వర్ణ రంజితం కావాలి | to day Bangladesh and India match Dhee | Sakshi
Sakshi News home page

వర్ణ రంజితం కావాలి

Published Wed, Mar 23 2016 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 8:20 PM

వర్ణ రంజితం కావాలి

వర్ణ రంజితం కావాలి

నేడు బంగ్లాదేశ్‌తో భారత్ ఢీ నెట్న్‌ర్రేట్‌పై ధోనిసేన దృష్టి
 
తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగానే... తెల్ల గోడ వెలిసిపోయినట్లు అనిపించింది. మన నీలి రంగు మెరుపు తగ్గిందనే ఆందోళన కలిగింది. తర్వాత మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేయగానే... ప్రత్యర్థిపై పచ్చరంగు చల్లి బల్లే బల్లే అంటూ గంతులేశాం. ఇప్పుడు ప్రత్యర్థిపై అన్ని రంగులూ కలిపి బలంగా చల్లాల్సిన సమయం వచ్చింది. ఏదో సాదాసీదా గెలుపు గులాల్‌తో సరిపెట్టకుండా రంగ్‌దే బసంతి అంటూ రంగుల్లో ముంచెత్తాలి. హోళీ వేల యావత్ దేశం ధోనిసేన నుంచి ‘కలర్‌ఫుల్’ విజయాన్ని ఆశిస్తోంది.

 పాక్‌ను కసితీరా ఓడించినా... మరో పక్క అడపాదడపా విజయాలతో పక్కలో బల్లెంలా మారుతున్న బంగ్లాదేశ్‌నూ తక్కువ అంచనా వేయకూడదు. తర్వాతి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఉన్నందున ఈ మ్యాచ్‌లో బంగ్లాపై భారీ విజయం సాధించి నెట్న్‌ర్రేట్‌ను మెరుగు పరుచుకోవాలి. సెమీస్ బెర్త్‌లను ఖరారు చేసే ప్రక్రియలో నెట్న్‌ర్రేట్ కూడా అవసరం కావచ్చు మరి.

 
బెంగళూరునుంచి సాక్షి క్రీడా ప్రతినిధి:  టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు తమ మూడో లీగ్ మ్యాచ్‌కు సన్నద్ధమైంది. నేడు (బుధవారం) ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో భారత్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడుతుంది. ఒక మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్‌లో ఓడిన ధోనిసేన ఇక్కడా నెగ్గితే సెమీస్ అవకాశాలు మరింత మెరుగవుతాయి. మరో వైపు ఇప్పటికే రెండు ఓటములు మూటగట్టుకున్న బంగ్లా ఓడితే అధికారికంగా టోర్నీనుంచి నిష్ర్కమిస్తుంది. భారత్ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడాల్సి ఉండటంతో ఈ మ్యాచ్‌లో విజయంతో పాటు సాధ్యమైనంతగా రన్‌రేట్‌ను పెంచుకోవాలని కూడా భారత జట్టు భావిస్తోంది.

 రైనా, ధావన్‌లపై ప్రత్యేక దృష్టి: బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు భారత ఆటగాళ్లు మంగళవారం నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. మూడు గంటల పాటు క్రికెటర్లు ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు. అయితే టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి ప్రత్యేకంగా మరో నెట్స్‌లో ధావన్, రైనాల చేత ప్రాక్టీస్ చేయించారు. అంతా బాగుందని చెబుతున్నా ప్రస్తుతం జట్టు ఫామ్, ఆటతీరును చూస్తే  వీరిద్దరు రాణించడమే ముఖ్యమని జట్టు గుర్తించినట్లుంది. వీరిద్దరికి అన్ని రకాల బౌలింగ్‌లు వేయిస్తూ శాస్త్రి సాధనను పర్యవేక్షించారు. అందరికంటే ముందుగా వచ్చిన ధావన్ ఆఖర్లో వెళ్లగా, రైనా కూడా సుదీర్ఘ సమయం పాటు సాధన చేశాడు.

అశ్విన్ బౌలింగ్‌కంటే బ్యాటింగ్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టడం కనిపించింది.  ఆసియా కప్‌లో ఇటీవలే రెండు సార్లు బంగ్లాదేశ్‌తో తలపడి గెలవడం, ఇరు జట్లలో పెద్దగా మార్పులు కూడా లేకపోవడంతో టీమిండియా అదే జోరులో హ్యట్రిక్ విజయంపై దృష్టి పెట్టింది. జట్టులో మార్పులకు కూడా ఇక ఏ మాత్రం అవకాశం లేదు.  

నైరాశ్యంలో బంగ్లాదేశ్: సోమవారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన బంగ్లాదేశ్ భారత్‌తో మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. ఐసీసీ నిషేధం కారణంగా ఇద్దరు కీలక ఆటగాళ్లను కోల్పోవడంతో గత మ్యాచ్‌లో టాస్ సమయంలోనే కెప్టెన్ మషఫ్ ్రమొర్తజా మొహంలో ఒకింత నైరాశ్యం కనిపించింది. ప్రధాన బౌలర్ అయి ఉండీ అతను ఒక్క ఓవర్ మాత్రమే వేయడం అతని మానసిక పరిస్థితిని సూచిస్తోంది. జట్టు పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్లు అనిపిస్తోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఓడిన బంగ్లాదేశ్ ఇక ముందంజ వేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

గత కొంత కాలంగా బంగ్లాదేశ్ ఫామ్, దూకుడు చూస్తే భారత్‌కు కూడా గట్టి పోటీ ఇవ్వగల జట్టుగా కనిపించింది. అయితే ఈ వరల్డ్‌కప్‌లో పరిస్థితి మారిపోయింది. పాకిస్తాన్ చేతిలో చిత్తుగా ఓడిన జట్టు, ఆస్ట్రేలియాకు తలవంచింది. ఆసీస్‌తో ఆడని తమీమ్ ఫిట్‌నెస్‌పై  ఇంకా స్పష్టత లేకపోవడంతో మరోసారి బంగ్లా సీనియర్ షకీబ్‌పై ఆధార పడుతోంది.
   
 జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, కోహ్లి, రైనా, యువరాజ్, పాండ్యా, జడేజా, అశ్విన్, నెహ్రా, బుమ్రా.
బంగ్లాదేశ్: మొర్తజా (కెప్టెన్), మిథున్, సర్కార్, షబ్బీర్, షకీబ్, షువగత, మహ్ముదుల్లా, ముష్ఫికర్, సక్లాయిన్, అల్ అమీన్, ముస్తఫిజుర్.
 
 నేనూ... నా నోకియా...
ఆశిష్ నెహ్రా సాధారణంగా పెద్దగా మీడియాలో హడావిడి చేయడు. గంభీరంగా ఉంటూ తన పనేదో తాను చేసుకునే రకం. అయితే మంగళవారం మీడియా సమావేశంలో అతను చేసిన వ్యాఖ్య నవ్వులు పంచింది. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో భారత్, బంగ్లాదేశ్  ఆటగాళ్ల ఫోటోలతో రచ్చ చేస్తున్న ధోరణి పెరిగిపోవడంపై ప్రశ్నకు అతను సరదాగా జవాబిచ్చాడు.  ‘మీరు ఎవరిని అడుగుతున్నారో చూడండి. నాకు ఫేస్‌బుక్ అకౌంట్ లేదు. ట్విట్టర్, ఇన్‌స్టగ్రామ్ వాడను. ఇప్పటికీ ఎప్పటిదో నోకియా ఫోన్‌నే వాడుతున్నాను. కాస్త పాతకాలం మనిషిలాగా కనిపించవచ్చు కానీ ఇలాగే ఉంటాను. పత్రికలూ చదవను కాబట్టి  సోషల్ మీడియా సంగతులు నేను  పట్టించుకోను’  అని నెహ్రా అన్నాడు.
 
4  భారత్, బంగ్లాదేశ్ మధ్య ఇప్పటి వరకూ నాలుగు టి20లు జరిగితే అన్నింటిలోనూ భారత్ గెలిచింది.

 
 పిచ్, వాతావరణం
 చిన్నస్వామి సాధారణంగా బ్యాటింగ్‌కు మంచి వేదిక. విండీస్, లంక మధ్య జరిగిన మ్యాచ్ పిచ్‌నే  దీని కోసం ఉపయోగిస్తున్నారు. భారీ స్కోర్లకు అవకాశం ఉంది. ముందు రోజు నగరంలో వాతావరణం కాస్త చల్లబడినా... వర్షం వల్ల మ్యాచ్‌కు అంతరాయం ఉండకపోవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement