2015, 2016, 2017, 2019, 2022.. 2023.. ఐసీసీ వరల్డ్‌కప్ టోర్నీల్లో భారత్‌కు ఎదురైన చేదు అనుభవాలను మరిపిస్తూ.. నెల రోజుల క్రితం ఓ అద్భుతం ఆవిష్కృతమైంది. అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచింది. ఫలితంగా దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ టైటిల్ సాధించిన తర్వాత హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ తన ప్రస్థానం ముగించగా.. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. విండీస్‌లోని బార్బడోస్‌లో సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ విజేతగా నిలిచిన తర్వాత తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో కోహ్లి- రోహిత్ అభిమానులు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు.
అయితే, యావత్ భారతావని మాత్రం వరల్డ్‌కప్ హీరోలు ఎప్పుడెప్పుడు తిరిగి వస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే, బార్బడోస్‌లో హారికేన్ బీభత్సం వల్ల టీమిండియా రాక రెండు రోజులు ఆలస్యమైంది. ఉధృతమైన వర్షాల కారణంగా విమాన సర్వీసులు రద్దు కాగా.. భారత క్రికెట్ నియంత్రణ మండలి తక్షణ చర్యలు చేపట్టింది.
వాతావరణం కాస్త తేలికపడగానే AIC24WC చార్టెడ్ ఫ్లైట్‌ను బార్బడోస్‌కు పంపింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందితో పాటు కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులను కూడా ఇదే విమానంలో భారత్‌కు తీసుకువచ్చారు.
ఈ క్రమంలో స్టార్ స్పోర్ట్స్ ప్రొడ్యూసర్ ఒకరు నాటి విమాన ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలను తాజాగా గుర్తుచేసుకున్నారు. ‘‘ఆరోజు బార్బడోస్ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం. పదహారు గంటల జర్నీ. అయితే, ఆరోజు ఎవరూ కూడా ఆరు గంటలకు మించి నిద్రపోలేదు. అంతా సందడి సందడిగా సాగింది.
ఆటగాళ్లలో చాలా మంది ప్రెస్ వాళ్లను కలవడానికి వచ్చారు. వారితో ముచ్చట్లు పెట్టారు. అందరి కంటే రోహిత్ శర్మ ఎక్కువసార్లు బయటకు వచ్చాడు. బిజినెస్ క్లాస్ అంతా విజయ సంబరంతో అల్లరి అల్లరిగా ఉండటంతో రాహుల్ ద్రవిడ్ ఒకానొక సమయంలో ఎకానమీ క్లాస్‌కు వచ్చేశాడు. బిజినెస్ క్లాస్‌లో నిద్రపట్టడం లేదని..ఎకానమీ క్లాస్‌లో నిద్రపోయాడు.
నేను నిద్రపోతున్న సమయంలో రోహిత్ శర్మ ఎవరినో తిడుతున్నట్లుగా శబ్దాలు వినిపించాయి. లేచి చూస్తే నిజంగానే రోహిత్ అక్కడ ఎవరినో ఏదో అంటున్నాడు. అయితే, తనదైన స్టైల్లో సరదాగానే వారికి చివాట్లు పెడుతూ ఆటపట్టిస్తున్నాడు. ఆ తర్వాత రిషభ్ పంత్, హార్దిక్‌పాండ్యా అందరూ బయటకు వచ్చారు. మీడియా వాళ్లతో ముచ్చటించారు. ఎన్నో విషయాలు మాట్లాడుకున్నారు’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment