ఇంగ్లండ్ గడ్డపై టి20 సిరీస్ గెలవాలనే కోరిక టీమిండియా మహిళల జట్టుకు కలగానే మిగిలిపోయింది. గురువారం రాత్రి జరిగిన మూడో టి20లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి భారత్ టాప్-5 బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
ఒక దశలో 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో దీప్తి శఱ్‌మ(25 బంతుల్లో 24 పరుగులు), రిచా ఘోష్(22 బంతుల్లో 33 పరుగులు), పూజా వస్త్రాకర్ 19 పరుగులు నాటౌట్ చేయడంతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లీస్టోన్ 3, సారా గ్లెన్ 2, వాంగ్, డేవిస్, స్మిత్‌లు తలా ఒక వికెట్ తీశారు.
123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లీ 49 పరుగులు, డేనియల్ వ్యాట్ 22 పరుగులతో శుభారంభం అందించారు. అనంతరం అలీస్ క్యాప్సీ(24 బంతుల్లో 38 నాటౌట్), బ్రయాన్ స్మిత్ 13 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించారు. కాగా ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 18న(ఆదివారం) జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment