ప్రాణం లేచొచ్చింది! | India win one-run Bangladesh | Sakshi
Sakshi News home page

ప్రాణం లేచొచ్చింది!

Published Thu, Mar 24 2016 12:14 AM | Last Updated on Sun, Sep 3 2017 8:24 PM

ప్రాణం లేచొచ్చింది!

ప్రాణం లేచొచ్చింది!

ఒక్క పరుగుతో బంగ్లాదేశ్‌పై గెలిచిన భారత్
చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లతో సంచలనం
టి20 ప్రపంచకప్‌లో సెమీస్ ఆశలు సజీవం
తర్వాతి మ్యాచ్ ఆదివారం ఆస్ట్రేలియాతో

 
కోట్లాది మంది ఊపిరి బిగపట్టి చూస్తున్న క్షణం.. లక్షలాది గొంతుకలు మూగబోతున్న తరుణం... వేలాది కనులు రెప్పార్పకుండా చూసిన సమయం... ఏదో జరుగుతోంది.... ఏదేదో అయిపోతోంది. ఊహకందని స్థాయిలో... ఊహించని రీతిలో... కళ్లముందే భారత్ స్వప్నం చెదిరిపోతోంది  అభిమానుల మనసు మూగబోవడానికి ఇక మిగిలింది క్షణమే...స్వదేశంలో ధోనిసేన పరువు పాతాళంలో కలవడానికి మిగిలిందీ ఆ క్షణమే... కానీ ఆ ఒక్క క్షణమే.... భారత జట్టు తల రాతను తిరగరాసింది.

జరిగింది కలో.. అద్భుతమో తెలుసుకునే లోపే... ఆశకు, నిరాశకు మధ్య ఊగిసలాడుతున్న ఎన్నో ప్రాణాలు లేచి వచ్చేలా మాయ జరిగింది.చివరి మూడు బంతులకు మూడు వికెట్లు తీసి... చేజారిన మ్యాచ్‌ను రెండు చేతులా భారత్ ఒడిసిపట్టింది. కేవలం రెండు పరుగులు చేయలేక బంగ్లా గుండె పగిలింది. టి20 ప్రపంచకప్‌లో భారత్ ఒక్క పరుగుతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.సెమీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.

 
 బెంగళూరునుంచి సాక్షి క్రీడా ప్రతినిధి
నరాలు తెగే ఉత్కంఠ... చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకూ విజయం దోబూచులాడిన వేళ... భారత జట్టు ఒత్తిడిని జయించింది. చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి గట్టెక్కింది. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ఒక్క పరుగు తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది.  టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 146 పరుగులు చేసింది. సురేశ్ రైనా (23 బంతుల్లో 30; 1 ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులకు పరిమితమయింది. తమీమ్ ఇక్బాల్ (32 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించాడు. 2 కీలక వికెట్లు తీసిన అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీఫైనల్‌కు చేరుతుంది.


కనిపించని దూకుడు:  తొలి ఐదు ఓవర్లలో 27 పరుగులు... తర్వాతి ఓవర్లో 15 పరుగులతో పాటు రోహిత్ శర్మ అవుట్. ఇదీ పవర్‌ప్లేలో భారత జట్టు ఆట కొనసాగిన తీరు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు దూకుడైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ధావన్ (22 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ (16 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్స్) ధాటిని ప్రదర్శించకుండా జాగ్రత్తగా ఆడారు. ముస్తఫిజుర్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్, ధావన్ చెరో సిక్సర్ బాది వేగం పెంచగా... చివరి బంతికి రోహిత్‌ను అవుట్ చేసి బౌలర్ ప్రతీకారం తీర్చుకున్నాడు. మరుసటి ఓవర్లోనే చక్కటి బంతితో షకీబ్... ధావన్‌ను పెవిలియన్ పంపించాడు. కోహ్లి, రైనా మూడో వికెట్‌కు 50 పరుగులు జోడించిన అనంతరం మరోసారి బంగ్లా ఆధిక్యం ప్రదర్శించింది. షువగత వేసిన 14వ ఓవర్లో 17 పరుగులు రాబట్టి భారత్ దూకుడు ప్రదర్శించినా...అదే ఓవర్లో కోహ్లి (24 బంతుల్లో 24; 1 సిక్స్) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం వరుస బంతుల్లో రైనా, పాండ్యా (7 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్)లను అమీన్ అవుట్ చేయగా, యువరాజ్ (3) విఫలమయ్యాడు.  చివర్లో ధోని (13 నాటౌట్), జడేజా(12) కొన్ని పరుగులు జోడించినా స్కోరు 150 పరుగుల లోపే ఆగిపోయింది.  

 అంతా కలిసికట్టుగా...: సాధారణ లక్ష్యాన్ని కాపాడుకోవాల్సిన మ్యాచ్‌లో బుమ్రా... బంగ్లా ప్రధాన బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ నెత్తిన పాలు పోశాడు. ఫీల్డింగ్ వైఫల్యంతో ఇన్నింగ్స్ తొలి బంతికే తమీమ్‌కు బౌండరీని ఇచ్చిన బుమ్రా... 15 పరుగుల వద్ద అతను ఫైన్‌లెగ్‌లో ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను వదిలేశాడు. అంతే... ఈ అవకాశాన్ని అందుకున్న తమీమ్...  బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లోనే చెలరేగిపోయి నాలుగు ఫోర్లు బాదాడు. అయితే అదే ఊపులో భారీ షాట్‌కు ప్రయత్నించి తమీమ్ వెనుదిరగ్గా, మరో వైపు దూకుడు ప్రదర్శించిన షబ్బీర్ (15 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్)ను ధోని అద్భుతంగా స్టంపౌట్ చేశాడు. ఎనిమిది పరుగుల వద్ద షకీబ్ (15 బంతుల్లో 22; 2 సిక్సర్లు) క్యాచ్‌ను అశ్విన్ వదిలేసినా... కొద్ది సేపటికే అద్భుత బంతికి అతనే అవుట్ చేశాడు.

ఈ దశలో మహ్ముదుల్లా, సర్కార్ (21 బంతుల్లో 21; 1 ఫోర్, 1 సిక్స్) కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే చివరి ఓవర్లలో భారత బౌలర్లు పూర్తిగా కట్టి పడేశారు.  19వ ఓవర్లో బుమ్రా 6 పరుగులే ఇవ్వగా,  ఆఖరి ఓవర్లో పాండ్యా 9 పరుగులు ఇచ్చినా 2 కీలక వికెట్లు తీయడం, చివరి బంతికి ధోని  రనౌట్ చేయడంతో భారత్‌కు చిరస్మరణీయ విజయం దక్కింది.

 స్కోరు వివరాలు: భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) షబ్బీర్ (బి) ముస్తఫిజుర్ 18; ధావన్ (ఎల్బీ) (బి) షకీబ్ 23; కోహ్లి (బి) షువగత 24; రైనా (సి) షబ్బీర్ (బి) అమీన్ 30; పాండ్యా (సి) సర్కార్ (బి) అమీన్ 15; ధోని (నాటౌట్) 13; యువరాజ్ (సి) అమీన్ (బి) మహ్ముదుల్లా 3; జడేజా (బి) ముస్తఫిజుర్ 12; అశ్విన్ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 146.

వికెట్ల పతనం: 1-42; 2-45; 3-95; 4-112; 5-112; 6-117; 7-137. బౌలింగ్: మొర్తజా 4-0-22-0; షువగత 3-0-24-1; అమీన్ 4-0-37-2; ముస్తఫిజుర్ 4-0-34-2; షకీబ్ 4-0-23-1; మహ్ముదుల్లా 1-0-4-1.

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: తమీమ్ (స్టంప్డ్) ధోని (బి) జడేజా 35; మిథున్ (సి) పాండ్యా (బి) అశ్విన్ 1; షబ్బీర్ (స్టంప్డ్) ధోని (బి) రైనా 26; షకీబ్ (సి) రైనా (బి) అశ్విన్ 22; మొర్తజా (బి) జడేజా 6; మహ్ముదుల్లా (సి) జడేజా (బి) పాండ్యా 18; సర్కార్ (సి) కోహ్లి (బి) నెహ్రా 21; ముష్ఫికర్ (సి) ధావన్ (బి) పాండ్యా 11; షువగత (నాటౌట్) 0; ముస్తఫిజుర్ (రనౌట్) 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 145.

వికెట్ల పతనం: 1-11; 2-55; 3-69; 4-87; 5-95; 6-126; 7-145; 8-145; 9-145 బౌలింగ్: నెహ్రా 4-0-29-1; బుమ్రా 4-0-32-0; అశ్విన్ 4-0-20-2; జడేజా 4-0-22-2; పాండ్యా 3-0-29-2; రైనా 1-0-9-1.
 
 
 హైడ్రామా సాగిందిలా...

బంగ్లాదేశ్ విజయానికి చివరి ఓవర్లో 11 పరుగులు కావాలి. హార్దిక్ పాండ్యా బంతి అందుకున్నాడు.తొలి బంతి: మహ్మదుల్లా డీప్ కవర్‌లోకి ఆడి సింగిల్ తీశాడు.రెండో బంతి: లెంగ్త్ బాల్. ముష్ఫిఖర్ ఎక్స్‌ట్రా కవర్‌లోకి బౌండరీ కొట్టాడు.మూడో బంతి: ముష్ఫిఖర్ స్కూప్ షాట్ ఆడి బౌండరీ సాధించాడు. మిగిలిన మూడు బంతుల్లో రెండు పరుగులు చేస్తే బంగ్లాదేశ్ గెలుస్తుంది.నాలుగో బంతి: ముష్ఫికర్ పుల్‌షాట్ ఆడాడు. డీప్ మిడ్‌వికెట్‌లో ధావన్ క్యాచ్ పట్టాడు.

ఐదో బంతి: పుల్‌టాస్ బంతిని మహ్మదుల్లా భారీ షాట్ కొట్టాడు. డీప్ మిడ్‌వికెట్‌లో జడేజా పరిగెడుతూ వచ్చి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.సింగిల్ తీస్తే మ్యాచ్ టై. రెండు పరుగులుచేస్తే బంగ్లా విజయంఆఖరి బంతి: ఆఫ్ స్టంప్ బయట పడిన బంతిని బ్యాట్స్‌మన్ షువగతా మిస్ చేశాడు. నాన్‌స్ట్రయికర్ ముస్తఫిజుర్ పరుగు పూర్తి చేసేలోపు... కీపర్ ధోని తెలివిగా పరిగెడుతూ వచ్చి బెయిల్స్ ఎగరగొట్టాడు. రనౌట్. భారత్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. బంగ్లా గుండె పగిలింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement