మెల్‌బోర్న్ టెస్ట్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి దారుణంగా విఫలమయ్యారు. రోహిత్, కోహ్లి వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమిండియాలో వారి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. అభిమానులు, మాజీలు, విశ్లేషకులు రో-కో టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటే మంచిదని అభిప్రాయపడుతున్నారు.
విరాట్ మాట అటుంచితే రోహిత్ శర్మపై విమర్శల ధాటి ఎక్కువగా ఉంది. బ్యాటింగ్‌లో వైఫల్యాలతో పాటు రోహిత్ కెప్టెన్సీలోనూ తేలిపోతున్నాడు. గడిచిన ఆరు టెస్ట్ మ్యాచ్‌ల్లో టీమిండియా రోహిత్ సారథ్యంలో ఐదింట ఓడింది. ఆన్ ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ నిర్ణయాలు తీసుకోవడంలో రోహిత్ తేలిపోతున్నాడు. మైదానంలో సహచరులపై అరవడం తప్పించి రోహిత్ చేస్తున్నదేమీ లేదు.
విరాట్ విషయానికొస్తే.. ఈ సిరీస్‌లో అతను చేసిన తప్పులనే (ఆఫ్ సైడ్ బంతులను నిక్ చేయడం) పదేపదే చేస్తూ విసుగుతెప్పిస్తున్నాడు. ఆడిన ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఆరింట ఆఫ్ సైడ్ బంతులను నిక్ చేసి వికెట్ పారేసుకున్నాడు.
ఈ సిరీస్‌లో రోహిత్, విరాట్ గణాంకాలు పరిశీలిస్తే.. భారత క్రికెట్ అభిమాని రక్తం ఉడికిపోతుంది. రోహిత్ 5 ఇన్నింగ్స్‌ల్లో 6.2 సగటున 31 పరుగులు చేయగా.. విరాట్ 7 ఇన్నింగ్స్‌ల్లో 27.8 సగటున 167 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో విరాట్ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ అయినా చేశాడు. రోహిత్ అయితే రెండంకెల స్కోర్ చేసేందుకు కూడా చాలా కష్టపడ్డాడు. తమపై విమర్శల దాడి ఎక్కువైన నేపథ్యంలో రోహిత్, విరాట్ తమ అసమర్ధతను బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. ఇక చేసేదేమీ లేదని చేతులెత్తేస్తున్నారు.
బీసీసీఐ, భారత సెలెక్టర్లు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే రో-కోను ఐదో టెస్ట్ కూడా ఆడించాల్సి వస్తుంది. ఆఖరి టెస్ట్‌లో వీరిద్దరు తుది జట్టులో ఉంటే టీమిండియాకు ఒరిగేదేమీ ఉండకపోగా నష్టం వాటిల్లుతుంది. ఇకనైనా వారు తాము జట్టుకు భారంగా మారామని స్వతాహాగా తప్పుకుంటే మంచిది. లేదంటే టీమిండియా ఆఖరి టెస్ట్‌లోనూ దారుణంగా ఓడిపోయి, సిరీస్ కూడా కోల్పోవాల్సి వస్తుంది.
'కింగ్' చనిపోయాడు..!
కోహ్లి వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆసీస్ మాజీ క్రికెటర్ సైమన్ కాటిచ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లి ఇకపై కింగ్ ఏమాత్రమూ కాదు. కింగ్ చనిపోయాడు. కొత్త కింగ్ బుమ్రా అంటూ కాటిచ్ ఘాటు కామెంట్స్ చేశాడు.
కాగా, మెల్‌బోర్న్ టెస్ట్‌లో టీమిండియా 184 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని ఎదుర్కొంది. 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (84), రిషబ్ పంత్ (30) టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. తాజా ఓటమితో ఐదు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకపడి పోయింది. ఐదో టెస్ట్ సిడ్నీ వేదికగా వచ్చే ఏడాది జనవరి 3 నుంచి ప్రారంభమవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment