టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులోకి వచ్చిన తొలినాళ్లలో రోహిత్ ఇంగ్లిష్ సరిగ్గా మాట్లాడలేకపోయేవాడని.. దాంతో సరదాగా అతడిని తాము ఏడిపించేవాళ్లమని పేర్కొన్నాడు.
అయితే, రోహిత్‌కు మాత్రం అందరితో కలిసి ఉండటం ఇష్టమని.. అతడు గొప్ప మనసున్న వ్యక్తి అంటూ యువీ కొనియాడాడు. ఈసారి రోహిత్ శర్మ కచ్చితంగా ప్రపంచకప్ సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.
ఇంత వరకూ నో ఐసీసీ టైటిల్స్!
టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ ఒక్క ఐసీసీ టోర్నీలోనూ టైటిల్ అందించలేకపోయాడు. అతడి కెప్టెన్సీలో 2022 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌లోనే ఇంటిబాట పట్టిన భారత్.. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ చేతులెత్తేసింది.
ఇక సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లోనూ బోల్తాపడి తృటిలో ట్రోఫీని చేజార్చుకుంది. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఆసియా వన్డే కప్-2023 మినహా ఒక్క మెగా ఈవెంట్లోనూ రోహిత్ సేన ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది.
రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు
ఈ క్రమంలో ప్రస్తుతం అందరి కళ్లు టీ20 ప్రపంచకప్-2024 మీదే ఉన్నాయి. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఈసారైనా టైటిల్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. జూన్ 1 నుంచి అమెరికా- వెస్టిండీస్ వేదికగా మొదలుకానున్న ఈ ఐసీసీ టోర్నీకి యువరాజ్ సింగ్ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఐసీసీతో మాట్లాడుతూ యువీ రోహిత్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడికి అసలు ఇంగ్లిష్ రాదు. ముంబైలోని బోరివలీ వీధుల నుంచి వచ్చిన వాడు. చాలా సరదాగా ఉంటాడు.
ఇంగ్లిష్ విషయంలో మాత్రం అతడిని మేము ఏడిపించేవాళ్లం. భాష సంగతి పక్కనపెడితే అతడి మనసు మాత్రం వెన్న. ఎంత ఎదిగినా తన ప్రవర్తనలో ఎలాంటి మార్పూ లేదు. రోహిత్ శర్మలో గొప్ప గుణం అదే.
నా బెస్ట్ ఫ్రెండ్
తాను సరదాగా ఉండటంతో పాటు చుట్టూ ఉన్న వాళ్లకు కూడా వినోదం పంచుతాడు. గొప్ప నాయకుడు. క్రికెట్ రంగంలో నాకున్న అత్యంత సన్నిహితుల్లో రోహిత్ కూడా ఒకడు.
ఈసారి రోహిత్ శర్మ వరల్డ్‌కప్ ట్రోఫీ ఎత్తాలని.. వరల్డ్‌కప్ మెడల్ మెడలో వేసుకుంటే చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఇందుకు వందకు వంద శాతం అర్హుడు’’ అని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు.
అతడే సరైన కెప్టెన్
ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకోగల సత్తా ఉన్న రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా ఉండటం బీసీసీఐ తీసుకున్న సరైన నిర్ణయమని ఈ సందర్భంగా యువీ అన్నాడు. ఐపీఎల్‌లో ఐదు ట్రోఫీలు గెలిచిన రోహిత్ లాంటి వ్యక్తి టీ20 వరల్డ్‌కప్-2024లోనూ భారత్‌ను ముందుకు నడిపించడం సానుకూలాంశమని పేర్కొన్నాడు.
చదవండి: ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment