ప్రపంచంలో ఎప్పుడైనా...ఎక్కడైనా...
► ఈడెన్‌లోనూ పాకిస్తాన్‌పై భారత్ విజయం
► చెలరేగిన విరాట్ కోహ్లి
భారత్ మళ్లీ గర్జించింది... విశ్వ వేదికపై మనల్ని ఓడించడం పక్కవాడి, పగవాడి తరం కాదని మరో సారి నిరూపించింది. చరిత్ర మార్చడం అంత సులువు కాదని, అదిప్పుడు శిలాక్షరంగా మారిపోయిందని ప్రత్యర్థికి గట్టిగా గుర్తు చేసింది. ఈడెన్‌లో శత సహస్ర సంఖ్యలో ‘హిందుస్తాన్ జిందాబాద్’ అని వినిపిస్తుండగా, సగర్వంగా మరో విజయాన్ని అందుకుంది.
ఈ మైదానం మాకు అచ్చి వచ్చిందని చెప్పుకుంటూ ఆటకు ముందే సంబరపడిన పాకిస్తాన్‌ను ధోని సేన దుమ్ము దులిపింది. ఇక్కడే కాదు ప్రపంచంలో భారత్‌తో ఎక్కడ ప్రపంచకప్ మ్యాచ్ జరిగినా విజయం వారి వాకిలి వైపు కూడా తిరిగి చూడదని ఆ జట్టుకు అర్థమయ్యేలా గట్టి దెబ్బ కొట్టిన మన జట్టు పనిలో పనిగా సొంతగడ్డపై ప్రపంచకప్‌లో మనమేంటో చూపిస్తూ రేసులో నిలబడింది.
కొలంబో, ఢాకా, సిడ్నీ, కోల్‌కతా... మైదానం ఏదైనా ‘పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటే నేనే గెలిపిస్తాను’ అని విరాట్ కోహ్లి మరోసారి ఢంకా బజాయించి చెప్పాడు. దాయాదిపై తన ఘన రికార్డును నిలబెట్టుకున్నాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి ఆందోళనతో ఉన్న సమయంలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత్‌కుచిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
కోల్‌కతానుంచి సాక్షి క్రీడా ప్రతినిధి టి20 ప్రపంచకప్‌లో భారత్ మళ్లీ రేస్‌లోకి వచ్చేసింది. గత మ్యాచ్ ఓటమి నుంచి తొందరగానే కోలుకున్న ధోనిసేన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ని చిత్తు చేసి వరల్డ్‌కప్‌లలో తమ రికార్డును నిలబెట్టుకుంది. శనివారం ఇక్కడి ఈడెన్ గార్డెన్స్ మైదానంలో వర్షం కారణంగా 18 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 18 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. మాలిక్ (16 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), అక్మల్ (16 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్) కీలక భాగస్వామ్యంతో ఆ జట్టు ఈ మాత్రం పరుగులైనా చేయగలిగింది.
అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 4 వికెట్లకు 119 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (37 బంతుల్లో 55 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్ ) అర్ధ సెంచరీతో చెలరేగగా, యువరాజ్ (23 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగోవికెట్‌కు 44 బంతుల్లోనే 61 పరుగులు జోడించడం విశేషం. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఈ నెల 23న బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
కీలక భాగస్వామ్యం
గింగిరాలు తిరుగుతున్న అశ్విన్ బంతి, అనూహ్య బౌన్స్... చూస్తే ఈడెన్ గార్డెన్ కూడా నాగ్‌పూర్ పిచ్‌లాగే అనిపించింది. పాక్ జట్టు కూడా తడబడుతూనే తమ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ప్రారంభించింది. మూడో ఓవర్ చివరి బంతికి గానీ ఆ జట్టు తొలి బౌండరీని కొట్టలేకపోయింది. భారత బౌలింగ్ కట్టుదిట్టంగా సాగడంతో పరుగులు తీయడానికి తీవ్రంగా ఇబ్బంది పడిన ఓపెనర్లు షర్జీల్ (24 బంతుల్లో 17; 2 ఫోర్లు), షహజాద్ (28 బంతుల్లో 25; 3 ఫోర్లు) తక్కువ వ్యవధిలోనే వెనుదిరిగారు. గత మ్యాచ్‌లో బంగ్లాపై చెలరేగిన ఆఫ్రిది (8) ఒక్కో బంతిని ఆడేందుకు శ్రమించి చివరకు పాండ్యా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ దశలో మాలిక్, అక్మల్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.
ఎట్టకేలకు పాండ్యా వేసిన 14వ ఓవర్లో రెండు సిక్సర్లతో 15 పరుగులు రావడంతో పాక్ పరిస్థితి కాస్త మెరుగైంది. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 4 ఓవర్లలోనే 41 పరుగులు జోడించారు. చివర్లో మళ్లీ వేగం తగ్గిన పాక్ ఆఖరి 3 ఓవర్లలో 23 పరుగులతోనే సరిపెట్టుకుంది. పిచ్‌పై తేమను ఉపయోగించుకోవడంతో పాటు వర్షం పడితే లక్ష్య ఛేదనపై స్పష్టత ఉంటుందని టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోగా... పాక్ మాత్రం లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇమాద్ స్థానంలో అనూహ్యంగా నాలుగో పేసర్‌గా సమీని ఎంచుకుంది.
