 2014 బంగ్లాదేశ్ శ్రీలంక భారత్ ప్రైజ్‌మనీ వివరాలు విజేత : రూ. 23 కోట్ల 44 లక్షలు రన్నరప్ : రూ. 10 కోట్లు సెమీస్‌లో ఓడిన జట్లకు : రూ. 5 కోట్లు లీగ్ దశలో గెలిచిన ఒక్కో మ్యాచ్‌కు : రూ. 33 లక్షల 48 వేలు టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుకు : రూ. 2 కోట్లు ప్రపంచకప్ హీరోలు అత్యధిక పరుగులు : జయవర్ధనే (1016) అత్యధిక వ్యక్తిగత స్కోరు : బ్రెండన్ మెకల్లమ్ (123) అత్యధిక వికెట్లు : మలింగ (38) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు : అజంతా మెండిస్ (8 పరుగులకు 6 వికెట్లు) ఒక జట్టు అత్యధిక స్కోరు : శ్రీలంక (266- కెన్యాపై) అలా జరిగింది! ►దక్షిణాఫ్రికా క్రికెటర్ వాన్ డెర్ మెర్వ్ టి20 ప్రపంచకప్‌లో రెండు దేశాల తరఫున ఆడాడు. ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన 2009 ప్రపంచకప్‌లో వాన్ డెర్ మెర్వ్ దక్షిణాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా... 2016 ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో నెదర్లాండ్స్ జట్టు తరఫున ఆడాడు. ►ఇప్పటివరకు ఐదుసార్లు టి20 ప్రపంచకప్ జరిగినా... ఆతిథ్య జట్టుకు టైటిల్ దక్కలేదు. ►డిఫెండింగ్ చాంపియన్ జట్లకు తదుపరి ప్రపంచకప్ కలసిరాలేదు. ఒకసారి విజేతగా నిలిచిన జట్టు తదుపరి టోర్నీలో కనీసం సెమీఫైనల్‌ను దాటలేకపోయింది. -
జోరు కొనసాగిస్తారా!
► నేడు బంగ్లాదేశ్‌తో భారత్ తొలిపోరు ► మహిళల టి20 ప్రపంచకప్ బెంగళూరు: పటిష్టమైన ఆస్ట్రేలియా, శ్రీలంకపై సిరీస్ విజయాలు సాధించిన భారత మహిళల జట్టు... కీలకమైన టి20 ప్రపంచకప్‌కు సిద్ధమైంది. నేడు (మంగళవారం) జరగనున్న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. గతంలో ఆడిన వరల్డ్‌కప్ టోర్నీల్లో రెండుసార్లు సెమీస్‌కు చేరిన భారత్... చివరి రెండుసార్లు మాత్రం గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. అయితే ఈసారి ఫామ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ టోర్నమెంట్లో మరోసారి సెమీస్‌కు చేరుకోవాలన్న లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. కెప్టెన్ మిథాలీ రాజ్‌తో పాటు ఏడుగురు క్రీడాకారిణిలకు 2014 టోర్నీలో ఆడిన అనుభవం ఉంది. ఇక జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్ గత నాలుగు టోర్నీల్లోనూ పాల్గొన్నారు. దీంతో సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకుని ఈసారి ఎలాగైనా కప్ చేజిక్కించుకోవాలని జట్టు మేనేజ్మెంట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మిథాలీ, వనిత, కౌర్, మందన సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఓపెనర్లు విఫలమైతే మిడిలార్డర్ ఒత్తిడికి లోనుకావడం కాస్త ప్రతికూలాంశంగా మారింది. బౌలింగ్‌లో పేసర్ జులన్ గోస్వామి, స్పిన్నర్ ఏక్తా బిస్త్, అనుజా పాటిల్‌ల బంతులను ఎదుర్కోవడం ప్రత్యర్థికి పెద్ద సవాలే. వీళ్లు ముగ్గురు రాణిస్తే భారత్ విజయం నల్లేరు మీద నడకే. మరోవైపు జహనరా నేతృత్వంలోని బంగ్లా జట్టు కూడా ఈ మధ్య కాలంలో బాగానే కుదురుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించే సత్తా లేకపోయినా సమష్టిగా ఆడుతోంది. బ్యాటింగ్‌లో కాస్త నిలకడను చూపెడితే ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడం ఖాయం. వార్మప్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై గెలవడం జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బౌలింగ్‌లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. పోరాటం చేసైనా ఈ మ్యాచ్‌లో భారత్‌కు షాకిచ్చి టోర్నీలో ముందంజ వేయాలని బంగ్లాదేశ్ ప్రయత్నాలు చేస్తోంది. మ.గం 3.30 నుంచి స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం -
‘ప్రాక్టీస్’లో నెగ్గిన పాకిస్తాన్
రాణించిన హఫీజ్ కోల్‌కతా: బౌలింగ్‌లో రాణించిన పాకిస్తాన్... టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో విజయం సాధించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. హఫీజ్ (49 బంతుల్లో 70 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. సర్ఫరాజ్ అహ్మద్ (13)తో మూడో వికెట్‌కు 39; ఉమర్ అక్మల్‌తో నాలుగో వికెట్‌కు 53 పరుగులు జత చేశాడు. కెప్టెన్ ఆఫ్రిది (0) తొలి బంతికే డకౌటయ్యాడు. తిసారా పెరీరా 2 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన లంకను లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమద్ వసీమ్ (4/25) వణికించాడు. దీంతో లంక 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్‌కు మరో విజయం ముంబై: టి20 ప్రపంచకప్ సన్నాహల్లో భాగంగా జరిగిన వార్మప్ మ్యాచ్‌లను ఇంగ్లండ్ విజయాలతో ముగించింది. తొలి వార్మప్‌లో పటిష్ట న్యూజిలాండ్‌ను దెబ్బతీయగా... తాజాగా సోమవారం స్థానిక బ్రబౌర్న్ స్టేడియంలో ముంబై క్రికెట్ సంఘం ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ 14 పరుగుల తేడాతో నెగ్గింది. ముందుగా ఇంగ్లండ్ జట్టు 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 177 పరుగులు చేసింది. జో రూట్ (34 బంతుల్లో 48; 3 ఫోర్లు; 2 సిక్సర్లు), అలెక్స్ హేల్స్ (23 బంతుల్లో 37; 7 ఫోర్లు) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ఎంసీఏ ఎలెవన్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 136 పరుగులు చేసింది. ఓపెనర్ జే బిస్టా (37 బంతుల్లో 51; 5 ఫోర్లు; 2 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (38 బంతుల్లో 45; 4 ఫోర్లు; 1 సిక్స్) ఆకట్టుకున్నారు. -
‘ఆఫ్రిది సిగ్గుపడాలి’
కరాచీ: భారతీయులు కురిపిస్తున్న ప్రేమ తమ దేశంలో కూడా చూడలేదని పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలను మాజీ సారథి జావెద్ మియాందాద్ తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవమానకరమని, అలా చేసిన ఆటగాళ్లు తమకు తామే సిగ్గుపడాలని విమర్శించారు. ‘పాకిస్తాన్ జట్టు టి20 ప్రపంచకప్ ఆడేందుకు మాత్రమే భారత్‌కు వెళ్లింది. కానీ ఆటగాళ్లు ఆ దేశాన్ని ఆకాశానికి ఎత్తడానికి కాదు. అసలు భారతీయులు మనకు ఏం ఇచ్చారు? పాక్ క్రికెట్‌కు ఏమైనా చేశారా? పాక్ క్రికెట్‌కు ఎన్నో ఏళ్లు సేవలందించిన వ్యక్తిగా ఆఫ్రిది మాటలు విని షాక్‌కు గురయ్యా’ అని మియాందాద్ పేర్కొన్నారు. మరోవైపు పాక్ ప్రజల మనోభావాలు దెబ్బతీశాడంటూ ఆఫ్రిదికి ఓ సీనియర్ న్యాయవాది లీగల్ నోటీసు కూడా పంపారు. -
తమీమ్ తడాఖా
ఒమన్‌పై విజయంతో ప్రధాన టోర్నీకి బంగ్లాదేశ్ ధర్మశాల: తమీమ్ ఇక్బాల్ (63 బంతుల్లో 103 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో... బంగ్లాదేశ్ టి20 ప్రపంచకప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. ఆదివారం జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 54 పరుగులు తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతి) ఒమన్‌పై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లా 20 ఓవర్లలో 2 వికెట్లకు 180 పరుగులు సాధించింది. సౌమ్య సర్కార్ (12) విఫలమైనా... తమీమ్ వీరవిహారం చేశాడు. షబ్బీర్ రెహమాన్ (26 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్‌కు 9.1 ఓవర్లలో 97; షకీబ్ (9 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి మూడో వికెట్‌కు 4 ఓవర్లలో అజేయంగా 41 పరుగులు జత చేశాడు. లక్ష్య ఛేదనకు దిగిన ఒమన్ ఇన్నింగ్స్‌కు ఏడు ఓవర్ల తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని 16 ఓవర్లలో 152 పరుగులుగా సవరించారు. ఆ తర్వాత మరోసారి వరుణుడు ప్రతాపం చూపడంతో లక్ష్యాన్ని 12 ఓవర్లలో 120 పరుగులుగా మార్చారు. చివరకు ఒమన్ 12 ఓవర్లలో 9 వికెట్లకు 65 పరుగులు చేసింది. జితేందర్ సింగ్ (25) మినహా మిగతావారు నిరాశపర్చారు. షకీబ్ 4 వికెట్లు తీశాడు. నెదర్లాండ్స్‌కు ఊరట మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 12 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై గెలిచింది. వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్‌ను 6 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 6 ఓవర్లలో 5 వికెట్లకు 59 పరుగులు చేసింది. మైబర్గ్ (27), బోరెన్ (14)లు రాణించారు. డాక్రిల్ 3 వికెట్లు తీశారు. తర్వాత ఐర్లాండ్ 6 ఓవర్లలో 7 వికెట్లకు 47 పరుగులు మాత్రమే సాధించింది. స్టిర్లింగ్ (15) టాప్ స్కోరర్. మికెరెన్ 4 వికెట్లు తీశాడు. -
ఆరు ఓవర్ల మ్యాచ్‌లో నెదర్లాండ్స్ విజయం
ధర్మశాల: టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ రౌండ్ గ్రూప్-ఏలో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 12 పరుగులతో విజయం సాధించింది. ఆదివారం ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఇన్నింగ్స్‌ను 6 ఓవర్ల చొప్పున కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్ నిర్ణీత 6 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. ఓపెనర్ మైబర్గ్ 18 బంతుల్లో 5 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. కెప్టెన్ బోరెన్ 14 పరుగులు చేశాడు. ఐర్లాండ్ బౌలర్ డాక్రెల్ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యసాధనలో ఐర్లాండ్ 6 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 47 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ స్టిర్లింగ్ (15) టాప్ స్కోరర్. నెదర్లాండ్స్ బౌలర్లు వాన్ మీకెరెన్ నాలుగు, వాండర్ మెర్వ్ రెండు వికెట్లు తీశారు. -
టి-20 ప్రపంచ కప్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం
ధర్మశాల: టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా గ్రూపు-ఏలో నెదర్లాండ్స్, ఐర్లాండ్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ధర్మశాలలో ఈ మ్యాచ్ ఆరంభం కావాల్సివుంది. ఐర్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే భారీ వర్షం రావడంతో మ్యాచ్ మొదలు కాలేదు. పిచ్, మైదానంపై కవర్లను కప్పి ఉంచారు. -
'బౌలింగ్ మా బలం.. భారత్‌తో ఫైట్‌కు రెడీ'
ఆమిర్ బెస్ట్ బౌలర్ అని వ్యాఖ్య కోల్‌కతా: స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఐదేళ్ల నిషేధం ఎదుర్కొని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేసిన ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ ఆమీర్‌పై షాహిద్ ఆఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. అతను ఉత్తమ బౌలర్ అని, టాప్ అంతర్జాతీయ పేసర్లలో అతడు ఇప్పటికే చోటు సంపాదించాడని పేర్కొన్నాడు. ఆమిర్ ను పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని ఇటీవల భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రోహిత్ వ్యాఖ్యల గురించి అతన్నే అడుగాలని, తమకు మాత్రం ఆమిర్ బెస్ట్ బౌలర్ అని పాకిస్థాన్ జట్టు కెప్టెన్ అఫ్రిది పేర్కొన్నాడు. వన్డేల్లోనైనా, ట్వంటీ-20ల్లోనైనా వరల్డ్ కప్‌లో ఇంతవరకు భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించలేదు. ఇది తమకు నెగిటివ్ అంశమే అయినా, సానుకూల దృక్పథంలో ముందుకుసాగుతామని, ఇటీవలికాలంలో భారత జట్టు మంచి ఆటతీరును కనబరుస్తున్నదని అతను పేర్కొన్నాడు. ఈ నెల 19న ఈడెన్ గార్డెన్స్‌లో చిరకాల ప్రత్యర్థులైన భారత్-పాక్ తలపడుతున్న సంగతి తెలిసిందే. మొదట పాక్ జట్టు 16వతేదీన క్వాలిఫైయింగ్‌లో అర్హత సాధించిన జట్టు (బంగ్లాదేశ్ కావొచ్చు)తో ఆడనుంది. ఆ తర్వాత భారత్‌తో పోరు ఉంటుంది. ఈ నేపథ్యంలో మొదటి మ్యాచుతోపాటు, రెండో మ్యాచును అత్యంత కీలకంగా భావిస్తున్నామని, ఈడెన్ గార్డెన్స్‌లోని పిచ్ ఇరుజట్లకూ అనుకూలించేవిధంగా ఉందని పేర్కొన్నాడు. దాయాది భారత్‌తో మ్యాచు కోసం మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నామని, ఇప్పటికే లాహోర్‌లో తగినంత శిక్షణ తీసుకున్న నేపథ్యంలో తమ జట్టు భారత్‌కు రావడం ఆలస్యమైనా.. ఇది తమ ఆటతీరుపై ప్రభావం చూపబోదని, డెఫినెట్‌గా తాము బాగా ఆడుతామని చెప్పాడు. భారత బ్యాటింగ్, పాకిస్థాన్ బౌలింగ్ మధ్య ప్రధానంగా పోరు ఉండనుందని, ఆమిర్, మహమ్మద్ ఇర్ఫాన్, మహమ్మద్ షమీతో తమ బౌలింగ్ ఆటాక్ పటిష్టంగా ఉందని, తమ బ్యాట్స్‌మెన్ బాగా ఆడి.. చక్కని స్కోరు చేస్తే.. దానిని కాపాడుకునే బౌలింగ్ సామర్థ్యం జట్టులో ఉందని అఫ్రిది ధీమా వ్యక్తం చేశాడు. -
ఇదొక్కటే లోటు
క్రికెట్లో అందుబాటులో ఉన్న అన్ని ఘనతలూ సాధించిన ఆసీస్ జట్టు ఇప్పటివరకూ ఒక్కసారి కూడా టి20 ప్రపంచకప్ గెలవలేదు. ఇదొక్కటే లోటుగా కనిపిస్తోందని, భారత్‌లో కప్ గెలవడం ద్వారా టి20ల్లోనూ చాంపియన్లుగా అవతరిస్తామని ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
పాక్ ఆటగాళ్లకు ఘనస్వాగతం
కోల్‌కతా: కొన్ని రోజులుగా కొనసాగిన అనిశ్చితి వీడడంతో టి20 ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్తాన్ జట్టు భారత్‌లో అడుగుపెట్టింది. 27 మందితో కూడిన పాక్ క్రికెట్ బృందం అబుదాబి ద్వారా శనివారం రాత్రి స్థానిక నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. భారత్‌లో భద్రతాపరమైన ఇబ్బందులున్నాయని ఆరోపించడంతో పాక్ ఆటగాళ్లను రెండు బస్సుల ద్వారా కట్టుదిట్టమైన సెక్యూరిటీతో వారు బస చేసే హోటల్‌కు తరలించారు. వందలాది సీఐఎస్ఎఫ్ సిబ్బందితో పాటు బ్లాక్ కమెండోస్ రక్షణగా ఉన్నారు. అయితే విమానాశ్రయం నుంచి వెలుపలికి వచ్చిన పాక్ క్రికెటర్లకు భారత అభిమానుల నుంచి అద్భుత స్వాగతమే లభించింది. ఆఫ్రిది బృందాన్ని చప్పట్లతో స్వాగతించగా ఆటగాళ్లు కూడా వారికి చేతులూపుతూ వెళ్లారు. సోమవారం ఈ జట్టు శ్రీలంకతో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. -
భారత మహిళల జట్టుకు రెండో విజయం
