
సుదిర్మన్ కప్‌లో భారత్‌కు నిరాశ
తొలి లీగ్ మ్యాచ్‌లో డెన్మార్క్ చేతిలో ఓడిన టీమిండియా
జియామెన్ (చైనా): స్టార్ జోడీలు లేకుండానే ప్రతిష్టాత్మక సుదిర్మన్ కప్ ప్రపంచ మిక్స్‌డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన భారత జట్టుకు నిరాశ ఎదురైంది. గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 1–4 తేడాతో డెన్మార్క్ చేతిలో ఓడిపోయింది. ఈ పరాజయంతో భారత జట్టు నాకౌట్ దశకు చేరుకోవాలంటే తదుపరి రెండు మ్యాచ్‌ల్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గాయాల కారణంగా పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం ఈ మెగా ఈవెంట్‌కు దూరంగా ఉన్నాయి.
దాంతో భారత జట్టు విజయావకాశాలన్నీ రెండు సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడ్డాయి. అయితే ఈ రెండింటిలోనూ భారత స్టార్స్ ఆకట్టుకోలేకపోయారు. వెరసి ఈ టోర్నీని భారత జట్టు పరాజయంతో మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌గా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల జంట 13–21, 14–21తో జెస్పెర్ టాఫ్ట్–అమెలీ మేగ్‌లండ్ జోడీ చేతిలో ఓటమి పాలైంది. రెండో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్‌లో భారత రెండో ర్యాంకర్ హెచ్‌ఎస్ ప్రణయ్ 15–21, 16–21తో ప్రపంచ మూడో ర్యాంకర్ ఆండెర్స్ ఆంటోన్సెన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.
మూడో మ్యాచ్‌గా జరిగిన పురుషుల డబుల్స్‌లో హరిహరన్–రూబన్ కుమార్ ద్వయం 7–21, 4–21తో ప్రపంచ నంబర్‌వన్ ఆండెర్స్ స్కారప్–కిమ్ అస్‌ట్రుప్ జోడీ చేతిలో ఓడిపోవడంతో భారత పరాజయం ఖరారైంది. నాలుగో మ్యాచ్‌గా జరిగిన మహిళల సింగిల్స్‌లో భారత నంబర్‌వన్ పీవీ సింధు 20–22, 21–23తో లినె హోమార్క్ జార్స్‌ఫెల్డ్ చేతిలో ఓడిపోయింది.
రెండు గేముల్లోనూ సింధు ఒకదశలో ఆధిక్యంలో ఉన్నా దానిని సది్వనియోగం చేసుకోలేకపోయింది. చివరిదైన ఐదో మ్యాచ్‌గా జరిగిన మహిళల డబుల్స్‌లో తనీషా క్రాస్టో–శ్రుతి మిశ్రా ద్వయం 13–21, 18–21తో నటాషా–అలెగ్జాండ్రా బోయె జంటను ఓడించి భారత్ క్లీన్‌స్వీప్ కాకుండా కాపాడింది. మంగళవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్‌లో మాజీ చాంపియన్ ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది.