కామెంట్
దేశ విభజనానంతరం ఎన్నో పరిణామాలు సంభవించాయి. గత నలభై ఏళ్లలో – విభజనకు ముందు తరం రాలిపోయింది. రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. బాలీవుడ్ సినిమాలు మునుపటిలా లేవు. అయినప్పటికీ భారత్, పాక్ మనుషులు ఒకేలా ఉన్నారు. ఒకే ఆహారం తీసుకుంటున్నారు. ఒకే ఒక చోట వేరుపడింది ఎక్కడంటే మతంలో! బ్రిటిష్ వాళ్లు గీసిన మ్యాపులో! దాన్ని దాటగలిగేందుకు ‘పంజాబీయత’కు తగినంత బలమే ఉంది. ఆ బలమే... నీరజ్–అర్షద్ ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోవటానికి కారణం అయింది. వారి క్రీడ మాత్రమే కాదు, వారి సంస్కృతి కూడా ఆ దగ్గరితనాన్ని నిర్ణయించింది. బరిలో ప్రత్యర్థులైనా పరస్పరం సానుకూలంగా మాట్లాడటం, బాంధవ్యాన్ని పంచుకోవటం అసహజత్వానికి దూరంగా ఉన్నాయి.
పంజాబీలు పాకిస్తాన్‌ను ఎలా చూస్తారనే దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అది దేశంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా ఉంటుంది. నిజానికి, బెంగాలీలు బంగ్లాదేశ్‌ను ఎలా చూస్తారనే దానిని అందుకు చాలా దగ్గరి సమాంతరంగా నేను ఊహించుకుంటాను. రెండు రాష్ట్రాలు కూడా విభజన వల్ల తమ దేశాలతో వేరైపోయినప్పటికీ, కోల్పోయిన తమ రెండో సగంతో ఉన్న ఆత్మీయతలు, ఆనాటి అమ్మ ఒడి జ్ఞాపకాలు కొడిగట్టిపోలేదు. కాకపోతే అవి తరాల నుండి తరా లకు సంక్రమిస్తున్నట్లుగా ఉంది.
బహుశా అందుకే నీరజ్ చోప్రా–అర్షద్ నదీమ్‌ల కథ దేశంలోని ఇతర ప్రాంతాలకు ప్రాధాన్యత గల వార్త అయితే, పంజాబీలకు అది – ఇందులో వింతేముందన్నంతగా – ఒక మామూలు సంగతి అయింది. నేను మరికాస్త ముందుకు వెళ్లబోయే ముందు, హరియాణా 1966 వరకు కూడా కొన్ని శతాబ్దాలపాటు అవిభక్త పంజాబ్‌లో ఒక ముఖ్యమైన భాగంగా ఉందన్న సంగతిని మీకు గుర్తు చేయనివ్వండి. లాహోర్, లూథియానా మాదిరిగానే అంబాలా, రోహ్‌తక్ పంజాబీ ప్రాంతాలు.
కాబట్టి, నీరజ్–అర్షద్ ఒకరితో ఒకరు చక్కగా కలిసిపోవటంలో ఆశ్చర్యం లేదు. వారి క్రీడ మాత్రమే కాదు, వారి సంస్కృతి కూడా ఆ దగ్గరితనాన్ని నిర్ణయించింది. ఒకరితో ఒకరికి తమ గ్రెనడా, ఐరోపా, అమెరికా సహ–అథ్లెట్‌ల కంటే ఎక్కువగా ఉమ్మడితనం ఉంది. ఆలింగనం, నవ్వు, ఒకరి గురించి ఒకరు సానుకూలంగా మాట్లాడటం, ఒక బాంధవ్యాన్ని పంచుకోవటం ఇద్దరి మధ్య ఎంతో స్పష్టంగా, అసహజ త్వానికి దూరంగా ఉన్నాయి. ఇలా కాకపోతేనే ఆశ్చర్యం.
వారి తల్లుల విషయంలో కూడా ఇది వాస్తవం. వారు తమ కొడు కుతో తలపడిన వారిని ప్రత్యర్థిగా చూడకపోవటానికి కారణం వారు తమ ‘పంజాబీయత’ను అనుభూతి చెందటమే. నిస్సందేహంగా ఇది, వారు మాట్లాడే విధానంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న సారూప్యాన్ని వివరిస్తోంది. ‘‘నేను నీరజ్ కోసం కూడా ప్రార్థిస్తున్నాను’’ అని అర్షద్ తల్లి రజియా పర్వీన్ చెప్పారు. అదే విధంగా నీరజ్ తల్లి సరోజ్ దేవి కూడా ‘‘అతను కూడా నా కుమారుడి లాంటి వాడే’’ అని చెప్పారు. ‘‘బంగారం గెలుచుకున్న అబ్బాయీ మా బిడ్డే, వెండి గెలుచుకున్న అబ్బాయీ మా బిడ్డే’’ అని ఆమె అన్నారు.
నేనంటున్న పంజాబీ బాంధవ్యం అనే దాని గురించి మొదట నాకు 1980లో తెలిసింది. నేనప్పుడు లాహోర్‌లో ఉన్నాను. దేశ సరి హద్దుల ఆవలి ఆ తొలి పర్యటనలో నేను అటువైపు చేరుకునే వరకు కూడా పాకిస్థాన్‌ను నేను ఒక పరాయి దేశంగానే చూశాను. నిజంగా పరాయి దేశమే. కానీ అక్కడి ప్రజలైతే కచ్చితంగా పరాయి వారు కాదు. అలాగే వారికి నేను అపరిచితుడినీ కాదు, గ్రహాంతరవాసినీ కాదు.
ఒక సాయంత్రం నేను పాత ‘వాప్డా’(వాటర్ అండ్ పవర్ డెవలప్‌మెంట్ అథారిటీ, పాకిస్తాన్) భవనంలోని సల్లూస్ రెస్టారెంట్‌లో కూర్చున్నాక, ఆ రెస్టారెంట్‌లో నేను తప్ప మరొకరు లేకపోవటం గమనించాను. ఒంటరిగానే డిన్నర్ చేసి, త్వరగా బయటికి వెళ్లి పోవటానికి సిద్ధం అయ్యాను. ఎంత పొరపాటు! నేను ఇండియా నుంచి వచ్చిన పంజాబీనని కనిపెట్టిన కొద్ది నిమిషాలకే రెస్టారెంట్ సిబ్బంది నా దగ్గరికి నడుచుకుంటూ వచ్చి మీతో మాట్లాడవచ్చా అని అడిగారు.
నేను అంగీకరించగానే నాతో కలిసి కూర్చున్నారు. ఎంపిక చేసిన ఆహారాన్ని నా కోసం తెప్పించారు. లాహోర్‌లో నేను తప్పక చూడవలసిన ప్రదేశాలు ఏమిటో చెప్పారు. వెచ్చగా ఉన్న రోటీలను బలవంతంగా పక్కన పెట్టించి, తాజాగా చేయించిన పొగలు కక్కే రోటీలను నా ప్లేటులో ఒక దాని పైన ఒకటిగా వెడ్డింగ్ కేక్‌ను తలపించేలా ఇంత ఎత్తున సర్వ్ చేయిస్తూనే ఉన్నారు.
అయితే నేను ఎప్పటికీ మరచిపోలేనివి మాత్రం వారు నన్ను అడిగిన ప్రశ్నలు. ‘‘మీరెప్పుడైనా జలంధర్‌లోని గల్లీ నంబర్ టెన్‌కి వెళ్లారా? అది మా తల్లితండ్రులు నివసించిన ప్రదేశం’’ అని ఒక ప్రశ్న. ‘‘మీరెప్పుడైనా అమితాబ్ బచ్చన్‌ని, రేఖను కలిశారా? నేను వారిని కలవటానికి ఎంతో ఆసక్తిగా ఉన్నాను’’ అని ఇంకో ప్రశ్న. ‘‘ఇందిరా గాంధీ గురించి చెప్పండి. ఆమె గురించి ప్రతిదీ తెలుసుకోవాలని ఉంది నాకు’’ అని అత్యంత ఆశ్చర్యకరమైన మరొక ప్రశ్న.
తమ తల్లితండ్రులు జీవితాన్ని గడిపిన ప్రదేశం గురించి ఆ ప్రదేశం తమది కూడా అన్నంత ఉద్విగ్నంగా, ఉత్సాహంగా వారు ఉన్నారు. భారతదేశం అన్నది వారికి వేరే దేశం అయుండొచ్చు కానీ, వారి తల్లితండ్రులు జన్మించిన ప్రదేశం ఇప్పటికీ తమ ‘ఇల్లే’. అందు వల్ల నేను వారు కోల్పోయిన దేశం నుంచి వెళ్లిన వ్యక్తినే అయినప్పటికీ, వారు మర్చిపోలేని వ్యక్తిని. ‘సల్లూస్’ ద్వారా వారు కనుగొన్న ఒక బాంధవ్య అనుసంధానాన్ని నేను.
ఇప్పుడు, 1980 అంటే... నలభై సంవత్సరాలకు పైమాటే. నాటి నుంచి ఎన్నో పరిణామాలు సంభవించాయి. దేశ విభజనకు ముందు తరం రాలిపోయింది. రాజకీయాల్లో మార్పులు వచ్చాయి. అవి మనల్ని ఆకర్షించటం లేదు. బాలీవుడ్ సినిమాలు మునుపటిలా లేవు. అయినప్పటికీ మనం ఒకేలా ఉన్నాం. ఒకే భాష మాట్లాడుతున్నాం. ఒకే ఆహారం తీసుకుంటున్నాం. ఆఖరికి ఒకేలా శాపగ్రస్థులమై ఉన్నాం. ఒకే ఒక చోట వేరుపడింది ఎక్కడంటే మతంలో, బ్రిటిష్ వాళ్లు గీసిన మ్యాపులో! దాన్ని దాటగలిగేందుకు పంజాబీయతకు తగినంత బలమే ఉంది.
నీరజ్–అర్షద్‌లు ఒకరికొకరు దగ్గరయ్యేలా చేసింది ఇదే. విదేశాలలో భారతీయులు, పాకిస్తానీలు ఒకరికొకరు – వాళ్లు పంజాబీలు అయినా కాకున్నా – కలివిడిగా ఉండేందుకు కూడా కారణం ఇదే. వారు ఒకరి సమక్షంలో ఒకరు సౌకర్యవంతంగా ఉంటారు. తమ గురించి తాము వివరించాల్సిన అవసరం వారికి లేదు. తమను అర్థం చేసుకుంటారని వారికి తెలుసు. ఉమ్మడి సంస్కృతి విభజన రాజకీ యాల కంటే కూడా శక్తిమంతమైనది. ఇది మన రాజకీయ నాయకు లకు అర్థమైతే బాగుండు!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment