నిన్న (జూన్ 29) జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను సాధించింది. 17 ఏళ్ల పొట్టి ప్రపంచకప్ చరిత్రలో భారత్‌తో (2007, 2024) పాటు వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లండ్ (2010, 2022) మాత్రమే రెండేసి సార్లు టైటిల్స్ సాధించాయి.
ఈ వరల్డ్‌కప్ విజయంతో భారత్ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. ఈ ప్రపంచకప్‌లో అజేయ జట్టుగా నిలిచిన టీమిండియా.. పొట్టి ప్రపంచకప్ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా (సింగిల్ ఎడిషన్) టైటిల్ సాధించిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఏ జట్టు అజేయంగా టీ20 ప్రపంచకప్ గెలవలేదు.
కాగా, టీ20 వరల్డ్‌కప్ 2024 విజయానంతరం భారత ఆటగాళ్ల సంబురాలు అంబరాన్నంటాయి. తొలుత భావోద్వేగాలను అదుపు చేసుకోలేక ఆనంద బాష్పాలు కార్చిన టీమిండియా క్రికెటర్లు.. ఆతర్వాత తేరుకుని సంబురాలు చేసుకున్నారు.
11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ, 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్, 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ గెలవడంతో యావత్ భారతావణి పులకించిపొయింది. ఊరు వాడా విజయోత్సవ సంబురాలు జరిగాయి.
టీమిండియా కృష్ణార్జునులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పొట్టి ప్రపంచకప్ టైటిల్ గెలిచి టీ20 ఫార్మాట్‌కు ఘనంగా వీడ్కోలు పలకగా.. భారత హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్‌కప్ విక్టరీతో ముగిసింది.
భారత క్రికెట్ అభిమానులు ఓ పక్క టీమిండియా విజయాన్ని ఆస్వాధిస్తూనే.. మరోపక్క దిగ్గజాల రిటైర్మెంట్ ప్రకటనను తలచుకుంటూ కుమిలిపోయారు. మొత్తంగా నిన్నటి ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment