‘రోహిత్‌, కోహ్లి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది’ | On Kohli Rohit T20I Retirement India Departing Bowling Coach Big Revelation | Sakshi
Sakshi News home page

‘రోహిత్‌, కోహ్లి నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది’

Published Tue, Jul 23 2024 8:16 PM | Last Updated on Tue, Jul 23 2024 8:33 PM

On Kohli Rohit T20I Retirement India Departing Bowling Coach Big Revelation

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, రవీంద్ర జడేజా రిటైర్మెంట్‌ ప్రకటన తమను ఆశ్చర్యపరిచిందని భారత జట్టు బౌలింగ్‌ మాజీ కోచ్‌ పారస్‌ మాంబ్రే అన్నాడు. వాళ్లు తమ నిర్ణయం గురించి ఒక్కసారి కూడా డ్రెసింగ్‌రూంలో చర్చించనేలేదని తెలిపాడు.

ఏదేమైనా దశాబ్దకాలం పాటు జట్టుతో ఉన్న ఈ స్టార్‌ ప్లేయర్లు సరైన సమయంలో సరైన ప్రకటన చేశారని మాంబ్రే అభిప్రాయపడ్డాడు. కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా  చాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే.

అమెరికా- వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ ఐసీసీ టోర్నీలో రోహిత్‌ సేన అద్భుత ఆట తీరుతో టైటిల్‌ సాధించింది. పదకొండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి వరల్డ్‌కప్‌ ట్రోఫీని ముద్దాడింది.

ఇక ఈ చిరస్మరణీయ విజయానంతరం కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ విషయం గురించి పారస్‌ మాంబ్రే తాజాగా గుర్తుచేసుకున్నాడు. హిందుస్తాన్‌ టైమ్స్‌తో ముచ్చటిస్తూ..

‘‘అభిమానులే కాదు మేము కూడా వాళ్లు ఇలాంటి ప్రకటన చేస్తారని అస్సలు ఊహించలేదు. ఇలాంటి విషయాల గురించి జట్టులో ముందుగానే చర్చ రావడం సహజం. కానీ వీళ్లు మాత్రం ఎక్కడా విషయం బయటకు రానివ్వలేదు.

బహుశా రాహుల్‌ ద్రవిడ్‌తో మాట్లాడి ఉంటారేమో గానీ.. మాకు మాత్రం తెలియదు. అందుకే ఫ్యాన్స్‌తో పాటు మేము కూడా ఆశ్చర్యపోయాం. అయితే, వాళ్ల కోణం నుంచి చూస్తే రిటైర్మెంట్‌కు ఇదే సరైన సమయం అని అనిపించింది.

పదేళ్లకు పైగా జట్టుతో ఉన్నారు. 2011లో విరాట్‌ వరల్డ్‌కప్‌ గెలిచాడు. ఆ తర్వాత మళ్లీ ప్రపంచకప్‌ టైటిల్‌ సాధించలేదు. ఇందుకోసం కోహ్లి ఎంతగానో తపించిపోయాడు.

ఎట్టకేలకు ఆ కల ఇప్పుడు నెరవేరింది. అతడి సుదీర్ఘ ప్రయాణం ఒకరకంగా పరిపూర్ణమైంది. ఇక ఈ ముగ్గురి ఆటగాళ్ల వయసు పరంగా చూసినా ఇది సరైన నిర్ణయమే. వారికి అపార అనుభవం, నైపుణ్యాలు ఉన్నాయి. కానీ.. హై నోట్‌లో కెరీర్‌ ముగించే అవకాశం మళ్లీ మళ్లీ రాకపోవచ్చు కదా!’’ అని పారస్‌ మాంబ్రే పేర్కొన్నాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2024లో టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ ఉండగా.. అతడి జట్టులో బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రం రాథోడ్‌, బౌలింగ్‌ కోచ్‌గా పారస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌గా టి.దిలీప్‌ సేవలు అందించారు. ఈ టోర్నీ తర్వాత వీరందరి పదవీ కాలం ముగియగా.. కొత్త కోచ్‌ గౌతం గంభీర్‌ హయాంలో దిలీప్‌ రీఎంట్రీ(తాత్కాలికం) ఇచ్చాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement