నేడు భారత్, బంగ్లాదేశ్ చివరి టి20
దూకుడు మీదున్న టీమిండియా
పరువు కాపాడుకునేందుకు బంగ్లా
రా.గం.7:00 నుంచి స్పోర్ట్స్ 18, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం
తొలి టి20లో సులువైన విజయం... రెండో టి20లో మరీ ఎదురు లేని ఆధిపత్యం... సిరీస్ గెలుచుకున్న తర్వాత ఇక మూడో టి20లో భారత్ చేయాల్సిందేముంది...అదే జోరు కొనసాగించి అభిమానులకు మరింత ఆనందం పంచడం... గత రెండు మ్యాచ్‌లు ఆడని ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం... బంగ్లాదేశ్‌తో చివరి టి20కి ముందు భారత టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన ఇది...
మరో వైపు బంగ్లాదేశ్ పరిస్థితి మరీ పేలవం... టెస్టు సిరీస్‌ను 0–2తో కోల్పోయిన తర్వాత టి20 సిరీస్ కూడా చేజారిపోయింది... ఇక మిగిలింది ఏకైక మ్యాచ్‌లో ఎంతో కొంత మెరుగ్గా రాణించి పరువు కాపాడుకోవడం... ఈ నేపథ్యంలో హైదరాబాద్ అభిమానుల కోసం ధనాధన్ పోరుకు రంగం సిద్ధమైంది.
సాక్షి, హైదరాబాద్: ఏడాది ఆరంభంలో భారత్, ఇంగ్లండ్ మధ్య టెస్టు మ్యాచ్ వినోదాన్ని ఆస్వాదించిన నగర అభిమానులకు ఇప్పుడు దసరా రోజున టి20 ఆనందానికి సమయం ఆసన్నమైంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో నేడు భారత్, బంగ్లాదేశ్ జట్లు మూడో టి20 మ్యాచ్‌లో తలపడనున్నాయి.
ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న సూర్యకుమార్ బృందం క్లీన్‌స్వీప్‌పై దృష్టి పెట్టగా...ఒక్క మ్యాచ్‌లోనైనా నెగ్గి స్వదేశం వెళ్లాలని బంగ్లా భావిస్తోంది. అయితే టీమిండియా జోరు చూస్తే జట్టును నిలువరించడం ప్రత్యరి్థకి దాదాపు అసాధ్యం కావచ్చు.
హర్షిత్ రాణాకు చోటు!
సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో అవకాశం దక్కని ఆటగాళ్లు నలుగురు ఉన్నారు. వీరిలో ఇక్కడ ఎవరు ఆడతారనేది ఆసక్తికరం. మయాంక్ స్థానంలో మరో కొత్త ఆటగాడు హర్షిత్ రాణాను ఎంపిక చేయడం దాదాపు ఖాయంగా అనిపిస్తోంది. 2024 ఐపీఎల్‌లో కోల్‌కతా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన పేసర్ హర్షిత్‌కు తొలి అవకాశం ఇవ్వాలని కోచ్ గంభీర్ భావిస్తున్నాడు. స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో లెగ్‌స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను కూడా ఆడించవచ్చు.
ప్రస్తుత పరిస్థితిలో కీపర్ జితేశ్ శర్మకు చాన్స్ కష్టమే. అయితే హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మను తుది జట్టులోకి ఎంచుకుంటారా చూడాలి. సామ్సన్, సూర్యకుమార్, రింకూ, పాండ్యా, పరాగ్‌లతో కూడిన బ్యాటింగ్ ఆర్డర్ మళ్లీ చెలరేగితే భారీ స్కోరు ఖాయం. సన్‌రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మకు ఈ మైదానంలో విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన చూపించిన రికార్డు ఉంది. అతడిని ఆపడం కూడా బంగ్లాకు కష్టమే.
గెలిపించేదెవరు?
బంగ్లాదేశ్ టి20 టీమ్ చాలా కాలంగా వైఫల్యాల్లోనే ఉంది. ఈ సిరీస్‌లో కూడా అది కొనసాగింది. ఏ ఒక్కరిలో కూడా జట్టును గెలిపించే సామర్థ్యం కనిపించడం లేదు. ఆటగాళ్లు మారినా జట్టు పరిస్థితి మారడం లేదు. అంతా సమష్టిగా విఫలమవుతున్నారు.
ఢిల్లీ మ్యాచ్‌లో బౌలర్లలో పదును లేక భారత్ భారీ స్కోరు చేసే అవకాశం కల్పించగా, బ్యాటర్లెవరూ కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. పర్వేజ్, లిటన్ దాస్, కెపె్టన్ నజ్ముల్, తౌహీద్...ఎవరూ ఆడటం లేదు. ఈ సారి జాకీర్ స్థానంలో మహేదీకి అవకాశం దక్కవచ్చు.
జట్టులో అందరికంటే సీనియర్ అయిన మహ్ముదుల్లా ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20లనుంచి రిటైర్ అవుతున్నాడు. చివరిదైన తన 141వ మ్యాచ్‌లోనైనా అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపిస్తాడా చూడాలి. మిరాజ్, తస్కీన్, తన్‌జీమ్‌లతో పాటు అనుభవజు్ఞడైన ముస్తఫిజుర్ కూడా ప్రభావం చూపలేకపోతున్నాడు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: సూర్యకుమార్ (కెప్టెన్ ), సామ్సన్, అభిషేక్, నితీశ్ రెడ్డి, రింకూ, పాండ్యా, పరాగ్/ తిలక్, సుందర్, వరుణ్, అర్‡్షదీప్, హర్షిత్.
బంగ్లాదేశ్: నజు్మల్ (కెప్టెన్ ), పర్వేజ్, లిటన్‌దాస్, తౌహీద్, మహ్ముదుల్లా, మిరాజ్, మహేదీ, రిషాద్, తన్‌జీమ్, తస్కీన్, ముస్తఫిజుర్.
పిచ్, వాతావరణం
ఉప్పల్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లు నమోదు కావచ్చు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ వర్షం కురిసింది. మ్యాచ్ రోజున కూడా వాన పడే అవకాశం ఉంది. అయితే కొద్ది సేపు అంతరాయం మినహా పూర్తిగా మ్యాచ్‌కు ఆటంకం కలగకపోవచ్చు.
చెలరేగుతారా!
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిగా నితీశ్ రెడ్డి ఇదే మైదానంలో చూపించిన దూకుడు అతనికి భారత జట్టులో చోటు కల్పించింది. ఇప్పుడు టీమిండియా ప్లేయర్‌గా అతను తొలిసారి ఉప్పల్ మైదానంలో బరిలోకి దిగబోతున్నాడు.
ఈ ఆంధ్ర క్రికెటర్ బంగ్లాపై గత మ్యాచ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఇక్కడా అదే ధాటిని ప్రదర్శించాలని అభిమానులు కోరుకుంటున్నాడు. ఐపీఎల్‌లో ముంబైకి ఆడే మరో హైదరాబాదీ తిలక్ వర్మ కూడా సొంతగడ్డపై బరిలోకి దిగాలని ఆశిస్తున్నాడు. వీరిద్దరూ బాగా ఆడితే దసరా రోజు అభిమానులకు పరుగుల పండగే.
Comments
Please login to add a commentAdd a comment