ముంబై: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... ఇంగ్లండ్ జట్టుకు సిరీస్‌ను అప్పగించేసిన తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు తేరుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి పరువు నిలబెట్టుకుంది. దాంతో మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఆశించిన హీతెర్ నైట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ తుదకు సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ సరిగ్గా 20 ఓవర్లలో 126పరుగుల వద్ద ఆలౌటైంది. కెపె్టన్ హీతెర్ నైట్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా, అమీ జోన్స్ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. ఇంగ్లండ్ 76 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో హీతెర్ నైట్, చార్లీ డీన్ (15 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) తొమ్మిదో వికెట్‌కు 50 పరుగులు జోడించి ఆదుకున్నారు.
ఇన్నింగ్స్ చివరి రెండు బంతుల్లో హీతెర్, మహికా గౌర్ (0) అవుటవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత స్పిన్నర్లు సైకా ఇషాక్ (3/22), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయాంక పాటిల్ (3/19) ఇంగ్లండ్ జట్టును దెబ్బ కొట్టారు. సీమర్లు రేణుక సింగ్, అమన్‌జోత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ మహిళల జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే షఫాలీ వర్మ (6) నిష్క్ర మించినా... ఓపెనర్ స్మృతి మంధాన (48 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా (33 బంతుల్లో 29; 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు.
అనంతరం విజయానికి చేరువైన తరుణంలో దీప్తి శర్మ (12), స్మృతి, రిచా ఘోష్ (2) స్వల్పవ్యవధిలో నిష్క్రమించారు. ఉత్కంఠకు దారితీస్తున్న దశలో అమన్‌జోత్ (4 బంతుల్లో 13 నాటౌట్; 3 ఫోర్లు) 19వ ఓవర్లో 3 బౌండరీలు కొట్టి భారత్‌ను గెలిపించింది. ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సివర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ 14 నుంచి డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment