‘‘ప్రియమైన రాహుల్ భాయ్.. నా మనసులోని భావాలను వెల్లడించేందుకు సరైన పదాల కోసం వెతుక్కొంటున్నాను. అయితే, ఈ నా ప్రయత్నం వృథా అవుతుందేమో!
ఏదేమైనా చెప్పాలనుకున్నది చెప్పి తీరుతా..! కోట్లాది మంది అభిమానుల్లాగే నేను కూడా చిన్ననాటి నుంచి నిన్ను చూస్తూ పెరిగా.
అయితే, వారెవరికీ రాని అవకాశం నాకు వచ్చింది. నిన్న దగ్గరగా చూడటమే కాదు.. నీతో కలిసి పనిచేసే భాగ్యం దక్కింది.
క్రికెట్‌లో నువ్వొక శిఖరానివి. కఠిన శ్రమకు ఓర్చే ఆటగాడివి. అందుకు ప్రతిఫలంగా ఎన్నెన్నో ఘనతలు సాధించావు.
అయితే, మా దగ్గరికి వచ్చే సమయంలో ఆటగాడిగా నీ ఘనతలన్నీ పక్కన పెట్టి.. కేవలం కోచ్‌గా మాత్రమే వ్యవహరిస్తావు.
నీలాంటి గొప్ప ఆటగాడితో మమేకమయ్యే క్రమంలో మాకు ఎలాంటి సందేహాలు, సంశయాలు లేకుండా చేస్తూ మేము సౌకర్యంగా ఫీలయ్యేలా చేస్తావు.
ఆటకు, మాకు నువ్విచ్చిన గొప్ప బహుమతి అది. ఆట పట్ల నీకున్న ప్రేమ నీ హుందాతనానికి కారణం. నీ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను.
ఎన్నో మధుర జ్ఞాపకాలు పోగు చేసుకున్నాను. పనిలో ఉన్నపుడు తనను కూడా పట్టించుకోకుండా నేను నీతోనే ఉంటానని నా భార్య ఎల్లప్పుడూ అంటూ ఉంటుంది.
రాహుల్ భాయ్ ‘నీ వర్క్ వైఫ్’(పనిలో సహచరులు, పరస్పర గౌరవం, మద్దతు, విశ్వసనీయత కలిగి ఉండేవారు) అంటూ నన్ను ఆటపట్టిస్తుంది. ఇలా అనిపించుకోవడం కూడా నా అదృష్టమే అని భావిస్తా. నిన్ను చాలా మిస్సవుతాను. అయితే, కలిసి కట్టుగా మనం సాధించిన విజయం పట్ల సంతోషంగా ఉన్నాను.
రాహుల్ భాయ్ నా నమ్మకం, నా కోచ్, నా స్నేహితుడు అని అనుకుంటూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా?! సెల్యూట్’’ అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు.
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకొంటున్న రాహుల్ ద్రవిడ్‌ను ఉద్దేశించి భావోద్వేగపూరిత నోట్ షేర్ చేశాడు. రాహుల్ భాయ్‌తో తన అనుబంధం చిరస్మరణీయంగా నిలిచిపోతుందంటూ కోచ్ పట్ల ప్రేమను చాటుకున్నాడు.
ఈ సందర్భంగా టీ20 ప్రపంచకప్-2024 ట్రోఫీతో ద్రవిడ్, తాను, తన కుటుంబం దిగిన ఫొటోలను రోహిత్ శర్మ షేర్ చేశాడు. కాగా విరాట్ కోహ్లి తర్వాత భారత జట్టు సారథిగా రోహిత్ పగ్గాలు చేపట్టగా.. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించాడు.
కల నెరవేరింది
వీరిద్దరి హయాంలో టీమిండియా ఆసియా వన్డే కప్ గెలవడంతో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరింది. అయితే, తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌తో ఈ దిగ్గజాల కల నెరవేరింది.
అమెరికా- వెస్టిండీస్ వేదికగా సాగిన ఈ మెగా టోర్నీలో ద్రవిడ్ మార్గదర్శనంలోని రోహిత్ సేన ట్రోఫీ గెలిచింది. సౌతాఫ్రికాను ఓడించి ఐసీసీ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఇక ఈవెంట్ తర్వాత తాను బాధ్యతల నుంచి వైదొలుగుతానని ఇప్పటికే ద్రవిడ్ స్పష్టం చేశాడు. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్‌తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి గురయ్యాడు.
మీరిద్దరూ అరుదైన వజ్రాలు
ఇందుకు స్పందిస్తూ.. ‘‘మీరిద్దరూ అరుదైన వజ్రాలు’’ అంటూ టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్ కామెంట్ చేశాడు. కాగా వరల్డ్‌కప్-2024 తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
తదుపరి చాంపియన్స్ ట్రోఫీ-2025, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 సీజన్ ముగిసే వరకూ కెప్టెన్‌గా తనే కొనసాగనున్నాడు. ఇదిలా ఉంటే.. రోహిత్‌తో పాటు దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సైతం ఇంటర్నేషనల్ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు.
చదవండి: శుభవార్త చెప్పిన పేసర్.. టీమిండియా ఎంట్రీ మాత్రం ఆ తర్వాతే!
Comments
Please login to add a commentAdd a comment