టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్ ఆటగాడు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) కొనసాగుతానని స్పష్టం చేశాడు.
పొట్టి ప్రపంచకప్ గెలవడంతో తన కల నిజమైందని అన్నాడు. టీ20 కెరీర్‌లో వరల్డ్‌కప్ గెలవడం అత్యుత్తమమని తెలిపాడు. కెరీర్‌లో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలని పేర్కొన్నాడు. చివరిగా జై హింద్ అని రాసుకొచ్చాడు. 35 ఏళ్ల రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల్లో 74 మ్యాచ్‌లు ఆడి 127.2 స్టయిక్‌రేట్‌తో 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు.
కాగా, సౌతాఫ్రికాతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కు ఇది రెండో ప్రపంచకప్. 2007లో (అరంగేట్రం ఎడిషన్) ధోని సారథ్యంలో పొట్టి ప్రపంచకప్ గెలిచిన భారత్... తాజాగా రోహిత్ శర్మ నేతృత్వంలో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం కోహ్లి, రోహిత్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు గుడ్ బై చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment