
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్పందించాడు. తనకు తన దేశం, దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశాడు. ఓ అథ్లెట్‌గా మరో అథ్లెట్‌ను తన పేరిట జరిగే ఈవెంట్‌కు రమ్మన్నానే తప్ప.. మరో ఉద్దేశం లేదని పేర్కొన్నాడు.
నో చెప్పిన అర్షద్
అసలేం జరిగిందంటే.. కాగా మే నెల (24)లో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ‘నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ ఈవెంట్’ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem)ను ఈ టోర్నీలో పాల్గొనాల్సిందిగా నీరజ్ చోప్రా ఆహ్వానించాడు.
అయితే, తాను ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ ఈవెంట్‌కు రాలేకపోతున్నానని అర్షద్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పహల్గామ్‌లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రదాడి జరగగా.. భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఈ పాశవిక చర్యను ఖండించిన విషయం తెలిసిందే.
‘‘జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడితో హృదయం విదారకంగా మారింది. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా’’ అని నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడు. అయితే, కొంతమంది నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు. ముఖ్యంగా పాక్‌కు చెందిన అర్షద్ నదీమ్‌ను ఈవెంట్‌కు ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ ద్రోహి అంటూ నీరజ్‌ను నిందించారు.
విద్వేష విషం చిమ్ముతున్నారు
ఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘సాధారణంగా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. అయితే, నాకు తప్పుగా అనిపించిన విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో మాత్రం వెనుకడుగు వేయను. ముఖ్యంగా దేశం పట్ల నా ప్రేమపై సందేహాలు, నా కుటుంబ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితే వస్తే అస్సలు రాజీపడను.
అర్షద్ నదీమ్‌ను ఈవెంట్‌కు ఆహ్వానించడం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విద్వేష విషం చిమ్ముతున్నారు. అసభ్యంగా తిడుతున్నారు. మా కుటుంబాన్ని కూడా వదలడం లేదు.
ఓ అథ్లెట్‌గా మరో అథ్లెట్ అయిన అర్షద్‌కు నేను ఆహ్వానం పంపాను. అంతేగానీ అందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లో భాగంగా అత్యుత్తమ అథ్లెట్లను దేశానికి రప్పించి.. ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశాం.
ఇందుకు సంబంధించి సోమవారమే అంటే.. పహల్గామ్ ఘటన కంటే ముందే సదరు అథ్లెట్లకు ఆహ్వానాలు చేరిపోయాయి. ఆ తర్వాత 48 గంటలకు ఘటన జరిగింది. నా వరకు నా దేశం, నా దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యం. అన్నింటికంటే వాటికే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది.
మా అమ్మ తప్పేముంది?
బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశం మొత్తం వారికి అండగా ఉంటుంది. జరిగిన ఘటనతో నా మనసు ఎంతో బాధపడింది. అంతకంటే ఎక్కువ ఆగ్రహాన్నీ తెప్పించింది. మన దేశం ఇందుకు తగిన సమాధానం చెప్పి.. బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నా.
ఓ క్రీడాకారుడిగా చాలా ఏళ్లుగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా. అందుకు ఎంతో గర్విస్తున్నా కూడా. కానీ దేశం పట్ల నా ప్రేమను సందేహిస్తూ ఇలాంటి కామెంట్లు రావడం మనసును బాధించింది.
నన్ను, నా కుటుంబానికి టార్గెట్ చేస్తున్నవాళ్లు.. మాది ఓ సాధారణ కుటుంబం అనే విషయం అర్థం చేసుకోవాలి. నా మీద మీడియాలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నేను స్పందించననే భ్రమలో ఉన్నారేమో.
మీరు చేసే అబద్ధపు ప్రచారాలు ఎన్నటికీ నిజం కావు. మా అమ్మను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారో అర్థం కావడం లేదు. దాదాపు ఏడాది క్రితం తను ఓ తల్లిగా స్పందిస్తూ అమాయకంగా, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు.
ఆరోజు మా అమ్మను ఎంతో మంది ప్రశంసించారు. మరి ఈరోజు అదే మనుషులు ఎందుకు ఇలా తనను కించపరిచేలా మాట్లాడుతున్నారు. నేను మరింత కఠినంగా శ్రమించి దేశానికి మరింత గొప్ప పేరు తెచ్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తా. జై హింద్ ’’ అంటూ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. దేశం పట్ల తన ప్రేమను శంకించేవారికి ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
కాగా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్.. ప్యారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక ప్యారిస్‌లో అర్షద్ రికార్డు స్థాయిలో 2.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం అందుకున్నాడు. కాగా నీరజ్- అర్షద్ టోక్యో, ప్యారిస్ విశ్వక్రీడల సమయంలో కలిసి ఫొటోలు దిగుతూ.. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారు.
ఇక ప్యారిస్‌లో నీరజ్ తృటిలో స్వర్ణం చేజార్చుకున్నా.. అర్షద్ గెలవడం కూడా తమకు సంతోషాన్నిచ్చిందని నీరజ్ తల్లి పేర్కొన్నారు. అర్షద్ కూడా తన కుమారుడి లాంటి వాడేనని.. అతడిని దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. అయితే, తాజా ఘటనల నేపథ్యంలో నీరజ్‌తో పాటు అతడి తల్లిని కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.
చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్