ధర్మశాలలోనే జరుగుతుంది..! | match Done in Dharamshalas ..! | Sakshi
Sakshi News home page

ధర్మశాలలోనే జరుగుతుంది..!

Published Fri, Mar 4 2016 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

match Done in Dharamshalas ..!

 పాక్‌తో మ్యాచ్‌పై ఠాకూర్ ఆశాభావం
 
న్యూఢిల్లీ: టి20 ప్రపంచకప్‌లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య  మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని బీ సీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇస్తుందని అన్నారు. ‘షెడ్యూల్ ప్రకారం ఈనెల 19న పాక్‌తో మ్యాచ్ ధర్మశాలలోనే జరుగుతుందని అనుకుంటున్నాను. సీఎం వీరభద్ర సింగ్‌తో బుధవారంనాటి సమావేశం సామరస్యంగా జరిగిం ది. మ్యాచ్ నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సైనిక కుటుంబాలతో ప్రభుత్వం మాట్లాడుతుంది. మంచి నిర్ణయమే వెలువడుతుందని ఆశిస్తున్నాను. బోర్డు నుంచైతే ఎలాంటి ఇబ్బంది లేదు. క్రీడల్లో రాజ కీయాలను తేవడం సరికాదు. ఈ వేదికపై మ్యాచ్ గతంలోనే నిర్ణయం జరిగింది. ఒకవేళ భద్ర తా సిబ్బంది కొరత ఉంటే కేంద్రం నుంచి తెప్పించుకోవచ్చని సీఎంకు సూచించాను. ఇక ఇక్కడ మ్యాచ్ కు అనుమతి లేకపోతే మా దగ్గర ప్లాన్ బి లేదు. ఈ చివరి క్షణంలో ఎలాంటి ప్రత్యామ్నాయం చేయలేము’ అని ఠాకూర్ స్పష్టం చేశారు.

 ‘ఇక్కడ మ్యాచ్‌ను జరగనివ్వం’
సిమ్లా: పాకిస్తాన్‌తో టి20 మ్యాచ్‌ను ధర్మశాలలో జరగనివ్వమని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ సైనికుల లీగ్ చీఫ్ రిటైర్డ్ మేజర్ విజయ్ సింగ్ మన్‌కోటియా స్పష్టం చేశారు. పఠాన్‌కోట్ బేస్‌పై ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు రాష్ట్రానికి చెందిన సైనికులు మరణించారని ఆయన గుర్తు చేశారు. అమరవీరుల స్మారక స్థూపానికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే జరిగే ఈ మ్యాచ్‌ను ఎట్టి పరిస్థితిలోనూ జరగనివ్వబోమని రాష్ట్ర టూరిజం అభివృద్ధి బోర్డు చైర్మన్ కూడా అయిన విజయ్ సింగ్ తేల్చారు.

 భద్రతపై హామీ ఇవ్వకుంటే వైదొలుగుతాం: పాక్
లాహోర్: టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే తమ జట్టుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతపై హామీ ఇవ్వాలని, లేకుంటే టోర్నీ నుంచి తప్పుకుంటామని పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరించింది. ‘ఐసీసీకి ఈ విషయంలో మేం ఇప్పటికే స్పష్టంగా చెప్పాం. మా జట్టును సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలి. అలాగే పాక్ ఆటగాళ్లకు గట్టి భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పాలి.  లేకపోతే టి20 ప్రపంచకప్‌లో ఆడేది కష్టమే. మా ప్రభుత్వం నుంచి అనుమతి ఉంది. కానీ భారత్‌లో పరిస్థితులే మాకు ఇబ్బందికరంగా ఉన్నాయి’ అని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement