
మే 27 నుంచి 31 వరకు దక్షిణ కొరియాలో ఈవెంట్
నీరజ్ చోప్రా దూరం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి ప్ పోటీల్లో పాల్గొనే భారత జట్టును శుక్రవారం ప్రకటించారు. కొచ్చిలో గురువారం ముగిసిన ఫెడరేషన్ కప్‌లో రాణించిన క్రీడాకారులను, ఇంతకుముందు ఆసియా చాంపియన్‌షి ప్ అర్హత ప్రమాణాలను అధిగమించిన ప్లేయర్లను భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) ఎంపిక చేసింది.
మే 27 నుంచి 31వ తేదీ వరకు దక్షిణ కొరియాలోని గుమీ నగరంలో జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత్ నుంచి వివిధ విభాగాల్లో కలిపి మొత్తం 59 మంది బరిలోకి దిగుతారు. పలువురు అథ్లెట్స్ ఒకటికి మించి ఈవెంట్స్‌లో పోటీపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జ్యోతి యర్రాజీ, కుంజ రజిత... తెలంగాణ నుంచి నిత్య గంధే, అగసార నందిని భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నారు.
భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఆసియా పోటీలకు దూరంగా ఉంటున్నాడు. స్వదేశంలో మే 24న తన పేరిట జరగనున్న నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ బరిలోకి దిగనుండటంతో అతడిని ఆసియా పోటీలకు ఎంపిక చేయలేదని ఏఎఫ్‌ఐ వివరించింది. 2023లో బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ పోటీల్లో భారత్ 6 స్వర్ణాలు, 12 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి 27 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. జ్యోతి యర్రాజీ 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం, 200 మీటర్లలో రజతం సాధించింది.
భారత అథ్లెటిక్స్ జట్టు
పురుషుల విభాగం:
అనిమేశ్ కుజుర్ (200 మీటర్లు), అను కుమార్, కృషన్ కుమార్ (800 మీటర్లు), యూనుస్ షా (1500 మీటర్లు), అవినాశ్ సాబ్లే (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), గుల్‌వీర్ సింగ్, అభిషేక్ పాల్ (5000 మీటర్లు), గుల్‌వీర్ సింగ్, సావల్ బర్వాల్ (10000 మీటర్లు), ప్రవీణ్ చిత్రావెల్, అబ్దుల్లా అబూబకర్ (ట్రిపుల్ జంప్), సర్వేశ్ కుషారే (హైజంప్), సచిన్ యాదవ్, యశ్‌వీర్ సింగ్ (జావెలిన్ త్రో), సమర్దీప్ సింగ్ (షాట్‌పుట్), తేజస్విన్ శంకర్ (డెకాథ్లాన్), సెర్విన్ సెబాస్టియన్, అమిత్ (20 కిలోమీటర్ల నడక). 4గీ100 మీటర్ల రిలే: ప్రణవ్ ప్రమోద్ గౌరవ్, అనిమేశ్ కుజుర్, మణికంఠ హొబ్లీదార్, అమ్లాన్ బొర్గోహైన్, తమిళరసు, రాగుల్ కుమార్, గురీందర్‌వీర్ సింగ్. 4గీ400 మీటర్ల రిలే: విశాల్, జై కుమార్, టీఎస్ మనూ, రిన్సీ జోసెఫ్, తుషార్ మన్నా, సంతోష్ కుమార్, ధరమ్‌వీర్ చౌధరీ, మోహిత్ కుమార్.
మహిళల విభాగం: నిత్య గంధే (200 మీటర్లు), జ్యోతి యర్రాజీ (100 మీటర్ల హర్డిల్స్), రూపల్ చౌధరీ, విత్యా రాంరాజ్ (400 మీటర్లు), ట్వింకిల్ చౌధరీ, పూజ (800 మీటర్లు), లిల్లీ దాస్, పూజ (1500 మీటర్లు), పారుల్ చౌధరీ, అంకిత (3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్), సంజీవని జాధవ్, సీమా (10000 మీటర్లు), విత్యా రాంరాజ్, అను (400 మీటర్లు), శైలి సింగ్, అన్సీ సోజన్ (లాంగ్‌జంప్), పూజ (హైజంప్), సీమా (డిస్కస్ త్రో), అన్ను రాణి (జావెలిన్ త్రో), అగసార నందిని (హెప్టాథ్లాన్). 4గీ100 మీటర్ల రిలే: నిత్యా గంధే, అభినయ రాజరాజన్, స్నేహ, శ్రాబణి నందా, దానేశ్వరి, సుధీక్ష. 4గీ400 మీటర్ల రిలే: రూపల్, స్నేహ, శుభ, జిస్నా మాథ్యూస్, కుంజ రజిత, సాండ్రామోల్ సాబు.