న్యాయం చేయలేకపోతున్నా.. కోహ్లి ఆవేదన! ద్రవిడ్‌ రిప్లై ఇదే.. | Not Doing Justice: Kohli Reveals Chat With Dravid Amid Poor Form In T20 WC 2024 | Sakshi
Sakshi News home page

న్యాయం చేయలేకపోతున్నా.. కోహ్లి ఆవేదన! ద్రవిడ్‌ రిప్లై ఇదే..

Published Sat, Jul 6 2024 1:42 PM | Last Updated on Sat, Jul 6 2024 1:56 PM

Not Doing Justice: Kohli Reveals Chat With Dravid Amid Poor Form In T20 WC 2024

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయాడు టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి. లీగ్‌ దశలో పూర్తిగా విఫలమైన ఈ ‘రన్‌మెషీన్‌’.. సెమీస్‌ వరకు అదే పేలవ ప్రదర్శన కనబరిచాడు.

అయితే, అసలైన మ్యాచ్‌లో మాత్రం దుమ్ములేపాడీ కుడిచేతి వాటం బ్యాటర్‌. సౌతాఫ్రికాతో ఫైనల్లో అద్భుత అర్ధ శతకంతో రాణించి భారత్‌ ప్రపంచకప్‌ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

తద్వారా ‘ఫామ్‌ తాత్కాలికం.. క్లాస్‌ మాత్రమే శాశ్వతం’ అని నిరూపించి.. తన విలువ చాటుకున్నాడు. అయితే, ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు తనను ఆత్మవిశ్వాసంతో లేనని.. డీలా పడిపోయానని కోహ్లి పేర్కొన్నాడు.

భారంగా తయారయ్యానని కుమిలిపోయా
జట్టుకు ఏమాత్రం ఉపయోగపడకుండా భారంగా తయారయ్యానని కుమిలిపోయానని తెలిపాడు. అలాంటి సమయంలో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మద్దతుగా నిలిచి.. తాను కోలుకునేలా ఉత్సాహాన్ని నింపారని కోహ్లి వెల్లడించాడు.

వెస్టిండీస్‌ నుంచి ట్రోఫీతో తిరిగి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సమయంలో కోహ్లి సంభాషిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘నాకు నేను, నా జట్టుకు ఏమాత్రం న్యాయం చేయలేకపోతున్నానని రాహుల్‌ భాయ్‌కు చెప్పాను.

అందుకు బదులుగా.. ‘కీలక సమయంలో నువ్వు తప్పకుండా ఫామ్‌లోకి వస్తావు’ అని భాయ్‌ చెప్పాడు. ఆ తర్వాత మ్యాచ్‌ ఆడే సమయంలో రోహిత్‌తో కూడా ఇదే మాట చెప్పాను. నేను కాన్ఫిడెంట్‌గా లేనని చెప్పాను.

పట్టుదలగా నిలబడ్డాను
ఒక్క పరుగు కూడా చేయకపోతే పరిస్థితి ఏమిటని సతమతమయ్యాను. అయితే, ఫైనల్లో మేము వికెట్లు కోల్పోతున్న క్రమంలో పరిస్థితి తగ్గట్లుగా నన్ను నేను మలచుకోవాలని నిర్ణయించుకున్నాను.

జట్టు కోసం నా వంతు ప్రయత్నం చేయాలని పట్టుదలగా నిలబడ్డాను. అందుకు తగ్గట్లుగానే ఫలితం కూడా వచ్చింది’’ అని విరాట్‌ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. 

కాగా వరల్డ్‌కప్‌-2024లో ఫైనల్‌కు ముందు కోహ్లి చేసిన పరుగులు 75 మాత్రమే.. సౌతాఫ్రికాతో ఫైనల్లో 59 బంతుల్లోనే 76 రన్స్‌ సాధించాడు. కాగా సమష్టిగా రాణించి టీమిండియా టీ20 ప్రపంచకప్‌-2024 ట్రోఫీని ముద్దాడిన విషయం తెలిసిందే.

చదవండి: Ind vs Zim: వికెట్‌ కీపర్‌గా అతడే.. భారత తుది జట్టు ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement