సిరీస్‌ వేటలో బౌలర్లపై భారం! | India vs Australia 4th T20 today | Sakshi
Sakshi News home page

సిరీస్‌ వేటలో బౌలర్లపై భారం!

Dec 1 2023 12:40 AM | Updated on Dec 1 2023 8:26 AM

India vs Australia 4th T20 today - Sakshi

రాయ్‌పూర్‌: పరుగుల వరద పారిన భారత్, ఆ్రస్టేలియా సిరీస్‌లో మరో సమరానికి రంగం సిద్ధమైంది. ఇరు జట్లు నేడు జరిగే నాలుగో టి20లో తలపడనున్నాయి. భారత్‌ ఇప్పటికే 2–1తో ఆధిక్యంలో ఉండగా, ఈ మ్యాచ్‌లో గెలిస్తే సిరీస్‌ సొంతమవుతుంది. అయితే గత పోరులో ఆసీస్‌నుంచి ఎదురైన ప్రతిఘటనను చూస్తే ఇది అంత సులువు కాదు. మ్యాక్స్‌వెల్‌ సహా పలువురు ఆసీస్‌ కీలక ఆటగాళ్లు స్వదేశానికి వెళ్లిపోవడంతో  జట్టు కాస్త బలహీనపడగా...దీనిని భారత్‌ సానుకూలంగా మార్చుకుంటే సిరీస్‌ గెలవచ్చు.  

ముకేశ్‌ పునరాగమనం... 
గత మ్యాచ్‌లో ఆడిన జట్టునుంచి పలు మార్పులతో భారత్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. తన పెళ్లి కోసం మూడో మ్యాచ్‌కు దూరమైన పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ తిరిగొచ్చాడు. దీంతో గత మ్యాచ్‌లో చెత్తబౌలింగ్‌ వేసిన ప్రసిధ్‌ కృష్ణను పక్కనబెట్టొచ్చు. అలాగే శ్రేయస్‌ అయ్యర్‌ నాలుగు, ఐదో టి20ల కోసం జట్టులోకి రావడంతో తిలక్‌వర్మ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. దీంతో పాటు అదనంగా జట్టులో చేరిన దీపక్‌ చహర్‌ను కూడా ఆడించే అవకాశం ఉంది.

చహర్‌ను ఎంచుకంటే అర్ష్దీప్‌ను పక్కన పెడతారు. స్పిన్నర్‌ బిష్ణోయ్‌ మాత్రం మెరుగ్గా ఆడుతుండటంతో అతని స్థానానికి ఢోకా లేదు. అయితే బ్యాటింగ్‌ విషయంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ సారైనా గెలిపించాల్సిన భారం బౌలర్లదే. భారీ స్కోర్లు నమోదవుతున్న మ్యాచ్‌లలో మెరుగైన బౌలింగ్‌తోనే మ్యాచ్‌ను కాపాడుకోవచ్చు.

బ్యాటింగ్‌లో రుతురాజ్‌ అద్భుత ఫామ్‌తో తానేంటో చూపించగా, సూర్యకుమార్‌ తన స్థాయిని ప్రదర్శిస్తున్నాడు. ఇషాన్‌ కిషన్‌ ఫర్వాలేదనిపించగా...యశస్వి కూడా మరో మ్యాచ్‌లో జోరు చూపించాల్సి ఉంది. అన్నింటికి మించి హైదరాబాదీ తిలక్‌ వర్మ చెలరేగడం కీలకం. ఈ సిరీస్‌లో ఇంకా అతని ముద్ర కనిపించలేదు.  

హెడ్‌ మినహా... 
ఆరుగురు ఆటగాళ్లు ఇప్పటికే ఆసీస్‌కు వెళ్లిపోవడంతో ఆసీస్‌ జట్టు మొత్తం కొత్తకొత్తగా కనిపిస్తోంది. వరల్డ్‌ కప్‌లో ఆడిన ట్రవిస్‌ హెడ్‌ ఒక్కడే సిరీస్‌లో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు. వేడ్‌ బ్యాటింగ్‌ పదును గత మ్యాచ్‌లో కనిపించగా, టిమ్‌ డేవిడ్‌ అంచనాలను అందుకోలేకపోతున్నాడు.

షార్ట్, హార్డీ, మెక్‌డెర్మాట్‌లాంటి బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపిస్తారనేది సందేహమే. బౌలింగ్‌లో కూడా బెహ్రన్‌డార్ఫ్‌ ఒక్కడే ఆకట్టుకున్నాడు. ఎలిస్, సంఘా విఫలం కాగా, కొత్త ఆటగాడు క్రిస్‌ గ్రీన్‌ ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. ఓవరాల్‌గా ఆసీస్‌ మరీ పటిష్టంగా కనిపించకపోయినా... పోరాడేతత్వం ఉన్న జట్టు సభ్యులంతా ఎలాంటి సమయంలోనైనా టీమిండియాను ఇబ్బంది పెట్టగలరు.

పిచ్, వాతావరణం
సాధారణ బ్యాటింగ్‌ వికెట్‌ కాబట్టి మరోసారి భారీ స్కోర్లు ఖాయం. టాస్‌ గెలిస్తే ఛేజింగ్‌కు మొగ్గుచూపొచ్చు. ఈ గ్రౌండ్‌లో గతంలో ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్, అదీ వన్డే జరిగింది. ఇది తొలి టి20 కానుంది. మ్యాచ్‌ రోజు వర్షసూచన లేదు.

తుది జట్లు (అంచనా)
భారత్‌: సూర్యకుమార్‌ (కెప్టెన్ ), యశస్వి, రుతురాజ్, ఇషాన్‌ కిషన్, అయ్యర్, రింకూ సింగ్, అక్షర్, బిష్ణోయ్, చహర్, అవేశ్, ముకేశ్‌.  
ఆ్రస్టేలియా: వేడ్‌ (కెప్టెన్ ), హార్డీ, హెడ్, షార్ట్, మెక్‌డెర్మాట్, డేవిడ్, క్రిస్‌ గ్రీన్, డ్వార్‌షుయిస్, ఎలిస్,  బెహ్రన్‌డార్ఫ్, సంఘా. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement