Ind vs Zim: వికెట్‌ కీపర్‌గా అతడే.. భారత తుది జట్టు ఇదే! | Ind vs Zim 1st T20: Aakash Chopra Picks His Playing XI No place for Sudharsan Jitesh | Sakshi
Sakshi News home page

Ind vs Zim: వికెట్‌ కీపర్‌గా అతడే.. భారత తుది జట్టు ఇదే!

Published Sat, Jul 6 2024 12:50 PM | Last Updated on Sat, Jul 6 2024 1:27 PM

Ind vs Zim 1st T20: Aakash Chopra Picks His Playing XI No place for Sudharsan Jitesh

దిగ్గజ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ తర్వాత యువ టీమిండియా తొలిసారి టీ20 సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది. ఈ స్టార్‌ బ్యాటర్ల నిష్క్రమణ తర్వాత శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో జింబాబ్వేతో తలపడేందుకు హరారేకు వెళ్లింది.

ఆతిథ్య జట్టుతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం తొలి టీ20 ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్‌, ప్రముఖ కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తన తుది జట్టును ఎంచుకున్నాడు.

ఈ మేరకు యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా తన అభిప్రాయాలు పంచుకుంటూ.. ‘‘టాపార్డర్‌లో శుబ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిషేక్‌ శర్మ ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా ఈ ముగ్గురి ఆర్డర్‌ మారొచ్చు కానీ.. టాప్‌-3లో మాత్రం వీరే ఉండాలి.

ఆ తర్వాతి స్థానంలో రియాన్‌ పరాగ్‌ బ్యాటింగ్‌కు రావాలి. ఇక వికెట్‌ కీపర్‌గా ధ్రువ్‌ జురెల్‌ను ఆడించాలి. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఐదో స్థానం అతడిదే.

ఆరో బ్యాటర్‌గా రింకూ సింగ్‌ బరిలోకి దిగాలి. లేదంటే జురెల్‌ కంటే ముందుగానే వచ్చినా పర్లేదు. జురెల్‌ కీపింగ్‌ చేస్తాడు కాబట్టి ఈసారి జితేశ్‌ శర్మకు నేనైతే అవకాశం ఇవ్వను.

ఇక ఏడో స్థానంలో వాషింగ్టన్‌ సుందర్‌ను ఆడించాలి. ఆల్‌రౌండర్‌గా జట్టుకు తన సేవలు అవసరం. నలుగురు బౌలర్లను తీసుకోవాలి కాబట్టి స్పిన్నర్‌ కోటాలో రవి బిష్ణోయితో పాటు.. వాషింగ్టన్‌ కూడా అందుబాటులో ఉండటం కలిసి వస్తుంది.

అభిషేక్‌ శర్మ కూడా పార్ట్‌టైమ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌గా ప్రభావం చూపగలడు. ఇక పేస్‌ విభాగంలో ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌ తమ బాధ్యతను సమర్థవంతంగా నెరవేర్చగలరు.

నిజానికి హర్షిత్‌ రాణాను చోటివ్వాల్సింది. అయితే, బెంగాల్‌ ప్రొ టీ20 లీగ్‌లో ముకేశ్‌ కుమార్‌ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఇక ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ వరల్డ్‌కప్‌ ట్రావెలింగ్‌ టీమ్‌లో భాగం కాబట్టి.. ఈ ముగ్గురిని ఆడించవచ్చు. అందుకే హర్షిత్‌ రాణాకు ఈసారికి మొండిచేయి తప్పదు’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే.. జింబాబ్వేతో టూర్‌కు ఎంపికైన సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్‌, శివం దూబే తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నారు. టీ20 ప్రపంచకప్‌-2024 విజయోత్సవాల్లో పాల్గొనేందుకు వీరు భారత్‌కు తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.

 

జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు:
శుబ్‌మన్‌ గిల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్, ముకేశ్‌ కుమార్, ఖలీల్ అహ్మద్, రవి బిష్ణోయ్, సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, తుషార్ దేశ్‌పాండే, హర్షిత్ రాణా.

తొలి టీ20కి ఆకాశ్‌ చోప్రా ఎంచుకున్న జట్టు:
శుబ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురెల్‌, రింకూ సింగ్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయి, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement