Indian boxing federation
-
కామన్వెల్త్కు హుసాముద్దీన్
పటియాలా: తెలంగాణకు చెందిన బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ 2022 కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత బృందంలోకి ఎంపికయ్యాడు. సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించిన భారత బాక్సింగ్ సమాఖ్య వేర్వేరు విభాగాలకు చెందిన ఎనిమిది మంది బాక్సర్లను ఈ ప్రతిష్టాత్మక క్రీడలకు ఎంపిక చేసింది. 57 కేజీల విభాగం ట్రయల్స్‌లో నిజామాబాద్ జిల్లాకు చెందిన హుసాముద్దీన్ 4–1 తేడాతో 2019 ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత కవీందర్ సింగ్‌పై విజయం సాధించడంతో అతనికి అవకాశం దక్కింది. గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన 2018 కామన్వెల్త్ క్రీడల్లోనూ పాల్గొన్న హుసాముద్దీన్ కాంస్య పతకం సాధించాడు. జూలై 28నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌లో కామన్వెల్త్ క్రీడలు జరుగుతాయి. భారత జట్టు వివరాలు: అమిత్ పంఘాల్ (51 కేజీలు), హుసాముద్దీన్ (57), శివ థాపా (63), రోహిత్ టోకస్ (67), సుమిత్ (75), ఆశిష్ కుమార్ (80), సంజీత్ (92), సాగర్ (92 ప్లస్). -
నిఖత్ జరీన్‌కు షాక్!
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తూ పెద్ద టోర్నీలలో సత్తా చాటేందుకు సిద్ధమైన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఆశలపై భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) పంచ్ విసిరింది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలనుకున్న ఆమెను ఊహించని విధంగా అడ్డుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో నిఖత్ పాల్గొనకుండా స్వయానా చీఫ్ సెలక్టర్ రాజేశ్ భండారి నిరోధించారు. నిఖత్ ఈవెంట్ అయిన 51 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన 36 ఏళ్ల మేరీకోమ్‌ను బీఎఫ్ఐ ఎంపిక చేసింది. ట్రయల్స్‌లో పాల్గొనకపోయినా ఇటీవలి ప్రదర్శన ఆధారంగా మేరీకోమ్‌ను ఎంపిక చేసినట్లు బీఎఫ్ఐ ప్రకటించింది. మేరీకోమ్ ఈ ఏడాది ఇండియన్ ఓపెన్‌తో పాటు ఇండోనేసియాలో జరిగిన ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో కూడా విజేతగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరిగిన ట్రయల్స్‌లో వన్లాల్ దువాతితో నిఖత్ తలపడాల్సి ఉంది. అయితే బౌట్ ఆరంభానికి కొద్దిసేపు ముందు ఈ పోరు జరగడం లేదని ఆమెకు భండారి చెప్పారు. బుధవారం జరగవచ్చని ఆశించినా... జాబితాలో ఆమె పేరు, కేటగిరీలే కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా ఈ నిజామాబాద్ బాక్సర్ దిగ్భ్రాంతికి గురైంది. ట్రయల్స్ నిర్వహించండి... తనకు జరిగిన అన్యాయంపై ప్రపంచ మాజీ జూనియర్ చాంపియన్ నిఖత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ యూత్ బాక్సింగ్ రజత, సీనియర్ ఆసియా కాంస్య పతక విజేత అయిన ఆమె తన సమస్యను, బాధను వెల్లడిస్తూ బాక్సింగ్ సమాఖ్యకు లేఖ రాసింది. ఇటీవలే నిఖత్ థాయ్‌లాండ్‌లో జరిగిన టోర్నీలో కూడా రజతం సాధించింది. ‘ఇది చాలా ఆశ్చర్యంతోపాటు నిరాశ కలిగించింది. చిన్న వయసులోనే నేను ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగకుండా రక్షిస్తున్నామని, మంచి భవిష్యత్తు కోసం నా మేలు కోరుతున్నామని సెలక్టర్లు నాతో చెప్పారు. అయితే 2016లోనే ఈ టోర్నీలో పాల్గొన్న నేను ఇప్పుడు చిన్నదాన్ని ఎలా అవుతాను. కాబట్టి నన్ను ఆపేందుకు వయసు మాత్రమే కారణం కాదు. మీ ఆధ్వర్వంలో పారదర్శకంగా ట్రయల్స్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఒక నిబంధన నిజంగా ఉంటే అది బాక్సర్ల స్థాయి, ఘనతను బట్టి కాకుండా అందరికీ వర్తింపజేయాలి. బాక్సర్లు ట్రయల్స్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు తప్పుడు పద్ధతులు అవలంబించవద్దు. అందుకే మీ జోక్యం కోరుతున్నాను’ అని 23 ఏళ్ల నిఖత్ ఆ లేఖలో పేర్కొంది. సరైన నిర్ణయమే: భండారి నిఖత్‌ను ట్రయల్స్‌లో పాల్గొనకుండా తీసుకున్న నిర్ణయాన్ని రాజేశ్ భండారి సమర్థించుకున్నారు. భారత్ పతకావకాశాలు మెరుగ్గా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘బీఎఫ్ఐ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ను ఎంపిక చేశాం. ఆమె కోచ్ కూడా మాకు ఒక అభ్యర్థన పంపారు. దానిని పరిశీలించిన తర్వాత ట్రయల్స్ లేకుండానే ఎంపికయ్యేందుకు మేరీకోమ్‌కు అర్హత ఉందని నిర్ధారణకు వచ్చాం. ఇటీవల ఇండియా ఓపెన్‌లో నిఖత్‌ను కూడా ఆమె ఓడించింది. జాతీయ శిబిరంలో కూడా అందరికంటే మెరుగ్గా కనిపించింది. నిఖత్ కూడా చాలా మంచి బాక్సర్. భవిష్యత్తులో ఆమెకు తగిన అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతానికి మాత్రం ప్రదర్శన, అనుభవంపైనే మేరీకోమ్‌ని ఎంపిక చేశాం’ అని భండారి వివరించారు. మేరీకోమ్గీనిఖత్ మే నెలలో గువాహటిలో జరిగిన ఇండియా ఓపెన్ సెమీఫైనల్లో నిఖత్‌పై మేరీకోమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు ‘నాకు స్ఫూర్తిగా నిలిచిన బాక్సర్తో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఆమె వ్యూహాలను పసిగట్టి గట్టి పోటీనిస్తా’ అని నిఖత్ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలో అంత వివాదం ఏమీ లేదు. కానీ ఎందుకో మేరీకోమ్ అహం దెబ్బతిన్నట్లుంది! లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ దిగ్గజం తనకంటే ఎంతో జూనియర్ అయిన నిఖత్‌పై మ్యాచ్ తర్వాత ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ‘ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేను చా లా ఏళ్లుగా ఆడుతున్నాను. నన్ను ఆమె సవాల్ చేస్తున్నట్లుగా పత్రికల్లో వచ్చింది. నాకు ఆశ్చర్యంతో పాటు చికాకు కలిగింది. ముందు నిన్ను నువ్వు రింగ్‌లో నిరూపించుకో. ఆ తర్వాత నాపై వ్యాఖ్యలు చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయి లో ఒక్క పతకం గెలిచిన ఆమెకు ఇంత అహం అవసరమా? నాతో పోటీ పడటం ఆమె అదృష్టం’ అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిఖత్ కెరీర్ ఆరంభం నుంచి 51 కేజీల విభాగంలోనే పోటీ పడుతోంది. మొదటి నుంచి 48 కేజీల విభా గంలో ఆడిన మేరీ కోమ్ దానిని ఒలింపిక్స్ నుంచి తప్పించడంతో ఇండియా ఓపెన్‌తోనే 51 కేజీలకు మారింది. దాంతో నిఖత్ అవకాశాలు దెబ్బతింటున్నాయి. నాటి ఘటనకు, ఇప్పుడు నిఖత్‌ను అడ్డుకోవడానికి సంబంధం ఉండవచ్చని బాక్సింగ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. -
సత్తాకు పరీక్ష సమయం
న్యూఢిల్లీ: ఏషియాడ్ బాక్సింగ్ పోటీల్లో ‘డ్రా’ కీలక పాత్ర పోషిస్తుందని, అయినా భారత బృందం విషయంలో దానికి పెద్దగా ప్రాధాన్యం లేదని భారత బాక్సింగ్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నియెవా అన్నారు. అదే సమయంలో భారత బాక్సర్లకు వారి సత్తా తెలిసి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 18న మొదలయ్యే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు బుధవారం ఇండోనేసియా పయనం కానున్న ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో కూడిన బృందానికి భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ), స్పోర్ట్స్ ఇండియా మంగళవారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో శాంటియాగో మాట్లాడారు. ‘బలమైన ప్రత్యర్థులు ఎదురయ్యే ఈ పోటీ ప్రపంచంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకునేందుకు మంచి అవకాశం. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ ఉన్నందున ఓ రకంగా సత్తాకు పరీక్ష. పోటీ తేలికగా మాత్రం ఉండదు’ అని శాంటియాగో అన్నారు. బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ మాట్లాడుతూ... కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ క్రీడాకారులు బరిలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. అయినప్పటికీ కామన్వెల్త్ క్రీడల తరహాలో ప్రతి బాక్సర్ కనీసం ఒక పతకంతోనైనా రావాలని ఆయన ఆంకాక్షించారు. 75 కేజీల ఈవెంట్లో 2010 ఏషియాడ్‌లో స్వర్ణం, 2014లో కాంస్యం గెల్చుకున్న వికాస్ కృషన్... ప్రస్తుత బృందాన్ని అత్యుత్తమమైనదిగా అభివర్ణించాడు. ఇటీవలి కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు)... గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు అందుకున్న శివ థాపా (60 కేజీలు), మహిళల విభాగంలో సర్జుబాలా దేవి (51 కేజీ), సోనియా (57 కేజీలు) ఇండోనేసియా వెళ్తున్నారు. మిగతా సభ్యులైన అమిత్ (49 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మనోజ్ (69 కేజీలు)లు సైతం కామన్వెల్త్లో పతకాలు కైవసం చేసుకున్నారు. ఏషియాడ్‌లో బాక్సింగ్ పోటీలు ఈ నెల 24న ప్రారంభమవుతాయి. పరిస్థితులకు అలవాటు పడేందుకు మన బృందం చాలా ముందుగానే బయల్దేరుతోంది. 2014 ఏషియాడ్‌లో భారత బాక్సర్లు ఒక స్వర్ణం, నాలుగు కాంస్యాలు... 2010లో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలు నెగ్గారు. -
ఇక ‘పంచ్’ పండుగ...
జూలై 7 నుంచి ప్రారంభం న్యూఢిల్లీ: భారత్‌లో విపరీతంగా ఆదరణ పొందుతున్న బాక్సింగ్‌లోనూ తాజాగా ఓ లీగ్ రాబోతుంది. ఇంగ్లండ్ ప్రొఫెషనల్ బాక్సర్ ఆమిర్ ఖాన్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్న ‘ది సూపర్ బాక్సింగ్ లీగ్’ (ఎస్బీఎల్) త్వరలోనే ప్రారంభం కానుంది. జూలై 7 నుంచి ఆగస్టు 12 వరకు భారత్‌లోనే జరిగే ఈ లీగ్‌లో దేశ, విదేశీ బాక్సర్లు పోటీపడనున్నారు. ఈ లీగ్‌కు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం మద్దతు కూడా ఉంది. ఇంగ్లండ్‌కు చెందిన పారిశ్రామికవేత్త బిల్ దోసంజీ తగిన ఆర్థిక సహకారాన్ని అందిస్తూ సీఈవోగా వ్యవహరించనున్నారు. అయితే బాక్సింగ్ లీగ్‌లో పాల్గొనేందుకు మాత్రం తమ బాక్సర్లను అనుమతించేది లేదని భారత బాక్సింగ్ సమాఖ్య తేల్చి చెప్పింది. ఈ ఏడాది చివర్లో తామే కొత్తగా లీగ్‌ను నిర్వహిస్తామని తెలిపింది. -
బాక్సర్లకు ఇబ్బంది రానివ్వం
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ సమాఖ్య (ఐబీఎఫ్) గుర్తింపును అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) రద్దు చేసినా.. బాక్సర్లకు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగనివ్వమని క్రీడల మంత్రి జితేంద్రసింగ్ హామీ ఇచ్చారు. బుధవారం జాతీయ సైక్లింగ్ అకాడమీకి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘ఐబీఎఫ్‌పై ఐబా వేటు ప్రభావం బాక్సర్లపై పడకుండా చూస్తాం. సమస్య పరిష్కారమయ్యేదాకా బాక్సర్ల శిక్షణకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తాం’ అని అన్నారు. హాకీ ఇండియాకు జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్) హోదా కల్పించడంపై స్పందిస్తూ.. ఆయా క్రీడల అంతర్జాతీయ సమాఖ్యలు గుర్తించిన క్రీడా సంఘాల్నే తాము ఆమోదిస్తామన్నారు. 2017లో జరగనున్న ఫిఫా అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆతిథ్యమవ్వనుండడం భారత్‌కు గర్వకారణమని జితేంద్రసింగ్ తెలిపారు.