
భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఎన్నికల దగ్గరవుతున్న నేపథ్యంలో ప్రత్యర్థుల మధ్య విమర్శలు కూడా పెరుగుతున్నాయి. తాజాగా బీఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్... సస్పెన్షన్‌కు గురైన మాజీ కార్యదర్శి హేమంత కలితాపై కొత్త ఆరోపణలు చేశారు.
అసోంకు చెందిన హేమంత తమ రాష్ట్రానికి చెందిన అగ్రశ్రేణి బాక్సర్లను జాతీయ మహిళా చాంపియన్‍షిప్‌లో ఆడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత అయిన లవ్లీనా బొర్గొహైన్‌తో పాటు ఇతర బాక్సర్లను ఈ ప్రతిష్టాత్మక టోర్నీ నుంచి తప్పుకోవాలని ఆయన ఆదేశించారంటూ అజయ్ సింగ్ వ్యాఖ్యానించారు.
దాదాపు రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న జాతీయ మహిళా బాక్సింగ్ చాంపియన్‌షిప్ గురువారం ప్రారంభం కానుంది. ‘ఇందులో ఆడేందుకు లవ్లీనా సిద్ధమైంది. అయితే వారు పాల్గొనకుండా చూడాలని హేమంత అధికారులకు ఫోన్‌లు చేశారు.
ఎన్నో ట్రైన్, ఫ్లయిట్ టికెట్లు రద్దు చేశారు. సహజంగానే తమ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ఇలాంటి స్థితిలో లవ్లీనాలాంటి బాక్సర్లు పునరాలోచనలో పడ్డారు’ అని ఆయన వెల్లడించారు. దీనిని హేమంత కలితా కొట్టిపారేశారు.
తాను ఏ ప్లేయర్‌ను ఆపలేదని, దానికి తనకు సంబంధం లేదన్న హేమంత...టోర్నీ కోసం ప్రకటించిన తేదీల పట్ల అసంతృప్తితో వివిధ రాష్ట్ర సంఘాలు తప్పుకున్నాయనే విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్నికల ఫలితాలు ప్రకటించవద్దు: కోర్టు ఆదేశాలు
భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు కొత్త ఆదేశాలు ఇచ్చింది. వివిధ రాష్ట్ర సంఘాల నుంచి ఎన్నికైన వారికి మాత్రమే ప్రతినిధులుగా ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉందంటూ బీఎఫ్‌ఐ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది. అయితే ఎన్నికలను నిర్వహించుకోవచ్చని, ఫలితాలను మాత్రం ప్రకటించరాదని ఆదేశించింది.
ఫలితాల ప్రకటన తమ తుది ఉత్తర్వులకు లోబడి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 28 బీఎఫ్‌ఐ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈ నెల 7న జారీ చేసిన నియమావళిలో తాజా నిబంధనలు ఉన్నాయి.
అయితే దీనిని సవాల్ చేస్తూ కొందరు కోర్టుకెక్కారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్‌ను తమ ప్రతినిధిగా ఓటు వేసేందుకు హిమాచల్‌ప్రదేశ్ బాక్సింగ్ సంఘం ప్రతిపాదించగా... ఆయన ఎంపికైన వ్యక్తి కాదంటూ రిటర్నింగ్ అధికారి ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించారు. తాజా అంశంపై నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ బీఎఫ్‌ఐని కోర్టు ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment