ముంబై ఇండియన్స్ కెప్టెన్ మార్పు అంశంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యాకు హడావుడిగా కెప్టెన్సీ అప్పగించి.. రోహిత్ శర్మపై వేటు వేయడం సరికాదని అభిప్రాయపడ్డాడు.
కాగా ఐపీఎల్-2024 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ తమకు కొత్త కెప్టెన్ వచ్చినట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఐదుసార్లు జట్టుకు టైటిల్ అందించిన రోహిత్ శర్మను కాదని.. గుజరాత్ టైటాన్స్ నుంచి భారీ మొత్తానికి ట్రేడ్ చేసుకున్న పాండ్యాను తమ నాయకుడిగా ప్రకటించింది.
ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులతో పాటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హిట్‌మ్యాన్‌కు ఇది అవమానమేనంటూ సోషల్ మీడియా వేదికగా ఎంఐ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని తూర్పారబట్టారు. అయితే, ఫ్రాంఛైజీ మాత్రం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే కెప్టెన్ మార్పు చేసినట్లు పేర్కొంది.
ఈ క్రమంలో తాజాగా యువరాజ్ సింగ్ ఈ అంశంపై స్పందించాడు. ‘‘కెప్టెన్‌గా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన రోహిత్ శర్మది. అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడం అనేది సాహసోపేత నిర్ణయం.
హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేయడం వెనుక వాళ్ల కారణాలు వాళ్లకు ఉండి ఉంటాయని అర్థం చేసుకోగలను. కానీ.. నా అభిప్రాయం ప్రకారం.. కనీసం ఈ ఒక్క సీజన్‌కైనా కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగించాల్సింది. పాండ్యాను అతడికి డిప్యూటీగా నియమించి పరిశీలించమని చెప్పాల్సింది.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. నిజమే.. కానీ రోహిత్ ఇప్పటికీ అద్భుతంగా ఆడుతున్నాడు. టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్నాడు. అలాంటపుడు అతడిని తప్పించడం ఎంత వరకు ఆమోదయోగ్యం?’’ అని యువరాజ్ సింగ్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు.
అదే విధంగా.. హార్దిక్ పాండ్యాను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘అవును.. అతడు అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాడే. అయితే, గుజరాత్ టైటాన్స్‌ను ముందుకు నడిపించడానికి.. ముంబై కెప్టెన్‌గా వ్యవహరించడానికి చాలా తేడా ఉంటుంది. ముంబై ఏ రకంగా చూసినా పెద్ద జట్టు. అందుకు తగ్గట్లుగానే అంచనాలు కూడా భారీగానే ఉంటాయి’’ అని యువీ హెచ్చరించాడు. కాగా మార్చి 22న ఐపీఎల్-2024 ఆరంభం కానుండగా.. మార్చి 24న ముంబై-తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment