టీమిండియా విజయవంతమైన కోచ్‌లలో ఒకడిగా గుర్తింపు పొందాడు మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్. టీ20 ప్రపంచకప్-2021 తర్వాత రవిశాస్త్రి స్థానంలో హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ఈ కర్ణాటక లెజెండ్ మార్గదర్శనంలో.. టీమిండియా అన్ని ఫార్మాట్లలో నంబర్ వన్‌గా ఎదిగింది. ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.
ఘనంగా వీడ్కోలు
అయితే, టీ20 ప్రపంచకప్-2022(సెమీస్), ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్- 2021-23, వన్డే వరల్డ్‌కప్-2023(ఫైనల్) టోర్నీలో మాత్రం టైటిల్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో ఒక సందర్భంలో ద్రవిడ్‌ను వెంటనే కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లూ వచ్చాయి. అయితే, బీసీసీఐ మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. వరల్డ్‌కప్-2023 తర్వాత అతడి పదవీకాలం ముగిసినా.. టీ20 ప్రపంచకప్-2024 వరకు కోచ్‌గా కొనసాగాలని కోరింది.
ఇందుకు అంగీకరించిన ద్రవిడ్‌కు ఘనమైన వీడ్కోలు లభించింది. ప్రపంచకప్-2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత జట్టు చాంపియన్‌గా అవతరించింది. తద్వారా దాదాపు పదకొండేళ్ల విరామం తర్వాత మరోసారి భారత్‌కు ఐసీసీ టైటిల్ దక్కింది. అయితే, సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్ ఓడిపోవడం మాత్రం ద్రవిడ్ కెరీర్‌లోని చేదు అనుభవం అని చెప్పవచ్చు.
ఆ ఓటమే బాధించింది
అయితే, రాహుల్ ద్రవిడ్ మాత్రం అన్నింటికంటే సౌతాఫ్రికా గడ్డ మీద ఓటమే.. తన కోచింగ్ కెరీర్‌లో ఎదురైన ఘోర పరాభవం అంటున్నాడు. ప్రొటిస్ జట్టును తమ సొంతదేశంలో ఓడించే అవకాశం చేజారడం ఎన్నటికీ మర్చిపోలేనన్నాడు. చిరస్మరణీయ విజయం సాధించే క్రమంలో జరిగిన పొరపాట్ల వల్ల భారీ మూల్యమే చెల్లించామని పేర్కొన్నాడు.
ఈ మేరకు.. ‘‘నా క్రికెట్ కోచింగ్ కోరీర్‌లో అన్నింటికంటే ఘోర పరాభవం.. సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవలేకపోవడం. సెంచూరియన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో మేము విజయం సాధించాం. అదే జోరులో రెండో టెస్టును ఘనంగా ఆరంభించాం. కానీ సౌతాఫ్రికా అనూహ్య రీతిలో తిరిగి పుంజుకుని గెలుపును లాగేసుకుంది.
మూడో టెస్టులోనూ అదే ఫలితం పునరావృతం చేసింది. మా జట్టులోని కొందరు సీనియర్లు అప్పుడు అందుబాటులో లేరు. రోహిత్ శర్మ కూడా గాయపడ్డాడు. అయినా.. రెండు, మూడో టెస్టుల్లో విజయానికి చేరువగా వచ్చాం. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాం. అయితే, ఈ సిరీస్ ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. కోచ్‌గా ఎలా నన్ను నేను సంభాళించుకోవాలో తెలుసుకున్నా.
ఓటమీ మంచికే
అన్ని మ్యాచ్‌లు మనమే గెలవలేం. ఒక్కోసారి ఓటమే మనకు ఎంతో నేర్పిస్తుంది’’ అని రాహుల్ ద్రవిడ్ 2021-22 సిరీస్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా ద్రవిడ్ స్థానంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఇక గౌతీ హయాంలో తొలిసారిగా శ్రీలంక పర్యటనకు వెళ్లిన టీమిండియా టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అయితే, వన్డే సిరీస్‌లో మాత్రం 0-2తో ఆతిథ్య లంక జట్టు చేతిలో ఓటమిని చవిచూసింది. 27 ఏళ్ల తర్వాత తొలిసారి శ్రీలంకకు వన్డే సిరీస్‌ను సమర్పించుకుంది.
చదవండి: IPL 2025: ఈ ముగ్గురు కెప్టెన్లను రిలీజ్ చేయనున్న ఫ్రాంఛైజీలు!
Comments
Please login to add a commentAdd a comment