రోహిత్ మోత
వార్మప్‌లో భారత్ ఘన విజయం
45 పరుగులతో వెస్టిండీస్ ఓటమి
కోల్‌కతా: అసలు పోరు అయినా, అల్లాటప్పా మ్యాచ్ అయినా అతని ఆట మాత్రం అదే తరహాలో అద్భుతంగా సాగుతోంది. తనకు అచ్చొచ్చిన, అభిమాన మైదానంలో రోహిత్ శర్మ మరోసారి చెలరేగిపోయాడు. ‘హిట్‌మ్యాన్’తో పాటు జట్టు ఫామ్ కూడా అదే స్థాయిలో కొనసాగడంతో టి20 ప్రపంచకప్‌లో భారత్ తమ ‘సాధన’ను ఘనంగా ప్రారంభించింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగి తొలి వార్మప్ మ్యాచ్‌లో భారత్ 45 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. టాస్ లేకుండా పరస్పర అవగాహనతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కొద్దిలో రోహిత్ శర్మ (57 బంతుల్లో 98 నాటౌట్; 9 ఫోర్లు, 7 సిక్సర్లు) సెంచరీ మిస్ అయింది. ఇన్నింగ్స్ చివరి రెండు బంతులకు అతను పరుగు తీయలేకపోయాడు.
యువరాజ్ (20 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా దూకుడుగా ఆడటంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. వీరిద్దరు మూడో వికెట్‌కు 46 బంతుల్లోనే 89 పరుగులు జోడించడం విశేషం. విండీస్ బౌలర్లలో టేలర్, బెన్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం వెస్టిండీస్ 19.2 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌట్ అయింది. క్రిస్ గేల్ (11 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్)ను బుమ్రా తాను వేసిన మూడో బంతికే బౌల్డ్ చేసిన తర్వాత విండీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. షమీ మొత్తం 4 ఓవర్లు బౌలింగ్ చేయగా, రహానే 4 క్యాచ్‌లు అందుకున్నాడు. భారత బౌలర్లలో నేగి, పాండ్యా, జడేజా, షమీ తలా 2 వికెట్లు పడగొట్టారు. భారత్ తమ తర్వాతి వార్మప్ మ్యాచ్‌ను శనివారం దక్షిణాఫ్రికాతో ముంబైలో ఆడుతుంది.
కివీస్ చేతిలో లంక చిత్తు
ముంబై: మరో వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 74 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 226 పరుగులు చేసింది. మున్రో (34 బంతుల్లో 67; 7 సిక్సర్లు), అండర్సన్ (29 బంతుల్లో 60 రిటైర్డ్‌హర్ట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు), గప్తిల్ (25 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్), ఇలియట్ (21 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగారు. షనక 2 వికెట్లు తీశాడు. షనక వేసిన ఒకే ఓవర్లో మున్రో వరుసగా నాలుగు సిక్సర్లు కొట్టడం మ్యాచ్‌లో హైలైట్. అనంతరం లంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. తిరిమన్నె (29 బంతుల్లో 41; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), కపుగెదెర (27 బంతుల్లో 38; 7 ఫోర్లు) మాత్రమే రాణించారు. మిల్నేకు 3 వికెట్లు దక్కాయి.
మందన మెరుపులు
వార్మప్‌లో ఐర్లాండ్‌పై భారత్ గెలుపు
బెంగళూరు: స్మృతి మందన (52 బంతుల్లో 73 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించడంతో టి20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 29 పరుగుల తేడాతో ఐర్లాండ్‌పై విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 147 పరుగులు చేసింది. మిథాలీ రాజ్ (11), వనిత (2) విఫలమైనా... మందన, హర్మన్‌ప్రీత్ కౌర్ (24) మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. చివర్లో వేద (26) మెరుగ్గా ఆడింది. కిమ్ గార్త్ 3 వికెట్లు తీసింది. తర్వాత ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది. డాల్టన్ (37) టాప్ స్కోరర్. శిఖా పాండే, నిరంజన చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 98; ధావన్ (బి) బెన్ 21; రహానే (స్టంప్డ్) రామ్‌దిన్ (బి) బెన్ 7; యువరాజ్ (సి) టేలర్ (బి) స్యామీ 31; జడేజా (సి) నర్స్ (బి) బ్రాత్‌వైట్ 10; నేగి (బి) టేలర్ 8; పాండ్యా (సి) రామ్‌దిన్ (బి) టేలర్ 0; రైనా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 185.
వికెట్ల పతనం: 1-32; 2-56; 3-145; 4-160; 5-179; 6-179.
బౌలింగ్: రసెల్ 4-0-35-0; టేలర్ 4-0-26-2; బ్రాత్‌వైట్ 4-0-30-1; బెన్ 4-0-30-2; నర్స్ 2-0-27-0; స్యామీ 2-0-29-1.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: చార్లెస్ (సి) ధోని (బి) షమీ 18; గేల్ (బి) బుమ్రా 20; శామ్యూల్స్ (బి) జడేజా 17; రామ్‌దిన్ (సి) షమీ (బి) జడేజా 6; బ్రేవో (సి) రైనా (బి) నేగి 13; రసెల్ (సి) రహానే (బి) పాండ్యా 19; బ్రాత్‌వైట్ (బి) నేగి 6; స్యామీ (సి) రహానే (బి) పాండ్యా 9; నర్స్ (సి) రహానే (బి) షమీ 8; హోల్డర్ (నాటౌట్) 13; బెన్ (సి) రహానే (బి) హర్భజన్ 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (19.2 ఓవర్లలో ఆలౌట్) 140.
వికెట్ల పతనం: 1-36; 2-40; 3-59; 4-72; 5-78; 6-84; 7-96; 8-106; 9-123; 10-140.
బౌలింగ్: అశ్విన్ 2-0-21-0; హర్భజన్ 1.2-0-12-1; షమీ 4-0-30-2; బుమ్రా 2-0-6-1; నేగి 4-0-15-2; జడేజా 4-0-26-2; పాండ్యా 2-0-25-2.