సూపర్ కోహ్లి: స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో మళ్లీ న్యూజిలాండ్ మ్యాచ్ అనుభవాన్నే గుర్తుకు తెచ్చింది. ఇర్ఫాన్ ఓవర్లో 2 ఫోర్లు బాదిన తర్వాత రోహిత్ (10) ఆమిర్ చక్కటి బంతికి వెనుదిరగ్గా, ఆ వెంటనే సమీ వరుస బంతుల్లో ధావన్ (6), రైనా (0)లను క్లీన్‌బౌల్డ్ చేసి ఒక్కసారిగా అలజడి రేపాడు. కానీ ఎప్పటిలాగే కోహ్లి ముందుండి నడిపించాడు. తనదైన శైలిలో జాగ్రత్తగా ఆరంభం చేసి నిలదొక్కుకున్న తర్వాత దూకుడు కనబర్చాడు. పాక్ బౌలర్లు ఒక్కసారి కూడా కోహ్లిని కనీసం ఇబ్బంది పెట్టలేకపోయారు.
మరో వైపు యువరాజ్‌నుంచి కోహ్లికి చక్కటి సహకారం లభించింది. చాలా కాలం తర్వాత యువరాజ్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు ప్రతీ బౌలర్‌ను సమర్థంగా ఎదుర్కోవడంతో పరుగులు రావడంలో ఎలాంటి ఇబ్బంది లేకపోయింది. చివర్లో అనవసర షాట్‌తో యువీ వెనుదిరిగినా... కోహ్లి, ధోని (13 నాటౌట్) మరో 13 బంతులు మిగిలి ఉండగానే ముగించారు.
స్కోరు వివరాలు
పాకిస్తాన్ ఇన్నింగ్స్: షర్జీల్ (సి) పాండ్యా (బి) రైనా 17; షహజాద్ (సి) జడేజా (బి) బుమ్రా 25; ఆఫ్రిది (సి) కోహ్లి (బి) పాండ్యా 8; అక్మల్ (సి) ధోని (బి) జడేజా 22; మాలిక్ (సి) అశ్విన్ (బి) నెహ్రా 26; సర్ఫరాజ్ (నాటౌట్) 8; హఫీజ్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (18 ఓవర్లలో 5 వికెట్లకు) 118.
వికెట్ల పతనం: 1-38; 2-46; 3-60; 4-101; 5-105.
బౌలింగ్: నెహ్రా 4-0-20-1; అశ్విన్ 3-0-12-0; బుమ్రా 4-0-32-1; జడేజా 4-0-20-1; రైనా 1-0-4-1; పాండ్యా 2-0-25-1.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) మాలిక్ (బి) ఆమిర్ 10; ధావన్ (బి) సమీ 6; కోహ్లి (నాటౌట్) 55; రైనా (బి) సమీ 0; యువరాజ్ (సి) సమీ (బి) రియాజ్ 24; ధోని (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (15.5 ఓవర్లలో 4 వికెట్లకు) 119.
వికెట్ల పతనం: 1-14; 2-23; 3-23; 4-84.
బౌలింగ్: ఆమిర్ 3-1-11-1; ఇర్ఫాన్ 2.5-0-25-0; సమీ 2-0-17-2; ఆఫ్రిది 4-0-25-0; మాలిక్ 2-0-22-0; రియాజ్ 2-0-16-1.
సచిన్‌కు వందనం
అర్ధ సెంచరీ సాధించినప్పుడు విరాట్ కోహ్లి ఏదో బ్యాట్ చూపించడంతో ఆగిపోకుండా ప్రేక్షకుల వైపు చూస్తూ కిందికి వంగుతూ వందనం చేయడం అందరికీ కనిపించింది. అప్పటికే జట్టు విజయం దాదాపు ఖాయమైన స్థితిలో హాఫ్ సెంచరీకి ఈ రకంగా భిన్నంగా తన ఆనందాన్ని వ్యక్తం చేయడం ఆసక్తిని కలిగించింది. అయితే అది తాను ఎంతో అభిమానించే దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోసమని కోహ్లి చెప్పాడు. సచిన్ ఎన్నో గొప్ప చారిత్రాత్మక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారని, ఆయన సమక్షంలో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలని ఎంతో కాలంగా కోరుకున్నట్లు కోహ్లి చెప్పాడు. ఇప్పుడు ఇది సరైన సందర్భంగా తాను భావించానని, అందుకే సచిన్‌కు ఈ తరహాలో వందనం చేసినట్లు అతను వెల్లడించాడు. ప్రతిగా సచిన్ కూడా చిరునవ్వుతో విరాట్‌కు బదులిచ్చారు.
11 ప్రపంచకప్‌లలో (వన్డేలు, టీ20లు కలిపి) పాకిస్తాన్‌పై భారత్ గెలవడం ఇది 11వ సారి.