T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన హసరంగ | T20 World Cup 2024 SL VS BAN: Wanindu Hasaranga Surpasses Lasith Malinga As Highest T20 Wicket Taker For Sri Lanka | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన హసరంగ

Published Sat, Jun 8 2024 9:17 PM | Last Updated on Sat, Jun 8 2024 9:17 PM

T20 World Cup 2024 SL VS BAN: Wanindu Hasaranga Surpasses Lasith Malinga As Highest T20 Wicket Taker For Sri Lanka

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌ వనిందు హసరంగ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి క్రికెట్‌లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. హసరంగకు ముందు ఈ రికార్డు దిగ్గజ పేసర్‌ లసిత్‌ మలింగ పేరిట ఉండేది. టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా బంగ్లాదేశ్‌తో నిన్న (జూన్‌ 7) జరిగిన మ్యాచ్‌లో హసరంగ.. మలింగ రికార్డును అధిగమించాడు.

మలింగ 84 అంతర్జాతీయ టీ20ల్లో 107 వికెట్లు పడగొట్టగా.. హసరంగ తన 67వ టీ20 మ్యాచ్‌లోనే ఈ మార్కును దాటాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో తౌహిద్‌ హ్రిదోయ్‌ వికెట్‌ పడగొట్టడం ద్వారా హసరంగ (108 వికెట్లు) శ్రీలంక తరఫున అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్‌గా  అవతరించాడు. ఈ మ్యాచ్‌లో హసరంగ హ్రిదోయ్‌ వికెట్‌తో పాటు మరో వికెట్‌ (లిట్టన్‌ దాస్‌) కూడా పడగొట్టాడు.

ఈ మ్యాచ్‌లో హసరంగతో పాటు నువాన్‌ తుషార (4-0-18-4), మతీశ పతిరణ (4-0-27-1), ధనంజయ డిసిల్వ (2-0-11-1) సత్తా చాటినా శ్రీలంక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక అత్యంత పేలవంగా బ్యాటింగ్‌ చేసి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. లంక ఇన్నింగ్స్‌లో పథుమ్‌ నిస్సంక (47) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్‌ చేశాడు. 

మిగతా వారంతా దారుణంగా విఫలమయ్యారు. బంగ్లా బౌలర్లలో రిషద్‌ హొసేన్‌, ముస్తాఫిజుర్‌ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. తస్కిన్‌ అహ్మద్‌ 2, తంజిమ్‌ హసన్‌ ఓ వికెట్‌ పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌.. లంక బౌలర్లు ప్రతిఘటించినప్పటికీ మరో ఓవర్‌ మిగిలుండగానే (8 వికెట్ల నష్టానికి) విజయతీరాలకు చేరింది. లిటన్‌ దాస్‌ (36), తౌహిద్‌ హ్రిదోయ్‌ (40), మహ్మదుల్లా (16 నాటౌట్‌) బాధ్యతాయుతంగా బ్యాటింగ్‌ చేసి బంగ్లాదేశ్‌కు 2 వికెట్ల తేడాతో విజయాన్నందించారు.

టీ20ల్లో శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..

హసరంగ-108 వికెట్లు
మలింగ- 107
కులశేఖర- 66
అజంత మెండిస్‌-66
దుష్మంత చమీరా-55

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement