ముంబై: భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఐపీఎల్‌తోపాటు టి20 ప్రపంచకప్ కూడా జరగాలని ఆశిస్తున్నాడు. కరోనా మహమ్మారి వల్ల ఈ టోర్నీలపై ఇప్పటికీ స్పష్టత లేకుండాపోయింది. టీమిండియా వైస్ కెప్టెన్ మాత్రం తాను ఈ రెండు టోర్నీల్లోనూ ఆడాలనుకుంటున్నట్లు చెప్పాడు. అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్ చాట్‌లో డాషింగ్ ఓపెనర్ మాట్లాడుతూ... ఆసీస్ పర్యటనలో జరిగే డే–నైట్ టెస్టు సవాలుతో కూడుకున్నదని చెప్పాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జెసన్ రాయ్‌ల ఆటను చూడటాన్ని ఆస్వాదిస్తున్నానని రోహిత్ తెలిపాడు. మాజీ సారథి ధోని గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఏం చెబుతారనే ప్రశ్నకు రోహిత్ బదులిస్తూ ‘లెజెండ్’ అని ముక్తాయించాడు.
ఈ ఏడాది ఆఖర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే భారత్ అక్కడ నాలుగు టెస్టులు ఆడనుంది. ఇందులో అడిలైడ్‌లో జరిగే రెండో టెస్టును పింక్‌బాల్‌తో ఫ్లడ్‌లైట్లలో నిర్వహిస్తారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చే ప్రపంచకప్‌పై ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఈ మెగా టోర్నీ వాయిదా పడితే ఐపీఎల్ నిర్వహణకు మార్గం సుగమం అవుతుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు గంగూలీ మాట్లాడుతూ లీగ్‌పై ఆశలు రేపాడు. అన్ని అవకాశాల్ని, ప్రత్యామ్నాయాల్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు ప్రకటించాడు.
Comments
Please login to add a commentAdd a comment