మీ సంగతేంటి..?
► ఆందోళన కలిగిస్తున్న ఓపెనర్లు
► మిడిలార్డర్ కూడా అంతంత మాత్రమే
మొహాలీ నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి: భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరినా జట్టు బ్యాటింగ్ ప్రదర్శన పట్ల పెద్దగా ఎవరికీ సంతృప్తి లేదు. కోహ్లి మినహా ఏ ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఇప్పటివరకూ ఆడలేదు. కోహ్లి పుణ్యమాని పాకిస్తాన్, ఆస్ట్రేలియాపై గెలిచాం. బంగ్లాదేశ్ స్వయంకృతాపరాధంతో గట్టెక్కాం. మొత్తానికి సెమీస్‌కు చేరాం. కానీ రేపు సెమీస్‌లో కోహ్లి పొరపాటున విఫలమైతే పరిస్థితి ఏమిటి? ఇప్పుడు భారత జట్టు సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న ఇది.
ఓపెనర్ల వైఫల్యం
వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు, టి20ల్లో కూడా సెంచరీ ఉన్న ఘనత రోహిత్ శర్మ సొంతం. కానీ అదంతా బ్యాటింగ్ పిచ్‌ల మహిమే తప్ప రోహిత్ గొప్పతనం కాదేమో అన్నట్లుగా అతని ఆట కొనసాగుతోంది. నాలుగు ఇన్నింగ్స్‌లలో ఒక్కసారి కూడా అతను కనీస ప్రభావం చూపలేకపోయాడు. మొత్తం టోర్నీలో అతను ఇప్పటి వరకు 45 పరుగులే చేశాడు. పిచ్ కాస్త బౌలర్లకు అనుకూలిస్తుంటే చాలు చేతులెత్తేస్తున్నాడు. పోరాటపటిమ అనేది మచ్చుకైనా కనిపించక పోగా, అవుటైన తీరు నిర్లక్ష్యంగా కనిపిస్తోంది.
శిఖర్ ధావన్ కూడా ఘోరంగా విఫలమవుతున్నాడు. ఈసారి టోర్నీలో ఒక్క మ్యాచ్‌లో కూడా ప్రభావం చూపలేదు. ధావన్ వరుసగా 1, 6, 23, 13 పరుగులు చేశాడు. నేరుగా వచ్చిన బంతులను స్వీప్ ఆడి అతను రెండు సార్లు ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడం ఇంకా డెరైక్టర్, కోచ్‌లు గుర్తించినట్లు లేదు. గతంలో చాలా సందర్భాల్లో టి20లైనా సరే వీరిద్దరు ఆరంభంలో కాస్త నిలదొక్కుకొని ఆ తర్వాత చెలరేగిపోయేవారు. ఫలితంగా స్ట్రైక్‌రేట్ కూడా బ్రహ్మాండంగా ఉండేది. ఇప్పుడూ నిలబడే ప్రయత్నంలో బంతులు తినేస్తున్నారు. కానీ ఆ వెంటనే అవుట్ కావడంతో పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిగా మారుతోంది. గత నాలుగు మ్యాచ్‌లలో భారత ఓపెనింగ్ భాగస్వామ్యం 5 పరుగులు (5 బంతుల్లో), 14 (13), 42 (36), 23 (23)గా ఉంది. టి20ల్లో సాధారణంగా పవర్‌ప్లేలో కనిపించే మెరుపు ఆరంభానికి ఇది భిన్నం.
మిడిల్ అంతంత మాత్రమే
ఇక ఈ టోర్నీలో అందరికంటే దారుణం రైనా. బంగ్లాదేశ్‌పై చేసిన 30 పరుగులు మినహా ఏమాత్రం ఆడలేదు. పడుతూ లేస్తూ పరుగులు చేస్తున్న యువరాజ్‌ను చూసి సంతోషించాలో లేక గతంలో అతడి స్థాయిని గుర్తు చేసుకుని బాధపడాలో తెలియడం లేదు. ఒకప్పుడు గొప్ప మ్యాచ్ ఫినిషర్‌గా పేరున్న యువరాజ్ ఇప్పుడు చివరి వరకూ నిలబడలేకపోతున్నాడు. ఈ టోర్నీలో నాలుగు మ్యాచ్‌లు కలిపి 52 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కొద్ది సేపు నిలబడగలిగితే ఆ మాత్రం పరుగులైనా వస్తున్నాయి కానీ లేదంటే ఆరంభంలో తడబడితే అక్కడితోనే సరి. కెప్టెన్ ధోని నుంచి కూడా ఆశించిన స్థాయిలో ఇప్పటివరకూ పరుగులు రాలేదు.
ఆల్‌రౌండర్ పేరున్న జడేజా బ్యాటింగ్ మరచిపోయి చాలా కాలం అయింది కాబట్టి అతనిపై ఆశలు పెట్టుకోవడం కూడా అనవసరం. టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో కనీసం 100 పరుగులు చేసిన 23 మందిలో కోహ్లి మినహా మరెవరూ భారతీయులు లేకపోవడం మన బ్యాట్స్‌మెన్ ఆటకు ఉదాహరణ.
ఇక స్ట్రైక్‌రేట్ పరంగా చూస్తే కోహ్లి (132.37)నే 46వ స్థానంలో నిలిచాడంటే మన స్టార్ బ్యాట్స్‌మెన్ వేగంగా కూడా ఆడలేకపోతున్నారని అర్థమవుతుంది. యువరాజ్ సరిగ్గా 100 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తే...రోహిత్ (88.23), ధావన్ (82.69) బంతికో పరుగు కూడా చేయలేకపోయారు. మరోసారి టి20ల్లో విశ్వ విజేతగా నిలిచేందుకు, సొంతగడ్డపై వరుసగా ప్రపంచకప్ గెలిచేందుకు ఇక ఆడాల్సింది రెండు మ్యాచ్‌లే. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా టోర్నీలో తమదైన ముద్ర వేసేందుకు ఇదే మిగిలిన అవకాశం. మరి ఇకనైనా కోలుకుంటారా..?