బెంగళూరు: మహిళల టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో శ్రీలంకపై నెగ్గింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన లంక 20 ఓవర్లలో 4 వికెట్లకు 125 పరుగులు చేసింది. సురంగిక (43 నాటౌట్), కౌసల్య (34 నాటౌట్), జయాంగి (18) మెరుగ్గా ఆడారు. తర్వాత భారత్ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 128 పరుగులు సాధించింది. స్మృతి మందన (42 నాటౌట్), వనిత (37), మిథాలీ రాజ్ (23), హర్మన్‌ప్రీత్ కౌర్ (12 నాటౌట్) రాణించారు. -
ఆఖర్లో పంచ్
► రెండోప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓడిన భారత్ 4 పరుగులతో దక్షిణాఫ్రికా గెలుపు ► చెలరేగిన డుమిని, డికాక్ ధావన్, రైనా, ధోనిల శ్రమ వృథా ముంబై: పొట్టి ఫార్మాట్లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్న భారత్‌కు టి20 ప్రపంచకప్‌కు ముందు పంచ్ పడింది. శనివారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోనిసేన 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 196 పరుగులు చేసింది. డుమిని (44 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), డికాక్ (33 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగిపోయారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌కు 77 పరుగులు జోడించారు. మిల్లర్ (18) ఓ మాదిరిగా ఆడినా మిగతా వారు విఫలమయ్యారు. పాండ్యా 3, షమీ, బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు మాత్రమే చేసింది. ధావన్ (53 బంతుల్లో 73; 10 ఫోర్లు), రైనా (26 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధోని (16 బంతుల్లో 30 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ధావన్, రైనా నాలుగో వికెట్‌కు 94 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే 24 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో ధావన్, రైనా రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగారు. ఈ దశలో వచ్చిన యువరాజ్ (16 నాటౌట్), ధోని వీరవిహారం చేశారు. 18 బంతుల్లో 41 పరుగులు చేశారు. ఇక ఆఖరి ఓవర్లో 14 పరుగులు చేయాల్సిన దశలో 9 పరుగులు మాత్రమే రాబట్టడంతో ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (సి) ధోని (బి) బుమ్రా 5; డికాక్ రిటైర్డ్ అవుట్ 56; డు ప్లెసిస్ (సి) జడేజా (బి) షమీ 12; డుమిని (సి) జడేజా (బి) షమీ 67; మిల్లర్ (సి) ధోని (బి) పాండ్యా 18; రోసోవ్ (సి) జడేజా (బి) పాండ్యా 11; వీస్ (సి) ధోని (బి) పాండ్యా 0; మోరిస్ (బి) బుమ్రా 14; బెహర్డిన్ రనౌట్ 5; అబాట్ నాటౌట్ 0; ఫాంగిసో నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 196. వికెట్ల పతనం: 1-15; 2-33; 3-110; 4-148; 5-170; 6-171; 7-186; 8-194; 9-195. బౌలింగ్: హర్భజన్ 4-0-27-0; షమీ 4-0-37-2; బుమ్రా 4-0-51-2; పాండ్యా 4-0-36-3; నేగి 1-0-12-0; జడేజా 2-0-18-0; రైనా 1-0-13-0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీడబ్ల్యు (బి) అబాట్ 10; ధావన్ రిటైర్డ్ అవుట్ 73; కోహ్లి (సి) డికాక్ (బి) స్టెయిన్ 1; రహానే రనౌట్ 11; రైనా రిటైర్డ్ అవుట్ 41; యువరాజ్ నాటౌట్ 16; ధోని నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 192. వికెట్ల పతనం: 1-11; 2-16; 3-48; 4-142; 5-142. బౌలింగ్: స్టెయిన్ 4-0-36-1; అబాట్ 4-0-32-1; మోరిస్ 4-0-43-0; వీస్ 2-0-26-0; తాహిర్ 3-0-25-1; డుమిని 2-0-16-0; ఫాంగిసో 1-0-13-0.