ఆసియా క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్‌ను అభినందిస్తున్న బీఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్, స్పోర్ట్స్ ఇండియా డైరెక్టర్ జనరల్ నీలమ్ కపూర్
న్యూఢిల్లీ: ఏషియాడ్ బాక్సింగ్ పోటీల్లో ‘డ్రా’ కీలక పాత్ర పోషిస్తుందని, అయినా భారత బృందం విషయంలో దానికి పెద్దగా ప్రాధాన్యం లేదని భారత బాక్సింగ్ హై పెర్ఫార్మెన్స్ డైరెక్టర్ శాంటియాగో నియెవా అన్నారు. అదే సమయంలో భారత బాక్సర్లకు వారి సత్తా తెలిసి వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈనెల 18న మొదలయ్యే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు బుధవారం ఇండోనేసియా పయనం కానున్న ఏడుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో కూడిన బృందానికి భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ), స్పోర్ట్స్ ఇండియా మంగళవారం నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో శాంటియాగో మాట్లాడారు. ‘బలమైన ప్రత్యర్థులు ఎదురయ్యే ఈ పోటీ ప్రపంచంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకునేందుకు మంచి అవకాశం. వచ్చే ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్ ఉన్నందున ఓ రకంగా సత్తాకు పరీక్ష. పోటీ తేలికగా మాత్రం ఉండదు’ అని శాంటియాగో అన్నారు. బీఎఫ్‌ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ మాట్లాడుతూ... కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ క్రీడాకారులు బరిలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు.
అయినప్పటికీ కామన్వెల్త్ క్రీడల తరహాలో ప్రతి బాక్సర్ కనీసం ఒక పతకంతోనైనా రావాలని ఆయన ఆంకాక్షించారు. 75 కేజీల ఈవెంట్‌లో 2010 ఏషియాడ్‌లో స్వర్ణం, 2014లో కాంస్యం గెల్చుకున్న వికాస్ కృషన్... ప్రస్తుత బృందాన్ని అత్యుత్తమమైనదిగా అభివర్ణించాడు. ఇటీవలి కామన్వెల్త్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్ (56 కేజీలు)... గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాలు అందుకున్న శివ థాపా (60 కేజీలు), మహిళల విభాగంలో సర్జుబాలా దేవి (51 కేజీ), సోనియా (57 కేజీలు) ఇండోనేసియా వెళ్తున్నారు. మిగతా సభ్యులైన అమిత్ (49 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మనోజ్ (69 కేజీలు)లు సైతం కామన్వెల్త్‌లో పతకాలు కైవసం చేసుకున్నారు. ఏషియాడ్‌లో బాక్సింగ్ పోటీలు ఈ నెల 24న ప్రారంభమవుతాయి. పరిస్థితులకు అలవాటు పడేందుకు మన బృందం చాలా ముందుగానే బయల్దేరుతోంది. 2014 ఏషియాడ్‌లో భారత బాక్సర్లు ఒక స్వర్ణం, నాలుగు కాంస్యాలు... 2010లో రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలు నెగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment