టీ20 ప్రపంచకప్-2024 విజేతగా నిలిచిన టీమిండియాపై ప్రశంసలతో పాటు కనక వర్షం కూడా కురిసింది. ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి కూడా భారత క్రికెట్ నియంత్రణ మండలి భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.
దాదాపు పదకొండేళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ గెలిచిన నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏకంగా రూ. 125 కోట్ల రివార్డును బీసీసీఐ ప్రకటించింది. అయితే, ఈ మొత్తం పంచుకునే క్రమంలో ఎవరెవరికి ఎంత దక్కనుందనే విషయం గురించి ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది.
ఒక్కొక్కరికి రూ. 5 కోట్లు!
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. వరల్డ్‌కప్ ప్రధాన జట్టులో భాగమైన ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌లకు ఒక్కొక్కరికి రూ. 5 కోట్ల మేర ఇవ్వనున్నారు. ఈ ఈవెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెటర్లకు కూడా ఈ మేర భారీ మొత్తం దక్కనుంది.
వారికి 2.5 కోట్లు?
అదే విధంగా ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. ఇక కోచింగ్ సిబ్బందిలో ప్రధానమైన బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌లకు రూ. 2.5 కోట్ల మేర రివార్డు దక్కనుంది.
మిగిలిన వాళ్లలో ముగ్గురు ఫిజియోథెరపిస్టులు కమలేశ్ జైన్, యోగేష్ పర్మార్, తులసీ రామ్ యువరాజ్.. ఇద్దరు మసాజర్లు రాజీవ్ కుమార్, అరుణ్ కనాడే.. అదే విధంగా కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయిలకు ఒక్కొక్కరికి రూ. 2 కోట్ల మేర బీసీసీఐ నజరానా ఇవ్వనుంది.
చీఫ్ సెలక్టర్‌కు ఎంతంటే?
వీరి సంగతి ఇలా ఉంటే.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ సహా సెలక్షన్ కమిటీలోని మిగిలిన నలుగురు సభ్యులకు రూ. కోటి చొప్పున ఇచ్చేందుకు బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అదే విధంగా.. వీడియో అనలిస్టులు, మీడియా ఆఫీసర్లు, టీమిండియా లాజిస్టిక్ మేనేజర్ సహా ఈ మెగా టోర్నీలో భాగమైన 42 మంది సభ్యులకు వారి బాధ్యతలకు అనుగుణంగా రివార్డులోని కొంత మొత్తాన్ని అందించనున్నట్లు సమాచారం.
సౌతాఫ్రికాను ఓడించి
కాగా రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు టీ20 ప్రపంచకప్-2024 చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన ఈ మెగా టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి టైటిల్ గెలిచింది.
ఈ ఐసీసీ ఈవెంట్లో భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలవగా.. ఫైనల్లో అద్భుతంగా ఆడిన విరాట్ కోహ్లి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
టీ20 ప్రపంచకప్-2024 భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, యజువేంద్ర చహల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్.
ట్రావెలింగ్ రిజర్వ్స్: రింకూ సింగ్, శుబ్‌మన్ గిల్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.
చదవండి: IND vs SL: భారత్‌తో టీ20 సిరీస్.. శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య
Comments
Please login to add a commentAdd a comment