
కెరీర్‌లో రెండో ఏటీపీ–250 డబుల్స్ టైటిల్ నెగ్గిన హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్
సాక్షి, హైదరాబాద్: అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగి... అంచనాలకు మించి రాణించి... హైదరాబాద్ టెన్నిస్ యువతార బొల్లిపల్లి రిత్విక్ చౌదరీ అద్భుతం చేశాడు. చిలీ దేశ రాజధాని సాంటియాగోలో జరిగిన అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ)–250 టోర్నీలో రిత్విక్ డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. లాటిన్ అమెరికాలో క్లే కోర్టులపై ఏటీపీ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్‌గా రిత్విక్ గుర్తింపు పొందాడు.
భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో రిత్విక్ (భారత్)–నికోలస్ బరియెంతోస్ (కొలంబియా) ద్వయం 6–3, 6–2తో టాప్ సీడ్ మాక్సిమో గొంజాలెజ్–ఆండ్రెస్ మొల్తాని (అర్జెంటీనా) జోడీని బోల్తా కొట్టించి టైటిల్ దక్కించుకుంది. విజేతగా నిలిచిన రిత్విక్–బరియెంతోస్‌లకు 35,980 డాలర్ల (రూ. 31 లక్షల 47 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
24 ఏళ్ల రిత్విక్ కెరీర్‌లో ఇది రెండో ఏటీపీ –250 డబుల్స్ టైటిల్. గత ఏడాది అక్టోబర్‌లో కజకిస్తాన్‌లో జరిగిన అల్మాటీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నిలో భారత్‌కే చెందిన అర్జున్ ఖడేతో కలిసి రిత్విక్ తొలి డబుల్స్ టైటిల్ గెలిచాడు. తాజా టైటిల్‌తో రిత్విక్ సోమవారం విడదలయ్యే ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిది స్థానాలు ఎగబాకి కెరీర్ బెస్ట్ 66వ ర్యాంక్‌ను అందుకోనున్నాడు.
11 ఏస్‌లతో మెరిసి...
63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో రిత్విక్–బరియెంతోస్ ద్వయం పూర్తి ఆధిపత్యం చలాయించింది. 11 ఏస్‌లు సంధించిన ఈ జోడీ కేవలం ఒక డబుల్ ఫాల్ట్ చేసింది. ఫస్ట్ సర్వ్‌లోని 30 పాయింట్లకుగాను 26 పాయింట్లు... సెకండ్ సర్వ్‌లో 13 పాయింట్లకుగాను 10 పాయింట్లు ఈ జంట గెలిచింది. మ్యాచ్ మొత్తంలో ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశం కూడా ఇవ్వని ఈ ఇండో–కొలంబియన్ జంట ప్రత్యర్థి ద్వయం సర్విస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసింది.
ఈ టోర్నిలో అన్‌సీడెడ్ గా పోటీపడ్డ రిత్విక్–బరియెంతోస్ తొలి రౌండ్‌లో 7–6 (7/5), 7–6 (9/7)తో ద్రెజెవ్‌స్కీ–పీటర్ మత్సుజెవ్‌స్కీ (పోలాండ్)లపై, క్వార్టర్ ఫైనల్లో 3–6, 7–6 (7/2), 10–8తో మార్సెలో డెమోలైనర్–మార్సెలో జొర్మాన్ (బ్రెజిల్)లపై, సెమీఫైనల్లో 4–6, 7–6 (9/7), 10–5తో మూడో సీడ్ గిడో ఆంద్రెజీ (అర్జెంటీనా)–థియో అరిబెజ్ (ఫ్రాన్స్)లపై గెలుపొందారు.
Comments
Please login to add a commentAdd a comment