
భారత బాక్సింగ్ సమాఖ్య ఎన్నికల బరిలో అనురాగ్ ఠాకూర్
సిమ్లా: భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పోటీ పడేందుకు అనుమతించాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 28న ఎన్నికలు జరగనున్నాయి. ఠాకూర్ నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా నామినేషన్ల గడువును పొడిగించాలని కూడా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
బీఎఫ్‌ఐ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బాక్సింగ్ సంఘం ప్రతినిధిగా పోటీ పడేందుకు ఠాకూర్ సిద్ధం కాగా... బీఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ ఆయనను అనర్హుడిగా ప్రకటించారు.
ఆయా రాష్ట్ర సంఘాల్లో ఎన్నికల ద్వారా గెలిచి ఆఫీస్ బేరర్లుగా కొనసాగుతున్న వారికే ఇక్కడా పోటీ పడే అవకాశం ఉంటుందని... ఈ కారణంగా ఠాకూర్ అనర్హుడంటూ రిటర్నింగ్ అధికారి ఈ నెల 7న ఆదేశాలు జారీ చేశారు. దీనిపై బీజేపీ ఎంపీ కోర్టుకెక్కారు.
2008 నుంచి వేర్వేరు హోదాల్లో తాను రాష్ట్ర సంఘంలో పని చేశానని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాదోపవాదాల అనంతరం... బీఎఫ్‌ఐ ఉత్తర్వులకు చట్టపరంగా ఎలాంటి విలువ లేదని, ఠాకూర్‌ను ఎన్నికలకు అనుమతించాలంటూ హిమాచల్ హైకోర్టు స్పష్టం చేసింది.
భారత్ ఖాతాలోనే ‘ఇండియన్ టూర్’ స్క్వాష్ టైటిల్
ఫైనల్లో అనాహత్‌తో ఆకాంక్ష ‘ఢీ’
చెన్నై: స్క్వాష్ రాకెట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఆర్‌ఎఫ్‌ఐ) ఇండియన్ టూర్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ భారత్‌కు ఖరారైంది. భారత్‌కే చెందిన అనాహత్ సింగ్, ఆకాంక్ష సాలుంఖే ఫైనల్‌కు చేరుకోవడంతో ఇది సాధ్యం కానుంది.
గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో అనాహత్ 11–6, 11–3, 11–4తో హీలీ వార్డ్ (దక్షిణాఫ్రికా)పై, టాప్ సీడ్ ఆకాంక్ష 11–5, 11–7, 11–7తో భారత్‌కే చెందిన స్టార్ జోష్నా చినప్పపై విజయం సాధించారు. ఫైనల్ శుక్రవారం జరుగుతుంది.
క్వార్టర్ ఫైనల్స్‌లో ఆకాంక్ష 11–8, 10–12, 4–11, 11–8, 11–9తో నాదియా ఎల్‌హమి (ఈజిప్ట్)పై, అనాహత్ 11–3, 11–3, 7–11, 11–1తో క్రిస్టినా గోమెజ్ (స్పెయిన్)పై, జోష్నా చినప్ప 11–7, 11–5, 11–4తో సోఫియా మటియోస్ (స్పెయిన్)పై గెలుపొందారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కే చెందిన వీర్ చోత్రాని, మెల్విల్ సియానిమనికో (ఫ్రాన్స్) టైటిల్ పోరుకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్స్‌లో వీర్ 11–5, 11–7, 12–10తో రవిందు లక్సిరి (శ్రీలంక)పై, మెల్విల్11–7, 11–2, 11–7తో డీగో గొబ్బి (బ్రెజిల్)పై విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment