సొంతగడ్డపై భారత్ ప్రమాదకారి
వచ్చే టి20 ప్రపంచకప్‌లో
ధోనిసేన ఫేవరెట్
విండీస్ బ్యాటింగ్ దిగ్గజం లారా అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న టి20 ప్రపంచకప్‌లో భారత్ కూడా గట్టిపోటీదారని విండీస్ బ్యాటింగ్ దిగ్గజం బ్రియాన్ లారా అభిప్రాయపడ్డాడు. టోర్నీలో ధోనిసేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుందన్నాడు. ‘స్వదేశంలో భారత్ జట్టు చాలా ప్రమాదకరమైంది. 2011లో ధోని నేతృత్వంలోని జట్టు వరల్డ్‌కప్ గెలవడమే ఇందుకు నిదర్శనం. జట్టులో కుర్రాళ్లతో పాటు భిన్నమైన ఆటగాళ్లు ఉన్నారు. సొంతగడ్డపై ఒత్తిడి అనేది ఎప్పుడూ ఉంటుంది. అయినప్పటికీ కుర్రాళ్లు దాన్ని జయిస్తారు. ఓవరాల్‌గా భారత్‌కు మరోసారి వరల్డ్‌కప్ గెలిచే మంచి అవకాశం వచ్చింది’ అని లారా పేర్కొన్నాడు.
ప్రస్తుత విండీస్ జట్టుకు తను కోచ్‌గా, మెంటార్‌గా పనిచేసినా పెద్దగా మార్పులేమీ ఉండబోవని స్పష్టం చేశాడు. ‘సమస్య మూలం చాలా లోతుగా ఉంది. మౌలిక వసతులు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను బాధ్యతలు స్వీకరించినా సమర్థంగా పని చేయలేను. ఎంతటి సమర్థుడైనా.. ఇప్పటికిప్పుడు తన మ్యాజిక్‌తో ఫలితాలను చూపెడతాడని భావించడంలేదు. అయితే విండీస్ జట్టులో కొంత మంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు ఉన్నారు. ఇప్పుడు వస్తున్న కుర్రాళ్లలో నైపుణ్యానికి కొదువలేదు.
బోర్డు పాలన బాగుంటే వాళ్లతో కలిసి అద్భుతాలు చేయొచ్చు. సమీప భవిష్యత్‌లోనైనా ఇది నెరవేరుతుందేమో చూడాలి’ అని లారా వ్యాఖ్యానించాడు. భారత్‌లో పర్యటించడం తనకు చాలా ఆనందాన్నిస్తుందన్నాడు. ‘క్రికెట్ ఆడే రోజుల్లో కూడా భారత్ అంటే నాకు చాలా ఇష్టం. భారత్‌లో అభిమానం ఎలా ఉంటుందో నా స్నేహితులు సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, ధోని, కోహ్లిలను చూస్తేనే అర్థమవుతుంది’ అని ఈ విండీస్ మాజీ కెప్టెన్ వివరించాడు.