
నేడు ఆస్ట్రేలియా ‘ఎ’తో భారత మహిళల హాకీ జట్టు పోరు
పెర్త్: భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆ్రస్టేలియా పర్యటనలో కూర్పుపై కసరత్తులు చేయనున్నట్లు భారత మహిళల హాకీ జట్టు చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ వెల్లడించాడు. ఈ టూర్‌లో భాగంగా భారత అమ్మాయిల జట్టు ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో రెండు మ్యాచ్‌లు... ప్రధాన జట్టుతో 3 మ్యాచ్‌లు ఆడనుంది. పెర్త్ వేదికగా శనివారం ఆ్రస్టేలియా ‘ఎ’తో సలీమా టెటె సారథ్యంలోని భారత జట్టు తలపడుతోంది. మే 1, 3, 4న వరసగా ఆస్ట్రేలియా సీనియర్ జట్టుతో టీమిండియా మ్యాచ్‌లు ఆడనుంది.
భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య ఇప్పటి వరకు 16 మ్యాచ్‌లు జరగగా... అందులో ఆసీస్ 10 మ్యాచ్‌ల్లో గెలవగా... భారత్ మూడు విజయాలు సాధించింది. ఈ నేపథ్యంలో హరేంద్ర మాట్లాడుతూ... ఇటీవల బెంగళూరులో నిర్వహించిన జాతీయ శిబిరం ప్లేయర్లకు ఉపయోగపడనుందని అన్నాడు. ‘ఈ పర్యటన మా ఆటతీరును పరీక్షించుకునేందుకు తోడ్పడుతుంది. ఇంకా ఏ రంగాల్లో మెరుగు పడాలో అర్థం చేసుకునేందుకు ఆ్రస్టేలియా కంటే మెరుగైన ప్రత్యర్థి ఉండరు.
కూర్పును పరీక్షించడంతో బెంచ్ బలాన్ని మరింత పెంపొందించుకుంటాం. ఆ్రస్టేలియాలాంటి జట్టును వారి సొంతగడ్డపై ఎదుర్కోవడం అతిపెద్ద సవాల్. ఇది మున్ముందు టోర్నీలకు తోడ్పడుతుంది’ అని హరేంద్ర అన్నాడు. ఇటీవల ప్రొ లీగ్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్ నెదర్లాండ్స్‌పై విజయం సాధించి మన అమ్మాయిల జట్టు మంచి టచ్‌లో ఉంది. ఈ పర్యటన కోసం సలీమా సారథ్యంలో 26 మందితో జట్టును ప్రకటించారు. అందులో సీనియర్ గోల్ కీపర్ సవిత, నవ్‌నీత్ కౌర్, డ్రాగ్‌ఫ్లికర్ దీపిక ఉన్నారు.
ఈ సిరీస్ కోసం ఐదుగురు కొత్త అమ్మాయిలు జ్యోతి సింగ్, సుజాత, అజ్మీన, పూజ యాదవ్, మహిమ టెటెకు అవకాశమిచ్చారు. ‘బలమైన ప్రత్యర్థితో పోరుకు సిద్ధంగా ఉన్నాం. మెరుగైన ప్రదర్శన చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతాం. జట్టు కూర్పు పరీక్షించుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ప్రొ లీగ్‌లో యూరప్ అంచె పోటీలు, మహిళల ఆసియా కప్‌నకు ముందు ప్లేయర్లకు ఇది మంచి అనుభవం అవుతుంది’ అని కెపె్టన్ సలీమా వెల్లడించింది.