గేదెను బహుమతిగా అందుకోవడం పట్ల పాకిస్తాన్ స్టార్ జావెలిన్ త్రోయర్, ప్యారిస్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ స్పందించాడు. తనకు పిల్లనిచ్చిన మామ ‘ధనవంతుడని’.. గేదెకు బదులు పొలం ఇచ్చి ఉంటే బాగుండేదని సరదాగా వ్యాఖ్యానించాడు. ఒలింపిక్స్-2024 జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను ఏకంగా 92.97 మీటర్ల దూరం విసిరి ప్రపంచ రికార్డు సృష్టించాడు అర్షద్ నదీమ్.
కోట్ల నజరానా
పాకిస్తాన్ నలభై ఏళ్ల నిరీక్షణకు తెరదించి పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్‌పై కాసుల వర్షం కురిసింది. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించిన 15 కోట్ల(భారత్ కరెన్సీలో రూ. 4.5 కోట్లు) రూపాయల నజరానా ప్రకటించగా.. పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ సైతం నగదు ప్రోత్సాహకంతో పాటు 92.97 నేమ్‌ప్లేటుతో ఉన్న కారును అతడికి బహూకరించారు.
పొలం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది!
ఈ నేపథ్యంలో అర్షద్ నదీమ్ మామయ్య అతడికి గేదెను బహుమతిగా ఇవ్వడం వార్తల్లో హైలైట్‌గా నిలిచింది. ఈ విషయం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నిజంగా గేదెనే బహుమతిగా ఇచ్చారు. దానికి బదులు ఓ ఐదెకరాల పొలం ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేది. అయినా.. పర్లేదు.. బర్రె కూడా తక్కువేమీ కాదు కదా!’’ అంటూ జోక్ చేశాడు నదీమ్.
భార్యను ఆటపట్టించిన నదీమ్
ఆ సమయంలో అతడి పక్కనే ఉన్న భార్య ఆయేషా స్పందిస్తూ.. ‘‘మా నాన్న ఈయనకు గేదెను గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నారని నాకసలు తెలియదు. వార్తల్లో చూసిన తర్వాతే ఈ విషయం తెలిసింది’’ అని పేర్కొంది. ఇందుకు బదులుగా.. ‘‘మీ నాన్న ధనికుడే కదా? మరి నాకు కేవలం గేదెను మాత్రమే ఎందుకు ఇచ్చాడు? 5-6 ఎకరాల పొలం ఇవ్వమని చెప్పాను. అయినప్పటికీ అటువైపు నుంచి ఎటువంటి స్పందనా లేదు’’ అంటూ నదీమ్ తన భార్యను ఆటపట్టించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రేమతో ఇచ్చిన బహుమతిని అంతే ప్రేమగా స్వీకరించిన అర్షద్ నదీమ్‌లో హాస్య చతురత కూడా బాగానే ఉందని అతడి అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా బలానికి గేదె ప్రతీక అని.. తమ గ్రామ ఆచారం ప్రకారం.. గేదెను బహుమతిగా పొందడాన్ని గౌరవంగా భావిస్తామని అర్షద్ నదీమ్ మామ పేర్కొన్న విషయం తెలిసిందే.
ఇక ప్యారిస్ ఒలింపిక్స్‌లో అర్షద్ బంగారు పతకం గెలవగా.. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజతంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే, నీరజ్ ఖాతాలోనూ ఒలింపిక్ స్వర్ణం(టోక్యో) ఉండటం విశేషం.
చదవండి: గ్రాండ్ వెల్‌కమ్.. కన్నీళ్లు పెట్టుకున్న వినేశ్ ఫోగట్( వీడియో)
Arshad Nadeem's reaction on his father gifting him a buffalo after winning the Gold medal 😂😂😂
He wanted 5-6 acre plot from his father-in-law and not a buffalo. Man, he's so simple 😭❤️ #Paris2024 pic.twitter.com/EzRv68GyAl— Farid Khan (@_FaridKhan) August 16, 2024
Comments
Please login to add a commentAdd a comment