T20I
-
పాకిస్తాన్ రికార్డు..టాప్-6లో మూడు సార్లు భారత్
పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. దాయాది జట్టు ఓ క్యాలెండర్ ఇయర్లో (పొట్టి ఫార్మాట్లో) అత్యధిక విజయాల శాతం కలిగిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. పాక్ 2018లో 89.47 శాతం విజయాలు సాధించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాల శాతం కలిగిన జట్ల జాబితాలో పాకిస్తాన్ తర్వాతి స్థానంలో భారత్ ఉంది. భారత్ టీ20ల్లో ఈ ఏడాది 83.33 శాతం విజయాలు సాధించింది. పాక్, భారత్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. టీ20ల్లో ఆస్ట్రేలియా ఈ ఏడాది 77.77 శాతం విజయాలు సాధించింది. టీ20ల్లో అత్యధిక విజయాల శాతం కలిగిన టాప్-6 జట్ల జాబితాలో టీమిండియా మూడు స్థానాల్లో నిలిచింది. భారత్ రెండు, నాలుగు, ఆరు స్థానాల్లో ఉంది.ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక విజయాల శాతం (టీ20ల్లో) కలిగిన జట్ల జాబితా..పాకిస్తాన్-89.47 (2018)భారత్- 83.33 (2024)ఆస్ట్రేలియా- 77.77 (2024)భారత్- 73.68 (2018)ఆఫ్ఘనిస్తాన్- 73.33 (2016)భారత్- 71.43 (2016)కాగా, పాకిస్తాన్ జట్టు నవంబర్ 14 నుంచి ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొంటుంది. నవంబర్ 14, 16, 18 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ సిరీస్‌కు ముందు పాక్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడింది. ఇందులో పాక్ ఆసీస్‌ను 2-1 తేడాతో ఓడించింది. మరోవైపు భారత్ ప్రస్తుతం సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగిశాయి. ఇరు జట్లు తలో మ్యాచ్ గెలిచాయి. మూడో టీ20 సెంచూరియన్ వేదికగా రేపు జరుగనుంది. -
సికిందర్ రజా ఊచకోత.. టీ20 క్రికెట్లో పెను సంచలనం
-
హైదరాబాద్‌లో ధనాధన్‌కు సై
తొలి టి20లో సులువైన విజయం... రెండో టి20లో మరీ ఎదురు లేని ఆధిపత్యం... సిరీస్ గెలుచుకున్న తర్వాత ఇక మూడో టి20లో భారత్ చేయాల్సిందేముంది...అదే జోరు కొనసాగించి అభిమానులకు మరింత ఆనందం పంచడం... గత రెండు మ్యాచ్‌లు ఆడని ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం... బంగ్లాదేశ్‌తో చివరి టి20కి ముందు భారత టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన ఇది... మరో వైపు బంగ్లాదేశ్ పరిస్థితి మరీ పేలవం... టెస్టు సిరీస్‌ను 0–2తో కోల్పోయిన తర్వాత టి20 సిరీస్ కూడా చేజారిపోయింది... ఇక మిగిలింది ఏకైక మ్యాచ్‌లో ఎంతో కొంత మెరుగ్గా రాణించి పరువు కాపాడుకోవడం... ఈ నేపథ్యంలో హైదరాబాద్ అభిమానుల కోసం ధనాధన్ పోరుకు రంగం సిద్ధమైంది. సాక్షి, హైదరాబాద్: ఏడాది ఆరంభంలో భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ వినోదాన్ని ఆస్వాదించిన నగర అభిమానులకు ఇప్పుడు దసరా రోజున టి20 ఆనందానికి సమయం ఆసన్నమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నేడు భారత్, బంగ్లాదేశ్ జట్లు మూడో టి20 మ్యాచ్‌లో తలపడనున్నాయి. ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న సూర్యకుమార్ బృందం క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టగా...ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి స్వదేశం వెళ్లాలని బంగ్లా భావిస్తోంది. అయితే టీమిండియా జోరు చూస్తే జట్టును నిలువరించడం ప్రత్యరి్థకి దాదాపు అసాధ్యం కావచ్చు. హర్షిత్ రాణాకు చోటు! సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో అవకాశం దక్కని ఆటగాళ్లు నలుగురు ఉన్నారు. వీరిలో ఇక్కడ ఎవరు ఆడతారనేది ఆసక్తికరం. మయాంక్ స్థానంలో మరో కొత్త ఆటగాడు హర్షిత్ రాణాను ఎంపిక చేయడం దాదాపు ఖాయంగా అనిపిస్తోంది. 2024 ఐపీఎల్లో కోల్‌కతా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ హర్షిత్‌కు తొలి అవకాశం ఇవ్వాలని కోచ్ గంభీర్ భావిస్తున్నాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను కూడా ఆడించవచ్చు. ప్రస్తుత పరిస్థితిలో కీపర్ జితేశ్ శర్మకు చాన్స్ కష్టమే. అయితే హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మను తుది జట్టులోకి ఎంచుకుంటారా చూడాలి. సామ్సన్, సూర్యకుమార్, రింకూ, పాండ్యా, పరాగ్‌లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ మళ్లీ చెలరేగితే భారీ స్కోరు ఖాయం. సన్‌రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మకు ఈ మైదానంలో విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన చూపించిన రికార్డు ఉంది. అతడిని ఆపడం కూడా బంగ్లాకు కష్టమే. గెలిపించేదెవరు? బంగ్లాదేశ్ టి20 టీమ్ చాలా కాలంగా వైఫల్యాల్లోనే ఉంది. ఈ సిరీస్‌లో కూడా అది కొనసాగింది. ఏ ఒక్కరిలో కూడా జట్టును గెలిపించే సామర్థ్యం కనిపించడం లేదు. ఆటగాళ్లు మారినా జట్టు పరిస్థితి మారడం లేదు. అంతా సమష్టిగా విఫలమవుతున్నారు. ఢిల్లీ మ్యాచ్‌లో బౌలర్లలో పదును లేక భారత్ భారీ స్కోరు చేసే అవకాశం కల్పించగా, బ్యాటర్లెవరూ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. పర్వేజ్, లిటన్ దాస్, కెపె్టన్ నజ్ముల్, తౌహీద్...ఎవరూ ఆడటం లేదు. ఈ సారి జాకీర్ స్థానంలో మహేదీకి అవకాశం దక్కవచ్చు. జట్టులో అందరికంటే సీనియర్ అయిన మహ్ముదుల్లా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20లనుంచి రిటైర్ అవుతున్నాడు. చివరిదైన తన 141వ మ్యాచ్‌లోనైనా అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపిస్తాడా చూడాలి. మిరాజ్, తస్కీన్, తన్జీమ్లతో పాటు అనుభవజు్ఞడైన ముస్తఫిజుర్ కూడా ప్రభావం చూపలేకపోతున్నాడు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), సామ్సన్, అభిషేక్, నితీశ్ రెడ్డి, రింకూ, పాండ్యా, పరాగ్/ తిలక్, సుందర్, వరుణ్, అర్‡్షదీప్, హర్షిత్. బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్ ), పర్వేజ్, లిటన్‌దాస్, తౌహీద్, మహ్ముదుల్లా, మిరాజ్, మహేదీ, రిషాద్, తన్జీమ్, తస్కీన్, ముస్తఫిజుర్. పిచ్, వాతావరణం ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లు నమోదు కావచ్చు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ వర్షం కురిసింది. మ్యాచ్ రోజున కూడా వాన పడే అవకాశం ఉంది. అయితే కొద్ది సేపు అంతరాయం మినహా పూర్తిగా మ్యాచ్‌కు ఆటంకం కలగకపోవచ్చు. చెలరేగుతారా! సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిగా నితీశ్ రెడ్డి ఇదే మైదానంలో చూపించిన దూకుడు అతనికి భారత జట్టులో చోటు కల్పించింది. ఇప్పుడు టీమిండియా ప్లేయర్‌గా అతను తొలిసారి ఉప్పల్ మైదానంలో బరిలోకి దిగబోతున్నాడు. ఈ ఆంధ్ర క్రికెటర్ బంగ్లాపై గత మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఇక్కడా అదే ధాటిని ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నాడు. ఐపీఎల్లో ముంబైకి ఆడే మరో హైదరాబాదీ తిలక్ వర్మ కూడా సొంతగడ్డపై బరిలోకి దిగాలని ఆశిస్తున్నాడు. వీరిద్దరూ బాగా ఆడితే దసరా రోజు అభిమానులకు పరుగుల పండగే. -
మెరిసిన సూర్య.. అదరగొట్టిన బౌలర్లు! తొలి టీ20 భారత్‌దే (ఫోటోలు)
-
పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో టీమిండియా స్టార్
టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరుసటి రోజే మరో టీమిండియా స్టార్ ఆటగాడు పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. జడ్డూ మిగతా ఫార్మాట్లలో (వన్డే, టెస్ట్) కొనసాగుతానని స్పష్టం చేశాడు. పొట్టి ప్రపంచకప్ గెలవడంతో తన కల నిజమైందని అన్నాడు. టీ20 కెరీర్లో వరల్డ్‌కప్ గెలవడం అత్యుత్తమమని తెలిపాడు. కెరీర్లో తనకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలని పేర్కొన్నాడు. చివరిగా జై హింద్ అని రాసుకొచ్చాడు. 35 ఏళ్ల రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20ల్లో 74 మ్యాచ్‌లు ఆడి 127.2 స్టయిక్‌రేట్‌తో 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు.కాగా, సౌతాఫ్రికాతో నిన్న జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. పొట్టి ఫార్మాట్లో భారత్‌కు ఇది రెండో ప్రపంచకప్. 2007లో (అరంగేట్రం ఎడిషన్) ధోని సారథ్యంలో పొట్టి ప్రపంచకప్ గెలిచిన భారత్... తాజాగా రోహిత్ శర్మ నేతృత్వంలో రెండోసారి జగజ్జేతగా నిలిచింది. నిన్న జరిగిన ఫైనల్లో విరాట్ కోహ్లి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. టీమిండియా వరల్డ్‌కప్ గెలిచిన అనంతరం కోహ్లి, రోహిత్ అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు గుడ్ బై చెప్పారు. -
టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ.. కేవలం 27 బంతుల్లోనే.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
టీ20 ఫార్మాట్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదైంది. సైప్రస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ 27 బంతుల్లోనే శతక్కొట్టాడు. పొట్టి క్రికెట్ చరిత్రలోనే ఇది వేగవంతమైన శతకం. పురుషులు, మహిళలు, అంతర్జాతీయ స్థాయి.. ఇలా ఏ విభాగంలో చూసినా ఇదే వేగవంతమైన సెంచరీ. అంతర్జాతీయ టీ20ల్లో నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాప్టీ ఈటన్ నమోదు చేసిన ఫాస్టెస్ట్ సెంచరీని సాహిల్ చౌహాన్ కేవలం నాలుగు నెలల్లో బద్దలు కొట్టాడు. లాఫ్టీ ఈటన్ ఈ ఏడాది (2024) ఫిబ్రవరి 27న నేపాల్‌పై 33 బంతుల్లో శతక్కొట్టాడు. అంతర్జాతీయ టీ20ల్లో సాహిల్ సెంచరీకి ముందు ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. టీ20 ఫార్మాట్ మొత్తంలో చూసినా ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. సాహిల్‌కు ముందు ఈ రికార్డు విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 2013 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున ఆడుతూ పూణే వారియర్స్‌పై 30 బంతుల్లో శతక్కొట్టాడు. తాజాగా సాహిల్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. సైప్రస్‌తో మ్యాచ్‌లో ఓవరాల్‌గా 41 బంతులు ఎదుర్కొన్న సాహిల్ 144 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా 18 సిక్సర్లు ఉన్నాయి. పురుషుల అంతర్జాతీయ టీ20ల్లో (ఓ ఇన్నింగ్స్‌లో) ఓ బ్యాటర్ సాధించిన అత్యధిక సిక్సర్లు ఇవే. సాహిల్ సునామీ శతకంతో విరుచుకుపడటంతో సైప్రస్‌పై ఎస్టోనియా ఘన విజయం సాధించింది. -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన హసరంగ
