కొడితే కొట్టాలిరా ఆసీస్‌ను... | India Vs Australia Head To Head Record Ahead Of The 1st Semi Final In Champions Trophy 2025 | Sakshi
Sakshi News home page

కొడితే కొట్టాలిరా ఆసీస్‌ను...

Published Tue, Mar 4 2025 5:53 AM | Last Updated on Tue, Mar 4 2025 5:53 AM

India Vs Australia Head To Head Record Ahead Of The 1st Semi Final In Champions Trophy 2025

నేడు చాంపియన్స్‌ ట్రోఫీ తొలి సెమీఫైనల్‌

ఆస్ట్రేలియాతో భారత్‌ ‘ఢీ’

జోరు మీదున్న టీమిండియా

బ్యాటింగ్‌పైనే కంగారూల భారం 

మధ్యాహ్నం గం.2:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం  

భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌లు ఏకపక్షంగా మారిపోయాయి... వేర్వేరు  కారణాలతో యాషెస్‌ సమరాలు గత కొన్నేళ్లుగా కళ తప్పాయి... అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పుడు అన్నింటికంటే ఆసక్తికర పోరు అంటే భారత్, ఆ్రస్టేలియా మధ్య  జరిగేదే. ఫార్మాట్‌ ఏదైనా హోరాహోరీ  పోరాటాలు, అత్యుత్తమ స్థాయిలో వ్యక్తిగత ప్రదర్శనలు వెరసి ఇరు జట్ల మధ్య మ్యాచ్‌లను ఆకర్షణీయంగా మార్చేశాయి. 

ఇప్పుడు అభిమానులు ఎదురు చూసినట్లుగా మరోసారి రెండు అగ్రశ్రేణి టీమ్‌ల మధ్య నాకౌట్‌ సమరానికి సర్వం సిద్ధమైంది.  ఐసీసీ టోర్నీల్లో ప్రత్యేకంగా నాకౌట్‌ మ్యాచ్‌లలో భారత్, ఆసీస్‌ మధ్య మ్యాచ్‌ ఉండే తీవ్రతే వేరు... వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ తర్వాత ఈ ఫార్మాట్‌లో ఇరు జట్లు మళ్లీ ఇప్పుడే తలపడబోతున్నాయి. చాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్‌ మ్యాచ్‌కు, వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు మధ్య స్థాయి అంతరం ఎంతో ఉన్నా... ఆసీస్‌ను ఓడించి ఇంటికి పంపిస్తే వచ్చే మజాయే వేరు. ఈ టోర్నీలో లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో గెలిచి టీమిండియా అజేయంగా నిలవగా, అగ్రశ్రేణి ఆటగాళ్లు లేకున్నా... ఇంగ్లండ్‌పై ఛేదన ఆసీస్‌ పట్టుదలను చూపించింది.  

దుబాయ్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో లీగ్‌ దశ తర్వాత ఇప్పుడు అత్యంత కీలక మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. దుబాయ్‌ అంతర్జాతీయ స్టేడియంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్లో మాజీ చాంపియన్లు భారత్, ఆ్రస్టేలియా తలపడనున్నాయి. వనరులు, ఫామ్‌ను బట్టి చూస్తే రోహిత్‌ బృందానిదే అన్ని రకాలుగా పైచేయిగా కనిపిస్తుండగా, చెప్పుకోదగ్గ బౌలింగ్‌ లేని ఆసీస్‌ పూర్తిగా తమ బ్యాటింగ్‌నే నమ్ముకుంది. భారత్‌ స్పిన్‌ చతుష్టయాన్ని 
కంగారులు ఎలా ఎదుర్కొంటారనేదే ఆసక్తికరం.  

అదే జట్టుతో... 
న్యూజిలాండ్‌తో చివరి లీగ్‌కు ముందు పేసర్‌ హర్షిత్‌ రాణాకు విశ్రాంతినిస్తూ జట్టు స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తిని ఎంచుకుంది. తనకు లభించిన ఈ అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్న అతను ఐదు వికెట్లతో తన విలువను ప్రదర్శించాడు. ఆసీస్‌ టాప్‌–7 ఆటగాళ్లలో మ్యాక్స్‌వెల్, స్మిత్‌లకు మాత్రమే వరుణ్‌ను ఎదుర్కొన్న అనుభవం ఉంది. స్టీవ్‌ స్మిత్‌ కూడా 2021 తర్వాతి అతని బౌలింగ్‌లో ఆడలేదు. ఆ తర్వాతే వరుణ్‌ తన బౌలింగ్‌ను మెరుగుదిద్దుకొని మరింతగా రాటుదేలాడు. కాబట్టి అతడిని పక్కన పెట్టి మళ్లీ రెండో పేసర్‌ను ఆడించే అవకాశం లేదు.

