అలసత్వం తగదు
న్యూజిలాండ్ స్పిన్నర్ల ప్రతిభ కంటే మా బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యమే ఓటమికి ప్రధాన కారణం... తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత కెప్టెన్ ధోని అభిప్రాయం ఇది. అవును... మాకు ఎదురే లేదనే దృక్పథంతో క్రీజులోకి వచ్చిన భారత బ్యాట్స్‌మెన్ షాట్ల ఎంపికలో చేసిన ఘోరమైన తప్పుల వల్లే కివీస్ చేతిలో అనూహ్య పరాభవం ఎదురయింది. అయితే తొలి మ్యాచ్‌లోనే ఇలాంటి షాక్ తగలడం కూడా ఒక రకంగా మంచిదే. అలసత్వం లేకుండా ఆడాలనే విషయం అర్థమైతే విజయాల బాటలోకి వెళ్లొచ్చు.
నాగ్‌పూర్ నుంచి సాక్షి క్రీడాప్రతినిధి టి20 ప్రపంచకప్ తొలిసారి 2007లో భారత్ గెలిచినప్పుడు... ఆ టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలోనే భారత్ ఓడిపోయింది. కానీ కప్ గెలిచింది..! ఈసారి కూడా మొదటి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం... అంటే కప్ గెలుస్తాం... ఓ భారత క్రికెట్ అభిమాని, ఆశాజీవి అభిప్రాయం ఇది. మంచిదే ఇంత సానుకూల దృక్పథం క్రికెటర్లలో కూడా ఉంటే అంతకంటే కావలసింది లేదు. ఆటన్నాక గెలుపోటములు సహజం. కానీ ఎలాంటి దృక్పథం కనబరుస్తున్నామనేదే ముఖ్యం.
గతంలో దారుణమైన పేస్ బౌలింగ్ పిచ్‌లు ఎదురైన ప్రతిసారీ భారత కెప్టెన్ లేదా టీమ్ డెరైక్టర్ నేరుగా తమ అసహనాన్ని ప్రదర్శించారు. కానీ ఈసారి మాత్రం నాగ్‌పూర్ పిచ్ మీద ఎలాంటి వ్యాఖ్యా చేయలేని పరిస్థితి. ‘తొలి రోజు నుంచి బంతి స్పిన్ తిరగకూడదని ఏ రాజ్యాంగంలో రాసుంది?’ అంటూ దక్షిణాఫ్రికాతో నాగ్‌పూర్‌లో టెస్టు విజయం తర్వాత రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. కాబట్టి పిచ్ గురించి ఏమీ మాట్లాడకుండా... తర్వాతి మ్యాచ్‌ల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించే భారత బృందం కసరత్తులు చేస్తోంది.
అడుగడుగునా నిర్లక్ష్యం
భారత జట్టులో నెహ్రా, బుమ్రా మినహా అందరూ బ్యాటింగ్ చేయగలవారే. అయినా అందరూ కలిసి చేసింది కేవలం 79 పరుగులు. మరో 11 బంతులు మిగిలుండగానే ఇన్నింగ్స్ ముగియడం అంటే టి20లో దారుణమైన వైఫల్యంగా భావించాలి. పరిస్థితిని గమనించి, పిచ్‌ను అర్థం చేసుకుని షాట్స్ ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. స్వీప్ ఆడబోయి ఎల్బీగా అవుట్ కావడం శిఖర్ ధావన్‌కు ఇది మొదటిసారేం కాదు. పదేపదే ఇలాగే అవుటవుతున్నాడు.
తొలి ఓవర్లో పెద్దగా స్పిన్ కాని బంతికే వికెట్ ఇవ్వడం ద్వారా ధావన్ భారీ తప్పు చేశాడు. ఇక ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రోహిత్ శర్మ అంత ముందుకు వెళ్లి ఆడాల్సిన అవసరం అసలే లేదు. రెండు ఓవర్లలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయిన తర్వాత వచ్చిన రైనా ఆడిన షాట్ నిర్లక్ష్యానికి పరాకాష్ట. చాలా క్యాజువల్‌గా బంతిని పుష్ చేసి వెనుదిరిగాడు. ఇక యువరాజ్, జడేజాల షాట్లలోనూ నిర్లక్ష్యమే ఎక్కువగా ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని విషయాన్ని గ్రహించిన న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ అండర్సన్ దూకుడు తగ్గించుకుని ఆడాడుగానీ, భారత బ్యాట్స్‌మెన్ ఎవరూ అలాంటి పరిణతి చూపలేకపోయారు.
కిం కర్తవ్యం..?
ఒక్క మ్యాచ్‌లో ఓడినంత మాత్రాన కొంపలు మునిగిపోవు. కానీ ఒక్క బ్యాట్స్‌మన్ చివరి వరకూ నిలబడితే గెలిచే చోట ఓడిపోవడం ఆందోళన కలిగించే అంశం. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లందరికీ కావలసినంత అనుభవం ఉంది. ఐపీఎల్‌లో ప్రతి ఒక్కరూ హీరోలే. కాబట్టి ఈ ఓటమి నుంచి వీలైనంత తొందరగానే కోలుకోవచ్చు. ఇక తర్వాతి మ్యాచ్ ఆడాల్సింది పాకిస్తాన్‌తో. సహజంగానే దేశంలో ఈ మ్యాచ్ గురించి అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా పాకిస్తాన్‌తో ఆడే సమయంలో ఆటగాళ్లంతా రెట్టింపు కష్టపడతారు. కాబట్టి రెండో మ్యాచ్ సమయానికి కోలుకోవచ్చు. పాక్‌తో మ్యాచ్ జరిగే ఈడెన్ గార్డెన్స్‌లో బ్యాటింగ్ పిచ్ సిద్ధంగా ఉంది. ఇది పూర్తిగా మన ఆటతీరుకు అనుకూలించే వికెట్. అయితే చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుని కివీస్‌తో పరాజయాన్ని వీలైనంత త్వరగా మరచిపోవాలి. ఇకపై ప్రతి మ్యాచ్ చావోరేవోలాంటిదే. ఇలాంటి సమయంలో ధోనిసేన మరింత మెరుగ్గా ఆడుతుందని ఆశిద్దాం.
టోర్నీలో తొలి మ్యాచ్ ఓడితే ఆపై అన్ని మ్యాచ్‌లు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని కోసం మానసికంగా సిద్ధమయ్యాం. ప్రతీ మ్యాచ్ చావోరేవోలాగా మారిపోవడం వల్ల ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. ఈ ఓటమి ఒకందుకు మంచిదే. మాకూ, దేశానికి మేలు చేసింది. ఎందుకంటే జట్టు పరంగా, అభిమానులపరంగా అందరికీ ఒక హెచ్చరిక లభించినట్లయింది. ఇప్పుడు సరిగ్గా సమస్య ఏమిటి, లోపం ఎక్కడుంది తెలిసింది కాబట్టి మేం ఇకపై ఏం చేయాలో తెలుస్తుంది. దాని ప్రకారం వ్యూహాలు రూపొందించుకునే అవకాశం ఉంటుంది. - ధోని