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి క్రికెట్లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. హసరంగకు ముందు ఈ రికార్డు దిగ్గజ పేసర్ లసిత్ మలింగ పేరిట ఉండేది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (జూన్ 7) జరిగిన మ్యాచ్‌లో హసరంగ.. మలింగ రికార్డును అధిగమించాడు.మలింగ 84 అంతర్జాతీయ టీ20ల్లో 107 వికెట్లు పడగొట్టగా.. హసరంగ తన 67వ టీ20 మ్యాచ్‌లోనే ఈ మార్కును దాటాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తౌహిద్ హ్రిదోయ్ వికెట్ పడగొట్టడం ద్వారా హసరంగ (108 వికెట్లు) శ్రీలంక తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. ఈ మ్యాచ్‌లో హసరంగ హ్రిదోయ్ వికెట్‌తో పాటు మరో వికెట్ (లిట్టన్ దాస్) కూడా పడగొట్టాడు.ఈ మ్యాచ్‌లో హసరంగతో పాటు నువాన్ తుషార (4-0-18-4), మతీశ పతిరణ (4-0-27-1), ధనంజయ డిసిల్వ (2-0-11-1) సత్తా చాటినా శ్రీలంక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక అత్యంత పేలవంగా బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్ నిస్సంక (47) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్ హొసేన్, ముస్తాఫిజుర్ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్ అహ్మద్ 2, తంజిమ్ హసన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. లంక బౌలర్లు ప్రతిఘటించినప్పటికీ మరో ఓవర్ మిగిలుండగానే (8 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. లిటన్ దాస్ (36), తౌహిద్ హ్రిదోయ్ (40), మహ్మదుల్లా (16 నాటౌట్) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి బంగ్లాదేశ్‌కు 2 వికెట్ల తేడాతో విజయాన్నందించారు.టీ20ల్లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..హసరంగ-108 వికెట్లుమలింగ- 107కులశేఖర- 66అజంత మెండిస్-66దుష్మంత చమీరా-55 -
Namibia: చిన్న జట్టే అయినా ఇరగదీసింది.. ఆస్ట్రేలియాకు సైతం సాధ్యం కాలేదు..!
అంతర్జాతీయ టీ20ల్లో పసికూన నమీబియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. పొట్టి ఫార్మాట్లో ఈ జట్టు వరుసగా తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. తాజాగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా మాజీ వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాకు సైతం సాధ్యంకాని తొమ్మిది వరస విజయాల రికార్డును సాధించింది. తద్వారా ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 18వ జట్టుగా రికార్డుల్లోకెక్కింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాల రికార్డు మలేసియా పేరిట ఉంది. ఈ జట్టు జూన్ 2022-డిసెంబర్ 2022 మధ్యలో వరుసగా 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వరుస విజయాలు సాధించిన జట్లు.. మలేసియా (13 వరుస విజయాలు) బెర్ముడా (13) ఆఫ్ఘనిస్తాన్ (12) రొమేనియా (12) ఇండియా (12) ఆఫ్ఘనిస్తాన్ (11) ఉగాండ (11) పపువా న్యూ గినియా (11) నైజీరియా (11) జెర్సీ (10) టాంజానియా (10) ఉగాండ (10) ఉగాండ (10) పాకిస్తాన్ (10) న్యూజిలాండ్ (10) పోర్చుగల్ (9) సౌదీ అరేబియా (9) నమీబియా (9*) కాగా, ట్రై సిరీస్‌లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‌లో నమీబియా 20 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా.. లాఫ్టీ ఈటన్ (36 బంతుల్లో 101; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) ఫాస్టెస్ట్ సెంచరీతో (33 బంతుల్లో) విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. నమీబియా ఇన్నింగ్స్‌లో ఈటన్‌తో పాటు మలాన్ క్రుగెర్ (59 నాటౌట్) రాణించాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్.. గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించినప్పటికీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. ఆ జట్టు 18.5 ఓవర్లలో 186 పరుగులకే పరిమితమై 20 పరగుల తేడాతో ఓటమిపాలైంది. రూబెన్ ట్రంపల్మెన్ (4/29) నేపాల్‌ను దెబ్బకొట్టాడు. నేపాల్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (42) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో రెండో మ్యాచ్ రేపు నేపాల్-నెదర్లాండ్స్ మధ్య జరుగనుంది. -
NZ VS AUS 1st T20: టిమ్ సౌథీ రికార్డు
న్యూజిలాండ్ వెటరన్ బౌలర్ టిమ్ సౌథీ ఆ దేశం తరఫున అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా అవతరించాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియాతో ఇవాళ (ఫిబ్రవరి 21) జరిగిన మ్యాచ్‌లో ఆడటం ద్వారా సౌథీ ఈ ఘనతను సాధించాడు. సౌథీ ఈ రికార్డును సాధించే క్రమంలో మార్టిన్ గప్తిల్‌ను అధిగమించాడు. గప్తిల్ న్యూజిలాండ్ తరఫున 122 టీ20లు ఆడగా.. సౌథీ ఇవాల్టి మ్యాచ్‌తో కలుపుకుని 123 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సౌథీ, గప్తిల్ తర్వాత న్యూజిలాండ్ తరఫున అత్యధిక టీ20లు ఆడిన రికార్డు ఐష్ సోధి పేరిట ఉంది. సోధి తన టీ20 కెరీర్లో 110 మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన రికార్డు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ టీమిండియా తరఫున ఇప్పటివరకు 151 మ్యాచ్‌లు ఆడాడు. మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరింతగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ చివరి బంతికి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేయగా.. టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చివరి బంతికి బౌండరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు. ఆసీస్ గెలుపులో మిచెల్ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) కీలకపాత్ర పోషించాడు. ఈ గెలుపుతో ఆసీస్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. -
రింకూ సింగ్‌ను మించినోడే లేడు.. ఈ గణంకాలు చూడండి..!
పొట్టి క్రికెట్లో టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా ఎవరికీ సాధ్యంకాని రికార్డులతో దూసుకుపోతున్నాడు. తాజాగా రింకూ ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఐసీసీ పుల్ మెంబర్ జట్లలో 10 టీ20 ఇన్నింగ్స్‌ల తర్వాత అత్యధిక స్ట్రయిక్‌రేట్, సగటు కలిగిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. Rinku Singh is here to rule!🔥 pic.twitter.com/4ro8aF6DWN — CricTracker (@Cricketracker) January 16, 2024 రింకూ తన 10 ఇన్నింగ్స్‌ల్లో 176.07 స్ట్రయిక్‌రేట్‌తో 71.75 సగటున ఓ హాఫ్ సెంచరీ సాయంతో 287 పరుగులు చేశాడు. రింకూ 10 ఇన్నింగ్స్‌ల్లో ఆరింట నాటౌట్‌గా నిలిచాడు. రింకూ ఖాతాలో 29 ఫోర్లు, 14 సిక్సర్లు ఉన్నాయి. ఈ గణాంకాలు చూసి పొట్టి క్రికెట్లో రింకూను మించినోడే లేడని భారత క్రికెట్ అభిమానులు అంటున్నారు. 10 టీ20 ఇన్నింగ్స్‌ల అనంతరం అత్యధిక సగటు, స్ట్రయిక్‌రేట్ కలిగిన ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది. రింకూ సింగ్-176.07 స్ట్రయిక్‌రేట్‌తో 71.75 సగటు మిస్బా ఉల్ హాక్- 135 స్ట్రయిక్‌రేట్‌తో 67.60 సగటు డెవాన్ కాన్వే- 151 స్ట్రయిక్‌రేట్‌తో 65.43 సగటు కేఎల్ రాహుల్- 151 స్ట్రయిక్‌రేట్‌తో 56.75 సగటు ఆండ్రూ సైమండ్స్- 170 స్ట్రయిక్‌రేట్‌తో 56.17 సగటు బాబర్ ఆజమ్- 123 స్ట్రయిక్‌రేట్‌తో 54.86 సగటు అంతర్జాతీయ టీ20ల్లో రింకూ సింగ్ స్కోర్లు.. ఆఫ్ఘనిస్తాన్‌తో రెండో టీ20 9 నాటౌట్ ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి టీ20 16 నాటౌట్ సౌతాఫ్రికాతో మూడో టీ20 14 సౌతాఫ్రికాతో రెండో టీ20 68 నాటౌట్ ఆస్ట్రేలియాతో ఐదో టీ20 6 ఆస్ట్రేలియాతో నాలుగో టీ20 46 ఆస్ట్రేలియాతో రెండో టీ20 31 నాటౌట్ ఆస్ట్రేలియాతో తొలి టీ20 22 నాటౌట్ నేపాల్‌తో టీ20 (ఆసియా క్రీడలు) 37 నాటౌట్ ఐర్లాండ్‌తో రెండో టీ20 38 -
హర్మన్ ప్రీత్ బృందానికి ఊరట
ముంబై: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... ఇంగ్లండ్ జట్టుకు సిరీస్‌ను అప్పగించేసిన తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు తేరుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి పరువు నిలబెట్టుకుంది. దాంతో మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఆశించిన హీతెర్ నైట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ తుదకు సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ సరిగ్గా 20 ఓవర్లలో 126పరుగుల వద్ద ఆలౌటైంది. కెపె్టన్ హీతెర్ నైట్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా, అమీ జోన్స్ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. ఇంగ్లండ్ 76 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో హీతెర్ నైట్, చార్లీ డీన్ (15 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) తొమ్మిదో వికెట్‌కు 50 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఇన్నింగ్స్ చివరి రెండు బంతుల్లో హీతెర్, మహికా గౌర్ (0) అవుటవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత స్పిన్నర్లు సైకా ఇషాక్ (3/22), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయాంక పాటిల్ (3/19) ఇంగ్లండ్ జట్టును దెబ్బ కొట్టారు. సీమర్లు రేణుక సింగ్, అమన్‌జోత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ మహిళల జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే షఫాలీ వర్మ (6) నిష్క్ర మించినా... ఓపెనర్ స్మృతి మంధాన (48 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా (33 బంతుల్లో 29; 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అనంతరం విజయానికి చేరువైన తరుణంలో దీప్తి శర్మ (12), స్మృతి, రిచా ఘోష్ (2) స్వల్పవ్యవధిలో నిష్క్రమించారు. ఉత్కంఠకు దారితీస్తున్న దశలో అమన్‌జోత్ (4 బంతుల్లో 13 నాటౌట్; 3 ఫోర్లు) 19వ ఓవర్లో 3 బౌండరీలు కొట్టి భారత్‌ను గెలిపించింది. ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సివర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ 14 నుంచి డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. -
సిరీస్ వేటలో బౌలర్లపై భారం!
రాయ్‌పూర్: పరుగుల వరద పారిన భారత్, ఆ్రస్టేలియా సిరీస్‌లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. ఇరు జట్లు నేడు జరిగే నాలుగో టి20లో తలపడనున్నాయి. భారత్ ఇప్పటికే 2–1తో ఆధిక్యంలో ఉండగా, ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. అయితే గత పోరులో ఆసీస్‌నుంచి ఎదురైన ప్రతిఘటనను చూస్తే ఇది అంత సులువు కాదు. మ్యాక్స్‌వెల్ సహా పలువురు ఆసీస్ కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవడంతో జట్టు కాస్త బలహీనపడగా...దీనిని భారత్ సానుకూలంగా మార్చుకుంటే సిరీస్ గెలవచ్చు. ముకేశ్ పునరాగమనం... గత మ్యాచ్‌లో ఆడిన జట్టునుంచి పలు మార్పులతో భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. తన పెళ్లి కోసం మూడో మ్యాచ్‌కు దూరమైన పేసర్ ముకేశ్ కుమార్ తిరిగొచ్చాడు. దీంతో గత మ్యాచ్‌లో చెత్తబౌలింగ్ వేసిన ప్రసిధ్ కృష్ణను పక్కనబెట్టొచ్చు. అలాగే శ్రేయస్ అయ్యర్ నాలుగు, ఐదో టి20ల కోసం జట్టులోకి రావడంతో తిలక్‌వర్మ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. దీంతో పాటు అదనంగా జట్టులో చేరిన దీపక్ చహర్‌ను కూడా ఆడించే అవకాశం ఉంది. చహర్‌ను ఎంచుకంటే అర్ష్‌దీప్‌ను పక్కన పెడతారు. స్పిన్నర్ బిష్ణోయ్ మాత్రం మెరుగ్గా ఆడుతుండటంతో అతని స్థానానికి ఢోకా లేదు. అయితే బ్యాటింగ్ విషయంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ సారైనా గెలిపించాల్సిన భారం బౌలర్లదే. భారీ స్కోర్లు నమోదవుతున్న మ్యాచ్‌లలో మెరుగైన బౌలింగ్‌తోనే మ్యాచ్‌ను కాపాడుకోవచ్చు. బ్యాటింగ్‌లో రుతురాజ్ అద్భుత ఫామ్‌తో తానేంటో చూపించగా, సూర్యకుమార్ తన స్థాయిని ప్రదర్శిస్తున్నాడు. ఇషాన్ కిషన్ ఫర్వాలేదనిపించగా...యశస్వి కూడా మరో మ్యాచ్‌లో జోరు చూపించాల్సి ఉంది. అన్నింటికి మించి హైదరాబాదీ తిలక్ వర్మ చెలరేగడం కీలకం. ఈ సిరీస్‌లో ఇంకా అతని ముద్ర కనిపించలేదు. హెడ్ మినహా... ఆరుగురు ఆటగాళ్లు ఇప్పటికే ఆసీస్‌కు వెళ్లిపోవడంతో ఆసీస్ జట్టు మొత్తం కొత్తకొత్తగా కనిపిస్తోంది. వరల్డ్ కప్‌లో ఆడిన ట్రవిస్ హెడ్ ఒక్కడే సిరీస్‌లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు. వేడ్ బ్యాటింగ్ పదును గత మ్యాచ్‌లో కనిపించగా, టిమ్ డేవిడ్ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. షార్ట్, హార్డీ, మెక్‌డెర్మాట్‌లాంటి బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది సందేహమే. బౌలింగ్‌లో కూడా బెహ్రన్‌డార్ఫ్ ఒక్కడే ఆకట్టుకున్నాడు. ఎలిస్, సంఘా విఫలం కాగా, కొత్త ఆటగాడు క్రిస్ గ్రీన్ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. ఓవరాల్‌గా ఆసీస్ మరీ పటిష్టంగా కనిపించకపోయినా... పోరాడేతత్వం ఉన్న జట్టు సభ్యులంతా ఎలాంటి సమయంలోనైనా టీమిండియాను ఇబ్బంది పెట్టగలరు. పిచ్, వాతావరణం సాధారణ బ్యాటింగ్ వికెట్ కాబట్టి మరోసారి భారీ స్కోర్లు ఖాయం. టాస్ గెలిస్తే ఛేజింగ్‌కు మొగ్గుచూపొచ్చు. ఈ గ్రౌండ్లో గతంలో ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్, అదీ వన్డే జరిగింది. ఇది తొలి టి20 కానుంది. మ్యాచ్ రోజు వర్షసూచన లేదు. తుది జట్లు (అంచనా) భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), యశస్వి, రుతురాజ్, ఇషాన్ కిషన్, అయ్యర్, రింకూ సింగ్, అక్షర్, బిష్ణోయ్, చహర్, అవేశ్, ముకేశ్. ఆ్రస్టేలియా: వేడ్ (కెప్టెన్ ), హార్డీ, హెడ్, షార్ట్, మెక్‌డెర్మాట్, డేవిడ్, క్రిస్ గ్రీన్, డ్వార్షుయిస్, ఎలిస్, బెహ్రన్‌డార్ఫ్, సంఘా. -
వస్తాడు.. సునామీలా విరుచుకుపడతాడు..!
-
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం.. 400కు పైగా స్కోర్ నమోదు
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. అర్జెంటీనా మహిళల జట్టు టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్‌ను నమోదు చేసింది. చిలీతో నిన్న జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా రికార్డు స్థాయిలో 427 పరుగులు (వికెట్ నష్టానికి) చేసింది. పొట్టి క్రికెట్లో ఇదే అత్యధిక టీమ్ స్కోర్‌గా (పురుషులు, మహిళలు) చరిత్రకెక్కింది. గతంలో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు బెహ్రయిన్ మహిళల జట్టు పేరిట ఉండేది. ఆ జట్టు 2022లో సౌదీ అరేబియాపై 318 పరుగులు చేసింది. తాజాగా ఈ రికార్డును అర్జెంటీనా బద్దలుకొట్టింది. పురుషుల క్రికెట్ విషయానికొస్తే.. అత్యధిక స్కోర్ రికార్డు నేపాల్ పేరిట ఉంది. తాజాగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో నేపాల్ టీమ్ 314 పరుగుల రికార్డు స్కోర్ చేసింది. ఇద్దరు భారీ సెంచరీలు.. అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి అంతర్జాతీయ టీ20ల్లో తొలిసారి ఓ రేర్ ఫీట్ నమోదైంది. ఓ ఇన్నింగ్స్‌లో తొలిసారి రెండు సెంచరీలు నమోదయ్యాయి. చిలీతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా మహిళా క్రికెటర్లు లూసియా టేలర్ (84 బంతుల్లో 169; 27 ఫోర్లు), అల్బెర్టీనా గలాన్ (84 బంతుల్లో 145 నాటౌట్; 23 ఫోర్లు) భారీ శతకాలు బాదారు. వీరితో పాటు మరియా (16 బంతుల్లో 40 నాటౌట్; 7 ఫోర్లు) కూడా రాణించడంతో అర్జెంటీనా వికెట్ నష్టానికి 427 పరుగులు చేసింది. ఇంత భారీ స్కోర్ చేసినా అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం విశేషం. Argentina Women have registered the highest total in T20Is (Men's or Women's) with 427/1 against Chile Women and also secured an easy win against them. This surpasses the previous record of 318/1 set by Bahrain Women against Saudi Arabia Women. pic.twitter.com/BjxwpW3V9x — CricTracker (@Cricketracker) October 14, 2023 టీ20ల్లో ఐదుసార్లు.. అంతర్జాతీయ టీ20ల్లో ఓ ఇన్నింగ్స్‌లో 2 సెంచరీలు నమోదవ్వడం ఇదే తొలిసారి అయితే టీ20ల్లో మాత్రం ఈ ఫీట్ ఐదుసార్లు నమోదైంది. 2011లో మిడిల్సెక్స్తో జరిగిన మ్యాచ్‌లో గ్లోసెస్టర్‌షైర్ ఇన్నింగ్స్‌లో రెండు సెంచరీలు తొలిసారి నమోదయ్యాయి. ఆతర్వాత 2016 ఐపీఎల్లో ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి సెంచరీలు చేశారు. ఆతర్వాత బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో, 2019 ఐపీఎల్లో (సన్‌రైజర్స్ ఆటగాళ్లు బెయిర్‌స్టో (114), డేవిడ్ వార్నర్ (100 నాటౌట్)), 2022లో బల్గేరియాపై ఇద్దరు చెక్ రిపబ్లిక్ ప్లేయర్లు ఒకే ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేశారు. ఎక్స్‌ట్రాలు 73 పరుగులు.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో చిలీ బౌలర్లు రికార్డు స్థాయిలో 73 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో సమర్పించుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఎక్స్‌ట్రాల రూపంలో ఇన్ని పరుగులు రావడం ఇదే తొలిసారి. టీ20ల్లో అతి భారీ విజయం.. అర్జెంటీనా మహిళల జట్టు అంతర్జాతీయ టీ20ల్లో అతి భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అర్జెంటీనా 427 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన చిలీ 63 పరుగులకే ఆలౌటై, 364 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా.. ఇద్దరు సున్నా స్కోర్లకే పరిమితమయ్యారు. కేవలం ఒక్కరు (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. చిలీ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాలే (29) అత్యధిక స్కోర్ కావడం విశేషం. చిలీ ఇన్నింగ్స్‌లో ఏకంగా నలుగురు రనౌట్లు కావడం మరో విశేషం. -
టీ20ల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సమం
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సమం అయ్యింది. వెస్టిండీస్‌తో ఇవాళ (అక్టోబర్ 2) జరిగిన మ్యాచ్‌లో 20 ఏళ్ల ఆస్ట్రేలియా బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును సమం చేసింది. ఈ మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్ కేవలం 18 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకుని, అప్పటివరకు సోల్‌గా ఫాస్టెస్ట్ టీ20 హాఫ్ సెంచరీ రికార్డును హోల్డ్ చేసిన కివీస్ ప్లేయర్ సోఫీ డివైన్ సరసన చేరింది. 2015 ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో సోఫీ కూడా 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తంగా 19 బంతులు ఎదుర్కొన్న లిచ్‌ఫీల్డ్ 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో లిచ్‌ఫీల్డ్‌కు ముందు ఎల్లిస్ పెర్రీ (46 బంతుల్లో 70; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు అర్ధసెంచరీతో మెరవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో జార్జియా వేర్హమ్ (13 బంతుల్లో 32 నాటౌట్; 6 ఫోర్లు) కూడా చెలరేగడంతో ఆసీస్ 200 పరుగుల మార్కును దాటింది. అంతకుముందు బెత్ మూనీ (22 బంతుల్లో 29; 5 ఫోర్లు), సథర్లాండ్ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) వేగంగా పరుగులు సాధించారు. విండీస్ బౌలర్లలో హేలీ మాథ్యూస్ 3, షమీలియా కొన్నెల్ 2, చినెల్ హెన్రీ ఓ వికెట్ పడగొట్టారు. ఫాస్టెస్ట్ ఫిఫ్టి వృధా.. ఆసీస్ ప్లేయర్ లిచ్‌ఫీల్డ్ టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టితో చెలరేగినప్పటికీ విండీస్‌పై ఆసీస్ విజయం సాధించలేకపోయింది. 213 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన విండీస్.. కెప్టెన్ హేలీ మాథ్యూస్ సూపర్ సెంచరీతో (64 బంతుల్లో 132; 20 ఫోర్లు, 5 సిక్సర్లు) విజృంభించడంతో మరో బంతి మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. మాథ్యూస్‌కు జతగా స్టెఫానీ టేలర్ (41 బంతుల్లో 59; 11 ఫోర్లు) అర్ధసెంచరీతో రాణించడంతో విండీస్ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఫలితంగా విండీస్ 7 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఘన విజయం సాధించింది. ఆసీస్ బౌలర్లలో మెగన్ షట్ 2, జొనాస్సెన్ ఓ వికెట్ పడగొట్టారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఆసీస్, రెండో మ్యాచ్‌లో విండీస్ విజయం సాధించాయి. నిర్ణయాత్మకమైన మూడో టీ20 అక్టోబర్ 5న జరుగుతుంది. 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌తో పాటు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం వెస్టిండీస్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. టీ20 సిరీస్ అనంతరం వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. -
అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు.. 15 పరుగులకే ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో చెత్త రికార్డు నమోదైంది. ఏషియన్ గేమ్స్ వుమెన్స్ క్రికెట్లో మంగోలియా జట్టు 15 పరుగులకే ఆలౌటైంది. ఇండోనేషియాతో ఇవాళ (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్‌లో మంగోలియన్లు ఈ చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోర్‌గా రికార్డైంది. ఇదే ఏడాది స్పెయిన్‌తో జరిగిన పురుషుల టీ20 క్రికెట్ మ్యాచ్‌లో ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌటై, అంతర్జాతీయ టీ20ల్లో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసింది. ఇండోనేషియా-మంగోలియా మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండోనేషియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఓపెనర్ రత్న దేవీ అర్ధసెంచరీతో (48 బంతుల్లో 62; 10 ఫోర్లు) రాణించగా.. మరో ఓపెనర్ నందా సకరిని (35), మరియా వొంబాకీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మంగోలియా బౌలర్లలో మెండ్‌బయార్, నముంజుల్, జర్గల్సై ఖాన్, గన్సుఖ్ తలో వికెట్ పడగొట్టారు. 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మంగోలియా.. ఆరియాని (3-0-8-4), రహ్మావతి (3-2-1-2), రత్న దేవీ (2-0-4-2) ధాటికి 10 ఓవర్లలో 15 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా ఇండోనేషియా 172 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మంగోలియా ఇన్నింగ్స్‌లో మొత్తం ఏడుగురు డకౌట్లు కాగా.. ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోర్లు సాధించలేకపోయారు. ఎక్స్‌ట్రాల రూపంలో, ఓపెనర్ బత్జర్గల్ చేసిన 5 పరుగులే మంగోలియన్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్స్‌గా నిలిచాయి. కాగా, ఆసియా క్రీడల్లో మొట్టమొదటిసారిగా క్రికెట్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళలతో పాటు పురుషుల విభాగంలోనూ ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్ కూడా పాల్గొంటుంది. -
సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో అతి భారీ పరాజయం
సౌతాఫ్రికా క్రికెట్ జట్టు టీ20ల్లో భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా స్వదేశంలో (డర్బన్) ఆస్ట్రేలియాతో నిన్న (ఆగస్ట్ 30) జరిగిన తొలి మ్యాచ్‌లో 111 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన ప్రొటీస్.. అంతర్జాతీయ టీ20ల్లో పరుగుల పరంగా అతి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. పరుగుల పరంగా సఫారీలు టీ20ల్లో ఎదుర్కొన్న భారీ పరాజయాల్లో టాప్-4 ఆసీస్ చేతుల్లోనే కావడం విశేషం. Australia has handed South Africa four out of their five biggest defeats in terms of runs in T20Is.#SAvsAUS pic.twitter.com/rW0OABPfk6 — CricTracker (@Cricketracker) August 31, 2023 నిన్నటి మ్యాచ్ తర్వాత అతి పెద్ద పరాజయాన్ని సౌతాఫ్రికా 2020లో ఎదుర్కొంది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఆ తర్వాత అతి భారీ పరాజయాన్ని కూడా సౌతాఫ్రికా అదే ఏడాది చవిచూసింది. 2020లో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 97 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. దీని తర్వాతి భారీ పరాజయం సౌతాఫ్రికాకు 2006లో ఎదురైంది. నాడు బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 95 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తయ్యారు. ఇలా టీ20ల్లో పరుగుల పరంగా సౌతాఫ్రికా ఎదుర్కొన్న భారీ పరాజయాలన్నీ ఆసీస్ చేతిలోనే కావడం ఆసక్తికరం. ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మిచెల్ మార్ష్ (49 బంతుల్లో 92 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (28 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం 227 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 115 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘా 4 వికెట్లు, మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లతో ప్రోటీస్‌ను దెబ్బతీశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెండ్రిక్స్(56) మినహా అందరూ విఫలమయ్యారు. -
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న తొలి ట్రాన్స్‌జెండర్
అంతర్జాతీయ క్రికెట్లో ట్రాన్స్‌జెండర్ రంగప్రవేశానికి ఐసీసీ ఓకే చెప్పింది. ఆస్ట్రేలియాలో జన్మించిన డేనియల్ మెక్‌గాహె అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా చరిత్ర సృష్టించనుంది. మెక్‌గాహె అంతర్జాతీయ మహిళల టీ20 మ్యాచ్ ఆడేందుకు ఐసీసీ నిర్ధేశించిన అన్ని అర్హత ప్రమాణాలను క్లియర్ చేసింది. మెక్‌గాహె 2024 మహిళల టీ20 వరల్డ్‌కప్ క్వాలిఫయింగ్ పోటీల కోసం ఎంపిక చేసిన కెనడా జట్టులో చోటు దక్కించుకుంది. 2020లో ఆస్ట్రేలియా నుంచి కెనడాకు వలస వెళ్లిన మెక్‌గాహె.. అదే ఏడాది లింగమార్పిడి చేయించుకని మహిళగా మారి, త్వరలో అదే దేశానికి ప్రాతినిథ్యం వహించనుంది. ఐసీసీ నుంచి క్లియెరెన్స్ లభించాక మెక్‌గాహె స్పందిస్తూ.. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించనున్న మొట్టమొదటి వ్యక్తిని అయినందుకు ఆనందంగా, గర్వంగా ఉందని అంది. కాగా, పురుషుడి నుంచి మహిళగా మారి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడాలంటే, సదరు వ్యక్తి పలు మెడికల్ టెస్ట్‌లు క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే వారు పలు రాతపూర్వక హామీలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. -
అంతర్జాతీయ టీ20 మ్యాచ్.. కేవలం 2 బంతుల్లోనే ఖేల్ ఖతం, అత్యంత చెత్త రికార్డులు
స్పెయిన్-ఐసిల్ ఆఫ్ మ్యాన్ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యంత చెత్త రికార్డులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పర్యాటక జట్టు ఐజిల్ ఆఫ్ మ్యాన్ 8.4 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఇన్నింగ్స్‌లో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయకపోగా.. ఏకంగా 6 మంది డకౌట్ అయ్యారు. ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఇన్నింగ్స్‌లో ఒక్క బౌండరీ కూడా నమోదు కాకపోగా.. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 4గా ఉంది. జోసఫ్ బుర్రోస్ 4 పరుగులు చేయగా.. జార్జ్ బుర్రోస్, లూక్ వార్డ్, జాకబ్ బట్లర్ తలో 2 పరుగులు చేశారు. ఐజిల్ ఆఫ్ మ్యాన్ ఆటతీరు ఎంత చెత్తగా సాగిందో ఈ గణంకాలు చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. స్పెయిన్ బౌలర్లలో మహ్మద్ కమ్రాన్ (4-1-4-4), అతీఫ్ మెహమూద్ (4-2-6-4) తలో 4 వికెట్లు పడగొట్టగా, లోర్న్ బర్న్స్ (0.4-0-0-2) 2 వికెట్లు దక్కించుకున్నాడు. అనంతరం 11 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన స్పెయిన్.. కేవలం 2 బంతుల్లోనే ఆటను ముగించింది. తొలి బంతిని జోసఫ్ బుర్రోస్ నో బాల్ వేయగా.. ఆ తర్వాత రెండు బంతులను అవైస్ అహ్మద్ సిక్సర్లుగా మలిచి తన జట్టుకు చారిత్రక విజయాన్ని అందించాడు. ఈ క్రమంలో ఈ మ్యాచ్ పలు చెత్త రికార్డులకు వేదికైంది. పురుషుల అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యల్ప స్కోర్ (10 ఆలౌట్), ఛేదనలో ఫాస్టెస్ట్ రన్‌రేట్ (39), బంతుల తేడా పరంగా విజయం (118 బంతులు) లాంటి చెత్త రికార్డులు ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి. -
వైజాగ్ లో హాట్‌కేకుల్లా అమ్ముడైన మ్యాచ్ టికెట్లు
-
భారత ప్లేయర్‌కు కరోనా.. రెండో టీ20 వాయిదా!
-
బట్లర్ వీర బాదుడు
సౌతాంఫ్టన్: జాస్ బట్లర్ వీర విహారంతో శ్రీలంకతో జరిగిన ఏకైన టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన 20 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. గుణతిలక(26) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జొర్డాన్, డాసన్ మూడేసి వికెట్లు పడగొట్టారు. ప్లంకెట్ 2 వికెట్లు తీశాడు. 141 పరుగుల టార్గెట్ ను 15 బంతులు మిగులుండగానే ఇంగ్లీషు టీమ్ ఛేదించింది. 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఓపెనర్ జాస్ బట్లర్ వీర బాదుడు బాదాడు. అజేయ అర్ధ సెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 49 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు సాధించాడు. మోర్గాన్ 47, విన్స్ 16 పరుగులు చేశారు. రాయ్ డకౌటయ్యాడు. లంక ఆటగాళ్లలో ఏడుగురు బౌలింగ్ చేశారు. మాథ్యూస్ 2 వికెట్లు పడగొట్టాడు. శ్రీలంకతో అంతకుముందు జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్ కైవసం చేసుకుంది.