 మిగతా ముగ్గురు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్, కుల్దీప్‌ యాదవ్‌ కూడా ఎంతో ప్రభావం చూపిస్తున్నారు. కాబట్టి ఇక్కడి పిచ్‌పై మన నలుగురు స్పిన్నర్లు మంత్రం బాగా పని చేస్తున్నట్లే. షమీకి తోడుగా హార్దిక్‌ పాండ్యా పేస్‌ బౌలింగ్‌ ఓవర్ల కోటా పూర్తి చేయగలిగితే చాలు. బ్యాటింగ్‌లో టాప్‌–3 గత మ్యాచ్‌లో విఫలమైనా... ఈ కీలక పోరులో చెలరేగిపోగల సత్తా వారికి ఉంది. శ్రేయస్‌ అయ్యర్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తుండగా, కేఎల్‌ రాహుల్‌ కూడా రాణించాడు. అయితే రాహుల్‌ తన కీపింగ్‌లో మరింత చురుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అక్షర్‌ బ్యాటింగ్‌లో అంచనాలకు మించి రాణిస్తుండటం సానుకూలాంశం. పాండ్యా దూకుడైన బ్యాటింగ్‌ చివర్లో భారత్‌కు భారీ స్కోరు అందించగలదు. ఓవరాల్‌గా చూస్తే టీమిండియా దాదాపు ఎలాంటి లోపాలు లేకుండా అన్ని రకాలుగా పటిష్టంగా కనిపిస్తోంది.  

బ్యాటర్లు రాణిస్తేనే... 
ముగ్గురు ప్రధాన పేసర్లు స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌ దూరం కావడంతో టోర్నీకి ముందే  ఆ్రస్టేలియా విజయావకాశాలు తగ్గిపోయాయి. అయితే ఇంగ్లండ్‌పై 352 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించడంతో ఆ జట్టు స్థాయి ఏమిటో  కనిపించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ రద్దు కాగా,  అఫ్గానిస్తాన్‌పై కూడా మ్యాచ్‌ ఆగే సమయానికి ఆసీస్‌ విజయం వైపు వెళుతోంది. బ్యాటింగ్‌లో ట్రవిస్‌ హెడ్, ఇన్‌గ్లిస్‌లు దూకుడుగా ఆడగల సమర్థులు కాగా... లబుషేన్, స్మిత్‌ ఇన్నింగ్స్‌ను నడిపించగలరు. మన టీమ్‌పై హెడ్‌ ఆట ఏమిటో కొత్తగా చెపాల్సిన అవసరం లేదు.

 చివర్లో కేరీ, మ్యాక్స్‌వెల్‌ వేగంగా పరుగులు రాబట్టగలరు. షార్ట్‌ గాయంతో దూరం కావడంతో అతని స్థానంలో వచ్చిన ఆల్‌రౌండర్‌ కూపర్‌ కనోలీ బరిలోకి  దిగుతాడు. బ్యాటింగ్‌తో పాటు అతని లెఫ్టార్మ్‌ స్పిన్‌ కూడా కీలకం కానుంది. రెగ్యులర్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా ఒక్కడే కాగా, మ్యాక్స్‌వెల్‌పై అదనపు భారం ఉంది. పిచ్‌ను బట్టి చూస్తే ముగ్గురు పేసర్లుతో ఆసీస్‌ ఆడుతుందా అనేది సందేహమే. డ్వార్‌షూయిస్‌ స్థానంలో మరో స్పిన్నర్‌ తన్వీర్‌ సంఘాను  ఎంచుకునే అవకాశం కూడా ఉంది. స్పిన్, అనుభవం లేని పేస్‌తో భారత్‌ను నిలువరించడం అంత సులువు కాదు కాబట్టి అనుభవజ్ఞులైన బ్యాటర్లపై జట్టు ఆధారపడుతోంది.  

పిచ్, వాతావరణం 
టోర్నీలో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌ల తరహాలోనే ఇప్పుడూ నెమ్మదైన పిచ్‌ సిద్ధంగా ఉంది. స్పిన్నర్లు సహజంగానే ప్రభావం చూపిస్తారు. టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోవడం ఖాయం.  

తుది జట్ల వివరాలు (అంచనా) 
భారత్‌: రోహిత్‌ (కెపె్టన్‌), గిల్, కోహ్లి, అయ్యర్, రాహుల్, అక్షర్, పాండ్యా, జడేజా, కుల్దీప్, షమీ, వరుణ్‌.  
ఆ్రస్టేలియా: స్మిత్‌ (కెప్టెన్‌), హెడ్, ఇన్‌గ్లిస్, లబుõÙన్, కనోలీ, కేరీ, మ్యాక్స్‌వెల్, ఎలిస్, స్పెన్సర్, జంపా, డ్వార్‌షుయిస్‌/సంఘా. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement